వ్యాధులే సవాల్‌! | New DMHO For Srikakulam | Sakshi
Sakshi News home page

వ్యాధులే సవాల్‌!

Published Thu, Sep 6 2018 2:41 PM | Last Updated on Thu, Sep 6 2018 2:41 PM

New DMHO For Srikakulam - Sakshi

నూతన డీఎంహెచ్‌వో చెంచయ్యను అభినందిస్తున్న కార్యాలయ సిబ్బంది

రోగాలు పంజా విసురుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. విషజ్వరాలు, డెంగీ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పటికే వివిధ వ్యాధి లక్షణాలతో చాలామంది మృత్యువు ఒడిలోకి చేరారు. వందలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు కొత్త వైద్యాధికారిగా ఎం.చెంచయ్య వచ్చారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత, తగినంత మంది వైద్యులు కూడా లేని సమయంలో బాధ్యతలు చేపట్టిన చెంచయ్య సమస్యల సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాకు కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌వో ఎం.చెంచయ్యకు వ్యాధులు పెను సవాల్‌ విసరనున్నాయి. ఇప్పటి వరకూ జిల్లా వైద్యాధికారిగా పని చేసిన సనపల తిరుపతిరావుకు విశాఖ జిల్లాకు బదిలీ అయింది. ఈయన శ్రీకాకుళం జిల్లా వాసి కావడం.. స్థానిక సమస్యలపై అనుభవం ఉండడంతో వాటిని నెట్టుకొచ్చేవారు. కొత్త డీఎంహెచ్‌వోగా బుధవారం బాధ్యతలు చేపట్టిన ఎం.చెంచయ్య తూర్పుగోదావరి జిల్లా చింతూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జిగా వైద్యాధికారిగా పని చేస్తూ జిల్లాకు వచ్చారు.

జిల్లాలో పరిస్థితి  
కుటుంబ సంక్షేమ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖపరిధిలో 80 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 76 పీహెచ్‌సీలు సొంత భవనాలు కలిగి ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకూ భవనాలు శిథిలావస్థకు చేరాయి. అలాగే రాజపురం, వెంకటాపురం, ఈదుపురం, మాణిక్యపురం పీహెచ్‌సీలు అద్దె భవనాల్లో  నడుస్తున్నాయి. చాలా పీహెచ్‌సీల్లో  సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోగులకు అరకొర వైద్య సేవలే అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది పీహెచ్‌సీలను వైద్యాధికారుల కొరత వేధి స్తోంది. అలాగే 26 నర్సుల పోస్టులు,80కి పైగా ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందిలో చాలామంది స్థానికంగా ఉండడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.

వేధిస్తున్న కిడ్నీ మహమ్మారి!
ఉద్దానంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో  కిడ్నీవ్యాధి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉద్దానం ప్రాంతంలోని కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కిడ్నీ వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజూ..ఏదో ఒక గ్రామంలో ఈ మహమ్మారి బారినపడి ఎవరో ఒకరు చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో అన్వేషించలేదు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఇటీవల అధికారులు చర్యలు చేపట్టినా అనుకున్నస్థాయిలో ఫలితాలు రాలేదు. ఇప్పటి వరకు ఉద్దానం ప్రాంతానికే పరి మితమైన కిడ్నీ వ్యాధులు తాజాగా జిల్లా అంతటా వ్యాపించాయి. గార, శ్రీకాకుళం, లావేరు, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో ఇటీవల కిడ్నీ వ్యాది కేసులు నమోదు నమోదయ్యాయి. ఈ పరిస్థితి వైద్యాధికారులకు సవాల్‌గా మారాయి.

సీజనల్‌ వ్యాధుల విజృంభణ
వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ కేసులు ప్రతిరోజు భారీగా నమోదవుతున్నాయి. వ్యాధుల నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకున్నామని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నప్పటికీ  క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రోగులకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం అందక పోవడంతో వారు  ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత గుర్తించలేకపోవడంతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. చాలామంది జ్వరాలతోనే కన్నుమూశారు. అయితే వ్యాధులతో చనిపోతున్న వారివి సహజ మరణాలుగానే వైద్యాధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 55 డెంగీ, 217 మలేరియా కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు.

అంతంత మాత్రంగానే రక్తపరీక్షలు: జిల్లాలో అంతంత మాత్రంగానే రక్త పరీక్షలు జరుగుతున్నాయి. రక్తపరీక్షల నిర్వహణ ఎన్‌టీఆర్‌ వైద్య పరీక్షల పేరిట మెడాల్‌ సంస్థ నిర్వహిస్తోంది. జిల్లాలో 80 పీహెచ్‌సీలు ఉండగా కేవలం నాలుగు చోట్ల (పొందూరు, పాలకొండ, టెక్కలి, పలాసలలో)మాత్రమే రక్త పరీక్షలు చేసే కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీలో ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ మాత్రమే ఉంటారు. ఆయా పీహెచ్‌సీకి వచ్చే రోగుల సంఖ్య ఆధారంగా 10 శాతం మందికి మాత్రమే రక్తపరీక్షలు నిర్వహిస్తారు. అనివార్య కారణాల వలన రోగి ఏ రోగం బారిన పడ్డాడో తెలియకపోతే సమీప పీహెచ్‌సీల్లోకి వెళ్లి వైద్యం చేయించుకుంటే ఆ రోగికి వచ్చే వ్యాధి తీవ్రతను బట్టి రక్త పరీక్షలు చేయిస్తారు. ఒకరోగి నుంచి సేకరించిన రక్తనమూనాను సంబంధిత కేంద్రం వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి ఆ నివేదికను మరుసటిరోజు రోగికి వెల్లడిస్తారు. దీంతో సరైన ప్రభుత్వ వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి.

చెంచయ్య బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం అర్బన్‌: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన ఎం.చెంచయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ డీఎంహెచ్‌వోగా పని చేసిన డాక్టర్‌ సనపల తిరుపతిరావు నుంచి చెంచయ్య బాధ్యతలను తీసుకున్నారు. చెంచయ్య తూర్పుగోదావరి జిల్లా చింతూరు సీహెచ్‌సీ నుంచి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. కొత్త డీఎంహెచ్‌వో వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి చేరుకోగానే ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి అభినందించారు. కార్యక్రమంలో బాలస్వస్థ్య జిల్లా కో–ఆర్డినేటర్‌ మెండ ప్రవీణ్, అడిషనల్‌ డీఎంహెచ్‌వో వై.వెంకటేశ్వరరావు, డీఐవో బగాది జగన్నాథరావు, డీఎల్‌వో కామేశ్వరప్రసాద్, సీనియర్‌ అధికారి సీహెచ్‌.కృష్ణమోహన్, డీఎంవో వీర్రాజు, కార్యాలయ సిబ్బంది కె.శివప్రసాద్, బమ్మిడి నర్సింగరావు, కరకవలస శ్రీనివాసరావు,  కొయ్యాన శ్రీనివాసరావు, ఆచారి ఉన్నారు.

క్షీణించిన పారిశుద్ధ్యం
జిల్లాలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇటీవలే పంచాయతీ సర్పంచ్‌ల  పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేకాధికారుల పాలనలోకి గ్రామ పంచాయతీలు వెళ్లిపోయాయి. దీంతో పారిశుధ్యం సక్రమంగా జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. చాలా గ్రామంలో తాజా మాజీ సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పంచాయతీల్లో నిధులు కూడా లేవు. దీంతో ప్రత్యేకాధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పారిశుధ్యం పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఎక్కడికక్కడే చెత్త..చెదారం పేరుకుపోతున్నాయి. దోమలు విజృంభించి వ్యాధులకు కారణమవుతున్నాయి.  

డీఎంహెచ్‌వో కార్యాలయంలో మార్పు వచ్చేనా?
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోని చాలామంది సిబ్బంది పనితీరుపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకూ పని చేసిన డీఎంహెచ్‌వో సిబ్బందిని బాగానే కట్టడి చేశారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. కొత్త అధికారి వస్తున్నారని తెలియడంతో కొంతమంది సిబ్బంది తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారనే గుసగుసలు కార్యాలయంలో వినిపిస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల్లోనూ, బదిలీల్లోనూ, డిప్యుటేషన్‌లు ఇవ్వడంలోనూ కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరిని కొత్త అధికారి ఎలా అదుపులోకి తీసుకువస్తారో వేచి చూడాల్సిందే. అలాగే జిల్లాలో విజృంభించిన వ్యాధుల నుంచి ప్రజలను కొత్త డీఎంహెచ్‌వో చెంచయ్య ఎలా కాపాడుతారో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement