శ్రీశైలం సీఐపై వేటు?
– అవినీతి ఆరోపణలపై ఎస్పీ సీరియస్
కర్నూలు: శ్రీశైలం సీఐ విజయకృష్ణపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. కర్నూలు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి రెండు మాసాల క్రితం ఈయన శ్రీశైలానికి బదిలీపై వెళ్లారు. తక్కువ వ్యవధిలోనే తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీశైలంలో భారీ మొత్తంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో తనకు వాటా ఇవ్వాలంటూ ఏకంగా ఆలయ అధికారితో బేరసారాలు చేసినట్లు సమాచారం. ఆలయ ఉన్నతాధికారి ఇదే విషయాన్ని ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఫోన్‌లో తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఇదే విషయంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో విచారణ చేయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ప్రాథమికంగా నిర్థారణ కావడంతో ఆయనను మౌఖిక ఆదేశాలతో విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా బందోబస్తు విధులకు కర్నూలుకు వచ్చిన ఆయనను ప్రస్తుతం ఏపీఎస్‌పీ రెండవ పటాలంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల వద్ద విధులకు నియమించారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే శాఖాపరమైన చర్యలు తప్పవని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఈయన గతంలో ఆదోని సబ్ డివిజన్‌లో విధులు నిర్వహించే సమయంలోనూ ఓ కేసులో నిందితున్ని తప్పించి, పోలీసు విచారణలో బయటపడటంతో శాఖాపరమైన చర్యలకు గురైన సంగతి తెలిసిందే. ఎస్పీ ఆకె రవికృష్ణను ఈ విషయంపై వివరణ కోరగా ఆరోపణలపై విచారణ కొనసాగుతుందన్నారు. ఎవరిపై అలాంటి ఆరోపణలు వచ్చినా శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా వ్యవహరించిన వారిపై పోలీసు అధికారుల చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. వసూళ్ల పరంపర మాత్రం తగ్గని పరిస్థితి. సంవత్సర కాలంలో ఎనిమిది మంది సీఐలు, పది మంది ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 14 మంది కానిస్టేబుళ్లు శాఖా పరమైన చర్యలకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలం సీఐ విజయకృష్ణపై ఆరోపణల అంశం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.