- ముగ్గురు సీఆర్టీల తొలగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎస్‌ఎస్‌ఏ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న సీఆర్టీ (కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్)లపై పదో తరగతి ఫలితాల ప్రభావం పడింది. ఈ క్రమంలో ముగ్గురిని విధుల నుంచి తొలగించడం చర్చనీయాంశమైంది. 2015 –16 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో కళ్యాణదుర్గం కేజీబీవీలో 15 మంది బాలికలు గణితంలో, కంబదూరులో 8 మంది విద్యార్థినులు సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు.
ఇందుకు బాధ్యులను చేస్తూ కళ్యాణదుర్గం కేజీబీవీలో గణితం సీఆర్టీగా పని చేస్తున్న మునెమ్మ, కంబదూరు కేజీబీవీలో ఫిజికల్ సైన్స్ (పీఎస్) సీఆర్టీగా పని చేస్తున్న వరలక్ష్మీ, న్యాచురల్ సైన్స్ (ఎన్‌ఎస్) సీఆర్టీగా పని చేస్తున్న మంజులను తొలిగించారు. కొందరు పిల్లలు కొన్ని సబ్జెక్టుల్లో పూర్తిగా వెనుకబడి ఉంటారని అందుకు తమను బాధ్యులు చేయడం ఎంతవరకు సబబని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉం డగా బాధితులు జిల్లాలోని ముఖ్య ప్రజాప్రతినిధులను ఆశ్రయించి వారి ద్వారా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్లినట్లు సమాచారం.