- సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళా దొంగ పట్టివేత
గూడూరు: స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఓ ఖాతాదారుడి నుంచి నగదును తస్కరించిన మహిళను సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ఆర్.ఖానాపురం గ్రామానికి చెందిన రైతు దామోదర్‌రెడ్డి వైజాగ్‌లో చదువుకుంటుండగా తన కుమారుడి ఖాతాలో నగదు జమ చేసేందుకు ఎస్‌బీఐకి వచ్చాడు. కుమారుడి ఖాతాలో రూ.25 వేలు జమ చేస్తుండగా వెనుక ఉన్న ఓ మహిళ బ్లేడుతో బ్యాగ్‌ను కత్తిరించి అందులో ఉన్న రూ. 960ని తస్కరించింది. కొద్ది సేపటికి బాధితుడు విషయాన్ని గమనించి బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా బాధితుడి వెనుక ఓ మహిళ బురఖా ధరించి చోరీకి పాల్పడిన విషయాన్ని గమనించారు. అనంతరం మేనేజర్ ప్రదీప్‌కుమార్, సిబ్బంది పాత బస్టాండు సెంటర్‌లో పరిశీలించగా బస్సు ఎక్కుతున్న నిందితురాలిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుని తస్కరించిన రూ. 960ని బాధితుడికి అప్పగించింది. నిందితురాలు కర్నూలు పట్టణానికి చెందిన మహిళ అని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఓబులేసు తెలిపారు.
బ్యాంక్‌లో చోరీ
Published Fri, Mar 10 2017 10:41 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement