- ఐదు నెలలుగా ఏఎన్‌ఎంలకు జీతాల్లేవు
- ఫోన్‌ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓకు బాధితుల వినతి
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి విభాగంలో డబ్బులు ఇవ్వందే వైద్యం చేయడం లేదని, పేద రోగులకు సరైన వైద్యం అందించడంలో ఆసుపత్రి డాక్టరు, సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంగారెడ్డిలోని హనుమాన్ నగర్‌కు చెందిన రాకేష్ ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్‌సింగ్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా ఎక్స్‌రే విభాగంలో దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫోన్‌ఇన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్‌సింగ్ పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఆయనకు సమస్యలను విన్నవించారు.
ఐదు నెలల నుంచి ఏఎన్‌ఎంల జీతాలు రావడం లేదని, జీతాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దుబ్బాకకు చెందిన నరేందర్ పేర్కొన్నారు సిద్దిపేట మండలం చిన్నగౌడవెల్లి ఆస్పత్రిలో హిమోఫీలియా మందులు గత రెండు నెలల నుంచి అందుబాటులో లేవని గ్రామానికి చెందిన నరేష్ ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ పీహెచ్‌సీలో ఉన్న ఖాళీలలను వెంటనే భర్తీ చేయాలని చందూలాల్ సూచించారు.