mpeo
-
రైతుభరోసాలో కుమార్తె పేరు చేర్చనందుకు బరితెగింపు
దాచేపల్లి (గురజాల) : రైతుభరోసా పథకంలో కౌలురైతు కింద తన కుమార్తె పేరును చేర్చడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పిన పాపానికి విధి నిర్వహణలో ఉన్న వ్యవసాయ శాఖ మహిళా ఎంపీఈఓపై టీడీపీ సానుభూతిపరుడు విచక్షణారహితంగా దాడిచేశాడు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే పథకం వర్తించదని చెబుతున్నా వినకుండా ఎంపీఈఓ జుట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టి కిందపడేశాడు. అడ్డుకోబోయిన ఆమె తండ్రిని సైతం కొట్టాడు. ఇతర రైతులనూ బెదిరించాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో శనివారం సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తెలిపిన వివరాలివీ.. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతుల జాబితాను తయారుచేసేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులు శనివారం రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. షేక్ మస్తాన్ అనే రైతు తనకున్న రెండెకరాలతో పథకానికి అర్హత సాధించాడు. ఇదే భూమిని తన కుమార్తె కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లుగా గుర్తించి ఆమెకూ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ఎంపీఈఓ వెన్నా దివ్యను కోరాడు. రేషన్‌కార్డులో మస్తాన్, అతని కుమార్తె ఉండడంవల్ల ఈ పథకం వర్తించదని దివ్య తేల్చి చెప్పారు. దీంతో మస్తాన్ ఆగ్రహంతో దివ్యను జుట్టుపట్టి లాగి చెంపపై కొట్టి కిందపడేశాడు. అడ్డువచ్చిన దివ్య తండ్రి రామకృష్ణారెడ్డిని కూడా మస్తాన్ కొట్టాడు. ఇతనికి మరో ఇద్దరు వ్యక్తులు నబీ సాహెబ్, సైదులు కూడా సహకరించారు. కాగా, దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర రైతులనూ వీరు బెదిరించారు. దీంతో తనపై దాడిచేసిన మస్తాన్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత ఎంపీఈఓ దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను ఎస్ఐ అద్దంకి మధుపవన్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్ తదితరులు ఎంపీఈఓను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉద్యోగులపై దాడిచేస్తే కఠిన చర్యలు విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గర్నెపూడి లెవీ హెచ్చరించారు. బాధితురాల్ని ఆయనతోపాటు మండల వ్యవసాయశాఖ అధికారి ఎం.సంధ్యారాణి పరామర్శించారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు లెవీ చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను నిష్పక్షపాతంగా అమలుచేసే ఉద్యోగులపై దాడులు చేయడం మంచిది కాదని వారిద్దరూ అన్నారు. -
నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు..?
► సూక్ష్మపోషకాల పంపిణీపై వివాదం ► ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడి దౌర్జన్యం ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీల సభ్యుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనల మేరకు సూక్ష్మపోషకాలను పంపిణీ చేసిన ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడు దాదాగిరీ చేశాడు. ‘‘ఏరా..? నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు’’ అంటూ నానా దుర్భాషలాడుతూ కొట్టినంత పని చేశాడు. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది కన్నీటి పర్యంతమవుతూ తమగోడును విలేకరులతో వెల్లబోసుకున్నారు. ఇంతకీ ఏంజరిగిందంటే... ధర్మవరం మండలం ఓబుళనాయునపల్లి గ్రామానికి మంజూరైన జిప్పం, బోరాన్, జింక్ తదితర మైక్రో న్యూట్రిన్స్ ను గురువారం అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ పద్ధతిన ఎంపీఈఓ పోతులయ్య శుక్రవారం పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడు శ్రీరాములు అక్కడి వచ్చి ఎంపీఈఓపై దౌర్జన్యం చేశాడు. తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా... పట్టించుకోలేదు. ‘‘ అంతా మీఇష్టమైతే మేమెందుకు.. మీరు ఏమి పని చేసినా, ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మాకు చెప్పాలి’’ అంటూ నానా దుర్భాషలాడారన్నారు. అదంతా తమకు తెలియదని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులను అడగాలని ఎంపీఈఓ సమాధానమివ్వడంతో కోపోద్రిక్తుడైన జన్మభూమి కమిటీ సభ్యుడు ఎంపీఈఓ పోతులయ్య గొంతుపట్టుకుని భౌతిక దాడికి యత్నించాడు. ప్రత్యేక అవసరాలుకలి్గన వ్యక్తి అన్న కనీస మర్యాద పాటించకుండా ఇలా దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పెత్తనం భరించలేకపోతున్నాం విలేకరులతో మాట్లాడిన పలువురు ఎంపీఈఓలు జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనాన్ని భరించలేకపోతున్నామని, ప్రతి చిన్న విషయం వారికే చెప్పాలని, లేదంటే నానా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. గురువారం ఉదయం రావులచెరువు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరు తనకు ఇన్పుట్ సబ్సిడీ పడలేదని నానాదుర్భాషలాడారని ఓ మహిళా ఎంపీఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి సదరు రైతుకు రెండు చోట్ల భూమి ఉండటంతో అటువంటి వారి వివరాలు అన్నీ జేడీ కార్యాలయానికి పంపామని, అక్కడి నుంచి వారికి అనుమతి లభించాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోకుండా... ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాదని ఆమె తెలిపింది. -
ఎంపీఈఓ పోస్టుల భర్తీకి 12న ఇంటర్వ్యూలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యానశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపీఈఓ పోస్టుల భర్తీకి ఈ నెల 12న జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం..ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మూడో విడతలో 62 ఎంపీఈఓ పోస్టుల భర్తీకి బీఎస్సీ బాటనీ అభ్యర్థులు 239 మందిని ఇంటర్వ్యూకు పిలిచినట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు ఎంపికయిన అభ్యర్థుల వివరాలు కర్నూలు జిల్లా వెబ్సైట్ www.kurnool.gov.inలో పెట్టామని అభ్యర్థులు చూసుకోవచ్చని తెలిపారు. ఇంటర్వ్యూలకు 12న ఉదయం 8 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. -
అంతా నా ఇష్టం!
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ 24 మంది ఎంపీహెచ్‌ఏల తొలగింపు కనీసం నోటీసులూ ఇవ్వని వైనం ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు డీఎంహెచ్ఓ తీరుపై విమర్శలు అనంతపురం మెడికల్ : వైద్య, ఆరోగ్యశాఖలో ఆయనో కీలక అధికారి. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందిపోయి సొంత నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 24 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్–మేల్ పోస్టుల భర్తీకి 2003లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 156 పోస్టులుండగా నలుగురు అభ్యర్థులు లేకపోవడంతో 152 భర్తీ చేశారు. అప్పట్లోనే పదో తరగతి విద్యార్హత ఉన్న వారిని తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 44 మందిని తొలగించి వారి స్థానంలో మెరిట్ ఆధారంగా ఇంటర్ విద్యార్హత ఉన్న వారిని తీసుకున్నారు. తొలగించిన వారు కోర్టుకు వెళ్లడంతో మూడేళ్ల తర్వాత వారందరికీ పోస్టింగులిచ్చారు. అయితే.. అప్పట్లో రూపొందించిన మెరిట్ జాబితాలో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 24 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 14 ఏళ్ల క్రితం విధుల్లోకి తీసుకున్న 44 మందిలో 24 మందిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎంపీహెచ్ఏ–మేల్ పోస్టుల భర్తీ క్రమంలో గతంలో పని చేస్తున్న వారిని తొలగించరాదని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గత నెల 27న మెమో (నంబర్ 7342/జీ2/2015–09) జారీ చేశారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు ప్రాముఖ్యతనిస్తూ ఎంపీహెచ్ఏ–మేల్ అందరినీ ఉద్యోగాల్లో కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంహెచ్ఓలకు డిసెంబర్ 1వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ అరుణకుమారి కూడా ఉత్తర్వులు (ఆర్సీ నంబర్ : 19247/ఈ4–ఎ) జారీ చేశారు. అయినా వీటిని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ బేఖాతరు చేశారు. ఆందోళనబాటలో ఉద్యోగులు ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను తొలగించడంపై ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఇప్పటికే కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సామూహిక నిరాహార దీక్షలకు దిగారు. ఇంత ఏకపక్షమా? 2013లో ఎంపీహెచ్‌ఏగా జాయిన్ అయ్యాను. కుందుర్పి పీహెచ్సీలో పని చేసేవాడిని. ఇప్పుడు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తే ఎలా? డీఎంహెచ్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలి. - శ్రీనివాస్ స్పష్టత కోసం అధికారులను పంపుతున్నా 42 మందిని తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఒకసారి ఉద్యోగులను తీసెయ్యాలని వచ్చింది. మరోసారి 'ఎక్సర్సైజ్' చేయాలని వచ్చింది. రకరకాలుగా ఆదేశాలు వస్తున్నాయి. ఉన్న వారిని తొలగించకపోతే ఆదేశాలు అమలు చేయలేం. గతంలో ఈ పోస్టుల భర్తీ సరిగా లేదు. తొలగించిన వారి జాబితా ప్రభుత్వానికి పంపాం. వీలైనంత వరకు ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తాం. స్పష్టత కోసం సోమవారం కార్యాలయంలోని అధికారులను విజయవాడకు పంపుతున్నాం. - వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
ఎంపీఈఓల సేవలు విశిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : ఎంపీఈఓలు వ్యవసాయశాఖ పరి ధిలో రైతులకు విశిష్ట సేవలు అందిస్తున్నారని ఎంపీఈవోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీహరిరావు అన్నారు. స్థానిక కృషి భవన్లో ఆదివారం జిల్లా ఎంపీఈవోల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎంపీఈఓల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాదబీమా వర్తింపజేయాలని, వేతన చెల్లింపులు నెలవారీగా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఎంపీఈవోల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
ఐదు రోజుల్లో ఆధార్ పూర్తి కావాలి
అనంతపురం అగ్రికల్చర్ : డ్రిప్, స్ప్రింక్లర్లు పొందిన రైతుల నుంచి ఆధార్ సేకరించాలని, ఈ కార్యక్రమం 5వ తేదీలోగా పూర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. ఉద్యానశాఖ ఏడీ సీహెచ్ సత్యనారాయణ, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఎంఐఏవోలు, ఇరిగేషన్ కంపెనీ డీసీవోలు, ఉద్యానశాఖ ఎంపీఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కావడంతో పథకం ప్రారంభమైన 2003–04 ఆర్థిక సంవత్సరం నుంచి 2013–14 సంవత్సరం వరకు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందిన రైతుల నుంచి వివరాలు సేకరించాలన్నారు. 2014–15 నుంచి ఆధార్ తీసుకున్నామన్నారు. అంతకు మునుపుకు సంబంధించి కూడా ఇప్పటికే 50 శాతానికి పైగా ఆధార్ సేకరించామని తెలిపారు. వంద శాతం సేకరించాలని ఆదేశాలు ఉండటంతో వచ్చే ఐదు రోజుల్లో కార్యక్రమాన్ని పూర్తీ చేయాలని ఆదేశించారు. ఇక మీ–సేవాలో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న దరఖాస్తులకు సంబంధించి ప్రాథమిక పరిశీలన చేపట్టాలన్నారు. రైతుల నుంచి డీడీలు కట్టించుకున్న వారం రోజుల్లోపు కార్యాలయంలో ఇవ్వని కంపెనీలకు అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు 7 వేల హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు ఇచ్చామన్నారు. -
ప్రశాంతంగా ఎంపీఈవోల ఇంటర్వ్యూలు
అనంతపురం అగ్రికల్చర్ : స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో బుధవారం జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సమక్షంలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈవో) అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిగాయి. 124 పోస్టుల భర్తీలో భాగంగా తొలిరోజు 98 మందికి జేసీ, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఆత్మ పీడీ డాక్టర్ పి.నాగన్న, ఏరువాక కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్ ఇంటర్వ్యూ చేశారు. గురువారం రెండో రోజు 101 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనున్నారు. -
నేడు, రేపు ఎంపీఈఓ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయశాఖ పరిధిలో దరఖాస్తు చేసుకున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈఓ) అభ్యర్థులకు బుధ, గురువారం) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 124 పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని 231 మందికి కాల్‌లెటర్లు పంపామన్నారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 130 మందికి, 29న (గురువారం) 101 మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. -
20న ఎంపీఈఓ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
అనంతపురం అగ్రికల్చర్ : మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఎంపీఈఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. 76 పోస్టులకు 560 దరఖాస్తులు రాగా వాటిని రెండు దఫాలుగా పరిశీలించి విద్యార్హత, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా 156 మందిని ఎంపిక చేసి ఇంటర్వ్యూలకు పిలిచినట్లు తెలిపారు. కాల్‌లెటర్లు అందుకున్న అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో 20న ఉదయం 9 గంటలకు స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. -
ఎంపీఈఓ ఇంటర్వ్యూలు వాయిదా
అనంతపురం అగ్రికల్చర్ : ఈనెల 9, 10న జరగాల్సిన ఎంపీఈఓ (మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్) ఇంటర్వ్యూలు వాయిదా వేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 124 పోస్టుల భర్తీకి గానూ అర్హులైన అభ్యర్థులకు ఇప్పటికే కాల్‌లెటర్లు పంపామన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామన్నారు. తదుపరి ఇంటర్వ్యూలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. -
రైతు సంక్షేమం గాలికే!
మచిలీపట్నం: జిల్లా వ్యవసాయశాఖలో మల్టీపర్పస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎంపీఈవో,) పోస్టుల భర్తీ ప్రహసనంగా మారింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పోస్టులను భర్తీ చేయకుండా జాప్యం జరుగుతోంది. వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికారుల స్థానంలో ఎంపీఈవోల నియామకాన్ని ప్రభుత్వం 2015లో చేపట్టింది. కృష్ణాజిల్లాకు 346 ఎంపీఈవో పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 2015లోనే ఈ పోస్టుల నియామకం జరిగింది. కాంట్రాక్టు పద్దతిపై పనిచేసే ఎంపీఈవోలకు నెలకు రూ. 8వేలు వేతనంగా ప్రకటించటంతో ఉద్యోగాలు పొందిన కొందరు ఈ వేతనాలు చాలవంటూ మానేశారు. ప్రస్తుతం జిల్లాలో 43 ఎంపీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చర్ బీఎస్సీ, డిప్లమో ఇన్ పాలిటెక్నిక్ (అగ్రికల్చర్) పట్టభద్రులు వీటికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎంపీఈవోలకు నెలకు రూ. 8వేలు వేతనంగా ఇవ్వగా ప్రస్తుతం దీనిని రూ. 12వేలకు పెంచారు. దీంతో ఈ పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ పెండింగే ఖాళీగా ఉన్న 43 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. మిగతా జిల్లాల్లో నియామకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మన జిల్లాలో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. గతంలో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన వారికి పోస్టులు ఇవ్వకుండా, కొత్త నియామకాలు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో రైతులు అవలంభించాల్సిన యాజమాన్య పద్ధతులు, పొలంబడి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టం అంచనా, ప్రభుత్వం ద్వారా రైతులకు ఒనగూరే ప్రయోజనాలను వివరించటం, తదితర విధులు ఎంపీఈవోలవే. కలెక్టర్‌కు నివేదిక పంపాం జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీఈవో పోస్టుల భర్తీపై ’సాక్షి‘ వ్యవసాయాధికారులను సంప్రదించగా, çకలెక్టర్‌కు నివేదిక పంపామని చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఇస్తే గతంలో ఒకటి, రెండు విడతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వటం జరుగుతుదని చెబుతున్నారు. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు అధిక మంది ఉండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదని చెబుతున్నారు. -
ఎంపీఈవో పోస్టులకు ఇంటర్వ్యూలు
గుంటూరు వెస్ట్ : జిల్లాలో బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారుల(ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి శనివారం కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 74 పోస్టులకు గాను జిల్లా వ్యాప్తంగా 324 దరఖాస్తులు అందాయి. అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులు 250 మందిని అర్హులుగా గుర్తించారు. అనంతరం వారందరికీ కలెక్టర్ చాంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ కృపాదాస్, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మావతి, డాట్ సైంటిస్టు రామ్‌ప్రసాద్, ఉద్యానశాఖ ఏడీ రామ్మోహన్ తదితరులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీఈఓ పోస్టులకు ఎంపికైన వారికి త్వరలోనే సమాచారం అందజేస్తామని వ్యవసాయాధికారులు అధికారులు వెల్లడించారు. -
కల సాకారమమ్యే నాటికి తానే కలగా మిగిలింది..
గోకవరం : ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలుగన్న ఓ యువతి.. దాన్ని సాకారం చేసుకోవడానికి అహర్నిశలు శ్రమించింది. తీరా ఆ ఉద్యోగం వచ్చేసరికి తానే ఓ కలగా మిగిలిపోయింది. తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బళ్ల స్వాతి (20) అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదివి ఇటీవల వ్యవసాయ శాఖలో బహుళార్థక విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టు కోసం జరిగిన ఇంటర్వ్యూకు హాజరైంది. అయితే ఆమెను గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వేధించ సాగారు. ఆ క్రమంలో ఈ వేధింపులు తాళలేక గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన స్వాతి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్వాతి తల్లిదండ్రులు తిరుపతి, పాపమ్మ .. సదరు యువకుల వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గోకవరం పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా స్వాతికి ఉద్యోగం వచ్చిందంటూ వ్యవసాయ అధికారుల నుంచి మంగళవారం ఆమె తల్లిదండ్రులకు ఫోను వచ్చింది. దీంతో మరణించిన కుమార్తెను తలచుకుని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఉద్యోగం కోసం స్వాతి రేయింబవళ్లు కష్టపడి చదివిందని, ఉద్యోగం వచ్చిన తరువాత కష్టం తెలియకుండా తమను చూసుకుంటానని చెప్పిందని.... అలాంటింది ఇప్పుడా ఉద్యోగం వచ్చిన వేళ.. తమ చిట్టితల్లి తమకు దక్కకుండా పోయిందని బోరున తిరుపతి, పాపమ్మ విలపించారు.