ఏసీబీ అదుపులో డీఎంహెచ్‌ఓ
ఏసీబీ అదుపులో డీఎంహెచ్‌ఓ
Published Wed, Dec 14 2016 10:12 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఓ జిల్లా అధికారిణిపై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌ఓ పోస్టు మరోసారి వివాదాలకు వేదికగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిగా డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి గత మే నెలలో నియమితులయ్యారు. అప్పట్లో విజయనగరం డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో భాగంగా కర్నూలుకు బదిలీ చేశారు. అప్పటికే విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయమై విచారణ చేసేందుకు అప్పట్లో ఆమెను బదిలీ చేశారు. కాగా కర్నూలు వచ్చిన ఆరు నెలల అనంతరం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చకు దారితీసింది. బుధవారం ఉదయమే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో కర్నూలు ఏసీబీ సీఐలు వెంకటకృష్ణారెడ్డి, సతీష్, సిబ్బంది స్థానిక సప్తగిరినగర్‌లోని శ్రీ కృష్ణ రెసిడెన్సీలో నివాసముంటున్న డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఇంట్లోని బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. రెండు బ్యాంకు ఖాతాల పాస్‌బుక్కులతో పాటు ఏటీఎం కార్డు, చెక్కు బుక్కు, రూ.19వేల నగదు, పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లోని సమాచారాన్ని సేకరించారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో హైడ్రామా
ఇంట్లో సోదాలు పూర్తి చేసుకున్న ఏసీబీ అధికారులు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి వెళ్లారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని కార్యాలయం బయటే ఓ వాహనంలో ఉంచి, అధికారులు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లారు. డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వెళ్లారు. కాగా అంతకుముందే డీఎంహెచ్‌ఓకు సన్నిహితంగా మెలిగే ఇద్దరు ఉద్యోగులు చాంబర్‌లోకి వెళ్లి పలు రికార్డులు చక్కబెట్టినట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఏసీబీ అధికారులు చాంబర్‌లోకి వచ్చినా ఏమీ దొరకనట్టు వారు సర్దినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు మరో ఉద్యోగి డీఎంహెచ్‌ఓకు సన్నిహితంగా మెలుగుతూ ఆదివారం సైతం విధులు నిర్వహించి అనుకున్న పనులు చక్కబెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంహెచ్‌ఓపై పలు ఫిర్యాదులు సైతం రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం.
డీఎంహెచ్‌ఓ పోస్టుకు కొనసాగుతున్న మకిలీ
డీఎంహెచ్‌ఓ పోస్టు అంటేనే రోత పుట్టేలా చర్యలు ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పనిచేసిన కొందరు డీఎంహెచ్‌ఓల మాదిరిగానే ఇక్కడకు వస్తున్న అధికారులు తమ అవినీతి పంథాను వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్‌ని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. దీంతో పాటు ఆయన స్టేషనరీ కుంభకోణంలోనూ ఇరుక్కున్నారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ ఆంజనేయులు సైతం ఇదే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేసి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన డాక్టర్ వెంకటపతి, డాక్టర్ రామకృష్ణారెడ్డిలపైనా ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలు విషయంలో డాక్టర్ శివశంకర్‌రెడ్డిపై కేసు నమోదైన విషయం విదితమే. డీఎంహెచ్‌ఓ పోస్టులో భారీగా ఆదాయం ఉండటం వల్లే ఈ పోస్టుకు రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఇచ్చి తెచ్చుకునే వారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినీతి మకిలి అంటించుకుని అధికారులు ఇక్కడి నుంచి స్థానచలనం పొందుతున్నారు.
Advertisement
Advertisement