సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అవసరమైన చోట కొత్త పోస్టుల మంజూరు, అవసరం లేనిచోట రద్దు చేయడంతోపాటు వైద్యులు అధికంగా ఉన్నచోట నుంచి తక్కువగా ఉన్నచోటుకు బదిలీ చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించాయి.
కొత్తగా డీఎంహెచ్‌వో పోస్టులు
ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 19 జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఒక డీఎంహెచ్‌వో పర్యవేక్షించడం కష్టమైన వ్యవహారం. దీంతో హైదరాబాద్‌కు మరో ఐదు డీఎంహెచ్‌వో, ఇతర జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో పోస్టులు అవసరమని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఈ మేరకు కొత్తగా 19 డీఎంహెచ్‌వో పోస్టులకు కేబినెట్ అనుమతి ఇచ్చిందని, మొత్తం డీఎంహెచ్‌వోల సంఖ్య 38కి పెరిగినట్టేనని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నుంచి హైదరాబాద్‌కు ఆరుగురు డీఎంహెచ్‌వోలు, మిగతా అన్ని జిల్లాలకు ఒక్కో డీఎంహెచ్‌వో ఉంటారు. త్వరలోనే హైదరాబాద్‌కు ఐదుగురు అదనపు డీఎంహెచ్‌వోల నియామకం జరగనుందని.. దీనితో నగరంలో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని.. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై పర్యవేక్షణ సులువు అవుతుందని అధికారులు అంటున్నారు.
అవసరమైన చోటకి వైద్యం, సిబ్బంది
వైద్యారోగ్యశాఖలో హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనలు చాలాకాలం నుంచి ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి మించి వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఉంటుంటే.. కొన్ని ఆస్పత్రుల్లో అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు. చాలామంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల్లోనే ఉండిపోయారు.
గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది కొరతతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఈ క్రమంలో ఎక్కువగా ఉన్న చోటి నుంచి తక్కువగా ఉన్న చోట్లకు సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రతిపాదించింది. దీనికి కూడా సర్కారు ఆమోదం తెలిపిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కౌన్సెలింగ్ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి.
అవసరం లేని పోస్టుల రద్దు
లెప్రసీ వంటి పలు విభాగాల్లోని కొన్ని పోస్టులకు ప్రస్తుతం కాలం చెల్లిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. వాటిలోని చాలా మందికి పనిలేదని, పలుచోట్ల ఆయా పోస్టుల అవసరం లేదన్న అభిప్రాయమూ ఉందని చెప్తున్నాయి. అటువంటి పోస్టులను అవసరమైన చోటికి మార్చడమో, రద్దు చేయడమో చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలిసింది. కొన్నిచోట్ల లిఫ్ట్ ఆపరేటర్లు అవసరం లేదని భావిస్తున్నారు. ఇలా విభాగాల వారీగా అవసరం లేని పోస్టులను గుర్తించి.. రద్దు చేయడమా, ఇతర చోట్ల సర్దుబాటు చేయడమా, పోస్టుల విధులు మార్చడమా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment