సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్..చిన్నారుల్లో సైతం ప్రబలుతున్న ఓ వ్యాధి. పిల్లల కాలేయాలను కమ్ముకుంటున్న ఫ్యాటీ లివర్ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తును చేజేతులా రోగాలకు అప్పగించినట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బొద్దుగా ముద్దుగా మెరిసిపోతూ మడత నలగని దుస్తుల్లో పాఠశాలలకెళ్లొచ్చే చిన్నారుల్ని చూసి మురిసిపోవడం మాత్రమే కాదు వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన ఓ అధ్యయనం చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం.
పెద్దల్లోనే కాదు..
హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ల బృందం నగరంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో అధ్యయనం నిర్వహించింది. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డీ)తో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా పెద్దలే ఈ వ్యాధి బాధితులుగా ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం తప్పని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
ఏమిటీ ఫ్యాటీ లివర్?
కాలేయం (లివర్)లో అధిక మొత్తంలో కొవ్వు (ఫ్యాట్) పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఈ వ్యాధి (స్టీటోసిస్) చాలావరకు పెద్దల్లో ఉంటుంది. అయితే ఆరోగ్యవంతమైన లివర్‌లోనూ స్వల్పంగా కొవ్వు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన లివర్ బరువులో 5 నుంచి 10 శాతం మధ్యకు కొవ్వుపెరుగుతుందో అప్పుడది సమస్యగా మారుతుంది.
ఆహారం.. వ్యాధుల భారం
సోడా, చాక్లెట్లు నూడుల్స్, బిస్కెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు వీరు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా యూరప్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పడింది. పిల్లలు తినే జంక్ ఫుడ్ చాలావరకు దీనికి కారణమవుతోంది..‘అని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అధ్యయనం కూడా చిన్నారులతో సహా 30 శాతం మందిలో ఈ వ్యాధి విస్తృతి ఉన్నట్లు తాజాగా గుర్తించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇది తక్కువగా ఉన్నట్లు తేల్చింది.
‘ఆట స్థలాలు లేక పాఠశాలల పిల్లల్లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.రవాణా సౌకర్యాలు కూడా నడకను తగ్గించి వారిలో ఊబకాయానికి ఊతమిస్తున్నాయి..‘అని ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ అంటున్నారు. ‘సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనాల్లో కనుగొన్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇది తక్కువ..‘అని ఏఐజీ బృందంలోని ఓ వైద్యుడు చెప్పారు.
జంక్ ఫుడ్‌పై అవగాహన పెంచాలి
చిన్నపిల్లల ఆహారంలో చిప్స్, బర్గర్స్, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ వంటివి భాగం కాకుండా చూడాలి. వీటివల్ల శరీరంలోని బాక్టీరియా మారిపోయి ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుంది. అందువల్ల జంక్ ఫుడ్ చేసే చేటుపై కూడా చిన్నారుల్లో అవగాహన పెంచాలి. కూరగాయలు, పెరుగు మంచివనే చిన్న చిన్న విషయాలు తరచు చెబుతుండాలి. సన్నగా ఉండే చిన్నారుల్లోనూ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. కాబట్టి సన్నగా ఉన్నంత మాత్రాన జంక్ ఫుడ్ తినమని చెప్పకూడదు. – డా.నాగేశ్వర్‌రెడ్డి, చైర్మన్, ఏఐజీ ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment