ఎంపీఈవోను పరామర్శిస్తున్న తహసీల్దార్, ఏవో
దాచేపల్లి (గురజాల) : రైతుభరోసా పథకంలో కౌలురైతు కింద తన కుమార్తె పేరును చేర్చడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పిన పాపానికి విధి నిర్వహణలో ఉన్న వ్యవసాయ శాఖ మహిళా ఎంపీఈఓపై టీడీపీ సానుభూతిపరుడు విచక్షణారహితంగా దాడిచేశాడు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే పథకం వర్తించదని చెబుతున్నా వినకుండా ఎంపీఈఓ జుట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టి కిందపడేశాడు. అడ్డుకోబోయిన ఆమె తండ్రిని సైతం కొట్టాడు. ఇతర రైతులనూ బెదిరించాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో శనివారం సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తెలిపిన వివరాలివీ..
వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతుల జాబితాను తయారుచేసేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులు శనివారం రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. షేక్ మస్తాన్ అనే రైతు తనకున్న రెండెకరాలతో పథకానికి అర్హత సాధించాడు. ఇదే భూమిని తన కుమార్తె కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లుగా గుర్తించి ఆమెకూ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ఎంపీఈఓ వెన్నా దివ్యను కోరాడు. రేషన్‌కార్డులో మస్తాన్, అతని కుమార్తె ఉండడంవల్ల ఈ పథకం వర్తించదని దివ్య తేల్చి చెప్పారు. దీంతో మస్తాన్ ఆగ్రహంతో దివ్యను జుట్టుపట్టి లాగి చెంపపై కొట్టి కిందపడేశాడు.
అడ్డువచ్చిన దివ్య తండ్రి రామకృష్ణారెడ్డిని కూడా మస్తాన్ కొట్టాడు. ఇతనికి మరో ఇద్దరు వ్యక్తులు నబీ సాహెబ్, సైదులు కూడా సహకరించారు. కాగా, దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర రైతులనూ వీరు బెదిరించారు. దీంతో తనపై దాడిచేసిన మస్తాన్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత ఎంపీఈఓ దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను ఎస్‌ఐ అద్దంకి మధుపవన్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్ తదితరులు ఎంపీఈఓను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఉద్యోగులపై దాడిచేస్తే కఠిన చర్యలు
విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గర్నెపూడి లెవీ హెచ్చరించారు. బాధితురాల్ని ఆయనతోపాటు మండల వ్యవసాయశాఖ అధికారి ఎం.సంధ్యారాణి పరామర్శించారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు లెవీ చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను నిష్పక్షపాతంగా అమలుచేసే ఉద్యోగులపై దాడులు చేయడం మంచిది కాదని వారిద్దరూ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment