అంతా నా ఇష్టం! | Everything is like me! | Sakshi
Sakshi News home page

అంతా నా ఇష్టం!

Published Sat, Dec 24 2016 12:44 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

అంతా నా ఇష్టం! - Sakshi

అంతా నా ఇష్టం!

  •  ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌
  • 24 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు
  • కనీసం నోటీసులూ ఇవ్వని వైనం
  • ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు 
  • డీఎంహెచ్‌ఓ తీరుపై విమర్శలు
  • అనంతపురం మెడికల్‌ : వైద్య, ఆరోగ్యశాఖలో ఆయనో కీలక అధికారి. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందిపోయి సొంత నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 24 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌–మేల్‌ పోస్టుల భర్తీకి 2003లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. 156 పోస్టులుండగా నలుగురు అభ్యర్థులు లేకపోవడంతో 152 భర్తీ చేశారు. అప్పట్లోనే పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 44 మందిని తొలగించి వారి స్థానంలో మెరిట్‌ ఆధారంగా ఇంటర్‌ విద్యార్హత ఉన్న వారిని తీసుకున్నారు. తొలగించిన వారు కోర్టుకు వెళ్లడంతో మూడేళ్ల తర్వాత వారందరికీ పోస్టింగులిచ్చారు. అయితే.. అప్పట్లో రూపొందించిన మెరిట్‌ జాబితాలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 24 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 14 ఏళ్ల క్రితం విధుల్లోకి తీసుకున్న 44 మందిలో 24 మందిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది.

     

    ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్‌

    ఎంపీహెచ్‌ఏ–మేల్‌ పోస్టుల భర్తీ క్రమంలో గతంలో పని చేస్తున్న వారిని తొలగించరాదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య గత నెల 27న మెమో (నంబర్‌ 7342/జీ2/2015–09) జారీ చేశారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రాముఖ్యతనిస్తూ ఎంపీహెచ్‌ఏ–మేల్‌ అందరినీ ఉద్యోగాల్లో కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్‌ఓలకు డిసెంబర్‌ 1వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణకుమారి కూడా ఉత్తర్వులు (ఆర్‌సీ నంబర్‌ : 19247/ఈ4–ఎ) జారీ చేశారు. అయినా వీటిని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ బేఖాతరు చేశారు.

     

    ఆందోళనబాటలో ఉద్యోగులు

    ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను తొలగించడంపై ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఇప్పటికే కలెక్టర్‌ కోన శశిధర్, జాయింట్‌ కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలకు దిగారు.

     

    ఇంత ఏకపక్షమా?

    2013లో ఎంపీహెచ్‌ఏగా జాయిన్‌ అయ్యాను. కుందుర్పి పీహెచ్‌సీలో పని చేసేవాడిని. ఇప్పుడు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తే ఎలా? డీఎంహెచ్‌ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలి.

    - శ్రీనివాస్‌
     

    స్పష్టత కోసం అధికారులను పంపుతున్నా

    42 మందిని తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఒకసారి ఉద్యోగులను తీసెయ్యాలని వచ్చింది. మరోసారి 'ఎక్సర్‌సైజ్‌' చేయాలని వచ్చింది. రకరకాలుగా ఆదేశాలు వస్తున్నాయి. ఉన్న వారిని తొలగించకపోతే ఆదేశాలు అమలు చేయలేం. గతంలో ఈ పోస్టుల భర్తీ సరిగా లేదు. తొలగించిన వారి జాబితా ప్రభుత్వానికి పంపాం. వీలైనంత వరకు ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తాం. స్పష్టత కోసం సోమవారం కార్యాలయంలోని అధికారులను విజయవాడకు పంపుతున్నాం.

    - వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement