dmho
-
పాములుంటాయ్..! జాగ్రత్త..!!
నిర్మల్: జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరా ల్లో ఆడుకుంటూ మరికొందరు, రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతి చెందిన ఘటనలున్నాయి. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారులో నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా మూఢవిశ్వాసాలతో మంత్రాలు చేయించడం, పసరు మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. జిల్లాలో ప్రస్తుతమున్న చల్లని వాతావరణానికి పచ్చని చెట్లు, పొదలు తోడు కావడం, వర్షానికి వరదనీటి ప్రవాహం వస్తుండడంతో పాములు ఆరుబయట విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జనావాసాల మధ్య, నిల్వ నీరున్న కుంటల్లో దర్శనమిస్తున్నాయి. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలో ఉండే గుంతలు, చెట్లపొదల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అటుగా వెళ్లి ఆడుకుంటున్న చిన్నపిల్లలు పాముకాటుకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇళ్ల ముందు, ఆరుబయట నిలిపి ఉంచుతున్న ద్విచక్ర వాహనాలు, కారు ఇంజిన్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాము కాటును ఇలా గుర్తించాలి.. పాము కరిస్తే ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది.. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా? అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు ఉంటుంది. కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఇవీ.. జాగ్రత్తలు పొలం పనులకు వెళ్లే రైతులు, అడవుల్లో పశువుల వెంట తిరిగేవారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్ వెంట తీసుకెళ్లాలి. పాములు ఎక్కువగా మోకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులు ధరించాలి. కాళ్ల కిందకు ఉండే దుస్తులు వేసుకోవాలి. కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎవరైనా పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్స ఇలా.. పాముకాటు వేసినప్పుడు నోరు లేదా బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు. కంగారులో నాటువైద్యులను ఆశ్రయించవద్దు. పాము కాటు వేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాలి. కాటు వేసిన భాగంలోని మూడు అంగుళాల పైభాగాన గుడ్డతో కట్టాలి. మందులు అందుబాటులో ఉంచాం అన్ని ప్రభుత్వ దవా ఖానలు, పీహెచ్‌సీల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వానాకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి -
అవసరమైన చోట ఎక్కువమంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే ప్రజారోగ్య సంచాలకుల విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో హేతుబద్దికరణ చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు గురువారం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఉద్యోగుల హేతుబద్దికరణ ప్రక్రియకు అనుమతించారు. రోగుల తాకిడికి అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డీఎంహెచ్‌వో మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో ఇక ఆరుగురు డీఎంహెచ్వోలు పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్వోలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఆరుగురు డీఎంహెచ్వోలు ఉంటారు. కొత్త డీఎంహెచ్వోలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 మంది ఉంటారు. ఇక రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, అందులో సిబ్బంది ఏకరీతిగా లేదు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది ఏకరీతిగా ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్రీచ్ కార్యకలాపాలు సీహెచ్‌సీలతో నిర్వహి స్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేశారు. రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లను బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను టీవీవీపీ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. 4,246 ఎంపీహెచ్ఏ పోస్టులు మంజూరు 1,712 పోస్ట్‌లను సూపర్‌న్యూమరరీ పోస్ట్‌లుగా మార్చారు. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు. దాంతో పీహెచ్‌సీలు, ఇతర సంస్థలలో మంజూరు చేసిన ఎంపీహెచ్ఏ (ఎఫ్) పోస్టుల స్థానం మారదు. దాంతో 4,246 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టులను మంజూరు చేశారు. అయితే ఈ పోస్టులకు సంబంధించిన స్పష్టతను వైద్య, ఆరోగ్యశాఖ ఇవ్వలేదు. మార్గదర్శకాల్లో కొంత గందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల తాకిడికి అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది. -
వైద్యారోగ్య శాఖలో...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అవసరమైన చోట కొత్త పోస్టుల మంజూరు, అవసరం లేనిచోట రద్దు చేయడంతోపాటు వైద్యులు అధికంగా ఉన్నచోట నుంచి తక్కువగా ఉన్నచోటుకు బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించాయి. కొత్తగా డీఎంహెచ్‌వో పోస్టులు ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 19 జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక డీఎంహెచ్‌వో పర్యవేక్షించడం కష్టమైన వ్యవహారం. దీంతో హైదరాబాద్‌కు మరో ఐదు డీఎంహెచ్‌వో, ఇతర జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో పోస్టులు అవసరమని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్తగా 19 డీఎంహెచ్‌వో పోస్టులకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, మొత్తం డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరిగినట్టేనని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి హైదరాబాద్‌కు ఆరుగురు డీఎంహెచ్వోలు, మిగతా అన్ని జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో ఉంటారు. త్వరలోనే హైదరాబాద్‌కు ఐదుగురు అదనపు డీఎంహెచ్‌వోల నియామకం జరగనుందని.. దీనితో నగరంలో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ సులువు అవుతుందని అధికారులు అంటున్నారు. అవసరమైన చోటకి వైద్యం, సిబ్బంది వైద్యారోగ్యశాఖలో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలు చాలాకాలం నుంచి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి మించి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఉంటుంటే.. కొన్ని ఆస్పత్రుల్లో అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు. చాలామంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది కొరతతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్న చోటి నుంచి తక్కువగా ఉన్న చోట్లకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రతిపాదించింది. దీనికి కూడా సర్కారు ఆమోదం తెలిపిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కౌన్సెలింగ్ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. అవసరం లేని పోస్టుల రద్దు లెప్రసీ వంటి పలు విభాగాల్లోని కొన్ని పోస్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలోని చాలా మందికి పనిలేదని, పలుచోట్ల ఆయా పోస్టుల అవసరం లేదన్న అభిప్రాయమూ ఉందని చెప్తున్నాయి. అటువంటి పోస్టులను అవసరమైన చోటికి మార్చడమో, రద్దు చేయడమో చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల లిఫ్ట్ ఆపరేటర్లు అవసరం లేదని భావిస్తున్నారు. ఇలా విభాగాల వారీగా అవసరం లేని పోస్టులను గుర్తించి.. రద్దు చేయడమా, ఇతర చోట్ల సర్దుబాటు చేయడమా, పోస్టుల విధులు మార్చడమా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
కేటుగాళ్లు.. కలెక్టర్ డీపీ పెట్టుకుని 1.40 లక్షలు కొట్టేశారు
సూర్యాపేట క్రైం: కలెక్టర్ డీపీ పెట్టుకుని ఏకంగా జిల్లా అధికారి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు కాజేశారు. సూర్యాపేట కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డీపీతో కేటుగాళ్లు వాట్సాప్ నంబర్‌తో డీఎంహెచ్‌వో డాక్టర్ కోటాచలం నంబర్‌కు మెసేజ్ చేశారు. నాకు అర్జెంటుగా రూ.1.40 లక్షలు కావాలని కోరారు. దీంతో నిజంగానే కలెక్టర్ మెసేజ్ పెట్టారని నమ్మి సదరు వైద్యాధికారి ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఏకంగా రూ.1.40 లక్షల విలువైన ఆరు అమెజాన్ గిఫ్ట్ కార్డులను పంపించారు. వెంటనే అదే నంబర్ నుంచి ఇంకో రూ.20 వేలు పంపించాలని సైబర్ నేరగాడు అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గ్రహించి ఆ అధికారి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వోల నియామకం
సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన పలు జిల్లాలకు డీఎంహెచ్వోలను నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏడు రోజుల్లోగా కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. -
18 నుంచి 22వ తేదీ వరకు వైద్య శిబిరాలు
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 నుంచి 22వ తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఎంపిక చేసిన 52 మండలాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 45 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం, రక్తపోటు, ఇతర జీవన శైలి జబ్బులకు సంబంధించిన స్క్రీనింగ్‌ను ఉచితంగా నిర్వహించనున్నారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ప్రజలకు డిజిటల్ ఐడీ సృష్టించడం వంటి ఇతర సేవలను అందించనున్నారు. వైద్య శిబిరాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్వోలను ఆదేశించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ నివాస్ తెలిపారు. -
సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, వైద్య సిబ్బందిని ట్విటర్లో బుధవారం అభినందించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారిలో 98 శాతం మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేటలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ కొత్తగా 558 మందికి వ్యాక్సినేషన్ జిల్లాలో బుధవారం 558 మందికి వ్యాక్సినేషన్ చేశారు. కోవిడ్ పరీక్షలు 2,326 మందికి చేయగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వేములవాడలో రెండు, ఇల్లంతకుంటలో ఒక్క కేసు ఉంది. ప్రస్తుతం 193 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఒకరు మరణించారు. దీంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 564కు చేరింది. పొలాల బాట పట్టిన వైద్యసిబ్బంది కరోనా వైరస్ నివారణకు జిల్లా వైద్యసిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. టీకా తీసుకోవడంతోనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం 18 ఏళ్లు పైబడ్డ 4,60,859 మందిని గుర్తించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేస్తున్న కృషితోనే ప్రస్తుతం జిల్లాలో 135 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రత్యేక కార్యాచరణతో వ్యాక్సినేషన్ జిల్లాలో వైద్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉపఆరోగ్యకేంద్రాలలో క్షేత్రస్థాయి సిబ్బందితో టీకా తీసుకోని వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు. టీకా తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకినా ఆస్పత్రికి వెళ్తే పరిస్థితులు రావని అవగాహన కల్పిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి మరీ టీకాలు ఇస్తున్నారు. పనిచేసుకుంటున్న వారి వద్దకు వెళ్లి టీకా తీసుకునేలా ప్రోత్సహించారు. జిల్లాలో తొలి, రెండో డోసులను 4,55,544 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో టీకా తీసుకోని వారు 53 వేల మందిని గుర్తించారు. ఏఎన్ఎంలు నిత్యం 13 వేల నుంచి 15 వేల మందికి టీకా ఇస్తున్నారు. ఈ లెక్కన మూడు, నాలుగు రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రత్యేక సందర్భాల్లోనే టీకాకు దూరం జిల్లాలో దాదాపు నూరుశాతం వ్యాక్సినేషన్ అయ్యిందని చెప్పుకోవచ్చు. బాలింతలు, గర్భిణులు, కరోనా పాజిటివ్ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు, వివిధ జబ్బులతో ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నవారు మాత్రమే కరోనా టీకా తీసుకోలేదు. ఇలాంటి వారు 5,335 మంది ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. Congratulations Collector Garu & DMHO team 👏 https://t.co/K8NmPztAs7 — KTR (@KTRTRS) September 29, 2021 -
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. జిల్లాల వారిగా ఖాళీలు, అర్హతలు, వేతనాలు, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్హెచ్ఎం, ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం.. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 858 ► పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు–53, మెడికల్ ఆఫీసర్లు–308, స్టాఫ్ నర్సులు–324, ల్యాబ్ టెక్నీషియన్లు–14, పారామెడికల్ స్టాఫ్–90, కన్సల్టెంట్–13, సపోర్ట్ స్టాఫ్–56. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: visakhapatnam.ap.gov.in డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 55 మెడికల్ స్టాఫ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌లు–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌లు–01, జనరల్ ఫిజీషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్లు–20, స్టాఫ్ నర్సు–17, ల్యాబ్ టెక్నీషియన్–02, ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపే షనల్ థెరపిస్ట్–02, ఆడియోమెట్రీషియన్–03, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్/క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌లు, జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్)వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► వాక్ ఇన్ తేదీలు: 2021, సెప్టెంబర్ 02 నుంచి 08 వరకు ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://krishna.ap.gov.in డీఎంహెచ్‌వో, ప్రకాశంలో 61 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో)..నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 61 ► పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు–23, స్టాఫ్ నర్సులు–26, సైకియాట్రిక్ నర్స్–01, ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపేషనల్ థెరపిస్ట్–02, ఆటోమెట్రీషియన్–02, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–క్వాలిటీ మానిటర్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.53,495 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్–హెల్త్ ఆఫీస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్, కాంపౌండ్, ఒంగోలు చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: https://prakasam.ap.gov.in డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో 71 మెడికల్ స్టాఫ్ కొలువులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపది కన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 71 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, ఎన్పీసీడీసీ ౖÐð ద్యాధికారులు–11, ఎన్‌బీఎస్‌యూసీ వైద్యాధికారులు–07, స్టాఫ్ నర్సులు–15, సెకియాట్రిక్ నర్స్–01, జిరియాట్రిక్/పెల్లవేటివ్ కేర్ నర్సులు–03, మెడికల్ కాలేజి ల్యాబ్ టెక్నీషియన్లు–19, ఫ్లోరోసిస్ ల్యాబ్ టెక్నీషియన్లు–01, ఎన్‌పీహెచ్‌సీఈ ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపేషనల్ థెరపిస్ట్–02, ఆడియో మెట్రీషియన్–02, ఎన్ఎంహెచ్పీ సోషల్ వర్కర్–01, ఎన్టీసీపీ సోషల్ వర్కర్–01, కన్సల్టెంట్ క్వాలిటీ మానిటర్–01, ఎన్‌పీహెచ్‌సీఈ హాస్పిటల్ అటెండెంట్–02, ఎన్‌పీహెచ్‌సీఈ అటెండెంట్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం /బీఎస్సీ(నర్సింగ్), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021 ► వెబ్సైట్: srikakulam.ap.gov.in ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ► విభాగాలు: డెసిషన్ సైన్స్, ఎంట్రప్రెన్యూర్షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్గనైజేషనల్∙బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ తదితరాలు. ► అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్–530003 చిరునామకు పంపించాలి. ► ఈమెయిల్: facultyrecruit2021sep@iimv.ac.in ► ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.10.2021 ► వెబ్సైట్: www.iimv.ac.in -
తాడిపత్రిలో శంకర్‌దాదా ఎంబీబీఎస్..
‘‘మోకాలి నొప్పులు, వెన్ను నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? దీర్ఘ కాలిక రోగాల బారినపడి విసిగిపోయారా? ఇకపై సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న సూదులతో కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేస్తాం’’ అంటూ ఆక్యుపంక్చర్ వైద్యుడిగా తనను తాను చలామణి చేసుకుంటున్న ఓ వ్యక్తి జిల్లాలో జోరుగా ప్రచారం చేశాడు. ఇదంతా నిజమేననుకుని వందలాది మంది ఆ వ్యక్తిని ఆశ్రయించారు. ఉన్నరోగం నయమవుతుంది అనుకున్న వారికి కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆక్యుపంక్చర్ వైద్యంతో సర్వరోగాలను నయం చేస్తానంటూ తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టడంతో వివిధ రోగాల బారిన పడిన వారంతా అతడి వద్దకు క్యూ కట్టారు. ఆక్యుపంక్చర్ వైద్యం పేరిట అతను అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వినియోగించడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. స్థానిక ఆర్ఎంపీలకు ఈ విషయం తెలిసి భయపడి పోయిన వారు తమ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి సదరు వ్యక్తిని పూర్తిగా తొలగించారంటే అతని వైద్యం ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆక్యు పేరిట అడ్డగోలు వైద్యం.. చర్మంపైన సూదితో గుచ్చుతూ వ్యాధిని నయం చేసే నైపుణ్యతను, శాస్త్ర పరిజ్ఞానాన్ని ‘ఆక్యుపంక్చర్’ అంటారు. ఇందులో రోగలక్షణాలకు కాకుండా రోగ మూలకారకాలకు చికిత్స చేస్తారు. అలా చేస్తేనే జబ్బు పూర్తిగా నయమవుతుంది. ఇందుకోసం తేలికపాటి ప్రత్యేకమైన సూదులను ఉపయోగిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ‘ఆక్యు’ పేరిట అడ్డగోలు వైద్యానికి తెరలేపాడు. తనకు తాను ఆంక్యుపంక్చర్ వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నాడు. వృద్ధాప్యం ఇతర కారణాలతో మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేసుకొని మోసానికి తెరలేపాడు. కేవలం రూ. 300 తో ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మబలకడంతో ఎంతో మంది అతని ఆస్పత్రి ముందు బారులు తీరుతున్నారు. స్టెరాయిడ్లతో చికిత్స ఇంజెక్షన్ వేసుకుంటే చాలు మోకాళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయని సదరు వ్యక్తి నమ్మబలకడంతో తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరుకు చెందిన ఎంతో మంది అతని వద్ద వైద్యం కోసం క్యూ కట్టారు. దీంతో అతను ఆక్యుపంక్చర్ వైద్యం పేరుతో అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేస్తున్నాడని కొందరు బాధితులు తెలిపారు. ఇంజెక్షన్ చేసిన ప్రతిసారీ రూ.300 వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇలా ఇంజెక్షన్ వేయించుకున్న వారికి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుండటంతో ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటంతో కొందరు ఆర్ఎంపీలకు కూడా కాసుల పంట పండుతోంది. ఉన్న రోగాలకు తోడు కొత్తరోగం ఇంజెక్షన్లు వేయించుకున్న వారికి తాత్కాలికంగా నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ వచ్చినా... ఆ తర్వాత నుంచి వారిని కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపులు రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టించుకోని వైద్యాధికారులు కొన్నేళ్లుగా తాడిపత్రి పట్టణంలో ‘ఆక్యు’ పేరిట ఈ దందా జరుగుతున్నా... జిల్లా వైద్యాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే వందలాది మంది అతన్ని ఆశ్రయించి మోసపోగా నేటికీ దర్జాగా ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తూనే ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా అతని ఆగడాలకు బ్రేక్ వేసి సామాన్యుల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఆక్యుపంక్చర్ పేరిట రోగుల ప్రాణాలతో ఆడుకుంటే ఉపేక్షించేది లేదు. రోగులకు నొప్పులు తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయి. జిల్లాలో ఇలాంటి విధానంతో వైద్యం చేస్తున్న విషయం నాకు తెలియదు. విచారించి, ఎక్కడైనా ఇలాంటి పనులు చేస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందుతోంది. ప్రజలు ఇలాంటి తెలిసీ తెలియని వైద్యుల వద్దకు వెళ్లవద్దు. – కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్ఓ ప్రభుత్వ గుర్తింపు లేదు ఆక్యుపంక్చర్ థెరపీ చైనా వైద్య విధానంలో భాగం. ఏపీలో ఈ వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదు. జిల్లాలో ఆక్యుపంక్చర్ చేసే వారు లేరు. ఆయుష్ వైద్య విధానంలో వివిధ రుగ్మతలకు మంచి వైద్యం అందిస్తున్నాం. జిల్లా ప్రజలు ఆస్పత్రుల్లో అందించే ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రత్నా చిరంజీవి, ఇన్చార్జ్ ఆయుష్ వైద్యాధికారి -
విశాఖలో బ్లాక్ ఫంగస్ కలకలం
విశాఖపట్నం: జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 94 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. బ్లాక్ ఫంగస్ బారీన పడిన బాధితులకు విశాఖ కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద బెడ్స్ ఏర్పాటు చేసి వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య శ్రీ కింద 50శాతం బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లఘింస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూర్యనారాయణ హెచ్చరించారు. -
మొదటి డోస్ కోవిషీల్డ్.. రెండో డోస్ కోవాగ్జిన్
నల్లగొండ: కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో వైద్యుల పొరపాటు ఒకరిని అస్వస్థతకు గురిచేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా ఇస్తోంది. 45 సంవత్సరాలపైబడిన వారంతా తీసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ప్రజలు పెద్దఎత్తున వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మొదటి డోస్ ఏ టీకా అయితే తీసుకుంటారో రెండో డోస్ కూడా అదే తీసుకోవాలి. కానీ వైద్యులు పొరపాటుగా వ్యవహరించి మొదటి డోస్ కోవిషీల్డ్, రెండో డోస్ కోవాగ్జిన్ ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రైతు సంఘం నాయకుడు చిలుక విద్యాసాగర్‌రెడ్డి మార్చి 5న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోవిషీల్డ్ టీకా తీçసుకున్నారు. తిరిగి రెండో డోస్ ఏప్రిల్ 17న అదే ఆస్పత్రిలో తీసుకున్నారు. అతనికి రెండోసారి కోవిషీల్డ్‌కు బదులుగా కోవాగ్జిన్ ఇచ్చారు. ఆ టీకా తీసుకున్నప్పటినుంచి అతనికి తల తిరగడం, నీరసంతో పడిపోవడం వంటి సమస్యలు వచ్చాయి. టీకా మార్పిడిపై కుటుంబ సభ్యులు ఫోన్లో వైద్యులను సంప్రదించగా, తమకు తెలియదని, డీఐఓ, డీఎంహెచ్ఓ, సూపరింటెండెంట్‌ను అడగాలని సమాధానం చెప్పారని బాధితుడు విద్యాసాగర్‌రెడ్డి ‘సాక్షి’తో వాపోయారు. ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. వ్యాక్సిన్ సరిగ్గానే ఇచ్చారు: కొండల్రావు, డీఎంహెచ్ఓ విద్యాసాగర్‌రెడ్డికి రెండో డోస్కూడా కోవిషీల్డ్ వ్యాక్సినే ఇచ్చాం. కంప్యూటర్లో డేటా ఎంటర్ చేసే క్రమంలో పొరపాటు జరిగింది. మొదటి డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటారో దానికి సంబంధించి రెండో డోస్ తీసుకునే సందర్భంలో అతని పేరు ఫీడ్ చేయగానే ఏ వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తెలుస్తుంది. వేరే వ్యాక్సిన్ ఇవ్వలేదు. కంప్యూటర్ ఆపరేటర్ ఎంటర్ చేయడంలో తప్పిదం జరిగింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
డీఎంహెచ్ఓ, అనంతపురంలో పీఎంఓఏ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన అనంతపురం జిలా వైద్య, ఆరోగ్యా ధికారి కార్యాలయం(డీఎంహెచ్ఓ).. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు (పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 26 ► అర్హత: ఇంటర్మీడియట్ బైపీసీ/ఎంపీసీ ఉత్తీర్ణతతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన సంస్థలో పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు /బీఎస్సీ(ఆప్టోమెట్రి)/డిప్లొమా(ఆప్టోమెట్రి) కోర్సు చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డ్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి. ► వయసు: 01.12.2020 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులకు–45 మార్కులు, టెక్నీషియన్ అర్హతలో సాధించిన మార్కులకు 45 మార్కులు, మిగతా వాటికి 10 మార్కులు..టెక్నికల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైనప్పటి నుంచి ఏడాదికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.03.2021 ► వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in Army Jobs: 502 ఆర్మీ పోస్టులు, నెలకు రూ.35,400 -
యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్..
సాక్షి, వరంగల్ : అల్లోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలను ఉల్లఘించిన హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ ఎదురుగా ఉన్న సిటీ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ లలితాదేవి, సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు తమకు అందిన సమాచారంతో ఆస్పత్రిలో తనిఖీ చేయగా అర్హులైన వైద్యులు, సిబ్బంది లేకుండా నిర్వహణ సాగుతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అంతేకాకుండా ఆస్పత్రి నిర్వహకుడు అండ్రు ఇంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. బీఎస్సీ చదివిన ఇంద్రారెడ్డి మెడికల్ రిప్రజెంటీవ్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఎంబీబీఎస్ చదివినట్లుగా అవతారమెత్తాడు. యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్లు కూడా చేసేస్తున్నాడు. అలాగే వచ్చీ రానీ వైద్యంతో అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇంద్రారెడ్డి ట్రీట్మెంట్పై అనుమానం రావడంతో వైద్యశాఖ అధికారులకు కొంతమంది సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు. అధికారులను చూసిన ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా గోడ దూకి పారిపోయాడు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళన బాత్రూమ్లో దాచారు. పోలీసుల సహాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చిన అధికారులు ఆమెను విచారించారు. తీవ్రరక్తస్రావం అవుతుండడంతో సదరు మహిళను హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఇంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంద్రారెడ్డి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. దాన్ని అధికారులు దాన్ని సీజ్ చేశారు. చదవండి: ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు.. -
మానవత్వం లేకపోతే ఎలా?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్ఖానగడ్డలోని మహతి ఆసుపత్రిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన పేషెంట్‌కు వైద్యం చేయగా వికటించిన ఘటనపై డీఎంహెచ్‌వో విచారణ ప్రా రంభించారు. హాస్పిటల్ యాజమాన్యాన్ని మంగళవారం తన కార్యాలయానికి పిలిపించారు. ప్రజారోగ్యాన్ని కాపాడుతామని ఆసుపత్రిని ఏ ర్పాటు చేశారు.. కనీస మానవత్వం లేకపోతే ఎలా.. రూ.2లక్షలకు పైగా బిల్లు వేసి, వైద్యం వి కటించి, పేషెంట్‌కు ఇన్ఫెక్షన్ వస్తే పట్టించుకోక పోవడం ఏంటని మండిపడ్డారు. ఇష్టానుసారంగా బిల్లులు వేస్తే నిరుపేదలు ఆస్తులు అమ్ముకొ ని, చెల్లించాలా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొత్తగా ఆసుపత్రిని తీసుకున్నామని నిర్వాహకులు తెలుపగా గతంలో ఉన్న మే నేజ్మెంట్ మారినప్పుడు వైద్యాధికారుల అనుమతి లేకుండా హాస్పిటల్ ఎలా నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో ప్రశ్నించారు. బాధితుడు, రేకుర్తికి చెందిన రంగయ్యది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమని, ఇంత బిల్లు ఎలా వేశారని ప్రశ్నించారు. ఆసుపత్రిని వైద్యేతరులు నడిపించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో కోవిడ్–19 చికిత్సకు అనుమతి పొంది, నిబంధనలు పాటించడం లేదని, అన్ని వివరాలతో మరోసారి హాజరు కావాలని ఆదేశించారు. త్వరలోనే ఆసుపత్రిని సందర్శించి, పూర్తిస్తాయిలో విచారణ చేపడుతామన్నారు. కాగా తమను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపరిచిన మహతి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని రంగయ్య కుటుంబీకులు కోరుతున్నారు. వివాహిత ఆందోళన ఇబ్రహీంపట్నం(కోరుట్ల): గోధూర్‌లో భర్త విడాకులు ఇవ్వకుండానే మూ డో పెళ్లి చేసుకున్నాడని ఓ వివాహిత అతని ఇంటి ఎదుట బైఠాయించింది. ఏఎస్సై సత్యనారాయణ వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌కు చెందిన ఆరీఫాకు గోధూర్‌కు చెందిన సల్మాన్‌తో వివాహం జరిగింది. కొన్ని నెలలు బాగానే ఉన్న సల్మాన్ ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టడంతో పుట్టింటికి చేరింది. అతనిపై మెట్పల్లి ఠాణా లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సల్మాన్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించడంతో వెళ్లిపోయింది. మళ్లీ ఈ నెల 11న మూడో పెళ్లి చేసుకున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే భర్త పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని, న్యాయం చేయాలని ఆరీఫా మంగళవారం భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. ఏఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, ప్రస్తుతం భర్త ఇంటిలోనే ఉండాలని సూచించచడంతో ఆందోళన విరమించింది దొంగపై పీడీయాక్టు అమలు సాక్షి, రామగుండం క్రైం: గోదావరిఖని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలురను చేరదీసి, దొంగతనాలకు పాల్పడుతున్న పెంకి బలరాం(23)పై పీడీయాక్టు నమోదు చేసినట్లు సీ ఐలు పర్శ రమేష్, రాజ్కుమార్గౌడ్లు మంగళవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో అందించామని, అనంతరం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించి నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రూరల్ ఆగంపుడికి చెందిన బలరాంకు భా ర్య ఉండగా మూడేళ్లుగా గోదావరిఖని విఠల్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మైనర్ బా లురతో కలిసి 2019 నుంచి ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6 ఘటనల్లో రూ.10 లక్షల విలువైన ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించాడు. వరుస దొంగతనాలు చేస్తున్న బలరాంపై పీడీయాక్టు అమలుకు కృషి చేసిన ఏసీపీ ఉమేందర్, సీఐలను సీపీ సత్యనారాయణ అభినందించారు. -
ఏపీలో పలువురు డీఎంహెచ్ఓల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల వైద్యాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్‌వోగా కేసీ చంద్రనాయక్ బాధ్యతలు చేపట్టనుండగా, పీఎస్ సూర్యనారాయణ విశాఖ జిల్లా వైద్యాధికారిగా బదిలీ అయ్యారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్‌వోగా కేవీఎస్ గౌరేశ్వరరావు, కృష్ణా జిల్లాకు ఎం.సుహాసిని, ప్రకాశం జిల్లాకు పి.రత్నవళి, చిత్తూరు జిల్లాకు ఎం.పెంచలయ్య(ఇంఛార్జి) డీఎంహెచ్‌ఓలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. (చదవండి: ఏపీ ఐసెట్–2020 ఫలితాల వెల్లడి) శ్రీకాకుళం- కేసీ చంద్రనాయక్ విశాఖ- పీఎస్ సూర్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా- కేవీఎస్ గౌరేశ్వరరావు కృష్ణా జిల్లా- ఎం.సుహాసిని ప్రకాశం జిల్లా- పి.రత్నవళి చిత్తూరు జిల్లా- ఎం.పెంచలయ్య(ఇంఛార్జి) -
పదవీ విరమణ రోజున అన్ని కోవిడ్ సెంటర్ల రద్దు
సాక్షి, విజయవాడ: నగరంలోని అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తూ మాజీ డీఎంహెచ్‌వో ఆదేశాలపై దుమారం రేగుతోంది. విజయవాడలో ఉన్న 22 కోవిడ్ సెంటర్లలో తొమ్మిది సెంటర్లను ప్రభుత్వం గతంలో రద్దు చేయగా, డాక్టర్ రమేష్ మిగతా 13 సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ నాలుగు రోజుల క్రితం (ఆగస్టు 31) ఆదేశాలిచ్చారు. అనుమతులు ఇచ్చిన ఆయనే రిటైర్మెంట్ రోజున రద్దు ఆదేశాలపై కలకలం రేగుతుంది. కాగా కోవిడ్ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండి: కోవిడ్ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..) -
ఏసీబీ వలలో డీఎంహెచ్ఓ
గద్వాల న్యూటౌన్: ప్రభుత్వ వైద్యురాలికి పీజీలో సీటులో వచ్చింది. రిలీవ్ చేయమని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓను అడిగింది. సాటి ఉద్యోగికి పీజీలో సీటు వచ్చింది కదా అని సంతోషించి రిలీవ్ చేయాల్సింది పోయి ఏకంగా పైసల్ డిమాండ్ చేశారు. వైద్యురాలు మరోసారి వెళ్లి అడిగినా అదే డిమాండ్‌ను ఆమె ముందు ఉంచారు. దీంతో చేసేదిలేక వైద్యురాలు, భర్త సాయంతో ఏసీబీని ఆశ్రయించింది. నెలరోజులుగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి సారించారు. బుద్ధిపోనిచ్చుకోని ఆ జిల్లా అధికారి ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రూ.7వేలు లంచం తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ చేతికి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన మంజుల అనే పీహెచ్సీ వైద్యురాలు గత నెల 17న జిల్లాలోని వడ్డేపల్లి పీహెచ్‌సీకి బదిలీపై వచ్చింది. విధుల్లో చేరిన మరుసటి రోజే ఆమెకు కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీలో సీటు వచ్చింది. పీజీలో జాయిన్ అయ్యేందుకు నిబంధనల ప్రకారం తనను రిలీవ్ చేయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ భీమ్‌నాయక్‌ను కోరింది. ఆయన డబ్బు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్త అశోక్ తెలిపింది. జూన్ 22న ఆయన మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అప్పటినుంచి వారు ఈ కేసుపై దృష్టి సారించి నాలుగుసార్లు గద్వాలకు వచ్చి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాల యంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ చాంబర్లో వైద్యురాలు మంజుల నుంచి రూ.7వేలు తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చాడు. తీసుకున్న డబ్బును తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో డీఎస్పీ కృష్ణగౌడ్, మహబూబ్‌నగర్, నల్గొండ ఏసీబీ అధికారులు ప్రవీణ్‌కుమార్, లింగస్వా మి, ఎస్ఐలు రమేష్‌బాబు, వెంకట్రావ్‌లు మరో 10మంది సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. కార్యాలయంలో ఉన్న అధికారులందరినీ ఎక్కడివారిని అక్కడే కూర్చోబెట్టారు. నేరుగా డీఎంహెచ్ఓ చాంబర్‌కు వెళ్లి డీఎంహెచ్ఓను తనిఖీ చేశారు. ఆయన ప్యాంట్ జేబులో రూ.7వేలు లభించాయి. ఆ నోట్లను పరిశీలించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ఏదేని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ 1064కు కాల్ చేయాలన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన కొద్దిరోజులకే.. ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉన్న భీమ్‌నాయక్ జూన్ 3న ఇన్చార్జ్ డీఎంహెచ్‌ఓగా జిల్లాకు బదిలీపై వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే ఆయనపై పలు ఫిర్యాదులొచ్చాయి. వివిధ విభాగాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై వారు కోరిన పీహెచ్‌సీలకు ఉద్దేశపూర్వకంగా మార్చాడని ఆశాఖ అధికారులే తెలిపారు. అయిజలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి, డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చిన నలుగురు ఉద్యోగులతో ఓ మాదిరి, మిగిలిన ఉద్యోగులతో మరో మాదిరిగా వ్యవహరించేవారని వైద్యులు తెలిపారు. సదరు నలుగురు ఉద్యోగులే పలు వ్యవహారాలు చక్కబెట్టావారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
సిరిసిల్ల జిల్లాలో అమానుషం!
సాక్షి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ అటెండర్ కనకయ్యతో చెప్పులు తుడిపించారు. ఈ ఘటన తంగళపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై డీఎమ్హెచ్వో చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ‘చెప్పులపై క్యాండిల్ మరకలు పడటంతో నేను తొలగిస్తుంటే.. అటెండర్ మధ్యలో కల్పించుకున్నాడు. చెప్పులను తీసుకుని వెళ్లాడు. నేను వారించిన కూడా అతడు వినలేదు. నా చెప్పులు తుడిపించే స్థాయికి దిగజారలేదు. ఆ ఫొటో ఎవరు తీశారో కూడా నాకు తీయలేదు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను’ అని చంద్రశేఖర్ తెలిపారు. -
అటెండర్‌తో చెప్పులు తుడిపించిన డీఎంహెచ్‌వో!
-
టీకా వికటించి చిన్నారి మృతి
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోగల శివలాల్ తండాలో శనివారం టీకా వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. తండాలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. అరుణ, హన్మాన్ సింగ్ దంపతుల తమ చిన్న కూతురు చిన్నారి (3 నెలలు)కి పోలియో రాకుండా చుక్కలు వేసి, టీకాలు ఇచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే చిన్నారి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. వైద్య సిబ్బంది వచ్చేలోపే చిన్నారి మృతి చెందింది. డీఎంహెచ్‌వో సుదర్శనం విచారణ చేపట్టారు. ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి, చిన్నారికి ఇచి్చన టీకాలు, చుక్కల మందును సీజ్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
అర్హత లేని వైద్యం ఎలా చేస్తారు?
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: స్థానిక రాష్ట్రపతి రోడ్డులోని ఓ హాస్పటల్‌ను మంగళవారం రాత్రి డీఎంహెచ్‌వో డాక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గి చికిత్స పొందుతున్న జ్వర పీడితులను ఆరా తీయగా ఇప్పటివరకు వారు ఖర్చు చేసిన మొత్తాన్ని చెప్పిన వైనానికి డీఎంహెచ్‌వో నివ్వెరపోయారు. ఇదేంటి మీరు మత్తు వైద్యుడు కదా? జనరల్ ఫిజీషియన్ చేయాల్సిన వైద్యం మీరెలా చేస్తున్నారంటూ సదరు వైద్యుడు డాక్టర్ డి.బిల్లీగ్రహంను నిలదీశారు. ఇకపై మీరు ఎటువంటి వైద్య పరీక్షలు రాయడానికి వీల్లేదని, జనరల్ ఫిజీషియన్‌ను అందుబాటులో ఉంచుకుని మాత్రమే వైద్యం చేయాలని, లేదంటే ఆస్పత్రిని సీజ్ చేస్తానని హెచ్చరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బంధువులకు ఈ హాస్పిటల్ వైద్యుడు ఇటువంటి వైద్యం చేయకూడదని, మీరు ఏ వైద్యుడి వద్దకు వెళ్లాలో తెలుసుకుని వైద్యం చేయించుకుని నాణ్యమైన వైద్యాన్ని పొందాలని సూచించారు. ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న జల్లి కొమ్మర గ్రామానికి చెందిన ఉప్పలపాటి దేవీ ప్రసన్న బంధువులు ఇప్పటివరకు రూ.62 వేలు ఖర్చయ్యిందని చెప్పడం విశేషం. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో డెంగీ పేరుతో కొన్ని ఆస్పత్రుల్లో అర్హతలేని వైద్యులు వైద్యం చేస్తూ ఇష్టానుసారంగా వైద్య పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం మండల జల్లి కొమ్మర గ్రామ వాసులకు ఈ హాస్పిటల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని, కొమ్మర వెళ్లి జ్వరాలపై పర్యవేక్షిస్తే ఈ హాస్పిటల్ వ్యవహారం తెలిసి వచ్చానని చెప్పారు. తీరా వచ్చి చూస్తే జనరల్ ఫిజీషియన్ లేకుండానే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందని వైద్యం చేస్తుండటం బయటపడిందన్నారు.ఇటువంటి ఆస్పత్రులపై రానున్న రోజుల్లో తనిఖీలు చేయనున్నట్టు వివరించారు. ముందుగా తణుకులోని అర్బన్ హెల్త్ సెంటర్లను పర్యవేక్షించారు. ఆమె వెంట హెల్త్ యాక్సెంట్ ఆఫీసర్ ఎం.జగన్మోహన్రావు, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలి చాగల్లు: మార్కొండపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా ఆరోగ్యశాఖాధికారిణి డా.బి సుబ్రహ్మణ్యేశ్వరి మంగళవారం సందర్శించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు. వైద్యులు డా. డి.ప్రభాకర్, డా.కె.నిషిత పాల్గొన్నారు. -
వ్యాధులే సవాల్!
రోగాలు పంజా విసురుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. విషజ్వరాలు, డెంగీ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పటికే వివిధ వ్యాధి లక్షణాలతో చాలామంది మృత్యువు ఒడిలోకి చేరారు. వందలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు కొత్త వైద్యాధికారిగా ఎం.చెంచయ్య వచ్చారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత, తగినంత మంది వైద్యులు కూడా లేని సమయంలో బాధ్యతలు చేపట్టిన చెంచయ్య సమస్యల సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. శ్రీకాకుళం అర్బన్: జిల్లాకు కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌వో ఎం.చెంచయ్యకు వ్యాధులు పెను సవాల్ విసరనున్నాయి. ఇప్పటి వరకూ జిల్లా వైద్యాధికారిగా పని చేసిన సనపల తిరుపతిరావుకు విశాఖ జిల్లాకు బదిలీ అయింది. ఈయన శ్రీకాకుళం జిల్లా వాసి కావడం.. స్థానిక సమస్యలపై అనుభవం ఉండడంతో వాటిని నెట్టుకొచ్చేవారు. కొత్త డీఎంహెచ్‌వోగా బుధవారం బాధ్యతలు చేపట్టిన ఎం.చెంచయ్య తూర్పుగోదావరి జిల్లా చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్చార్జిగా వైద్యాధికారిగా పని చేస్తూ జిల్లాకు వచ్చారు. జిల్లాలో పరిస్థితి కుటుంబ సంక్షేమ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖపరిధిలో 80 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 76 పీహెచ్‌సీలు సొంత భవనాలు కలిగి ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకూ భవనాలు శిథిలావస్థకు చేరాయి. అలాగే రాజపురం, వెంకటాపురం, ఈదుపురం, మాణిక్యపురం పీహెచ్‌సీలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. చాలా పీహెచ్‌సీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోగులకు అరకొర వైద్య సేవలే అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది పీహెచ్‌సీలను వైద్యాధికారుల కొరత వేధి స్తోంది. అలాగే 26 నర్సుల పోస్టులు,80కి పైగా ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందిలో చాలామంది స్థానికంగా ఉండడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. వేధిస్తున్న కిడ్నీ మహమ్మారి! ఉద్దానంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో కిడ్నీవ్యాధి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉద్దానం ప్రాంతంలోని కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కిడ్నీ వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజూ..ఏదో ఒక గ్రామంలో ఈ మహమ్మారి బారినపడి ఎవరో ఒకరు చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో అన్వేషించలేదు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఇటీవల అధికారులు చర్యలు చేపట్టినా అనుకున్నస్థాయిలో ఫలితాలు రాలేదు. ఇప్పటి వరకు ఉద్దానం ప్రాంతానికే పరి మితమైన కిడ్నీ వ్యాధులు తాజాగా జిల్లా అంతటా వ్యాపించాయి. గార, శ్రీకాకుళం, లావేరు, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో ఇటీవల కిడ్నీ వ్యాది కేసులు నమోదు నమోదయ్యాయి. ఈ పరిస్థితి వైద్యాధికారులకు సవాల్‌గా మారాయి. సీజనల్ వ్యాధుల విజృంభణ వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. వ్యాధుల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకున్నామని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రోగులకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అందక పోవడంతో వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత గుర్తించలేకపోవడంతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. చాలామంది జ్వరాలతోనే కన్నుమూశారు. అయితే వ్యాధులతో చనిపోతున్న వారివి సహజ మరణాలుగానే వైద్యాధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 55 డెంగీ, 217 మలేరియా కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. అంతంత మాత్రంగానే రక్తపరీక్షలు: జిల్లాలో అంతంత మాత్రంగానే రక్త పరీక్షలు జరుగుతున్నాయి. రక్తపరీక్షల నిర్వహణ ఎన్టీఆర్ వైద్య పరీక్షల పేరిట మెడాల్ సంస్థ నిర్వహిస్తోంది. జిల్లాలో 80 పీహెచ్‌సీలు ఉండగా కేవలం నాలుగు చోట్ల (పొందూరు, పాలకొండ, టెక్కలి, పలాసలలో)మాత్రమే రక్త పరీక్షలు చేసే కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే ఉంటారు. ఆయా పీహెచ్‌సీకి వచ్చే రోగుల సంఖ్య ఆధారంగా 10 శాతం మందికి మాత్రమే రక్తపరీక్షలు నిర్వహిస్తారు. అనివార్య కారణాల వలన రోగి ఏ రోగం బారిన పడ్డాడో తెలియకపోతే సమీప పీహెచ్‌సీల్లోకి వెళ్లి వైద్యం చేయించుకుంటే ఆ రోగికి వచ్చే వ్యాధి తీవ్రతను బట్టి రక్త పరీక్షలు చేయిస్తారు. ఒకరోగి నుంచి సేకరించిన రక్తనమూనాను సంబంధిత కేంద్రం వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి ఆ నివేదికను మరుసటిరోజు రోగికి వెల్లడిస్తారు. దీంతో సరైన ప్రభుత్వ వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. చెంచయ్య బాధ్యతల స్వీకరణ శ్రీకాకుళం అర్బన్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన ఎం.చెంచయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ డీఎంహెచ్‌వోగా పని చేసిన డాక్టర్ సనపల తిరుపతిరావు నుంచి చెంచయ్య బాధ్యతలను తీసుకున్నారు. చెంచయ్య తూర్పుగోదావరి జిల్లా చింతూరు సీహెచ్‌సీ నుంచి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. కొత్త డీఎంహెచ్‌వో వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి చేరుకోగానే ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి అభినందించారు. కార్యక్రమంలో బాలస్వస్థ్య జిల్లా కో–ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, అడిషనల్ డీఎంహెచ్‌వో వై.వెంకటేశ్వరరావు, డీఐవో బగాది జగన్నాథరావు, డీఎల్వో కామేశ్వరప్రసాద్, సీనియర్ అధికారి సీహెచ్.కృష్ణమోహన్, డీఎంవో వీర్రాజు, కార్యాలయ సిబ్బంది కె.శివప్రసాద్, బమ్మిడి నర్సింగరావు, కరకవలస శ్రీనివాసరావు, కొయ్యాన శ్రీనివాసరావు, ఆచారి ఉన్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం జిల్లాలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవలే పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేకాధికారుల పాలనలోకి గ్రామ పంచాయతీలు వెళ్లిపోయాయి. దీంతో పారిశుధ్యం సక్రమంగా జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. చాలా గ్రామంలో తాజా మాజీ సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పంచాయతీల్లో నిధులు కూడా లేవు. దీంతో ప్రత్యేకాధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పారిశుధ్యం పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఎక్కడికక్కడే చెత్త..చెదారం పేరుకుపోతున్నాయి. దోమలు విజృంభించి వ్యాధులకు కారణమవుతున్నాయి. డీఎంహెచ్‌వో కార్యాలయంలో మార్పు వచ్చేనా? జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోని చాలామంది సిబ్బంది పనితీరుపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ పని చేసిన డీఎంహెచ్‌వో సిబ్బందిని బాగానే కట్టడి చేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. కొత్త అధికారి వస్తున్నారని తెలియడంతో కొంతమంది సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారనే గుసగుసలు కార్యాలయంలో వినిపిస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల్లోనూ, బదిలీల్లోనూ, డిప్యుటేషన్లు ఇవ్వడంలోనూ కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరిని కొత్త అధికారి ఎలా అదుపులోకి తీసుకువస్తారో వేచి చూడాల్సిందే. అలాగే జిల్లాలో విజృంభించిన వ్యాధుల నుంచి ప్రజలను కొత్త డీఎంహెచ్‌వో చెంచయ్య ఎలా కాపాడుతారో చూడాలి. -
డీఎంహెచ్ఓ అన్నప్రసన్నకుమారి బదిలీ
జనగామ : జనగామ జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2017 మేలో జిల్లా వైద్యాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులను చక్కదిద్దడమే కాకండా.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోం, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్, ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా, కేసులు కూడా నమోదు చేశారు. గుట్టుచప్పడు కాకుండా చేస్తున్న అబార్షన్లపై కన్నెర్రజేశారు. ప్రజలను అమాయకులను చేసి, అడ్డదారిలో వైద్యం చేసే ఎంతటి వారినైనా వదిలి పెట్టలేదు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఆస్పత్రులను సీజ్ చేశారు. సుమారు 14 నెలల జనగామలో పని చేసిన అన్న ప్రసన్నకుమారి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ అడిషినల్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. జిల్లాలో పని చేసినంత కాలం వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. నేడు విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా వైద్యాధికారిగా మహేందర్ జనగామ జిల్లా వైద్యాధికారిగా ఎ.మహేందర్‌ను నియమిస్తూ వైద్యారోగ్య కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం స్టేట్ ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మహేందర్ పదోన్నతిపై హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుత డీఎంహెచ్ఓ పదోన్నతిపై బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో మహేందర్‌ను నియమించారు. -
డమ్మీలైన.. డిప్యూటీ డీఎంహెచ్వోలు..!
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో అధికారాల పంచాయితీ మొదలైంది. పరిపాలన సౌలభ్యం, మెరుగైన సేవల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన కొత్త వ్యవస్థ అమలు కావడంలేదు. దీంతో ఆస్పత్రుల పర్యవేక్షణ అయోమయంగా మారుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రాతిపదికగా చేసుకుని డిప్యూటీ డీఎంహెచ్‌వో (జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు)లను వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని సంస్థల పర్యవేక్షణ అధికారాలు వీరికే అప్పగించింది. ఈ మేరకు డిప్యూటీ డీఎంహెచ్‌వోల అధికారాలను పేర్కొంటూ 2016 అక్టోబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏడాదిన్నర గడిచినా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కావడం లేదు. ఉన్నతాధికారుల ఉదాసీనతతో పాత పద్ధతిలోనే పరిపాలన, పర్యవేక్షణ వ్యవహారాలు సాగుతున్నాయి. ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే అధికారాలు చెలాయిస్తున్నారు. ఈ పరిణామాలపై తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎంజేఏసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ను కోరింది. ఈ ‘అధికారాల’పంచాయితీ వైద్య, ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. వైద్య సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. టీఎంజేఏసీ పేర్కొన్న ప్రధాన అంశాలివీ - ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిప్యూటీ డీఎంహెచ్‌వో పర్యవేక్షణలోనే వైద్య, ఆరోగ్య శాఖ సంస్థలు, కార్యక్రమాల అమలు జరగాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని డిప్యూ టీ డీఎంహెచ్‌వోలకు నిధుల విడుదల (డీవో) అధికారాలు అమలు కావట్లేదు. - ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యాధికారుల సాధారణ సెలవులు, గరిష్టంగా 30 ఆర్జిత సెలవుల మంజూరు, వైద్యాధికారులు, ఇతర సిబ్బంది ఇంక్రిమెంట్, ఏసీఆర్, క్రమశిక్షణ చర్యలు, ఆకస్మిక తనిఖీ వంటి అధికారాలను డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఇస్తూ ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే వీటిపై అధికారాలు చెలాయిస్తున్నారు. - లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, ఆస్పత్రుల ఏర్పాటు అనుమతి, నిర్వహణ పర్యవేక్షణ వంటి చట్టపరమైన అధికారాలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే అప్పగించినా.. ఇప్పటికీ డీఎంహెచ్‌వోలే ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం వంటి చర్యల విషయంలోనూ ఇదే జరుగుతోంది. - మాతా శిశు సంరక్షణ, చిన్నారుల్లో వ్యాధి నిరోధకతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల బాధ్యత పూర్తిగా డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే ఉంది. నెలవారీ సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ డీఎంహెచ్‌వోల ఆధ్యర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. - 108, 104, మృతదేహాల తరలింపు వంటి వైద్య సేవల అమలు, పర్యవేక్షణ అధికారాలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకే ఉండాలి. వైద్య శాఖలోని వివిధ విభాగాల కింద ఉన్న ఆస్పత్రుల సేవల అనుసంధానం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి ఇతర ప్రభుత్వ శాఖల్లో సమన్వయం బాధ్యతలు డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ఉంటాయి. కానీ ఇవి డీఎంహెచ్‌వోల అధీనంలోనే ఉన్నాయి. -
నర్సుకు లైంగిక వేధింపులు
సాక్షి, ఖమ్మం: జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) తనను లైంగికంగా వేధిస్తున్నాడని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనను శారీరకంగా లొంగదీసుకోవడానికి డీఎంహెచ్‌వో కొండలరావు ప్రయత్నించారని, ఇందులో భాగంగా తనను లైంగికంగా వేధిస్తూ.. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరిస్తున్నారని బాధితురాలు తెలిపారు. కీచకంగా ప్రవర్తిస్తున్న అధికారి బారి నుంచి కాపాడి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా దళిత, బహుజన సంఘాలతో కలిసి ఖమ్మంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. డీఎంహెచ్‌వో వేధింపులు తట్టుకోలేని బాధితురాలు బుధవారం మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అన్నిమళ్ల కొండలరావు తనను లైంగికంగా వేధిస్తున్నారని, ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అందంగా ఉన్నావు.. కోరిక తీర్చు.. లేకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తా.. వ్యభిచారం కేసు పెట్టిస్తా అని కొండలరావు వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. -
వైద్యుల ఎంపిక జాబితా విడుదల
17న డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ అనంతపురం మెడికల్(అనంతపురం): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాను బుధవారం విడుదల చేశారు. వీటిని www.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో ఉంచినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 17న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కాగా, 37 పోస్టులకు గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసి కౌన్సెలింగ్ చేపట్టగా 23 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 17 మంది మాత్రమే విధుల్లో చేరారు. దీంతో రెండో జాబితా తయారు చేయగా కలెక్టర్ వీరపాండియన్ ఆమోదముద్ర వేశారు. మూడు బ్యాక్లాగ్ (ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల కోసం కేటాయించినవి) పోస్టులుండగా 17 మందితో జాబితా విడుదలైంది. -
జ్వరాలపై అప్రమత్తంగా ఉండండి
అనంతపురం మెడికల్: జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సూచించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఎంపీహెచ్ఈఓ, సీహెచ్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారా మెడికల్ సిబ్బంది, వైద్యులు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి లార్వా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ, మునిసిపల్ సిబ్బందిని కలుపుకుని సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించాలని తెలిపారు. జ్వర బాధితులుంటే తక్షణం సమీప పీహెచ్‌సీలకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే, శనివారం పరిసరాల పరిశుభ్రత దినంగా పాటించాలన్నారు. అంటు వ్యాధుల నివారణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి చేపట్టే మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) క్యాంపెయిన్‌ను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, డీఐఓ పురుషోత్తం, పీఓడీటీటీ సుజాత, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ కన్సల్టెంట్లు రితీశ్ బజాజ్, దిలీప్‌కుమార్, డీఎంఓ దోసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా చైతన్యమే కీలకం!
♦ సీజనల్ వ్యాధుల అడ్డుకట్టకుపక్కా ప్రణాళిక ♦ అమలుకు ప్రజల సహకారం చాలా అవసరం ♦ గతానుభవాలతో ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి ♦ పీహెచ్‌సీల్లో తగినంతగా మందులు సిద్ధం ♦ తాగునీటి బావుల్లో క్లోరినేషన్ ప్రారంభం ♦ ఉద్దానంలో మిగతా వారికీ వైద్య పరీక్షలు ♦ డీఎంహెచ్‌వో డాక్టర్ సనపల తిరుపతిరావు జూన్ నెల వచ్చిందంటే వర్షాలతో పాటే సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. వీటికి ప్రధాన కారణం దోమలే. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలే వీటికి ఆవాసాలు! జనావాసాల మధ్య మురుగు కాలువలు, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాల్సిందే. వైద్య, ఆరోగ్య విభాగం సిబ్బంది కృషికి తోడు ప్రజా చైతన్యం తోడైతేనే సీజనల్ వ్యాధులకు పక్కాగా అడ్డుకట్ట వేయగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సనపల తిరుపతిరావు చెబుతున్నారు. గతానుభవాలు పునరావృతం కాకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడానికి కసరత్తు చేస్తున్న ఆయన ‘సాక్షి’ ఇంటర్వూ్యలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: సాక్షి: సీజనల్ వ్యాధుల నిరోధానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? డీఎంహెచ్‌వో: ఈ సీజన్లో డయేరియా, జ్వరాల విషయానికొస్తే చికున్‌గున్యా, డెంగీ, మలేరియా ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉంటుంది. మలేరియా నిరోధానికి జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి స్ప్రేయింగ్ ప్రారంభించాం. జిల్లాలో 469 హైరిస్క్ గ్రామాలు ఉన్నాయి. తొలివిడతగా అక్కడ చేపట్టాం. అన్ని రకాల జ్వరాల నిరోధానికి ఒక ప్రణాళిక రూపొందించాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధం చేశాం. జిల్లాలో జ్వరాల బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మీ శాఖపరమైన అప్రమత్తత ఎలా ఉంది? ఎవ్వరికైనా ప్రాథమికంగా జ్వరం లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆస్పత్రికి వీలైనంత త్వరగా వెళ్లాలి. అక్కడ మూడ్రోజుల నుంచి తగ్గకుండా జ్వరం వస్తుంటే ఎన్ఎస్–1 పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే వారి రక్త నమూనాలు సేకరించి శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు కానీ, విశాఖలోకి కింగ్‌జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)కు కానీ ఎలీజా పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్షల్లోనూ పాజిటివ్ వస్తే అది చికెన్ గున్యా లేదా డెంగీ జ్వరంగా నిర్ధారించి తగిన వైద్యం అందిస్తాం. ఇందుకు అవసరమైన అత్యవసర మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచాం. సబ్సెంటర్లలో, ఏఎన్ఎంల వద్ద కూడా ఐవీ ఫ్లూయిడ్స్ కొంతమేర ఉంచాం. ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాం. పారిశుద్ధ్యలోపం, కలుషిత తాగునీరు కూడా వ్యాధులకు కారణమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలేమిటి? ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలి. హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఎవ్వరు ఏ గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టాలనేది ప్రణాళిక రూపొందించి, ఆ ప్రకారం కొనసాగిస్తున్నాం. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ఏటా సగటున తొమ్మిది నుంచి పది వరకూ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. అలాంటి గ్రామాల్లో ప్రజలు కచ్చితంగా కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలి. ప్రతి గ్రామంలోనూ తాగునీటి బావులన్నీ క్లోరినేషన్ చేయిస్తున్నాం. పది లక్షల వరకూ క్లోరిన్ టాబ్లెట్లు జిల్లాకు అవసరమని ఇండెంట్ పెట్టాం. ప్రజలు కూడా వారానికొకసారి డ్రైడే తప్పనిసరిగా నిర్వహించాలి. పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు? ఏజెన్సీలో తగిన సంఖ్యలోనే సిబ్బంది ఉన్నారు. సీహెచ్‌సీల్లో కొన్నిచోట్ల ప్రత్యేక వైద్యాధికారులు, ముఖ్యంగా ప్రసూతి వైద్యుల కొరత ఉంది. ఆమేరకు జిల్లా పరిధిలో సర్దుబాటు చేస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీకి ఒక వైద్యాధికారి ఉండేలా చూస్తున్నాం. ఏజెన్సీలో సమస్య ఉంటే మైదాన ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై నియమిస్తాం. అలాగే ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అన్ని పీహెచ్‌సీల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చాం. వ్యాధుల పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రతిరోజూ నివేదికలు ఇవ్వాలని చెప్పాం. మందుల కొరత సమస్యను ఎలా అధిగమిస్తారు? ఓపీలో వస్తున్న పేషెంట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇండెంట్ పెడితే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మందులు వస్తాయి. గతంలో ఈ ప్రక్రియ సరిగా నిర్వహించకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఇ–ఔషధి ద్వారా ప్రతిరోజూ వైద్యాధికారులు స్థానికంగా వ్యాధుల పరిస్థితిని సమీక్షించి ఇండెంట్లు పెడుతున్నారు. దోమతెరల పంపిణీ ఎంతవరకూ వచ్చింది? ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం దోమతెరల పంపిణీ చేపట్టింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి. గత ఏడాది 46,900 దోమతెరలు ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులతో పాటు హైరిస్క్ గ్రామాల్లో ప్రజలుకు పంపిణీ చేశాం. ఈ సంవత్సరం 90 వేల దోమతెరలు అవసరమని ఇండెంట్ పెట్టాం. అవి ఇంకా రావాల్సి ఉంది. జిల్లాలోని చాలా ప్రాంతాలకు 104 సంచార వైద్య వాహనాలు వెళ్లకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారు? గతంలో గుర్తించిన గ్రామాలను కచ్చితంగా కవర్‌చేసేలా 104 వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక 108 అంబులెన్స్‌ల విషయానికొస్తే పాడైన వాటిని మార్చేసి ఇటీవల ఐదు కొత్తవాటిని తెప్పించాం. డీజిల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలో రోగుల అవసరానికి తగిన రక్తనిధి ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? డెంగీనే కాదు ఏ రకమైన జ్వరం బారిన పడినా రోగుల రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. వాస్తవానికి జిల్లాలో జాతీయరహదారి తదితర రహదారులపై జరుగుతున్న ప్రమాదాల బాధితులకు, రోజువారీ ఆసుపత్రులకు వచ్చే జ్వరాల పీడితులు, ఇతరత్రా శస్త్రచికిత్సలకు అవసరాన్ని బట్టి చూస్తే 24 వేల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. కానీ ఆ స్థాయిలో అందుబాటులో లేదు. విద్యార్థులు మాత్రమే రక్తదానానికి ముందుకొస్తున్నారు. ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలి. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఎంతవరకూ వచ్చింది? ఇప్పటికే ఉద్ధానం ప్రాంతంలో 15 మొబైల్ టీమ్‌లు 176 గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి రక్త, సీరమ్ పరీక్షలు చేశాయి. వీటి ద్వారా 13వేల మంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో నాలుగు వేల మందికి రెండో దశ పరీక్షలు పూర్తయ్యాయి. వేసవికాలం దృష్ట్యా కొంతకాలం ఈ పరీక్షలు ఆపేసినా ఈనెల రెండో వారం నుంచి మిగతావారికి మళ్లీ ప్రారంభించాం. 176 గ్రామాల్లో జనాభా 2.67 లక్షలకు పైగా ఉంది. వారిలో 18 ఏళ్లు నిండినవారికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 70 వేలమంది వరకూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు కూడా నియమితులయ్యారు. -
ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వై.నరసింహులు
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జి అధికారిగా డాక్టర్ వై. నరసింహులుకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ అరుణకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ వై.నరసింహులు ఇకపై ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా, అడిషనల్ డీఎంహెచ్‌ఓగా, డీఎంహెచ్‌ఓగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు. కీలక పోస్టులన్నీ ఖాళీ డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఏసీబీకి పట్టుబడటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కీలక పోస్టులన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఆమె ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపల్‌గా రెగ్యులర్ పోస్టులో ఉన్నారు. డాక్టర్ స్వరాజ్యలక్ష్మిపై ఏసీబీ దాడుల నేపథ్యంలో ఆమెకు అడిషనల్ డీఎంహెచ్‌ఓగా, డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా డాక్టర్ మీనాక్షి మహదేవ్ సైతం ఏసీబీకి పట్టుబడటంతో ఒకేసారి మూడు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. దీంతో పాటు ఇప్పటికే ఎయిడ్స్ అండ్ లెప్రసి అధికారి సెలవులో వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. మలేరియా అధికారి పోస్టు సైతం ఇన్చార్జితో కొనసాగుతోంది. జిల్లా క్షయ నియంత్రణాధికారిగా ఉన్న డాక్టర్ మోక్షేశ్వరుడు, ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్) ప్రిన్సిపల్ డాక్టర్ వై.నరసింహులు సైతం బదిలీ కానుండగా, కొందరు వైద్యులు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. -
‘మహా’పరాధం!
డీఎంహెచ్ఓ కుర్చీకి అవినీతి మరక - ఏసీబీ దాడుల్లో పట్టుబడిన డాక్టర్ మీనాక్షి మహదేవ్ - ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌కు రూ.30వేలు డిమాండ్ - పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కుర్చీ అవినీతికి చిరునామాగా మారుతోంది. బాధ్యతలు చేపట్టిన ప్రతి అధికారి దాదాపుగా లంచావతారం ఎత్తుతున్నారు. అనతికాలంలో కోటీశ్వరులు అయిపోవాలనే తలంపుతో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా డీఎంహెచ్‌ఓగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మీనాక్షి మహదేవ్ సైతం అదేబాట పట్టారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు లంచం తీసుకుంటూ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. డాక్టర్ మీనాక్షి మహదేవ్ పట్టుబడ్డారిలా.. ఆదోని పట్టణంలోని 50 పడకల ఆదిత్య నర్సింగ్ హోమ్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు యజమాని డాక్టర్ బి. శ్రీనివాసులు 2016 మే 19న దరఖాస్తు చేసుకున్నారు. ఆసుపత్రిలోని స్కానింగ్ కేంద్రానికి సైతం గత ఫిబ్రవరి 8న దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ రెండు అనుమతులకు ఆయన డీఎంహెచ్ఓ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఆసుపత్రి రెన్యూవల్‌కు రూ.15వేలు, స్కానింగ్ సెంటర్‌కు రూ.15వేలు ఇస్తేనే సంతకం పెడతానని డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్ మొండికేశారు. ఈ మేరకు ఆమె వాయిస్‌ను డాక్టర్ శ్రీనివాసులు ఫోన్లోనూ రికార్డు చేసినట్లు సమాచారం. న్యాయబద్ధంగా చేయాల్సిన రిజిస్ట్రేషన్‌కు సైతం తాను ఎందుకు డబ్బు ఇవ్వాలనే బాధతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్ఓకు ఫోన్ చేసి రూ.30వేలు ఇస్తాను.. ఎక్కడికి రావాలో చెప్పండన్నారు. ఉదయం ఇంటి వద్దకు రమ్మని ఆమె సమాధానమిచ్చారు. ఆ మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే కర్నూలులోని దేవనగర్‌లో ఉన్న డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఇంటి వద్ద ఏసీబీ అధికారులు కాపు కాశారు. 7.30 నుంచి 8 గంటల ప్రాంతంలో డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఇంటికి వెళ్లి డాక్టర్ శ్రీనివాసులు రూ.30వేలను ముట్టజెప్పారు. ఆ మరుక్షణమే ఏసీబీ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో సీఐ ఖాదర్‌బాషా, సిబ్బంది కలిసి డీఎంహెచ్ఓను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేతులను, డబ్బును రసాయనాలతో తనిఖీ చేయగా లంచం తీసుకున్నట్లు రుజువైంది. అనంతరం ఇంట్లోని రికార్డులు, బ్యాంకు పాస్ బుక్కు, ఇతర పత్రాలతో పాటు డీఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో పనిచేసే డెమో ఎర్రంరెడ్డి, మరో ఉద్యోగి సత్యనారాయణను పలిపించి ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల వివరాలు, ఆమె వచ్చిన తర్వాత ఎన్ని ఆసుపత్రులకు, స్కానింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ చేశారనే వివరాలు సేకరించారు. ఆ తర్వాత సీనియర్ అధికారి, డీఐఓ డాక్టర్ వెంకటరమణ సమక్షంలో ప్రొసీడింగ్స్ రాసి డాక్టర్ మీనాక్షి మహదేవ్‌పై కేసు నమోదు చేశారు. ఎన్ని దాడులు జరిగినా వీళ్లు మారరు ఇటీవలే డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ స్వరాజ్యలక్ష్మిపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు కర్నూలుతో పాటు విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో దాడులు నిర్వహించి, రిమాండ్‌కు పంపించారు. ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా నియమితులైన డాక్టర్ మీనాక్షి మహదేవ్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ విషయంలో డబ్బు తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు ఆమెకు సహకరించినట్లు సమాచారం. ఆసుపత్రులు ఒకరు, స్కానింగ్ సెంటర్లు మరొకరు డీల్ చేసి మామూళ్లు తెచ్చి ఇచ్చేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఆమె ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా పనిచేసిన సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ జనాభా దినోత్సవానికి రూ.5లక్షలు మంజూరైతే రూ.50వేలు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిసింది. పల్స్‌పోలియో వంటి జాతీయ కార్యక్రమాల్లోనూ ఆమె అవినీతికి పాల్పడినట్లు సమాచారం. డాక్టర్ మీనాక్షి మహదేవ్ రెగ్యులర్ పోస్టు అయిన ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపాల్గానూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో డీఎంహెచ్‌ఓగా ఉన్న డాక్టర్ చంద్రశేఖర్‌ని సైతం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ ఆంజనేయులుతో పాటు, డాక్టర్ వెంకటపతి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ శివశంకర్రెడ్డిలపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ఏసీబీకి చిక్కిన కర్నూలు డీఎంహెచ్‌వో
కర్నూలు: డీఎంహెచ్‌వో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ కర్నూలు డీఎంహెచ్‌వో మీనాక్షి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం మీనాక్షి నివాసంతో పాటు ఆమె బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడ పనిచేసిన డీఎంహెచ్‌వోను ఏసీబీ అధికారులు పట్టుకోగా.. ఇప్పుడు మీనాక్షి కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆమె అక్రమాస్తులపై దృష్టి సారించారు. -
నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
= మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన = వివరాలు వెల్లడించిన డీఎంహెచ్ఓ యాస్మిన్ ఒంగోలు సెంట్రల్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో మానసిక కుంగుబాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. సమాజంలో ఎక్కువ మంది యువత నిరాశ, నిస్పృహలతో మానసిక ఆందోళనకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక బాలాజీ నగర్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా కొనకనమిట్ల, సింగరాయకొండలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. జిల్లా స్థాయిలో సీఎస్‌పురం, రాజుపాలెం, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం విజయవాడలో సీఎం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాకు 8 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, వాటిని కూడా ప్రారంభిస్తామని వివరించారు. ఒంగోలులో 4, చీరాలలో 2, మార్కాపురంలో 2 కేంద్రాలు చొప్పున ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ కేంద్రాల్లో కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించనున్నట్లు డీఎంహెచ్ఓ యాస్మిన్ వివరించారు. -
నేడు పల్స్‌పోలియో
ఏలూరు అర్బన్: పోలియోరహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కె. కోటేశ్వరి అన్నారు. శనివారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో అప్పుడే పుట్టిన çపసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించినా సరిహద్దు దేశాల్లో పోలియో వ్యాధి కేసులు న మోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా సంచార జాతులు, వలస కార్మికుల, ఇంటీరియర్ ప్రాంతాల చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక మొబైల్ టీములను ఏర్పాటు చేశామని అదే క్రమంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని రద్దీ కూడళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్యశాలలు, రైల్వే, ఆర్టీసీ బస్టాండ్‌ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం, మంగళవారం రెండురోజుల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు అందని చిన్నారులను గుర్తించి అందిస్తారని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా అర్హులైన చిన్నారులను గుర్తించామని వారందరికీ అవసరమైన డోసులను సిద్ధం చేశామని తెలిపారు. ప్రజలు తమ చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అడిషనల్ డీఎంహెచ్ఓ పి.ఉమాదేవి, డీఐఓ ఎం.మోహనకృష్ణ పాల్గొన్నారు. -
2 నుంచి పల్స్ పోలియో
ఏలూరు (మెట్రో): జిల్లాలో పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు వచ్చేనెల 2 నుంచి 4వ తేదీ వరకూ మూడు రోజులపాటు పల్స్ పోలియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్యాధికారి (డీఎంహెచ్ఓ) కె.కోటేశ్వరి తెలిపారు. పల్స్ పోలియా కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు నాలుగు లక్షల మంది వరకూ ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 2వ తేదీన జిల్లాలో 3,233 కేంద్రాలను ఏర్పాటు చేసి 13,215 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. డీఆర్ఓ హైమావతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మోహనకృష్ణ, డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యం జిల్లాలో అందరికీ ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పథకం అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్ఓ కె.కోటేశ్వరి తెలి పారు. సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఏడాదికి రూ.1,200 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంటుందన్నారు. కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు వచ్చేనెల 3వ తేదీ నుంచి ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారిని పథకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. పథకాల అమలుపై ఆరా జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పథకాలపై ఎంపీహెచ్ఈఓ, సీఓలతో డీఎంహెచ్ఓ కోటేశ్వరి సమీక్షించారు. ఐవో మోహనకృష్ణ, ఆర్బీఎస్కే డాక్టర్ కె.సురేష్‌బాబు, డెప్యూటీ డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
యాదాద్రిలో వైద్యాధికారిపై లైంగిక ఆరోపణలు
-
జిల్లాలో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు
చాగలమర్రి : జిల్లా లో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షి మహాదేవన్ తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ కాలనీలోని సల్లా నర్సింగ్ హోంను ఆమె పరిశీలించారు. ప్రసాద్ నర్సింగ్ హోం నిర్వాహకులు స్కానింగ్ సెంటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు కావాల్సిన వసతులు, వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో వైద్యులు కొరత ఉందని, అన్ని పీహెచ్‌సీలకు వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాద్ నర్సింగ్ హోం వైద్యులు ప్రసాద్ ఉన్నారు. -
రచ్చ..రచ్చేనా!
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల పోస్టింగ్ ఆర్డర్లు రద్దు నేడు డీఎంహెచ్ఓ కార్యాలయంలో రీ పోస్టింగ్‌కు కౌన్సెలింగ్ ఆందోళనకు సిద్ధమైన తొలగించిన అభ్యర్థులు అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు.. నియామకాల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోందా? ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా 24 మందిని తొలగించి.. వారి స్థానంలో కొత్తగా 24 మందిని విధుల్లోకి తీసుకున్న క్రమంలో కొన్నాళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడనుందా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అయితే ‘రచ్చ’ మాత్రం తప్పదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 156 ఎంపీహెచ్ఏ పోస్టుల నియామకాలకు 2003లో నోటిఫికేషన్ ఇచ్చారు. 152 పోస్టులు భర్తీ చేశారు. పదో తరగతి అర్హత ఉన్న 44 మందిని అప్పట్లోనే తొలగించి ఇంటర్ విద్యార్హతతో తీసుకున్నారు. అదే సమయంలో తొలగించిన 44 మందిని మళ్లీ తీసుకున్నారు. అప్పట్లో రూపొందించిన మెరిట్ లిస్ట్‌లో తమకు అన్యాయం జరిగిందని కొందరు కోర్టుకెళ్లగా.. గత ఏడాది సానుకూల తీర్పు వచ్చింది. అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను ఇక్కడి అధికారులు బేఖాతర్ చేశారు. పద్నాలుగేళ్లుగా పని చేస్తున్న 24 మందిని తొలగించి గత ఏడాది డిసెంబర్ 13ఽన కొత్తగా 24 మందికి రాత్రికి రాత్రే పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం కౌన్సెలింగ్ కూడా చేయలేదు. ఈ క్రమంలో మెరిట్ ఉన్నా కొందరికి అన్యాయం జరిగింది. బీసీ–ఈ కేటగిరీ కింద ఇద్దరికి చోటు కల్పించడం వివాదాస్పదమైంది. కార్యాలయంలో పని చేసే ముగ్గురు అధికారులు ‘చేతివాటం’ చూపి పోస్టింగ్‌లలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. నియామకాలకు సంబంధించిన ఫైల్‌ను రీరైట్ చేసి తీసుకురావాలని ఆదేశించడంతో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఈ ప్రక్రియను ముగించారు. ఈ నెల 8న కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పెట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరిన 24 మంది పోస్టింగ్ ఆర్డర్లు రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై సోమవారం ఈ–మెయిల్ ద్వారా సదరు అభ్యర్థులు పని చేస్తున్న పీహెచ్‌సీలకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ నెల 10న (నేడు) డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని పేర్కొన్నారు. ఎంపీహెచ్ఏలను రిలీవ్ చేయాలని ఆదేశాలు రావడంతో మెడికల్ ఆఫీసర్లు అందరినీ రిలీవ్ చేశారు. ‘బీసీ–ఈ’పై తెగని పంచాయితీ 2003లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేపట్టాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. 2003 నాటికి బీసీ–ఈ రిజర్వేషన్ లేకపోయినా ఇప్పుడు పోస్టులు దక్కించుకున్న వారిలో ఇద్దరు ఆ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. తాజాగా రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని చెబుతుండడంతో ఈ జాబితాలో బీసీ–ఈలను తొలగిస్తారా, లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు సిద్ధం! రీ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో విధుల నుంచి తొలగించబడిన 24 మంది అభ్యర్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సోమవారం విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అరుణకుమారిని కలిసిన అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరారు. రీ పోస్టింగ్ ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ‘కొత్త వ్యూహం’ తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ‘పోస్టింగ్ ఆర్డర్లు’ రద్దయిన దృష్ట్యా కౌన్సెలింగ్‌ను అడ్డుకుని తిరిగి విధుల్లో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన వారు మళ్లీ విధుల్లో చేరిపోతే.. కొత్తగా చేరి పోస్టింగ్ ఆర్డర్లు రద్దయిన వాళ్ల గురించి మళ్లీ ఆలోచించవచ్చన్న ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా అధికారులకు సైతం స్పష్టమైన ఆదేశాలు రానున్నట్లు తెలిసింది. -
విద్యార్థులతో ‘ఆరోగ్య అవగాహన సదస్సులు’
కర్నూలు(హాస్పిటల్): స్వాస్త్య విద్యావాహిణి పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విద్యార్థులతో ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ స్వాస్త్య విద్యావాహిణి పథకం కింద మెడికల్, డెంటల్, ఫార్మసి, ఆయుష్, నర్సింగ్, హోంసైన్స్ కళాశాలల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఈ కార్యక్రమానికి ఎంపిక చేశామన్నారు. ఆయా కళాశాలలకు 5 కి.మీ పరిధిలో చంద్రన్న సంచార వైద్యశాల వాహనం వెళ్లే గ్రామాలకు ఎంపిక చేసిన విద్యార్థులు ప్రతి నెలా ఒకరోజు వెళ్తారన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపైన వారు అవగాహన చేసుకుంటారని తెలిపారు. 14 వాహనాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పర్యవేక్షించి, ప్రతిరోజూ తమకు నివేదిక సమర్పిస్తారన్నారు. -
విధుల్లో చేరిన డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి బుధవారం సాయంత్రం విధుల్లో చేరారు. గత నెల 14వ తేదీన ఏసీబీ దాడుల అనంతరం ఆమె అదే నెల 24వ తేది నుంచి సెలవులో వెళ్లారు. ఈ నెల సైతం 15 రోజుల పాటు సెలవు పొడిగించుకునేందుకు ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీఎంహెచ్‌వోగా డాక్టర్ రామకృష్ణరావును డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి నియమించారు. ఇదే సమయంలో ఆమె బుధవారం తిరిగి విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నీ మేనేజ్మెంట్ ఇదేనా
డీఎం అండ్ హెచ్ఓ పద్మజారాణిపై పూనం మాలకొండయ్య మండిపాటు గుంటూరు మెడికల్ : ‘నీవు ప్రోగ్రామ్ చేయగలవా లేదా... నీ మేనేజ్మెంట్ ఇదేనా... నీ కమాండ్ ఏమీ బాగాలేదు’- అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మండిపడ్డారు. గుంటూరు వైద్య కళాశాలలో సోమవారం స్వాస్థ్య విద్యావాహిని వాహనాలను పూనం మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బ్యాడ్జీ, ఐఈసీ మెటీరియల్‌తో కూడిన బ్యాగ్‌లను అందజేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు సర్వే చేయాల్సిన అంశాలతో రూపొందించిన పత్రాలు బ్యాగ్‌లలో లేకపోవటాన్ని గమనించిన పూనం మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్యక్రమంపై అవగాహన కల్పించేలా రూపొందించిన బ్యానర్లు కట్టకపోవటం, సర్వే పత్రాలు బ్యాగ్‌లలో పెట్టకపోవటంతో డీఎం అండ్ హెచ్ఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే డీఎంహెచ్ఓ తన వద్ద ఉన్న ఓ సర్వే పత్రాన్ని వైద్య కళాశాలలో ఫోటోస్టాట్ కాపీలు తీయించి వైద్య విద్యార్థుల బ్యాగ్‌లలో పెట్టారు. ఉదయం ఏడుగంటల కల్లా వాహనాలు ప్రారంభం కావాల్సి ఉండగా 7.30 గంటల వరకు బయలు దేరకపోవటంతో వైద్యాధికారులకు పూనం మాలకొండయ్య క్లాస్ తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో పరిశీలించేందుకు ఆమె వైద్య విద్యార్ధుల వాహనాలతో పాటుగా వెళ్ళారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ డి.షాలినీదేవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఎస్పీఎం వైద్య విభాగాధిపతి డాక్టర్ ఆర్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి భరోసా కల్పించడమే ధ్యేయం సత్తెనపల్లి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త విధానానికి నాంది పలికిందని, రోగాలు వచ్చినప్పుడు వైద్యం చేసేకంటే రోగాలు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ పూనం మాలకొండయ్య ఆదేశించారు. సోమవారం ఆకస్మికంగా సత్తెనపల్లి వచ్చిన ఆమె చంద్రన్న సంచార వైద్యసేవల వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉండటంతో వాటిని పరిశీలించారు. అనంతరం సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలో స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేలా స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చంద్రన్న సంచార చికిత్స శిబిరాలు జరిగే రోజున గ్రామాల్లో స్వాస్థ్య విద్యావాహిని బృందాలు కూడా పర్యటిస్తాయన్నారు. నెలకో అంశంపై బృందాలు ప్రజలకు వివరిస్తాయన్నారు. మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, దంత వైద్య విద్యార్థులు, అసిస్టెంట్ సర్జన్ బృందంలో ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వైద్య విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. ఈసందర్భంగా వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల,అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి చిన్నారులతో చేతుల శుభ్రత, తదితర వాటి పై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
తాత్కాలిక డీఎంహెచ్‌వోగా మీనాక్షి మహదేవ్
కర్నూలు(హాస్పిటల్): తాత్కాలిక డీఎంహెచ్‌వోగా డాక్టర్ మీనాక్షి మహదేవ్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం డాక్టర్ మీనాక్షి మహదేవ్ బాధ్యతలు స్వీకరించారు. డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఇదే సమయంలో అడిషనల్ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ రాజాసుబ్బారావు సైతం డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రం(మేల్)లో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్ వై.నరసింహులును ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన తన తల్లి ఆరోగ్యం బాగాలేదని బాధ్యతలు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో డీఎంహెచ్‌వోతో పాటు అడిషనల్ డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఉన్న సందర్భంగా సీనియర్‌గా ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఫిమేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షిమహదేవ్‌ను తాత్కాలిక డీఎంహెచ్‌వోగా నియమించారు. ఆమెను ఆదివారం ఏపీ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
విధులను విస్మరిస్తే చర్యలు తప్పవు
ఏలూరు (మెట్రో) : ప్రజలకు అందుబాటులో లేకుండా విధులు సక్రమంగా నిర్వర్తించని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.కోటేశ్వరి హెచ్చరించారు. కలెక్టరేట్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమస్యలపై ప్రజలతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడాల్సి ఉండగా అదే సమయంలో ముఖ్యమంత్రితో టెలీ కాన్ఫెరెన్స ఉండటంతో డీఎంహెచ్‌వో కోటేశ్వరి ప్రజల నుంచి ఫోన్‌ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. చింతలపూడి నుంచి సుదర్శన్అనే వ్యక్తి ఫోన్ చేసి చింతలపూడిలోని పీహెచ్‌సీలతో పాటు చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొందరు వైద్యులు ఉదయం 8 గంటలకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లిపోతున్నారని, మరలా సాయంత్రం 4 గంటలకు హాజరు వేసి వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. డాక్లర్ల స్థానంలో వేరొకరిని ఉంచడంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎంహెచ్‌వో స్పం దిస్తూ దీనిపై తాను విచారణ చేయిస్తానని ఎవరైనా డాక్టర్లు విధులకు హాజరుకాకపోయినా, బయోమెట్రిక్ వేసి అందుబాటులో లేకపోయినా చర్యలు తప్పవని చెప్పారు. నరసాపురం నుంచి దుర్గ అనే మహిళ ఫోన్లో మాట్లాడుతూ తాను చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, సరైన వైద్యం అందించాలని కోరింది. డీఎంహెచ్‌వో స్పందిస్తూ వెంటనే నరసాపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని అక్కడ వైద్యులు పరీక్షించి ఉచితంగా వైద్యం అందిస్తారని ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. కామవరపుకోట మండలం నుంచి కో లన పెంటయ్య అనే వ్యక్తి మాట్లాడు తూ గత నెల 13న తన మావయ్య మ హాలక్ష్మణుడు ఏలూరు ఆసుపత్రిలో మరణించారని ఆ రోజు డ్యూటీ డాక్టర్ ఆర్వీఐ రమణ రసీదు ఇచ్చారని డెత్ సర్టిఫికెట్ కోసం మీ సేవకు వెళితే ఆన్లైన్లో నమోదు కాలేదని చెబుతున్నారన్నారు. దీంతో డెత్ సర్టిఫికెట్ రావడం లేదన్నారు. దీనిపై డీఎంహెచ్‌వో స్పందిస్తూ మీ సేవ ద్వారా డెత్‌సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ కె.శంకరరావు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వెంకట్రావు, జిల్లా అదనపు డీఎంహెచ్‌వో పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓ కార్యాలయంలో మారిన పనివేళలు
–ఏసీబీ దాడులు చేస్తారేమోనని మార్పు...! –ఐదుగురు ఉద్యోగులపై కన్ను కర్నూలు(హాస్పిటల్): సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మిపైనే ఏసీబీ దాడులు జరగడంతో కొందరు కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తమపై కూడా ఎప్పుడైనా దాడులు చేస్తారేమోనన్న భయంతో పనివేళలు మార్చుకున్నారు. గతంలో రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచే కార్యాలయం ఇప్పుడు సాయంత్రం 5 గంటలకే మూతపడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఏసీబీ దాడుల గుబులు కొనసాగుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో గత 14వ తేదీన డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి ఇంటిపై ఉదయం 6 గంటల నుంచే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆమె స్వస్థలం విశాఖపట్టణంతో పాటు గతంలో పనిచేసిన విజయనగరంలోని ఆమె ఇళ్లు, బ్యాంకు, కార్యాలయాలపైనా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కర్నూలులోనూ ఆమె ఏమైనా కార్యకలాపాలు నిర్వహించారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత కార్యాలయానికి వచ్చి డీఎంహెచ్‌వో చాంబర్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. వారు రాకముందే కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో డీఎంహెచ్‌వో చాంబర్లోకి వెళ్లి ఫైళ్లు చక్కదిద్దినట్లు కార్యాలయంలో చర్చ జరిగింది. ఈ కోణంలోనూ ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కార్యాలయ పనివేళల్లో మార్పు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేది. సాయంత్రం 5 గంటలకే ఇళ్లకు వెళ్లాల్సిన కొందరు ఉద్యోగులు సాయంత్రం తర్వాత రాత్రి వరకు మామూళ్ల పనులు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదేమంటే పెండింగ్ ఫైళ్లంటూ అధికారులను మభ్యపెట్టి వారి మామూళ్లు రాబడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా మామూళ్లు వచ్చే పనులను కార్యాలయం పనివేళల్లో గాకుండా రాత్రి పూటే చక్కపెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులు ఎవ్వరూ లేని సమయంలో ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి తమ పనులు కానిచ్చుకుని, మామూళ్లు ఇచ్చి వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు..మామూళ్లకు అలవాటు పడిన ఉద్యోగుల చెవిన పడింది. దీంతో వారు అప్రమత్తమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. తాము నిబద్ధతగా పనిచేస్తున్నా ఆరోపణలు వస్తున్నాయని, తాము కార్యాలయ పనివేళల్లో మాత్రమే విధులు నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పనివేళలు మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఏ ఒక్క ఉద్యోగి కార్యాలయంలో ఉండకూడదని ఓ ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో గత నాలుగు రోజులుగా ఉద్యోగులు సాయంత్రం 5 గంటలకే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు కార్యాలయంపై ఎక్కడ దాడులు చేస్తారోనని మామూళ్లకు అలవాటు పడిన ఉద్యోగుల గుండెల్లో గుబులు పుడుతోంది. -
అంతా నా ఇష్టం!
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ 24 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు కనీసం నోటీసులూ ఇవ్వని వైనం ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు డీఎంహెచ్ఓ తీరుపై విమర్శలు అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో ఆయనో కీలక అధికారి. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందిపోయి సొంత నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 24 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్–మేల్ పోస్టుల భర్తీకి 2003లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 156 పోస్టులుండగా నలుగురు అభ్యర్థులు లేకపోవడంతో 152 భర్తీ చేశారు. అప్పట్లోనే పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 44 మందిని తొలగించి వారి స్థానంలో మెరిట్ ఆధారంగా ఇంటర్ విద్యార్హత ఉన్న వారిని తీసుకున్నారు. తొలగించిన వారు కోర్టుకు వెళ్లడంతో మూడేళ్ల తర్వాత వారందరికీ పోస్టింగులిచ్చారు. అయితే.. అప్పట్లో రూపొందించిన మెరిట్ జాబితాలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 24 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 14 ఏళ్ల క్రితం విధుల్లోకి తీసుకున్న 44 మందిలో 24 మందిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎంపీహెచ్ఏ–మేల్ పోస్టుల భర్తీ క్రమంలో గతంలో పని చేస్తున్న వారిని తొలగించరాదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గత నెల 27న మెమో (నంబర్ 7342/జీ2/2015–09) జారీ చేశారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రాముఖ్యతనిస్తూ ఎంపీహెచ్ఏ–మేల్ అందరినీ ఉద్యోగాల్లో కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్ఓలకు డిసెంబర్ 1వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ అరుణకుమారి కూడా ఉత్తర్వులు (ఆర్సీ నంబర్ : 19247/ఈ4–ఎ) జారీ చేశారు. అయినా వీటిని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ బేఖాతరు చేశారు. ఆందోళనబాటలో ఉద్యోగులు ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను తొలగించడంపై ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఇప్పటికే కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. ఇంత ఏకపక్షమా? 2013లో ఎంపీహెచ్‌ఏగా జాయిన్ అయ్యాను. కుందుర్పి పీహెచ్సీలో పని చేసేవాడిని. ఇప్పుడు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తే ఎలా? డీఎంహెచ్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలి. - శ్రీనివాస్ స్పష్టత కోసం అధికారులను పంపుతున్నా 42 మందిని తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఒకసారి ఉద్యోగులను తీసెయ్యాలని వచ్చింది. మరోసారి 'ఎక్సర్సైజ్' చేయాలని వచ్చింది. రకరకాలుగా ఆదేశాలు వస్తున్నాయి. ఉన్న వారిని తొలగించకపోతే ఆదేశాలు అమలు చేయలేం. గతంలో ఈ పోస్టుల భర్తీ సరిగా లేదు. తొలగించిన వారి జాబితా ప్రభుత్వానికి పంపాం. వీలైనంత వరకు ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తాం. స్పష్టత కోసం సోమవారం కార్యాలయంలోని అధికారులను విజయవాడకు పంపుతున్నాం. - వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
విధులకు హాజరైన డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సోమవారం విధులకు హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై గత శుక్రవారం ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. కర్నూలుతో పాటు గతంలో ఆమె పనిచేసిన విజయనగరం, విశాఖపట్టణంలోనూ సోదాలు చేసిన విషయం విదితమే. సోదాల సమయంలో ఆమె బ్యాంకు అకౌంట్లు, లాకర్లు, రికార్డులు, బీరువాలు, కంప్యూటర్లను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల అనంతరం సోమవారం సాయంత్రం ఆమె తిరిగి విధులకు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. -
వెలుగు చూస్తున్న 'డీఎంహెచ్ఓ' ఆస్తులు
బ్యాంకు లాకర్లు, నివాసంలో మరింత బంగారం –గాజువాక వద్ద స్థలం గుర్తింపు –రికార్డులు కోర్టుకు సమర్పించిన సీఐయూ –స్వరాజ్యలక్ష్మికి నోటీసు జారీ సాక్షి, విశాఖపట్నం: తవ్వుతున్న కొద్దీ కర్నూలు డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో రెండు రోజులుగా ఆమె ఆస్తులపై కర్నూలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ వింగ్(ఏసీబీ సీఐయూ) అధికారులు దాడులు నిర్వహిస్తున్న విషయం విదితమే. గురువారం విశాఖలోని ఆమె నివాసంలో విచారణాధికారి, సీఐయూ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు నేతృత్వంలో అధికార బృందం సోదాలు నిర్వహించింది. రూ.5.6 కోట్లు ఆస్తులు గుర్తించింది. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. స్వరాజ్యలక్ష్మికి చెందిన రెండు బ్యాంకు లాకర్లు తెరిచారు. ఒకదానిలో కేజీ, మరో దానిలో 1.6 కేజీల బంగారం బయటపడింది. నివాసంలో మరో పావుకిలో బంగారం దొరికింది. గాజువాకలో ఒక స్థలం కూడా ఉన్నట్లు రికార్డులను బట్టి తెలిసింది. అంతేకాకుండా నగరంలోని విజయ ఆస్పత్రిని రూ.4 కోట్లతో కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇది ఆమె భర్త సూర్యనారాయణ నాయుడు పేరుమీద కొన్నారు. ఆస్పత్రి యజమాని సుదేందర్రెడ్డికి రూ.2కోట్లు అడ్వాన్స్ చెల్లించారు. మరో రూ.2కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఏసీబీ కంట్లో పడ్డారు. కుమారుడు శ్రీహర్ష చదువుకోసం కూడా రూ.కోట్లు ఖర్చు పెట్టారు. అమలాపురంలో అతను ఎంబీబీఎస్, విజయనగరంలో పీజీ చదివాడు. ఒక్క పీజీ సీటుకే రూ.2కోట్లు ఖర్చుపెట్టారు. శ్రీ హర్ష ఇటీవలే కేజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా శిక్షణ పూర్తి చేసుకుని ఓ ఫార్మసీలో చేస్తున్నాడు. అతని తండ్రి సూర్యనారాయణ నాయుడు ప్రస్తుతం పంజాబ్‌లోని పటాన్‌కోటలో ప్రైవేటు వైద్యుడిగా ఉన్నారు. నోటీసిచ్చాం: డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి ఆస్తులకు సంబంధించిన రికార్డులను శుక్రవారం ఏసీబీ కోర్టుకు సమర్పించినట్లు సిఐయు డీఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు 'సాక్షి'కి వెల్లడించారు. మహిళ కనుక ఆమెను అరెస్ట్ చేయలేదని, కానీ నోటీసు జారీ చేశామని ఆయన తెలిపారు. అదే విధంగా వీరికి ఆస్పత్రి విక్రయించిన సురేందర్‌రెడ్డిని కూడా విచారించామని చెప్పారు. -
ఏసీబీ అదుపులో డీఎంహెచ్ఓ
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఓ జిల్లా అధికారిణిపై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డీఎంహెచ్ఓ పోస్టు మరోసారి వివాదాలకు వేదికగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిగా డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి గత మే నెలలో నియమితులయ్యారు. అప్పట్లో విజయనగరం డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న ఆమెను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో భాగంగా కర్నూలుకు బదిలీ చేశారు. అప్పటికే విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయమై విచారణ చేసేందుకు అప్పట్లో ఆమెను బదిలీ చేశారు. కాగా కర్నూలు వచ్చిన ఆరు నెలల అనంతరం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చకు దారితీసింది. బుధవారం ఉదయమే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో కర్నూలు ఏసీబీ సీఐలు వెంకటకృష్ణారెడ్డి, సతీష్, సిబ్బంది స్థానిక సప్తగిరినగర్‌లోని శ్రీ కృష్ణ రెసిడెన్సీలో నివాసముంటున్న డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఇంట్లోని బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. రెండు బ్యాంకు ఖాతాల పాస్బుక్కులతో పాటు ఏటీఎం కార్డు, చెక్కు బుక్కు, రూ.19వేల నగదు, పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లోని సమాచారాన్ని సేకరించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో హైడ్రామా ఇంట్లో సోదాలు పూర్తి చేసుకున్న ఏసీబీ అధికారులు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి వెళ్లారు. డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని కార్యాలయం బయటే ఓ వాహనంలో ఉంచి, అధికారులు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లారు. డీఎంహెచ్ఓ చాంబర్లో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వెళ్లారు. కాగా అంతకుముందే డీఎంహెచ్ఓకు సన్నిహితంగా మెలిగే ఇద్దరు ఉద్యోగులు చాంబర్లోకి వెళ్లి పలు రికార్డులు చక్కబెట్టినట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఏసీబీ అధికారులు చాంబర్లోకి వచ్చినా ఏమీ దొరకనట్టు వారు సర్దినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు మరో ఉద్యోగి డీఎంహెచ్ఓకు సన్నిహితంగా మెలుగుతూ ఆదివారం సైతం విధులు నిర్వహించి అనుకున్న పనులు చక్కబెట్టేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎంహెచ్‌ఓపై పలు ఫిర్యాదులు సైతం రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. డీఎంహెచ్ఓ పోస్టుకు కొనసాగుతున్న మకిలీ డీఎంహెచ్ఓ పోస్టు అంటేనే రోత పుట్టేలా చర్యలు ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పనిచేసిన కొందరు డీఎంహెచ్ఓల మాదిరిగానే ఇక్కడకు వస్తున్న అధికారులు తమ అవినీతి పంథాను వీడటం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో డీఎంహెచ్‌ఓగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్‌ని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. దీంతో పాటు ఆయన స్టేషనరీ కుంభకోణంలోనూ ఇరుక్కున్నారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్ సాయిప్రసాద్, డాక్టర్ ఆంజనేయులు సైతం ఇదే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేసి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన డాక్టర్ వెంకటపతి, డాక్టర్ రామకృష్ణారెడ్డిలపైనా ఆరోపణలు వచ్చాయి. మందుల కొనుగోలు విషయంలో డాక్టర్ శివశంకర్‌రెడ్డిపై కేసు నమోదైన విషయం విదితమే. డీఎంహెచ్ఓ పోస్టులో భారీగా ఆదాయం ఉండటం వల్లే ఈ పోస్టుకు రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు ఇచ్చి తెచ్చుకునే వారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినీతి మకిలి అంటించుకుని అధికారులు ఇక్కడి నుంచి స్థానచలనం పొందుతున్నారు. -
వైద్యాధికారిణి ఇంటిపై ఏసీబీ దాడులు
కర్నూలు: అవినీతి ఆరోపణల నేపథ్యంలో కర్నూలు డీఎంఅండ్‌హెచ్‌వో స్వరాజ్యలక్ష్మి ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గతంలో ఆమె పనిచేసిన విశాఖపట్టణం, విజయనగరం ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్థానిక సప్తగిరినగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు చేపట్టిన అధికారులు స్వరాజ్యలక్ష్మి పాస్‌పోర్టును, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు విశాఖ, విజయనగరాల్లోనూ దాడులు చేస్తున్నట్లు సమాచారం. డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేపట్టారు. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో పాత రూ.500కు చెల్లుచీటీ
గుంటూరు మెడికల్: ప్రైవేటు ఆస్పత్రుల్లో పాత రూ.500 నోట్లు రోగుల వద్ద తీసుకోరని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ అరుణకుమారి డిసెంబర్ 4న ఇచ్చిన ఆదేశాల మేరకు నోట్లు తీసుకోరనే విషయాన్ని తెలియజేస్తున్నామన్నారు. నవంబర్ 29న ప్రైవేటు ఆస్పత్రుల్లో పాత రూ.500 నోట్లు తీసుకోవాలని ఆదేశించారని, ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. -
హెచ్ఐవీ బాధితులకు టీబీ పరీక్ష తప్పనిసరి
కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు తప్పనిసరిగా టీబీ పరీక్ష చేయించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. హెచ్ఐవీ, టీబీ మందులపై శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏఆర్టీ, టీబీ యూనిట్ల వైద్యసిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. హెచ్ఐవీ, టీబీ రోగులకు ఏఆర్టీ థెరపి మందులు ఏఆర్టీ సెంటర్లోనే ఇస్తారన్నారు. గతంలో టీబీ రోగులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇచ్చేవారమని, ఇప్పుడు నెలకు ఒక బాక్స్ మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రతి నెలా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. టీబీ లేకుండా హెచ్ఐవీ ఉన్న వారు.. గతంలో ఏడు మాత్రలు మింగేవారని, ఇప్పుడు ఏడు మందులు కలిపి రెండు మాత్రలుగా చేశారన్నారు. రెండు మాత్రలను చించిన తర్వాత ఫోన్ నెంబర్ ఉంటుందని, ఆ ఫోన్ నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తేనే వారు మింగినట్లు ఆన్లైన్లో నమోదవుతుందన్నారు. ఎవరైనా ఫోన్ చేయకపోతే వారి ఇంటికి సిబ్బంది వెళ్లి మందులు మింగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌వో(ఎయిడ్స్ అండ్ లెప్రసి) డాక్టర్ రూపశ్రీ, డీఐవో డాక్టర్ వెంకటరమణ, డబ్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ జోసఫ్, కర్నూలు, నంద్యాల ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 18 టీబీ యూనిట్లు మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ల్యాబ్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
'అనంత'కు జాతీయ ఆరోగ్య మిషన్ బృందం
6, 7 తేదీల్లో నాలుగు ఆస్పత్రులు పరిశీలన అనంతపురం మెడికల్ : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం డిసెంబర్ 6, 7 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్‌కు సమాచారం అందింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ ప్రభుస్వామితో పాటు మరో ఇద్దరు సభ్యులతో కూడిన బృందం 6వ తేదీ అనంతపురం చేరుకుంటుంది. ఉదయం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ప్రోగ్రాం ఆఫీసర్లతో బృందం సభ్యులు సమావేశమవుతారు. మధ్యాహ్నం ముదిగుబ్బ, కదిరి ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తారు. 7వ తేదీన ధర్మవరం, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేస్తారు. ఎన్హెచ్ఎం బృందం రానున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ నివేదికలను తయారు చేసుకునే పనిలో పడ్డారు. -
జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి
అనంతపురం మెడికల్ : జనన, మరణ రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మీటింగ్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాల్లో తేడాలు లేకుండా చూడాలన్నారు. ఆధార్ నంబర్ తీసుకుని పేర్లు సరిచూసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన వారందరికీ ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే జనన, మరణాలు కూడా నమోదు చేయాలన్నారు. వాటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఎస్ఓ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ కార్యాలయ ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
151 జీఓ ప్రకారం జీతాలు చెల్లించాలి
అనంతపురం మెడికల్ : ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ జీవో నంబర్ 151 విడుదల చేసిందనీ, అందువల్ల ఆ మేరకు తమకు వేతనాలు ఇవ్వాలని 104 ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం వారు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 45 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లు చెప్పారు. తమకు రూ.9,500 వేతనం వస్తుండగా గత ఆగస్టులో రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందన్నారు. అయినా పెంచిన వేతనాలు మాత్రం రావడం లేదన్నారు. తక్షణం సమస్యను పరిష్కరించి కొత్త జీతాలు వేయాలన్నారు. -
ముంపులో ఉన్నామని ముందే చంపేస్తారా?
డీఎంహెచ్ఓను ప్రశ్నించిన గౌరిదేవిపేట వాసులు ప్రభుత్వ వైద్యసేవలపై అసహనం గౌరిదేవిపేట (నెల్లిపాక): పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే ముంపునకు గురవుతామంటూ ఇప్పటి నుంచే వైద్యసేవలు అందకుండా చేసి ముందుగానే మమ్మల్ని చంపేస్తారా? అంటూ గౌరిదేవిపేట ప్రజలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) కె చంద్రయ్యను ప్రశ్నించారు. ఎటపాక మండలంలోని నెల్లిపాక, లక్ష్మీపురం, గౌరిదేవిపేట పీహెచ్‌సీలను డీఎంఅండ్ హెచ్‌వో గురువారం సందర్శించి ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, వైద్యసేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే గౌరిదేవిపేట పీహెచ్సీలో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆస్పత్రికి వచ్చిన వైద్యశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపుడో నిర్మించే పోలవరం ప్రాజెక్టు కోసం ముంపుగా గుర్తించిన గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటి నుంచే సౌకర్యాలు కల్పించకపోవటం తగదని అభ్యం తరం తెలిపారు. రెండేళ్ల నుంచి పీహెచ్సీలో కనీస సౌకర్యాలు లేక, సరిపడా సిబ్బంది లేక వైద్యసేవలు సక్రమంగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పీహెచ్‌సీల తనిఖీకి వచ్చిన ప్రతిసారీ సమస్యలను విని వెళ్లిపోవటం తప్ప పరిష్కారం చూపిందేమీ లేదని ఉప సర్పంచ్ కోడూరి నవీన్, నల్లకుంట సర్పంచ్ సొందె రామారావు వాపోయారు. మారుమూల గ్రామాల ప్రజలు మెరుగైన వైద్యసేవలు అందక వ్యాధులతో మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం స్పందించక పోవటం బాధాకరమని గ్రామస్తులు ఆకుల వెంకట రామారావు, అడప రమేష్, జింకా కొండయ్య అన్నారు. ఆస్పత్రిలో అంబులెన్ సదుపాయం లేదని, చిన్నపాటి వర్షానికే గదులన్నీ తడిసిపోతున్నాయని తెలిపారు. ప్రజల ఆగ్రహం, ఆవేదనను తెలుసుకున్న డీఅండ్‌హెచ్‌వో పీహెచ్సీ భవనాలను, పరిసరాలను పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎన్ఆర్హెచ్ఎం సత్యనారాయణ, నెల్లిపాక, గౌరిదేవిపేట వైద్యులు శేషారెడ్డి, ఉదయబాస్కర్ తదితరులు ఉన్నారు. -
పీహెచ్‌సీల్లో ప్రసవాలకు చర్యలు
కాకినాడ వైద్యం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.చంద్రయ్య ఆదేశించారు. కాకినాడ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం డివిజన్ల పరి«ధిలోని వైద్యాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రసవాలన్నీ కాకినాడ ప్రభుత్వ ఆçస్పత్రికి తరలించడంతో ఒత్తిడి పెరుగుతుందని, పీహెచ్‌సీల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. నెలలో పది రోజుల్లో కనీసం 20 ప్రసవాలు పీహెచ్‌సీల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల వివరాలు నూరు శాతం ఆ¯ŒSలై¯ŒSలో అప్లోడ్ చేయాలన్నారు. 85 శాతం పైబడి చేసిన నమోదు చేసిన ఏఎ¯ŒSఎంలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది జవనరి 29, ఏప్రిల్ రెండున పల్స్‌పోలియో జరుగుతుందన్నారు. అనంతరం వ్యాధి నిరోధక టీకాలు, క్షయ, మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల నివారణ, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. డీటీబీసీవో డాక్టర్ ప్రసన్నకుమార్, డీపీఎంవో డాక్టర్ కె.సత్యనారాయణ, డీసీ జేబార్ డాక్టర్ ఎ¯ŒS.రాజేశ్వరి, డీఎంవో పీఎస్ఎస్ ప్రసాద్, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. -
న్యాయం కోసం డీఎంహెచ్‌వోకు వినతి
శ్రీకాకుళం అర్బన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో గల గిరిజన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న ఉద్యోగులకు బదిలీ అయినప్పటికీ ఐటీడీఏ పీవో అనాలోచిత నిర్ణయం కారణంగా బదిలీ కాకపోవడంతో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ హంస(ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉంకిలి శ్రీనివాస్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ ఏపీ హంస ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సనపల తిరుపతిరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వివిధ కేటగిరిలకు చెందిన సుమారు 70మందికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 272 ప్రకారం వారు కోరుకున్న చోటకు మైదాన ప్రాంతంలో బదిలీ అయినప్పటికీ ఐటీడీఏ పీవో వారికి రిలీవ్ చేయకపోవడం శోచనీయమన్నారు. బదిలీ అయిన వారికి తక్షణమే వారి వారి స్థానాలకు రిలీవ్ ఉత్తర్వులు ఇప్పించి న్యాయం చేయాలని ఆయన కోరారు. స్పందించిన డీఎంహెచ్‌వో డాక్టర్ సనపల తిరుపతిరావు మాట్లాడుతూ కలెక్టర్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలసిన వారిలో డీఎంహెచ్‌వో ఏవో డాక్టర్ దవళ భాస్కరరావు, ఏపీ హంస జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొయ్యాన శ్రీనివాస్, బగాది వెంకటరమణ, కోశాధికారి బెండి జనార్ధనరావు, ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి.నవీన్‌కుమార్, సంఘ ప్రతినిధులు రామచంద్రరావు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. -
కొత్త జిల్లాలకు వైద్య, ఆరోగ్య అధికారులు
సాక్షి, హైదరాబాద్: దసరా నాటి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులను నియమించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 31 జిల్లాలకు అధికారుల పేర్లతో జాబితా విడుదలైంది. వీరిలో కొందరు ఇప్పుడున్న స్థానంలోనే కొనసాగుతుండగా, కొత్త జిల్లాలకు మాత్రం కొత్తవారిని కేటాయించారు. అవసరమైన మార్పుచేర్పులతో తుది ఉత్తర్వులు వెలువడాల్సిఉంది. ప్రస్తుతానికి లభించిన సమాచారం మేరకు ఏయే జిల్లాలకు ఎవరిని కేటాయించారంటే.. 1) హైదరాబాద్ - డాక్టర్ పద్మజ 2) ఆదిలాబాద్ - డాక్టర్ సుబ్బారాయుడు 3) మంచిర్యాల - డాక్టర్ భీష్మ 4) నిర్మల్ - డాక్టర్ జల్పత్ నాయక్ 5) ఆసిఫాబాద్ - డాక్టర్ టి.చందు 6) నిజామాబాద్ - డాక్టర్ జె.వెంకట్ 7) కామారెడ్డి - డాక్టర్ పి.చంద్రశేఖర్ 8) కరీంనగర్ - డాక్టర్ రాజేశం 9) జగిత్యాల - డాక్టర్ సుగంధిని 10) పెద్దపల్లి - డాక్టర్ బిక్షపతి 11) సిరిసిల్ల - డాక్టర్ రమేష్ 12) సంగారెడ్డి - డాక్టర్ గాయత్రీదేవి 13) మెదక్ - డాక్టర్ అమర్‌సింగ్ నాయక్ 14) సిద్దిపేట - డాక్టర్ యు.రామకృష్ణ 15) వరంగల్ అర్బన్ - డాక్టర్ సాంబశివరావు 16) వరంగల్ రూరల్ - డాక్టర్ ఎ.అశోక్ ఆనంద్ 17) భూపాలపల్లి - డాక్టర్ అప్పయ్య 18) మహబూబాబాద్ - డాక్టర్ డి.శ్రీరాం 19) జనగాం - డాక్టర్ బి.హరీష్‌రాజ్ 20) ఖమ్మం - డాక్టర్ కొండల్రావు 21) కొత్తగూడెం డాక్టర్ - బి.వెంకటేశ్వర్రావు 22) నల్లగొండ - డాక్టర్ భానుప్రసాద్ నాయక్ 23) సూర్యాపేట - డాక్టర్ టి.మురళీమోహన్ 24) యాదాద్రి - డాక్టర్ కాళిదాసచారి 25) రంగారెడ్డి - డాక్టర్ హరీష్చంద్రరెడ్డి 26) వికారాబాద్ - డాక్టర్ దశరథ్ 27) మేడ్చల్ - డాక్టర్ భానుప్రకాష్ 28) మహబూబ్‌నగర్ - డాక్టర్ శ్రీనివాసులు 29) నాగర్‌కర్నూలు - డాక్టర్ సుధాకర్ 30) వనపర్తి - డాక్టర్ నాగారం 31) గద్వాల - డాక్టర్ కె.కృష్ణ -
డీఎంహెచ్ఓ కార్యాలయ పనుల పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ ఆదివారం సందర్శించారు. దసరా రోజు నుంచి ఇక్కడి నుంచే పాలన కొనసాగనున్న దృష్ట్యా పనులను సూచించారు. కాంట్రాక్టర్ దగ్గర ఉండి పనులు చేయించాలన్నారు. ఆయన వెంట ఎస్పీహెచ్ఓ తండు మురళీమోహన్, కోటాచలం, సముద్రాల సూరి తదితరులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
భువనగిరి అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్యసిబ్బంది స్పందించి గ్రామాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచ్ఓ కె.భానుప్రసాద్‌నాయక్ అన్నారు. భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయ భవనం ఏర్పాటు కోసం మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రి సమీపంలో ఉన్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లేరియా వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డెంగీ లక్షణాలు గుర్చి గ్రామీణ ప్రజలు తెలుసుకోవాలని, మనుషులు నల్లగా మారడం, తరుచు జ్వరాలు రావడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స చేయించుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీ వరకు భువనగిరిలో జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా డీఎంహెచ్ఓ–1, ఏడీఎంహెచ్ఓ–1, డీఐఓ–1. డీటీసీఓ–1, డీఎల్ఓ–1, మల్లేరియా డీఎంఓ–2, ఎస్ఓ–1, ఐడీఎస్పీ మేడికల్ అధికారి–1, సూపరింటెండెంట్–1, సీనియర్ అసిస్టెంటు–3, జూనియర్–5, డ్రైవర్లు–5, అంటెండర్లు–5 పోస్టులలో అధికారులు, సిబ్బంది రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎండీ.అన్వర్‌హుస్సేన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, శ్రీకాంత్ ఉన్నారు. -
నాలుగు జిల్లాల్లో డీఎంహెచ్ఓ కార్యాలయాలు
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు ఎంజీఎం : వరంగల్ విభజన ద్వారా ఏర్పడనున్న నా లుగు కొత్త జిల్లాల్లో డీఎంహెచ్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. వరంగల్, హన్మకొండ కార్యాలయాలు ప్రస్తుతమున్న ప్రదేశాల్లోనే పనిచేస్తాయన్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి క్వార్టర్స్, మహబూబాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలను డీఎంహెచ్ఓ కార్యాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశామన్నారు. కార్యాలయాలవారీగా అధికారులు, సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. ఫైళ్ల విభజన పూర్తి కావచ్చిందని డీఎంహెచ్ఓ వివరించారు. -
డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు
ఉయ్యూరు : మలేరియా, డెంగీ ప్రాణాంతక వ్యాధులు కాదని డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి అన్నా రు. ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. దోమలపై దండయాత్ర, దోమల నివారణ చర్యలు, వైరల్ జ్వరాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పగటి దోమలతోనే డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. జిల్లాలో 120 డెంగీ కేసులు, 370 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. జ్వరం వస్తే ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్సీలో వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వైద్యులు బాలకృష్ణ, శోభ పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం : జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సాంబశివరావు తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీల్లో సరిపడ మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు శుభ్రమైన నీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. ఇంటి చుట్టూ పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని దూరం పోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే వృద్ధులు, పిల్లలు వర్షంలో తడకుండా చూడాలని తెలిపారు. ఏఎ¯ŒSఎంలు, ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వరంగల్ పట్టణ ప్రాంత మురికి వాడల్లో పట్టణ ఆరోగ్యకేంద్రాల, 104 సిబ్బదితో వరంగల్ కార్పొరేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మలేరియా సబ్యూనిట్ అ«ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఎంఓ పైడి రాజు, సీనియర్ ఎంటమాలజిస్టు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల వివరాలు ఆన్లైన్ చేయాలి
అడిషనల్ డైరెక్టర్ సూర్యప్రకాశ్ ఎంజీఎం : జిల్లా వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులు, ఫైళ్ల వివరాలను వెంటనే ఆన్లైన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్(ప్లానింగ్), జిల్లాల విభజన అధికారి సీహెచ్.సూర్యప్రకాశ్ ఆదేశించారు. వరంగల్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీహెచ్ఓ సాంబశివరావుతో విభజన ప్రక్రియపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా విభజన క్రమంలో నాలుగు కొత్త జిల్లాలుగా ఏర్పడుతున్న క్రమంలో లో శాఖకు సంబంధించి పూర్తి వివరాలు, ఫైళ్ల సమాచారాన్ని సెక్షన్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని సూచించారు. నాలుగు జిల్లాల్లో కార్యాలయాల వివరాలు, జిల్లాల వారీగా ఫైళ్ల విభజనతో పాటు సామగ్రి సర్దుబాటు వివరాలపై చర్చించారు. సమావేశంలో అడిషనల్ డిఎంహెచ్ఓ మధుసూన్, ఆఫీస్ సూపరింటెండెంట్ సదానందం, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపరాణి, అన్వర్ పాల్గొన్నారు. -
భయపెడుతున్న ‘డెంగీ’ భూతం
అధికారులను పరుగులు పెట్టిస్తున్న మహమ్మారి తగ్గుముఖం పట్టాయంటున్న డీఎంహెచ్ఓ కాకినాడ రూరల్ : జిల్లాలో డెంగీ కేసులు నమోదు కావడం ఇటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అటు పంచాయతీ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడం, కొన్ని గ్రామాల్లో జ్వర పీడితులు చనిపోవడంతో అధికారులు గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం పాత గైగోలుపాడులో ఓ మహిళ డెంగీ లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో, ఆ ప్రాంతానికి వైద్య శాఖ, పంచాయతీ అధికారులు చేరుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, ఇంటింటా రక్తపూతలను సేకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రయ్య పాత గైగోలుపాడులో ఎంపీడీఓ సీహెచ్‌కే విశ్వనాథరెడ్డి, మండల వైద్యాధికారి ఐ.ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి టీవీవీ సత్యనారాయణతో కలసి పర్యటించారు. విషజ్వరాలు తగ్గుముఖం : ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. విషజ్వరాలు సోకడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గుర్తించినట్టు వివరించారు. జిల్లాలో డెంగీ వల్ల నలుగురు చనిపోయారని, 102 కేసులు నమోదయ్యాయని వివరించారు. 600 మందికి పైగా విషజ్వరాలు సోకినట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో 92, ఏజెన్సీ ప్రాంతాల్లో 282 వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్యసేవలు అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రతి వీధిలోను వైద్య సిబ్బంది పర్యటించి, ప్రజల ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ అపరిశుభ్రత కనిపించినా వెంటనే పంచాయతీ అధికారులకు సమాచారం అందజేయాలని చెప్పారు. ఎవరైనా పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గైగోలుపాడులో చనిపోయిన మహిళ డెంగీతో మరణించలేదని, ఆమెకు వరుసగా రెండు సార్లు జ్వరం రావడంతో వైద్యం చేయించుకోవడంలో కొంత నిర్లక్ష్యం ప్రదర్శించిందని తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రులంటే ఇంత నిర్లక్ష్యమా?
రాపూరు పీహెచ్‌సీని పరిశీలించిన జెడ్పీచైర్మన్ వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం డీఎంహెచ్ఓకు ఫోన్లో ఫిర్యాదు రాపూరు: ప్రభుత్వ ఆస్పత్రి అంటే ఇంత నిర్లక్ష్యమా..పేదలకు సేవలందించేందుకు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడం ఏమిటని జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం ఆయన పరిశీలించారు. వైద్యశాలలో వైద్యులు లేకపోవడాన్ని గుర్తించి హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. 25 మంది సిబ్బంది ఉన్నా హెడ్ నర్సు, మెటర్నటీ అసిస్టెంట్, దంత, ఫిజియో«థెరపీ వైద్యులు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజుకు ఎంత మంది రోగులు వస్తుంటారని దంత వైద్యుడ్ని ప్రశ్నించారు. నిత్యం 250 నుంచి 300 మంది వస్తుంటారని చెప్పగా, ఇంత మంది వస్తున్నా ఒక్క వైద్యుడు లేకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దంత, ఫిజియోథెరపి వైద్యులు రోగులను పరీక్షించడం ఏమిటని వెంటనే డీఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడారు. ఐదుగురు వైద్యులు, ఆరుగురు నర్సులు, ఎన్సీడీ వైద్యులు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేకపోవడం ఏమిటని..వైద్యులకు సెలవులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వైద్యసిబ్బందిని నియమించేలా చూస్తామన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బండి కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లకదుపు శకుంతల, నాయకులు పాపకన్ను దయాకర్‌రెడ్డి, బండి తిరుపాల్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. -
హెల్త్ విజిటర్పై డీఎంహెచ్‌వో విచారణ
చింతలపూడి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్‌కు గురైన హెల్త్ విజిటర్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి శుక్రవారం విచారణ జరిపారు. రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ విజిటర్‌గా పనిచేస్తున్న బి.శాంతకుమారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత జూలైలో స్ధానిక సుప్రీంపేటకు చెందిన తల్లీబిడ్డా మృతి చెందారు. ఈ ఘటనలోకలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఆగస్టులో శాంతకుమారిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని శాంతకుమారి ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై స్వయంగా విచారించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించడంతో రాఘవాపురం పీహెచ్సీలో విచారణ చేపట్టారు. వైద్యులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను విడివిడిగా విచారించారు. -
డీఎంహెచ్ఓ కార్యాలయానికి భవనాల పరిశీలన
సూర్యాపేట : నూతనంగా జిల్లా కాబోతున్న సూర్యాపేటలో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం(డీఎంహెచ్ఓ) ఏర్పాటుకు శుక్రవారం డీఎంహెచ్ఓ భానుప్రసాద్ నాయక్ పట్టణంలో పలు భవనాలను పరిశీలించారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భాగంలోని క్వార్టర్స్‌ను, పాత ఆర్డీఓ కార్యాలయం, పాత మున్సిపల్ కార్యాలయ భవనాలను పరిశీలించారు. ఈ భవనాల ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపనున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్, ఎస్పీహెచ్ఓ తండు మురళీమోహన్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రమేష్‌నాయక్, మాండన్ సుదర్శన్, తీగల నర్సింహ, భాస్కరరాజు, సల్వాది శ్రీనివాస్, పోతరాజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
‘డెంగీ’పై ఆందోళన వద్దు
పెదపళ్ల (ఆలమూరు) : డెంగీ, సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందవద్దని డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య పేర్కొన్నారు. పెదపళ్ల పీహెచ్‌సీని శనివారం ఆయన సందర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ డెంగీలో తొలిదశను డీఎన్ఎస్, రెండో దశను డీహెచ్ఎస్, మూడో దశను డీఎస్‌ఎస్‌గా భావిస్తామని చెప్పారు. తొలి రెండు దశలు అంత ప్రమాదకరమైనవి కావని, సమీప వైద్య కేంద్రాల్లో వీటికి చికిత్స చేస్తారని తెలిపారు. డెంగీ వ్యాధి నిర్థారణ అందుబాటులో ఉన్నందున మూడో దశకు చేరే రోగిని గుర్తించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సను చేయించుకోవాలని వివరించారు. జిల్లాలోని సుమారు 125 పీహెచ్‌సీల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్టు వెల్లడించారు. పీహెచ్‌సీల్లో సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ టి.రమేష్ కిషోర్, వైద్యాధికారి ఆర్.సుదర్శన్‌బాబు ఉన్నారు. -
మాతాశిశు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
ఎంజీఎం : మాతాశిశు వివరాలతో పాటు హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్ చేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి హరీష్‌రాజు సూచించారు. వరంగల్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం ఆయా క్లస్టర్ల పరిధిలోని ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఓ హరీష్‌రాజు మాట్లాడుతూ తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే ఆవకాశం ఉందన్నారు. పీహెచ్‌సీలతో పాటు క్లస్టర్ స్థాయిలో వివరాలను ప్రతి నెల అన్ని సెంటర్లలో నమోదు చేయాలన్నారు. అనంతరం ఆన్లైన్లో జరిగే పొరపాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓలు కాంతారావు, రమేశ్గాడ్గిల్, సర్వేలెన్స్ అధికారి కిరణ్, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపారాణి పాల్గొన్నారు. -
నాటుమందు.. నమ్మితే కాటికే!
పాముకాటుతో ప్రాణాలు కోల్పోతున్న వైనం ఏడాదిలో 300మందికిపైగా మృత్యువాత ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు జిల్లాలో పాముకాటుకు గురై మృత్యువాతపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది కాలంలో 300మందికిపైగా ఇలా మృతి చెందారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. కూలీ చేసుకుని జీవించే నిరుపేదలతో పాటు పంట పొలాల దగ్గరకు కాపలాకోసం వెళుతున్న రైతన్నలు ఎక్కువగా బలవుతున్నారు.. పాముకాటుకు గురయినప్పుడు నాటు వైద్యం చేయించుకోరాదని వైద్యులు సూచిస్తున్నారు. – మహబూబ్‌నగర్ క్రైం చేను పనికి వెళ్లినప్పుడు పొదల్లో చేతులు పెట్టడం, అందులోంచి కాలినడకన వెళ్లడం చేస్తుండటంతో తరచూ పాముకాటుకు గురవుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పాముల్లో వివిధ రకాలుంటాయి. అందులో విషసర్పాలు కొన్నే ఉంటాయి. నాగుపాము, కట్ల, రక్తపింజరం వంటి కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదకరం. ఇవి కాటేసిన వెంటనే శరీరంలోకి విషం వెళ్లి శ్వాసకోశాలు, మూత్రపిండాలపై ప్రభావం పడి ప్రాణానికి అపాయం ఏర్పడుతుంది. విషసర్పాలు కానివి కాటేస్తే ప్రాథమిక చికిత్స సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జూలైలో 18, ఆగస్టులో 23వ తేదీ వరకు 14మంది పాముకాటుకు బలయ్యారు. ఇటీవల జిల్లాలో కొన్ని పాముకాటు మరణాలు.. ఆగస్టు 3న ధరూర్ మండలంలోని మాల్‌దొడ్డికి చెందిన చంద్రిక (4) ఇంట్లో నిద్రపోతుండగా పాటుకాటు వేయడంతో మృతి చెందింది. 4న మిడ్జిల్ మండలంలోని కొత్తూర్‌కు చెందిన శివకుమార్ (11) పాముకాటుతో మృతి చెందాడు. 6న కేశంపేట మండలం నిర్దవెల్లికి చెందిన గిద్దెల చిన్నకేశవులు (26) పాముకాటు వల్ల మృత్యువాతపడ్డాడు. 17వ తేదీ రాత్రి ధన్వాడ మండలం మాధ్వార్‌కు చెందిన ఆంజనేయచారి (35) పాముకాటుకు గురై మృత్యువాతపడ్డాడు. ఇదేరోజు తలకొండపల్లికి చెందిన అనిత (18) పాముకాటుతో‡మృతి చెందింది. కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దారెడ్డిచెరువుతండాకు చెందిన బాల్యనాయక్ (45) శివారులోని పొలంలో పశువులు మేపుతుండగా గడ్డిలో ఉన్న పాముకాటుకు బలయ్యింది. 18వ తేదీ రాత్రి ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లికి చెందిన సరోజ(35) ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గురై చనిపోయింది. ఇటీవల వెల్దండలో పదేళ్ల బాలుడు చెట్ల పొదల్లో బంతికోసం వెతకగా పాము కాటేయడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ప్రభుత్వ వైద్యులకు శిక్షణ అవసరం పాము కాటేస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విషవిరుగుడు మందు (యాంటీ స్నేక్ వీనమ్)లు అందుబాటులో ఉన్నా అత్యధికచోట్ల మరణాలే సంభవిస్తున్నాయి. చికిత్స విధానంలో వైద్యులు సరైన పద్ధతి పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. మామూలుగా సర్పం కాటేసినా విరుగుడు చికిత్స అందిస్తుండటంతో అదీ ప్రాణాల మీదకొస్తుందనే వాదనలున్నాయి. అందుకనే దీనిపై వైద్యులకు శిక్షణ ఇవ్వాలి. విషసర్పాలు కాటేస్తే పరిస్థితి చెయ్యిదాటిన సమయంలో రోగికి వెంటిలేటర్లు అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాము కాటేసిన వెంటనే విషం మనిషి శరీరంలోకి వెళ్లకుండా తాడుతో లేక ఇతర గుడ్డముక్కలతోనైనా కాటేసిన చోట పైన కట్టాలి. ఆ వెంటనే చికిత్సకు తరలించాలి. మూఢనమ్మకాలను నమ్మి మంత్రం వేసిన నీళ్లు తాగడమో, భూమిలో కాలుపెట్టి చికిత్స తీసుకోవడమే చాలాచోట్ల చేస్తుంటారు. వీటికి దూరం ఉండి తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. పాము కాటేసిన వెంటనే చాలామంది భయంతోనే ప్రాణాలను మీదకి తెచ్చుకుంటున్నారు. భయపడొద్దని చికిత్స ఉంటుందని నిర్భయంగానే ఆస్పత్రికి బాధితులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. చేనులోకి వెళ్లిన సమయంలో చెట్లపొదల్లో అడుగు పెట్టేది ఉంటే కాళ్లకు పెద్ద సైజులో ఉండేలా నల్లని బూట్లు ధరించాలి. పొలం పొదల్లో పనిచేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించాలి. పిల్లలను పొదలు ఎక్కువగా ఉన్నచోట ఆడుకోవడానికి పంపించరాదు. పల్లెల్లో ఇళ్ల పరిసరాలు చుట్టూ చెట్లపొదలు ఎక్కువగా ఉండనివ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చాలా వరకు పాములు బయటకొచ్చే అవకాశాలుంటాయి. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పాము కరిచిన పై భాగాన తాడుతో గాని, గుడ్డతో కానీ గట్టిగా కట్టు కట్టాలి. కాటువేసిన ప్రాంతంలో రక్తం బయటకు వెళ్లేలా చిన్నపాటి రంధ్రం వేయాలి. వెంటనే పరిగెత్తకుండా అలాగే కూర్చోవాలి. ఆర్ఎంపీల వద్దకు వెళ్లొద్దు జిల్లాలో పాముకాటు వేసిన తర్వాత ఎక్కువ శాతం మంది నాటువైద్యులు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా మంది భయం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు వచ్చేందుకు ఆలస్యం చేస్తుంటారు. అన్ని పీహెచ్‌సీల్లో యాంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంది. ఇప్పటికే దీనిపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. – డాక్టర్ నాగారాం, డీఎంహెచ్ఓ, మహబూబ్‌నగర్ -
సమష్టిగా పుష్కర వైద్య సేవలు
డీఎంహెచ్‌వో డా.నాగమల్లేశ్వరి లబ్బీపేట: లక్షలాది మంది పుష్కరాలకు తరలివచ్చినా ఎలాంటి అవాంతరాలు కలగకుండా వైద్యశాఖ సిబ్బంది అంతా సమష్టిగా పనిచేసి అనారోగ్యానికి గురైన వారికి సేవలు అందించారని ఆ శాఖ నోడల్ ఆఫీసర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి అన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పుష్కరాల్లో సేవలు అందించాయని అన్నారు. ప్రభుత్వ, ప్రవేటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో యాత్రికులకు మంచి సేవలు అందించగలిగాం. 4.11 లక్షల మందికి వైద్య పరీక్షలు పుష్కర ఘాట్లలోని వైద్య శిబిరాల్లో 4,11,283 మంది ఓపీ పరీక్షలు చేయగా, 2672 మందికి ఇన్ పేషెంట్స్‌గా సేవలు అందించినట్లు ఆమె తెలిపారు. 959 మందిని రిఫరల్ కేసులుగా మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రిలకు తరలించినట్లు చెప్పారు. -
నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందే
అనంతపురం సిటీ :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఉద్యోగులు నేడు, రేపు విధుల్లో ఉండాల్సిందేనని, ఆదివారం కూడా సెలవు ఉండదని వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. శనివారం కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ ఆయన పరిశీలించారు. జిల్లాకు రాష్ట్ర ఉన్నతాధికారులు రానున్నారని, అన్ని రికార్డులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ముగిసిన దరఖాస్తు గడువు : వైద్యులు, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులతో పాటు పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు కావడంతో కార్యాలయం అభ్యర్థులతో కిటకిట లాడింది. ఎన్ని దర ఖాస్తులుఅందాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ తెలిపారు. -
పుష్కర ఔషధాలు సిద్ధం
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు పుష్కరాల ఘాట్లకు మందులు సరఫరా చేశారు. జిల్లాలో ఉన్న 52పుష్కర ఘాట్లకు దాదాపు రూ.80లక్షల మందులను కొనుగోలుచేసినట్లు తెలిపారు. పుష్కర ఘాట్లలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి 640మంది వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంచారు. ముఖ్యమైన ఘాట్లలో తాత్కాలిక 10పడకల ఆస్పత్రులను ఏర్పాటుచేశారు. పుష్కర విధుల కోసం ప్రభుత్వ వైద్యులతో పాటు ఆరోగ్య శ్రీ అమలవుతున్న ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు పనిచేస్తున్నారు. పుష్కరాల కోసం 18రకాల మందులను భక్తుల కోసం ఉపయోగించనున్నారు. -
వైద్య సేవల్లో ముందుండాలి
డీఎంహెచ్ఓ సాంబశివరావు వర్ధన్నపేట : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందుండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద లక్ష్మిగార్డెన్లో గురువారం నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో ఆ యన మాట్లాడుతూ.. పీహెచ్సీ సబ్‌సెంట ర్ల పరిధిలోని వైద్య సేవల్లో కీలక పాత్ర వీరిదేనన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబ లకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజ లకు వైద్య సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. ఆశ కార్యకర్తల నైఫుణ్యత, భావ వ్యక్తీకరణ, రోజువారీ కార్యక్రమాల ప్రాధాన్యతపై నృత్య, నాటిక, పాట, ప్రసంగాల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ వైద్యులు సతీష్‌కుమార్, ప్రశాంతి, విద్య, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాల వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రోగులపట్ల అలసత్వం వహిస్తే చర్యలు
నెలవారీ సమీక్షలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ్ శ్రీకాకుళం అర్బన్: విధి నిర్వహణలో రోగులపట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్ హెచ్చరించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఎంపీహెచ్‌ఈవో, సీహెచ్‌వోల నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే అన్ని పీహెచ్‌సీలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాల నుంచి వైద్యసేవలు పొందేందుకు ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగానే ఉంటూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్‌ను నిర్లక్ష్యం చేస్తే వేతనాల్లో కోత తప్పదని హెచ్చరించారు. మందులు అన్ని పీహెచ్‌సీల్లో ఉన్నాయో లేవో పరిశీలించుకుని ఇండెంట్ మేర అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సీజన్ ప్రభావం అధికంగా ఉన్నందున గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించాలన్నారు. జ్వరాలు, డయేరియా వ్యాధుల గ్రామాల్లో ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఏవో డాక్టర్ దవళ భాస్కరరావు, డాక్టర్ హేమంత్, ఎంపీహెచ్‌ఈవోలు, సీహెచ్‌వోలు పాల్గొన్నారు. -
బ్రెస్ట్ క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించాలి
మహబూబ్‌నగర్ క్రై ం: మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొందరగా గుర్తించడం చాలా అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగారాం సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రస్తుత వాతావారణం, ఆహార అలవాట్ల కారణంగా మహిళలో రొమ్ము(బ్రెస్ట్) క్యాన్సర్ అధికంగా వస్తుందని చెప్పారు. పాలమూరు జిల్లాలో మహిళలకు ఈ క్యాన్సర్‌పై ఏమాత్రం అవగాహన లేదని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది తొలిదశలో గుర్తించి చికిత్స చేస్తే ప్రమాదం ఉండదని సూచించారు. గ్రామీణ మహిళలకు ఈ వ్యాధిపై పూర్తిస్థాయిలో ప్రచారం చేసి చైతన్యం తీసుకురావాలని కోరారు. అనంతరం ఎంఎన్‌జే ఆంకాలజీ రీజినల్ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ నుంచి వచ్చిన సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఎంతోమంది మహిళలు ఈ రకం లక్షణాలు ఉన్న కూడా గుర్తించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని తెలిపారు. గ్రామీణప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో బ్రెస్ట్‌క్యాన్సర్ అధికంగా ఉందని చెప్పారు. జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా దీనిపై అవగహన వస్తుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ హరీశ్చంద్రారెడ్డి, డీఐఓ డాక్టర్ కృష్ణ, మల్లిఖార్జునప్ప, రవిశంకర్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
డబ్బులిస్తేనే వైద్యం
ఐదు నెలలుగా ఏఎన్ఎంలకు జీతాల్లేవు ఫోన్‌ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్ఓకు బాధితుల వినతి సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి విభాగంలో డబ్బులు ఇవ్వందే వైద్యం చేయడం లేదని, పేద రోగులకు సరైన వైద్యం అందించడంలో ఆసుపత్రి డాక్టరు, సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంగారెడ్డిలోని హనుమాన్ నగర్‌కు చెందిన రాకేష్ ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్‌సింగ్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎక్స్‌రే విభాగంలో దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫోన్‌ఇన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్‌సింగ్ పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఆయనకు సమస్యలను విన్నవించారు. ఐదు నెలల నుంచి ఏఎన్ఎంల జీతాలు రావడం లేదని, జీతాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దుబ్బాకకు చెందిన నరేందర్ పేర్కొన్నారు సిద్దిపేట మండలం చిన్నగౌడవెల్లి ఆస్పత్రిలో హిమోఫీలియా మందులు గత రెండు నెలల నుంచి అందుబాటులో లేవని గ్రామానికి చెందిన నరేష్ ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ పీహెచ్సీలో ఉన్న ఖాళీలలను వెంటనే భర్తీ చేయాలని చందూలాల్ సూచించారు. -
వెబ్సైట్లో వైద్య సిబ్బంది మెరిట్ జాబితా
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్రీయ బాల స్వస్తయ కార్యక్రమంలో సంచార ఆరోగ్య బృందాలలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేసేందుకు మెడికల్ ఆఫీసర్స్ (స్త్రీ, పు), మెడికల్ ఆఫీసర్స్ ఆయుష్ (స్త్రీ, పు), ఫార్మసిస్టులు, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితా www.kadapa.nic.in అనే వెబ్సైట్లో పొందుపరిచామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సత్యనారాయణరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెరిట్ జాబితా అభ్యర్థుల సౌలభ్యం కోసం కడప నూతన కలెక్టరేట్, డీఎంహెచ్ఓ కార్యాలయాలతోపాటు జిల్లాలోని కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 28వ తేది సాయంత్రం 5 గంటల్లోగా రాత పూర్వకంగా డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు. -
వైద్యాధికారి పోస్టుల జాబితా విడుదల
నిజêమాబాద్ అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిన నియమించే వైద్యాధికారి పోస్టుల జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు. www.nizamabad.nicలో జాబితాను పొందుపరిచినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబితాలో పేర్లు గల అభ్యర్థులు ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
22న వైద్యాధికారుల పోస్టులకు ఇంటర్వ్యూలు
ఎంజీఎం : రాషీ్ట్రయ బాలస్వాస్థ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్–15 నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అలోపతిక్, ఆయుష్ అభ్యర్థులను మెడికల్ ఆఫీసర్ స్థానాలకు భర్తీ చేయగా, ఖాళీగా ఉన్న పోస్టులకు ఈనెల 22న డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తామని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. అలోపతిక్ విభాగంలో పురుషుల విభాగంలో 9, స్త్రీల విభాగంలో 11, అలాగే ఆయుష్ విభాగంలో పురుషుల విభాగంలో ఏడు, స్త్రీల విభాగంలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపించామన్నారు.