దోపిడీ కేసు.. తిర‘కాసు’
Published Tue, Aug 2 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
– కేసు లేకుండా చేసేందుకు ఎస్‌ఐ లంచం డిమాండ్
– వేధింపులు తాళలేక నిందితుడి తండ్రి అజ్ఞాతంలోకి
కర్నూలు:
దొంగతనం కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు ఎస్‌ఐ చేసిన నిర్వాకం వివాదస్పదమైంది. సి.బెళగల్ మండలంలోని కొండాపురం చెందిన పి.మహమ్మద్ గ్రామంలోనే డీజిల్, పెట్రోల్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెలరోజుల క్రితం గ్రామంలో వరుసగా దోపిడీలు జరిగాయి. మహమ్మద్‌పై అనుమానంతో గ్రామపెద్దల వద్ద బాధితులు పంచాయితీ పెట్టారు. చివరకు దొంగతనం చేశానని ఒప్పుకొని రూ.68 వేలు కట్టేందుకు పెద్ద మనుషులు ఒప్పుకొని పంచాయితీని సి.బెళగల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహమ్మద్‌పై ఎలాంటి కేసు లేకుండా బాధితులకు డబ్బులిచ్చే విధంగా ఒప్పందం చేసుకొని ఎస్‌ఐ మల్లికార్జునకు డబ్బులు అప్పగించి నిందితుడు వెళ్లిపోయాడు. నాలుగైదు రోజుల తర్వాత బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డబ్బులివ్వాలని ఎస్‌ఐను అడిగితే బెదిరించి పంపాడు. విషయాన్ని బాధితులంతా టీడీపీ ఇన్‌చార్జి ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. పంచాయితీ డబ్బులను బాధితులకు ఇవ్వాలని విష్ణువర్దన్‌రెడ్డి ఎస్‌ఐను కోరగా, కేసు నమోదు చేసి డబ్బులను కోర్టు ద్వారా రికవరీ చేయిస్తానని ఎస్‌ఐ బుకాయించాడు. చేతికొచ్చిన డబ్బులు జారీపోతాయన్న అక్కసుతో ఎస్‌ఐ.. నిందితుడు మహమ్మద్ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టాడు. రోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకొని రూ.50 వేలు ఇస్తే తప్ప వదిలిపెట్టనని బెదిరించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం వివాదమవుతుందని ఎస్‌ఐ గ్రహించి ఈనెల 30న మహమ్మద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపాడు. రూ.50 వేల కోసం తండ్రి గిడ్డయ్యను రోజూ స్టేషన్‌కు రప్పించి వేధించసాగాడు. సోమవారం డబ్బులు తీసుకొస్తానని గిడ్డయ్య కర్నూలుకు వెళ్లి ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
డబ్బులు డిమాండ్ చేయలేదు: మల్లికార్జున, ఎస్‌ఐ, సి.బెళగల్
దోపిడీ కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్‌ను డబ్బులు డిమాండ్ చేయలేదు. దోపిడీ కేసులో రికవరీ కోసం డబ్బులను సీజ్ చేసి అరెస్ట్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపాం.
Advertisement