choori
-
పోలీసుల అదుపులో దొంగ
కోవెలకుంట్ల: పట్టణంలోని అమ్మవారిశాల సమీపంలో గత శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు.. దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రూ. 15 లక్షల నగదు, 3 కిలోల 400 గ్రాముల బంగారు ఆభరణాలు.. అపహరించుకెళ్లినట్లు బాధితుడు పెండేకంటి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చోరీకి పాల్పడ్డ దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడ్డ దొంగ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగ నుంచి బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే చోరీ కేసు వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
సినిమా ఫక్కీలో చోరీ..
జూపాడుబంగ్లా: సినిమా ఫక్కీలో మంగళవారం చోరీ జరిగింది. బాధితుడు, పోలీసుల వివరాల మేరకు.. తరిగోపుల గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో సాయన్న నందికొట్కూరు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలోంచి రూ.90వేల నగదును డ్రాచేసుకొని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఆటోలో నందికొట్కూరు నుంచి తరిగోపులకు బయలుదేరాడు. మార్గమద్యలో నందికొట్కూరు నీలిశికారీపేటలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి సాయన్న పక్కలో కూర్చున్నారు. ఆటో రబ్బాని వేర్‌హౌస్ వద్దనున్న పెట్రోల్‌బంక్ వద్ద డీజిల్ పోయించుకునేందుకు డ్రైవర్ నిలబెట్టాడు. ఈలోగా సాయన్న ప్యాంట్ జేబులోంచి రూ.90వేల నగదును దోచుకున్న దుండగులు నీళ్లు తాగేందుకనే వంకతో ఆటోలోంచి దిగి వెళ్లిపోయారు. జూపాడుబంగ్లాకు చేరుకున్నాక జేబు తడుముకోగా డబ్బులు కనిపించకపోవటంతో స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
బ్యాంక్‌లో చోరీ
- సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళా దొంగ పట్టివేత గూడూరు: స్థానిక ఎస్బీఐ బ్రాంచ్‌లో ఓ ఖాతాదారుడి నుంచి నగదును తస్కరించిన మహిళను సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ఆర్.ఖానాపురం గ్రామానికి చెందిన రైతు దామోదర్‌రెడ్డి వైజాగ్‌లో చదువుకుంటుండగా తన కుమారుడి ఖాతాలో నగదు జమ చేసేందుకు ఎస్బీఐకి వచ్చాడు. కుమారుడి ఖాతాలో రూ.25 వేలు జమ చేస్తుండగా వెనుక ఉన్న ఓ మహిళ బ్లేడుతో బ్యాగ్‌ను కత్తిరించి అందులో ఉన్న రూ. 960ని తస్కరించింది. కొద్ది సేపటికి బాధితుడు విషయాన్ని గమనించి బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా బాధితుడి వెనుక ఓ మహిళ బురఖా ధరించి చోరీకి పాల్పడిన విషయాన్ని గమనించారు. అనంతరం మేనేజర్ ప్రదీప్‌కుమార్, సిబ్బంది పాత బస్టాండు సెంటర్లో పరిశీలించగా బస్సు ఎక్కుతున్న నిందితురాలిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుని తస్కరించిన రూ. 960ని బాధితుడికి అప్పగించింది. నిందితురాలు కర్నూలు పట్టణానికి చెందిన మహిళ అని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఓబులేసు తెలిపారు. -
అరగంట వ్యవధిలో చోరీ సొమ్ము రికవరీ
కర్నూలు : కర్నూలు నగరం హిందుస్థాన్ హోటల్ పక్కన గల గురుదత్త బట్టల షాపుకు ఓ మహిళ దుస్తుల కొనుగోలుకు వెళ్లింది. చోరీకి అలవాటు పడ్డ ఇద్దరు మహిళలు ఆమెను అనుసరించి పర్సుతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగలించి ఆటోలో ఎక్కి వెళ్లిపోయారు. బాధితురాలు అరగంట తర్వాత గుర్తించి ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కృష్ణయ్య, ఏఎస్ఐ నిర్మలాదేవి, కానిస్టేబుల్ మద్దిలేటి బృందంగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజీ సహకారంతో మౌర్యా ఇన్ దగ్గర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ మంగళవారం మధ్యాహ్నం ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సందర్భంలో బాధితులు స్టేషన్లో ఉండగా వారిని విచారించారు. అరగంట వ్యవధిలో తమ సొమ్ములను పోలీసులు రికవరీ చేశారని బాధితులు ఎస్పీకి తెలిపారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. బాధిత మహిళ ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు భద్రతాభావాన్ని పెంపొందించే విధంగా పోలీసులు పనిచేయాలని సూచించారు. అనంతరం స్టేషన్ అంతా కలియదిరిగి రికార్డులను పరిశీలించారు. సీఐ బి.ఆర్.కృష్ణయ్య, ఏఎస్ఐలు నిర్మలాదేవి, ఎస్.జె.సాహెబ్‌తో పాటు కానిస్టేబుల్ మద్దిలేటి తదితరులు ఎస్పీ వచ్చినప్పుడు స్టేషన్లో ఉన్నారు. -
దోపిడీ కేసు.. తిర‘కాసు’
– కేసు లేకుండా చేసేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ – వేధింపులు తాళలేక నిందితుడి తండ్రి అజ్ఞాతంలోకి కర్నూలు: దొంగతనం కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు ఎస్ఐ చేసిన నిర్వాకం వివాదస్పదమైంది. సి.బెళగల్ మండలంలోని కొండాపురం చెందిన పి.మహమ్మద్ గ్రామంలోనే డీజిల్, పెట్రోల్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెలరోజుల క్రితం గ్రామంలో వరుసగా దోపిడీలు జరిగాయి. మహమ్మద్‌పై అనుమానంతో గ్రామపెద్దల వద్ద బాధితులు పంచాయితీ పెట్టారు. చివరకు దొంగతనం చేశానని ఒప్పుకొని రూ.68 వేలు కట్టేందుకు పెద్ద మనుషులు ఒప్పుకొని పంచాయితీని సి.బెళగల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మహమ్మద్‌పై ఎలాంటి కేసు లేకుండా బాధితులకు డబ్బులిచ్చే విధంగా ఒప్పందం చేసుకొని ఎస్ఐ మల్లికార్జునకు డబ్బులు అప్పగించి నిందితుడు వెళ్లిపోయాడు. నాలుగైదు రోజుల తర్వాత బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డబ్బులివ్వాలని ఎస్ఐను అడిగితే బెదిరించి పంపాడు. విషయాన్ని బాధితులంతా టీడీపీ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. పంచాయితీ డబ్బులను బాధితులకు ఇవ్వాలని విష్ణువర్దన్‌రెడ్డి ఎస్ఐను కోరగా, కేసు నమోదు చేసి డబ్బులను కోర్టు ద్వారా రికవరీ చేయిస్తానని ఎస్ఐ బుకాయించాడు. చేతికొచ్చిన డబ్బులు జారీపోతాయన్న అక్కసుతో ఎస్ఐ.. నిందితుడు మహమ్మద్ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టాడు. రోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకొని రూ.50 వేలు ఇస్తే తప్ప వదిలిపెట్టనని బెదిరించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం వివాదమవుతుందని ఎస్ఐ గ్రహించి ఈనెల 30న మహమ్మద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపాడు. రూ.50 వేల కోసం తండ్రి గిడ్డయ్యను రోజూ స్టేషన్‌కు రప్పించి వేధించసాగాడు. సోమవారం డబ్బులు తీసుకొస్తానని గిడ్డయ్య కర్నూలుకు వెళ్లి ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. డబ్బులు డిమాండ్ చేయలేదు: మల్లికార్జున, ఎస్ఐ, సి.బెళగల్ దోపిడీ కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్‌ను డబ్బులు డిమాండ్ చేయలేదు. దోపిడీ కేసులో రికవరీ కోసం డబ్బులను సీజ్ చేసి అరెస్ట్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపాం.