Three OGH Doctors Stuck In Himachal Pradesh Floods Are Safe - Sakshi
Sakshi News home page

మంత్రి హరీష్‌ చొరవ.. హిమాచల్‌లో హైదరాబాద్‌ వైద్యులు క్షేమం

Published Wed, Jul 12 2023 3:01 PM | Last Updated on Wed, Jul 12 2023 3:16 PM

Hydearabad Doctors Trapped In Himachal Pradesh floods Are Safe - Sakshi

సాక్షి, సుల్తాన్‌బజార్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి వరదల్లో చిక్కుకున్న ముగ్గురు హైదరాబాద్‌  వైద్యులు క్షేమంగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వైద్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలి వరదల్లో చిక్కుకున్నారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ బానోతు కమల్‌లాల్, డాక్టర్‌ రోహిత్‌ సూరి, డాక్టర్‌ శ్రీనివాస్‌లు కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో పీజీ పూర్తి చేశారు. హాస్టల్‌లో ఉంటూ ఉస్మానియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. పీజీ పూర్తయిన సందర్భంగా వీరు హిమాచల్‌ప్రదేశ్‌కు టూర్‌కు వెళ్లారు. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ముగ్గురు వైద్యులు మనాలి వరదల్లో చిక్కుకున్నారని తోటి వైద్యులకు సమాచారం అందింది. వారిని మళ్లీ సంప్రదించేందుకు ప్రయత్నించగా ముగ్గురి ఫోన్లూ స్విచ్ఛాఫ్‌ వచ్చాయి. 

రంగంలోకి మంత్రి హరీష్‌ రావు..
దీంతో వైద్యుల తల్లిదండ్రులు, తోటి వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల ఆచూకీ కోసం జూనియర్‌ డాక్టర్ల సంఘం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన హరీశ్‌రావు వారు ఎక్కడ? ఎలా? ఉన్నారో తక్షణమే తెలుసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మనాలిలోని ప్రభుత్వ అధికారులను సంప్రదించిన తెలంగాణ అధికా­రులు.. వైద్యులు క్షేమంగా ఉన్నట్లు మంత్రికి ఫోన్‌లో సమాచారాన్ని అందించారు. వైద్యులను సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ‘నాకు సీఎం కావాలనే ఆశ లేదు’.. బీఆర్‌ఎస్‌ మంత్రి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement