liver
-
కాలేయంపై ’పని’భారం
మానవ శరీరంలోనే అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం.. పని భారంతో తల్లడిల్లుతోంది. క్రమం తప్పిన జీవన విధానాన్ని సమన్వయం చేయలేక సతమతం అవుతోంది. అవసరానికి మించిన తిండి.. అవసరమైన శ్రమ ఏమాత్రం చేయని దినచర్య కాలేయంపై పెను భారం మోపుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీవన విధానంలోని మార్పులు కాలే యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరా బాద్ శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో ఏఐజీ సీనియర్ హెపటాలజిస్ట్ పీఎన్ రావు, యూఓహెచ్ప్రొఫెసర్లు కల్యాణ్కర్ మహదేవ్, సీటీ అనిత, రీసెర్చ్ స్కాలర్లు భార్గవ, నందిత ప్రమోద్ పాల్గొన్నారు. వీరి పరిశోధనలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలోని వారి ఆరోగ్యాలను పరిశీలించారు. – సాక్షి, హైదరాబాద్ 71% మంది» అధిక బరువు (ఊబకాయం)తో 71 శాతం మంది బాధపడుతున్నారు. 34 శాతం మందిలో జీవక్రియల సమస్యలు ఉన్నాయి.»ఎక్కువ పని గంటలు, తీవ్ర పని ఒత్తిడి, వేళాపాళా లేని తిండి, నిద్రలేమితో కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు.» ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం, ఎక్కువ గంటల పని, ఒత్తిడి వల్ల జీవక్రియలో ఇబ్బందులు తలెత్తి, ఫ్యాటీలివర్ సమస్య (ఎంఏఎఫ్ఎల్డీ) వచ్చే ప్రమాదం పెరుగుతోంది.84% మంది» ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం దాదాపు84 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది.పరిశోధనలో తేలిన అంశాలుజీవ క్రియల్లో సమస్యలు ఉన్న వారిలో ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.కాలేయంలో 5 శాతం కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారని డాక్టర్ పీఎన్ రావు తెలిపారు. సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం వాపు, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే ఐటీ ఉద్యోగులు జీవన శైలిని మార్చుకోవాల్సిన తక్షణ అసవరం ఉందని సూచించారు. వ్యాయామంతోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని పేర్కొన్నారు. -
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
డైరెక్టర్ని పొట్టన పెట్టుకున్న జాండిస్? ఎందుకు వస్తుంది? లక్షణాలు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అకాలమరణం విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర్లు వ్యాధితో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలు ఏంటి? ఇది ప్రాణాంతకమేనా తదితర వివరాలను తెలుసుకుందాం. పచ్చకామెర్లు సరైన సమయంలో చికిత్స తీసుకోనట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధి. తొలి దశలోనే గుర్తించక పోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలోని లివర్ లేదా కాలేయం చాలా పనులను నిర్వరిస్తుంది. వైరస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగం, తదితర కారణాల చేత కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జాండిస్ వ్యాధి వస్తుంది. ఎసిటమైనోఫెన్, పెన్సిలిన్, గర్భనిరోధక మాత్రలు , స్టెరాయిడ్స్ వంటి మందులు కూడా కాలేయ వ్యాధికి కారణం కావచ్చు. ఈ కామెర్లు నవజాత శిశువులు మొదలు ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రధానంగా రక్తంలోని బిలిరుబిన్ను ఉత్పత్తి పెరిగిపోతోంది. ఫలితంగా కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. లక్షణాలు ♦ బరువు తగ్గడం, ఆకలి తగ్గుతుంది. మత్తుగా ఉండటం, ♦ శరీరం పసుపు పచ్చ కలర్లోకి మారిపోతుంది. కళ్ళు , మూత్రం కూడా పసుపు రంగులోకి మారతాయి. ♦ కడుపులో మంట ,కడుపు నొప్పి ♦ ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో బాగా నొప్పి , వికారం వాంతి వచ్చినట్టు ఉంటుంది. ♦ చలి, జ్వరం ♦ రక్తపు వాంతులు మద్యపానం, ఇతర కారణలు కొన్ని ఇతర కారణాలతోపాటు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లు వచ్చేందుకు దారి తీస్తాయి. కాలేయం నుంచి పేగుల్లోకి పైత్య రసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో రాళ్లు, నిర్మాణపరమైన లోపాలు, కేన్సర్ సోకినా కామెర్లకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు కామెర్ల వ్యాధిని నిర్లక్ష్యంచేస్తే రక్తపు వాంతులతోపాటు, రోగి కోమాలోకి వెళ్లి చనిపోయేప్రమాదం కూడా ఉంది. అందుకే అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం నోట్: సమతుల ఆహారాన్ని తీసుకుంటూ, మద్యపానం, ధూమపానం, గుట్కా లాంటి చెడు అటవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఎప్పటికపుడు గమనించుకుంటూ ఉండాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి సమయంకేటాయించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా, సమస్య ఏదైనా వైద్యుల ద్వారా నిర్ధరించుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. -
పాపులర్ బాడీ బిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
పాపులర్ బాడీ బిల్డర్, ప్రముఖ వైద్యుడు రోడాల్ఫో డువార్టే రిబీరో డాస్ శాంటోస్ (33) కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. బ్రెజిల్కుచెందిన ఈయన సోషల్ మీడియాలో బాగా పాపులర్. అయితే అనాబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల అతను మరణించాడనే వార్తలు సోషల్‌మీడియలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను రొడాల్ప్ స్పోర్ట్స్ మెడిసిన్ అడ్ ఫార్మకాలజీ క్లినిక్ ఖండించింది. కాలేయంలో ట్యూమర్,రక్తస్రావం కారణంగా సావో పాలోలో రోడాల్ఫో నవంబర్ 19న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు CNN బ్రసిల్ నివేదించింది. ఆదివారం (నవంబర్, 19) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడని , కాలేయంలోని అడెనోమా ఫలితంగా రక్తస్రావం కారణంగా ఆయన గుండె ఆగిపోయిందని తెలిపింది. తన రోజువారీ జీవితంలోని ఫోటోలతోపాటు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. ఇలాగే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న కాబోయే భార్య కరోలిన్ సాంచెస్‌తో వీడియోలను కూడా ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. తన రోగులు, ఇతర అథ్లెట్లు, బాడీ బిల్డర్ల అద్భుతమైన ఫలితాలను కూడా చూపించేవారు. ఇన్స్టాగ్రామ్ స్టార్‌కు 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Caroline Sanches (@carolinessanches) సావో పాలోకు దక్షిణాన మోమాలో ఉన్న ఈయన క్లినిక్ ఉంది. సాంచెస్ అక్కడ పోషకాహార నిపుణురాలుగా పనిచేస్తున్నారు. కాబోయే భర్త ఆకస్మిక మరణం తరువాత సాంచెస్ అతను గిటార్ వాయిస్తూ ‘మన మధ్య ఉన్న ప్రేమ, సాన్నిహిత్యం’ అంటూ పాడుతున్న వీడియోను ఎప్పటి ఎప్పటికీ శాశ్వతం అంటూ పోస్ట్ చేశారు.కాగా డాక్టర్ శాంటోస్ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో నుండి స్పోర్ట్స్ మెడిసిన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో డిగ్రీలు పొందారు. View this post on Instagram A post shared by Rodolfo Duarte (@rodolfo.drsantos) -
ఆల్కహాల్ తాగని వారిలోనూ లివర్ సమస్యలు.. అదొక్కటే పరిష్కారం
కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా అదుపు తప్పకుండా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం సహాయపడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో చదివేద్దాం. మన శరీరావయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకేఒక అవయవం కాలేయం. అందుకే వైద్యులు దీనిని ఫ్రెండ్లీ ఆర్గాన్ అని పిలుస్తారు. అటువంటి కాలేయాన్ని మనం ఒక మంచి స్నేహితుడిలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం కాదులే అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం దాపురించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. వారిలో లివర్ సిర్రోసిస్ కేసులు కూడా ఉంటున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కహాల్ తాగే వారితో పాటు, ఆల్కాహాల్ తాగని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సి, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్నార్మల్గా ఉన్న వారిలో వస్తున్నాయి. ఫాటీలివర్ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అది కాస్తా సిర్రోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిర్రోసిస్‌కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని, లివర్ ఫంక్షన్లో తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు. 40ఏళ్లు దాటితే.. శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫాట్ ఎక్కువగా ఉన్న జంక్ఫుడ్స్ తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. వయస్సు 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును కచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రో స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. లివర్ వ్యాధులకు కారణాలివే... శ్రమ లేని జీవన విధానం ఆహారపు అలవాట్లు పెరుగుతున్న మధుమేహులు ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం ఆల్కహాల్ వ్యసనం ఫాటీ లివర్‌ను అశ్రద్ధ చేయొద్దు పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు ఏడాదికోసారి పరీక్షలు తప్పనిసరి వీటికి దూరంగా ఉండాలి ►మంచి పోషకాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ► మద్యానికి దూరంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తాగేవారిలో కాలేయం త్వరగా పాడవుతుంది. ► కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అతిగా తినొద్దు. ► చేపలు, అవిసె గింజలు, అక్రోట్లు,పొట్టుతీయని ధాన్యాలు వంటివి డైట్లో ఉండేలా చూసుకోవాలి. ► చక్కెర ఎక్కువగా ఉండే కూల్డ్రింకులు, పానీయాలకు దూరంగా ఉండాలి. ► ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు. ఇవి పాటిస్తున్నారా? వాల్ నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకడోస్‌లు ఎక్కువగా తీసుకోవడం మంచిది నీరు ఎక్కువ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు,గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లివర్ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో కాలేయ సమస్యలతో వస్తున్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు ఆల్కహాల్ తాగే వారిలోనే లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకేది. కానీ ఇప్పుడు కొలస్ట్రాల్ కారణంగా నాన్ ఆల్కహాలిస్టుల్లో కూడా సిర్రోసిస్ చూస్తున్నాం. ప్రతిరోజూ వ్యాయామంతో పాటు, ఆహార నియమాలు పాటిస్తూ, శరీరంలో కొలస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. – డాక్టర్ బీఎస్వీవీ రత్నగిరి, అసోసియేట్ ప్రొఫెసర్, గాస్ట్రో ఎంట్రాలజీ -
గాంధీ వైద్యుల మరో ముందడుగు
గాందీఆస్పత్రి : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి చెందిన కాలేయాన్ని సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రి వైద్యులు సేకరించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల ప్రకారం... గాం«దీఆస్పతితో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌అయ్యాడు. అతని కుటుంబసభ్యుల అంగీకరించడంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి పలు అవయవాలు సేకరించాలని వైద్యులు నిర్ణయించారు\ లివర్ ఒక్కటే పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, మిగతా అవయవాల పనితీరు బాగోలేదని వైద్యపరీక్షల్లో తేలింది. జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్న జాబితా ప్రకారం ఏబీ బ్లడ్ గ్రూపుకు చెంది లివర్ సమస్యతో బాధపడేవ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. గాంధీ వైద్యులు బ్రెయిడ్ డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి లివర్‌ను సేకరించి (రిట్రీవల్) ప్రత్యేక వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అక్కడ చికిత్స పొందుతున్న మరోవ్యక్తికి (ట్రాన్స్‌ప్లాంట్) అమర్చారు. లివర్‌ను సేకరించడం ఇదే గాందీఆస్పత్రిలో మొదటిసారని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లివర్‌ను విజయవంతంగా సేకరించి మరో వ్యక్తికి అమర్చి పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, గాంధీ, ఉస్మానియా వైద్యులు, సిబ్బందిని వైద్యమంత్రి హరీష్ రావు అభినందించారు. -
హెపటైటిస్-బి అంటే ఏంటి? సూదులు, సిరంజీలతో ఇంత డేంజరా?
ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దానిసంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతీయడం ఆరంభిస్తుంది. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. 1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని! 2. ఈ వ్యాధిని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవటం ద్వారా వ్యాధి నివారించుకునే అవకాశం ఉంది. 3. వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 4. సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం. 5. హెపటైటిస్-బి సోకిన వారు ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఇది సోకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. హెపటైటిస్ - బి సెక్స్ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి. ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం చాలా అవసరం! పెళ్లి చేసుకోవచ్చా? టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్ -బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్అఫెక్టెడ్ క్యారియర్స్ కూడా) పిల్లలను కూడా కనొచ్చు. అలా చేస్తేనే బిడ్డకు క్షేమం గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్, మరో తొడకి హెపటైటిస్-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు. తప్పకుండా టీకాలు 1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. 2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి. 3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి. 4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి , - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్!
సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్..చిన్నారుల్లో సైతం ప్రబలుతున్న ఓ వ్యాధి. పిల్లల కాలేయాలను కమ్ముకుంటున్న ఫ్యాటీ లివర్ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తును చేజేతులా రోగాలకు అప్పగించినట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బొద్దుగా ముద్దుగా మెరిసిపోతూ మడత నలగని దుస్తుల్లో పాఠశాలలకెళ్లొచ్చే చిన్నారుల్ని చూసి మురిసిపోవడం మాత్రమే కాదు వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన ఓ అధ్యయనం చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. పెద్దల్లోనే కాదు.. హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ల బృందం నగరంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో అధ్యయనం నిర్వహించింది. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఎఫ్ఎల్డీ)తో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా పెద్దలే ఈ వ్యాధి బాధితులుగా ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం తప్పని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఏమిటీ ఫ్యాటీ లివర్? కాలేయం (లివర్)లో అధిక మొత్తంలో కొవ్వు (ఫ్యాట్) పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఈ వ్యాధి (స్టీటోసిస్) చాలావరకు పెద్దల్లో ఉంటుంది. అయితే ఆరోగ్యవంతమైన లివర్‌లోనూ స్వల్పంగా కొవ్వు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన లివర్ బరువులో 5 నుంచి 10 శాతం మధ్యకు కొవ్వుపెరుగుతుందో అప్పుడది సమస్యగా మారుతుంది. ఆహారం.. వ్యాధుల భారం సోడా, చాక్లెట్లు నూడుల్స్, బిస్కెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు వీరు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా యూరప్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పడింది. పిల్లలు తినే జంక్ ఫుడ్ చాలావరకు దీనికి కారణమవుతోంది..‘అని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అధ్యయనం కూడా చిన్నారులతో సహా 30 శాతం మందిలో ఈ వ్యాధి విస్తృతి ఉన్నట్లు తాజాగా గుర్తించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇది తక్కువగా ఉన్నట్లు తేల్చింది. ‘ఆట స్థలాలు లేక పాఠశాలల పిల్లల్లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.రవాణా సౌకర్యాలు కూడా నడకను తగ్గించి వారిలో ఊబకాయానికి ఊతమిస్తున్నాయి..‘అని ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ అంటున్నారు. ‘సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనాల్లో కనుగొన్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇది తక్కువ..‘అని ఏఐజీ బృందంలోని ఓ వైద్యుడు చెప్పారు. జంక్ ఫుడ్‌పై అవగాహన పెంచాలి చిన్నపిల్లల ఆహారంలో చిప్స్, బర్గర్స్, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ వంటివి భాగం కాకుండా చూడాలి. వీటివల్ల శరీరంలోని బాక్టీరియా మారిపోయి ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుంది. అందువల్ల జంక్ ఫుడ్ చేసే చేటుపై కూడా చిన్నారుల్లో అవగాహన పెంచాలి. కూరగాయలు, పెరుగు మంచివనే చిన్న చిన్న విషయాలు తరచు చెబుతుండాలి. సన్నగా ఉండే చిన్నారుల్లోనూ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. కాబట్టి సన్నగా ఉన్నంత మాత్రాన జంక్ ఫుడ్ తినమని చెప్పకూడదు. – డా.నాగేశ్వర్‌రెడ్డి, చైర్మన్, ఏఐజీ ఆసుపత్రి -
బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి.. హెపటైటిస్-బీకి వ్యాక్సిన్ ఉంది.. కానీ,
హెపాటో లేదా హెపాటిక్ అని పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కాస్త తొలగించినా... తిరిగి పెరిగేలా... పూర్తిగా పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాల్లో అతి పెద్దదైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం దాదాపు కిలోన్నర వరకు బరువుంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. విష పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దాన్ని ‘హెపటైటిస్’ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్లు... ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిల్లో బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి. రక్తమార్పిడి, అరక్షిత శృంగారం వల్ల, అలాగే తల్లి నుంచి బిడ్డకు...ఇవి సోకే ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ఉంది. కానీ... హెపటైటిస్–సి కు వ్యాక్సిన్ లేదు. అప్పటికే హెపటైటిస్–బి ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందర పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉంటే ఏ వయసువారైనా వేయించుకోవచ్చు. ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటువైద్యం వంటి సొంతవైద్యాలు చేసుకోకుండా... కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్ఫెక్షన్స్, ఫ్యాటీ లివర్, లివర్ యాబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి కాలేయ వ్యాధులున్నప్పుడు... హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకితే... వాటి ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత కాలేయం గాయపడినట్లుగా లేదా గట్టిగా మారడం (సిర్రోసిస్), అటు తర్వాత కాలేయ క్యాన్సర్‌కు దారితీయడం ఎక్కువమందిలో జరుగు తుంది. కాలేయంలోనే మొదలయ్యే హెపాటో సెల్యులార్ కార్సినోమా అనే క్యాన్సర్... దేహంలో ఇతర ్రపాంతాల్లో క్యాన్సర్ వచ్చి అది కాలేయానికి పాకే మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్, లంగ్ క్యాన్సర్... ఇలాంటి ఏ క్యాన్సర్ అయినా కాలేయానికి పాకే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు. కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వల్ల ఇతర సమస్యలుగా ΄÷రబడే అవకాశం ఎక్కువ. కడుపునొప్పి, బరువుతగ్గడం, కామెర్లు, ΄÷ట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా... హెపటైటిస్ బి, సి వైరస్లు పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా... రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం, కొలెస్ట్రాల్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ (ఏఎఫ్‌పీ)ను రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు ట్రిపుల్ ఫేజ్ సీటీ, ఎమ్మారై, పీఈటీ స్కాన్లు చేయించాలి. లివర్ బయాప్సీ చేయించడం వల్ల క్యాన్సర్, దాని స్టేజ్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) సైజు రెట్టింపు అయితే... మరికొందరిలో ఏడాది పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించినా... లివర్ సిర్రోసిస్‌కు గురికావడం వల్ల చాలామందిలో సర్జరీ కుదరకపోవచ్చు. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైటేషన్ (టీఏసీఈ), రేడియో అబ్లేషన్,ప్రోటాన్ బీమ్ థెరపీ, క్రయో అబ్లేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతుల్లో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి, మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురికాకుండా ఉంటే సర్జరీయే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే... కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడంతో పాటు, గతంలో ఎప్పుడైనా ఇతర క్యాన్సర్స్‌కు గురయి, చికిత్స తీసకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. చాలామందిలో హెపటైటిస్–బి పాజిటివ్ ఉన్నా, ఏళ్లతరబడి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ (హెచ్‌బీఐజీ) ఇప్పించడం మంచిది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం... శరీరంలో ప్రవేశించినట్లు అనుమానం ఉన్నా ముందుజాగ్రత్త చర్యగా ఆ సంఘటన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బీఐజీ ఇంజెక్షన్ తీసుకుంటే హెపటైటిస్–బి పాజిటివ్ కాకుండా కాపాడుకోవచ్చు. - Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి!
తరచూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? ఆలస్యం వద్దు తెల్లముల్లంగితో వండిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటే... ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు తేలిగ్గా నివారితమవుతాయి. దీనికి ఓ కారణం ఉంది. రెఫానస్ సెటైవస్ యాంటీఫంగల్ పెటైడ్ డ్–2 (సంక్షిప్తంగా ఆర్ఎస్ఏఎఫ్పీ–2) అనే ఓ ప్రోటీన్ కారణంగా తెల్లముల్లంగి ఫంగల్ వ్యాధుల్ని తేలిగ్గా నివారించగలుగుతుంది. అంతేకాదు... ఇది మంచి డీ–టాక్సిఫైయర్ కావడంతో దేహంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది. తద్వారా కాలేయం ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. కామెర్లతో బాధపడిన వాళ్లలో ఎర్రరక్తకణాలు నాశనం కాకుండా కా పాడుతుంది. వాటిని కా పాడటమంటే పోషకాలు, ఆక్సిజన్ అందేలా చూసి ప్రతి కణాన్నీ కా పాడినట్టే. మామూలుగానైతే డయాబెటిస్తో బాధపడేవారు దుంపకూరల్ని తినకూడదంటారు. కానీ ముల్లంగిలోని పీచు చక్కెరను చాలా నెమ్మదిగా వెలువడేలా చేస్తుంది కాబట్టి ఇది డయాబెటిస్ ఉన్నవారికీ మేలు చేసే దుంపగా పేరుతెచ్చుకుంది. -
కాలేయాన్ని భద్రపరిచే పరికరం
కోయంబత్తూరు శాస్త్రవేత్తల ఆవిష్కరణ టీ నగర్ (చెన్నై): కాలేయాన్ని 20 గంటల పాటు భద్రపరిచే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు పీఎస్జీ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్, పీఎస్జీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్లు దీన్ని రూపొందించారు. పరికరం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన డా.స్వామినాథన్, డా.జోసెఫ్ జాన్, డా.కె.వెంకట్రామన్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సాధారణంగా కాలేయాన్ని ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల్లోగా రోగులకు అమర్చాల్సి ఉంటుందని, లేకపోతే అది చెడిపోతుందని తెలిపారు. కాలేయంలోని కణాలు క్రమంగా మృతి చెందుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాలేయాన్ని 20 గంటలపాటు భద్రపరిచే నూతన పరికరాన్ని తాము అభివృద్ధి చేశామని వివరించారు. ఈ పరికరంలోని విడిభాగాలు చాలా వరకు భారత్‌లోనే తయారయ్యాయని, మోటార్, అల్ట్రా సౌండ్ సెన్సార్ విడిభాగాలు మాత్రం జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. -
లివర్ పెరిగిందంటున్నారు... ఎందుకిలా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. రాత్రివేళల్లో కడుపునొప్పిగా అనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – కె. రామమూర్తి, ఇంకొల్లు మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా అనే వివరాలు తెలియజేయలేదు. కొన్నిరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. అలాగే ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు మీకు కడుపునొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. నా వయసు 35 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. తొలుత గుండెకు సంబంధించిన సమస్యేమోనని అనుమానించి, కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – ధరణికుమార్, నూజివీడు మీరు తెలిపిన వివరాల ప్రకారం... మీరు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారా కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
మద్యంతో కాలేయం చెడితే....
కండరాలు పట్టేయడానికి చాలా కారణాలుంటాయి! నా వయసు 36 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. కండరం మరీ బిగుసుకుపోయినప్పుడు, నొప్పి తగ్గడానికి కాస్త మసాజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ సమస్యనుంచి బయట పడటానికి పరిష్కారం చెప్పండి. – కె. రాజ్‌కుమార్, హైదరాబాద్ ఇలా కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇంకొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ మద్యంతో కాలేయం చెడితే....కాపాడే చికిత్స లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్! మావారి వయసు 54 ఏళ్లు. గడచిన 25 ఏళ్లు నుంచి మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. దీంతో మా సొంత ఊరికి వచ్చేశాం. ఇప్పటికీ సర్జరీ చేయించుకోవచ్చా? దీనితో సమస్యలు ఏవైనా ఉన్నాయా? దయచేసి వివరంగా తెలపండి. – ప్రభావతి, నంద్యాల మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి ఒక్కటే ఆయనను కాపాడగలదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. కాలేయ వ్యాధుల చికిత్స ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో ఆధునికత సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అత్యధిక శాతం విజయవంతమవుతుండటం వల్ల కాలేయ వ్యాధుల సక్సెస్రేట్పై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మరోసారి మీ డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడండి. ఇప్పుడు మన దగ్గర ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స గతంలో మాదిరిగా ఖరీదైనదేమీ కాదు. మీరు దగ్గర్లోని అన్ని వసతులు ఉండే అన్ని సౌకర్యాలు గల పెద్ద ఆసుపత్రికి వెళ్లి, అక్కడి డాక్టర్లు సూచించిన విధంగా మీవారికి నిరభ్యంతరంగా, నిర్భయంగా శస్త్ర చికిత్స చేయించవచ్చు. డాక్టర్ పి.బాల చంద్రన్ మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
అవి తెగ లాగించేస్తున్నారా...అయితే జాగ్రత్త!
ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ పళ్లు తీసుకోవడం మనకందరికీ తెలిసిందే.. బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికంటూ ఎక్కువగా, పండ్లు, పళ్లరసాల పైనే ఆధారపడే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే పండ్లను, జ్యూస్ లను, కార్న్ సిరప్, దీనితోపాటు ఎక్కువ తేనెను సేవించడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచి బరువు ఇంకా బాగా పెరుగుతారని ఓ ఆశ్చర్యకరమైన పరిశీలనలో తేలింది. అంతేకాదు నరాల వ్యాధికి గురికాడం, లివర్ పాడైపోవడం లాంటి ప్రమాదమూ సంభవించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. శరీర మెటబాలిజం, నరాల పనితీరుపై రెండురకాల సుగర్ ప్రభావాలపై ఆడ ఎలుకమీద అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం కోసం, ఆడ ఎలుకలలో గ్లూకోజ్ (శరీరంలో కార్బొహైడ్రేట్స్ విచ్ఛిత్తి తర్వాత సహజంగా కనిపించే చక్కెర రూపం) ఫ్రక్టోజ్ (పండ్లు మరియు పండ్ల రసాల్లోఉండే చక్కెర ) సాధారణ ఆహారానికి బదులుగా ద్రవరూపంలో ఎనిమిది వారాల పాటు అందించారు. గ్లూకోజ్ తినిపించిన ఎలుకల్లో కంటే ఫ్రక్టోజ్ ఇచ్చిన ఎలుకల్లో మొత్తం కేలరీల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, కారణంగా కాలేయం బరువు పెరగడంతో , కాలేయంలో కొవ్వును కరిగించే శక్తి క్షీణించడం, రక్తపోటును ప్రభావితం చేసే బృహద్ధమని పనితీరు మందగించడాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఫలితంగా అధిక బరువుతోపాటు, గుండె వ్యాధి, మధుమేహం లాంటి ఇతర ప్రమాదకారక దీర్ఘ వ్యాధుల్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తేల్చారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా శరీర బరువులో మార్పులు ఉన్నప్పటికీ కేవలం ఫ్రక్టోజ్ గ్రూపు లో మాత్రమే ఎక్కువ బరువు పెరిగిందని తెలిపారు. హార్ట్ అండ్ సర్క్యులేటరీ ఫిజియాలజీ సమర్పించిన ఈ పరిశోధనా పేపర్ ను అమెరికన్ జర్నల్ ప్రచురించింది. అయితే దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రభావం చూపేవాటిల్లో తీపి పదార్థాల మూలంగా శరీరంలో చేరే కాలరీస్ మాత్రమే కాదని గుర్తించాలన్నారు. -
కాలేయం కలిపింది ఇద్దరినీ..!
కోడ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేస్తున్న క్రిస్ డెంప్సీ తన గదిలో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో క్రుగర్ సోదరుడు జాక్ తన సోదరి పరిస్థితి గురించి సహోద్యోగులతో చెప్పి బాధపడటం డెంప్సీ విన్నాడు. వెంటనే జాక్ దగ్గరకు వెళ్లి.. కాలేయం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పాడు. క్రిస్ ఎప్పుడూ క్రుగర్‌ను చూడలేదు. అస్సలు ఆమె ఎవరో కూడా తెలియదు. అయినా సరే తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఈ విషయం తెలిసి క్రుగర్ నోట మాట రాలేదు. ఆనందంతో ఆమె కళ్లు తడిసిపోయాయి. 2014 మార్చి 20..ఇల్లినాయీలోని ఫ్రాంక్‌ఫోర్ట్.. 27 ఏళ్ల హీదర్ క్రుగర్ కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇంక తాను జీవించేది కొన్ని నెలలు మాత్రమే అన్న విషయం అప్పుడే ఆమెకు తెలిసింది. లివర్ కేన్సర్ నాలుగో దశలో ఉంది. వెంటనే కాలేయ మార్పిడి చేస్తే తప్ప ఆమె జీవించే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు. లివర్ కోసం తమ పేరు నమోదు చేసుకుని ఎదురుచూస్తున్నవారి జాబితా చాంతాడంత ఉంది. అందులో తన వంతు వచ్చేసరికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. ఇక మిగిలి ఉన్న అవకాశం ఎవరిదైనా కాలేయంలోని కొంత భాగాన్ని తీసి క్రుగర్కు అమర్చడమే. కానీ అందుకు ఎవరు ముందుకు వస్తారు? ‘ఇక కొన్ని రోజుల్లో నా జీవితం ముగిసిపోనుంది. ఆ విషయం ఊహిస్తేనే చాలా భయంగా ఉంది’ అంటూ వణుకుతున్న చేతులతో క్రుగర్ తన డైరీలో రాసుకుంది. 2016 అక్టోబర్ 5..ఇల్లినాయీలోని ఫ్రాంక్‌ఫోర్ట్.. తెల్లని పెళ్లి గౌనులో క్రుగర్ మెరిసిపోతోంది. ఆమె మోములో చిరునవ్వు తాండవిస్తోంది. పక్కనే సూటులో క్రిస్.. బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ‘నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన వ్యక్తివి నువ్వు.. నా నవ్వుకు, ఆనందానికి కారణం నువ్వు.. మూతపడబోయిన నా కనులకు మళ్లీ కలలు కనే అవకాశం కల్పించిందీ నువ్వే.. ఈ నవ్వు, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి’ అంటూ డైరీలో రాసుకుంది. -
లివర్ వ్యాధి చికిత్సలో ముందడుగు
కోల్‌కతా: ఇటీవలి కాలంలో కాలేయ సమస్యలు పెరిగిపోతున్నాయి. కాలేయ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్డీ) ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ముఖ్యంగా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించే ఈ ఎన్ఏఎఫ్డీలో లివర్‌లో కొవ్వు పరిమాణం పెరగడంతో ప్రాణాంతకంగా మారుతోంది. భారత్‌లోని వయోజనుల్లో సుమారు 30 శాతం మంది ఎన్ఏఎఫ్ఎల్డీ బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ దీనికి ప్రత్యేకంగా ఎలాంటి వైద్య చికిత్స అందుబాటులో లేదు. దీనిపై పరిశోధనలు నిర్వహిస్తున్న సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ శాస్త్రవేత్తలు.. కణంలోని సీఓపీ-1 ప్రొటీన్‌ను నిరోధించడం ద్వారా లివర్ ఫ్యాట్ పరిమాణం గణనీయంగా తగ్గుతోందని గుర్తించారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రయోగదశలోనే ఉందని.. మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన పార్థా చక్రవర్తి వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలను అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్(ఏడీఏ) జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు. -
పరిమితికి మించి ఔషదాలు వాడితే లివర్ జబ్బులు
–ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎస్కే ఆచార్య కర్నూలు(హాస్పిటల్): పరిమితికి మించి ఔషదాలు వాడితే లివర్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఎయిమ్స్(ఢిల్లీ) గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగాధిపతి డాక్టర్ ఎస్కే ఆచార్య చెప్పారు. ఆదివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని నూతన క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగం ఆధ్వర్యంలో ‘లివ్ అప్–2016’ పేరున నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే ఆచార్య మాట్లాడుతూ హెపటైటిస్ బి,సి వ్యాధులతో పాటు ఆల్కహాలు, టీబీ మందులు, షుగర్, మలేరియా, డెంగీ వ్యాధికి వాడే మందులతో లివర్జబ్బులు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా హెపటైటిస్ ఎ,బి,సి వైరస్లు, పలు రకాల ఇన్ఫెక్షన్లతో భారత దేశంలో లివర్ ఫెయిల్యూర్లు సంభవిస్తున్నాయని వివరించారు. కొందరు ఆత్మహత్య చేసుకునేందుకు క్రిమిసంహారక మందులు, నిద్రమాత్రలు వాడుతున్నారని, దీంతో కాలేయం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. అనంతరం లివర్ వ్యాధులకు సంబంధించి డాక్టర్ ధీమన్(చండీగడ్), డాక్టర్ సేతుబాబు, డాక్టర్ పీఎన్ రావు, డాక్టర్ జార్జికురియన్(పాండిచ్చేరి) ఉపన్యసంచారు. సదస్సుకు రాష్ట్రం నుంచే గాక తెలంగాణ నుంచి పలువురు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్ బి. శంకరశర్మ, డాక్టర్ వెంకటరంగారెడ్డి, డాక్టర్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బయటి పదార్థాలు తింటే కామెర్లు తప్పదా?
గ్యాస్ట్రో కౌన్సెలింగ్ ఇటీవల కురుస్తున్న వర్షాలను చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేసే వృత్తిలో ఉన్నాను. కలుషితమైన బయటి ఆహారాలు తింటే కామెర్లు వస్తాయని అందరూ అంటున్నారు. ఇది వాస్తవమేనా? నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సుదర్శన్, వరంగల్ కామెర్లు అని చెప్పేది ఒక వ్యాధి కాదు. ఇది కలుషితమైన నీటి వల్ల వచ్చే హెపటైటిస్లలో రకాలైన హెపఐటిస్-ఏ, హెపటైటిస్-ఈ వైరస్లు వచ్చినప్పుడు కనిపించే ఒక లక్షణం మాత్రమే. సాధారణంగా కలుషితమైన నీళ్లలోని ఈ వైరస్ల వల్ల కాలేయం దెబ్బతిని కామెర్లు కనిపిస్తుంటాయి. కామెర్లలో రక్తంలోని బిలురుబిన్ పాళ్లు పెరుగుతాయి. రక్తంలో బిలురుబిన్ పెరిగినప్పుడు దాని రంగు కనుగుడ్లు, చర్మంలోని మ్యూకస్ పొరల్లో పేరుకుపోతుంది. దాంతో అవి పచ్చగా కనిపిస్తాయి. మామూలు పరిస్థితుల్లో వ్యర్థాలను కాలేయం సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి అది మలంలోకి వెళ్లి బయటకు వెళ్తుంది. మలం పసుపు రంగులో కనిపించడానికి కారణం ఆ వ్యర్థాలే. అయితే కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల బైలురుబిన్, బైలివర్దిన్ అనే పదార్థాలు ఒంట్లోనేరుకుపోతాయన్నమాట. ఇదే పచ్చదనం కళ్లలోనూ కనిపిస్తుందన్నమాట. కామెర్లు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు... కళ్లు పచ్చబడతాయి మూత్రం పసుపు రంగులోకి మారుతుంది మలం బూడిదరంగులో వస్తుంది జ్వరం, ఒళ్లునొప్పులు, ఆకలి తగ్గడం, దురదలు, వాంతులు కనిపిస్తాయి కాలేయానికి జరుగుతున్న నష్టం కనిపించకపోతే కామెర్లు తీవ్రతరమవుతాయి. అప్పుడు పాదాల వాపు, నిద్రపట్టకపోవడం, రక్తపు వాంతులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సాధారణంగా బయటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. మీ వృత్తి కారణంగా మీరు ఇంట్లో వండిన పదార్థాలను తినలేరు కాబట్టి ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయండి. మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగండి. మద్యం అలవాటుకు, పొగతాగే అలవాట్లకు దూరంగా ఉండండి పరిశుభ్రమైన పరిసరాల్లోనే ఉండండి. చెట్ల మందులు, పసర్ల వంటి నాటు మందులు వాడకండి. - డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
బీమాకు.. హెపటైటిస్ అడ్డుకాదు!
కీళ్ల నొప్పులు, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... ‘హెపటైటిస్ బీ’ పరీక్షలు చేయించమని సలహా ఇస్తారు. ప్రధానంగా లివర్ దెబ్బతినడంతో పాటు పలు రకాల జబ్బులకు దారితీసే ఈ వ్యాధికి అపరిశుభ్రత, సురక్షితం కాని శృంగార విధానాల వరకూ పలు కారణాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది రోగులతో చైనా తరువాత ఇండియా ఈ వ్యాధి విషయంలో రెండో స్థానం లో ఉందని ఇటీవలే ఒక సర్వే తెలిపింది. అయితే హెపటైటిస్‌కు గురయిన వ్యక్తి జీవిత బీమా రక్షణ అవకాశాన్ని కోల్పోతాడని చాలా మంది భావిస్తుం టారు. ఇదెంతమాత్రం నిజం కాదు. వారు కూడా జీవిత బీమాకు అర్హులే. వ్యక్తులు జీవిత బీమా పొం దేందుకు అవకాశం లేని కొన్ని ప్రాణాంతక వ్యాధుల (కోవర్డ్ డిసీజెస్) జాబితాలోకి హెపటైటిస్ రాదు. అయితే కొన్ని విషయాలు మాత్రం గమనించాలి. ♦ వాస్తవ కవరేజ్ ఎంత? ప్రీమియం వ్యయాలెంత? వంటివి వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. వ్యాధి తీవ్రత, గత చికిత్స రికార్డు, మెడికల్ హిస్టరీ ఇవన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి. ♦ ఎలాంటి చికిత్స తీసుకున్నాడు? భవిష్యత్తులో తీసుకోబోయే చికిత్స విధానాలేంటి? వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నారా? అనేవి బీమా కంపెనీలు పరిశీలిస్తాయి. ♦ ఏ వయసులో ఈ వ్యాధి వచ్చింది? లివర్ పనితీరు పరీక్షల (ఎల్ఎఫ్టీ) రీడింగ్స్ ఏమిటి? వ్యాధి వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిందా? మీరు వ్యాధిని తగ్గించుకోవటానికి ఎంత కృషి చేస్తున్నారు? మీరు వాడుతున్న మందులేంటి? వంటి అంశాలపై మీ ప్రీమియం, కవరేజీ ఆధారపడి ఉంటాయి. రిస్క్ అధికంగా ఉంటే... అధిక ప్రీమియం చెల్లించాలి. పూర్తిగా వ్యాధి తగ్గిన వారు మామూలు పాలసీలు, సగటు ప్రీమియం రేటుకు పొందే వీలూ ఉంది. -
కాలేయ మార్పిడి
విశాఖ విమానాశ్రయం.. సమయం ఆదివారం రాత్రి ఏడు గంటలు ఎవరో ముఖ్యమైన వ్యక్తి వస్తున్నట్టు విమానాశ్రయం అంతా హడావుడిగా ఉంది. పోలీసులు, విమానాశ్రయ సిబ్బందిలో ఆదుర్దా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వాతావరణంలోనే తిరుపతి నుంచి ప్రత్యేక విమానం దూసుకొచ్చి రన్‌వేపై ఆగింది. విమానం ఆగీ ఆగగానే, తలుపులు తెరుచుకున్న వెంటనే.. ప్రముఖులెవరూ దిగలేదు కానీ.. ప్రత్యేక యూనిఫారంలో ఉన్న కొందరు వ్యక్తులు ఏదో ఓ ప్రత్యేకమైన బాక్స్‌ను పట్టుకుని పరుగులు తీస్తున్నట్టు దిగడం కనిపించింది. అంతా ఉత్కంఠగా చూస్తూ ఉండగానే, వారు అక్కడే ఆగి ఉన్న ఓ వాహనంలోకి చేరడం, పోలీస్ ఎస్కార్ట్‌తో ఆ వాహనం దూసుకు పోవడం క్షణాల్లో జరిగిపోయాయి. పోలీస్ వాహనం సైరన్ మోగుతుండగా ట్రాఫిక్ పోలీసులు విజిల్స్ ఊదుతూ, రోడ్ల మీద ఒక్క అడ్డంకి కూడా లేకుండా చేస్తూ ఉండగా, ఈ వాహనం ఎన్ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, అడవి వరం మీదుగా బీఆర్టీఎస్ రోడ్డుపై మెరుపులా దూసుకుపోయింది. అదే వేగంతో ముడసర్లోవ చేరువలోని అపోలో ఆస్పత్రి వాకిట్లో ఆగింది. వాహనం తలుపులు తెరిచిన వెంటనే అప్పటికే అక్కడ ఆతతగా వేచి ఉన్న వైద్యులు పెట్టెతో పాటు లోనికి పరుగులు తీయగానే.. ఓ బహత్ ప్రయత్నం మొదలైంది. ఆ పెట్టెలో వచ్చింది ఎంతో విలువైన కాలేయం కాగా.. ఆస్పత్రికి దానిని ఆఘమేఘాలపై చేర్చిన వెంటనే అపోలోలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స మొదలైంది. ఆరిలోవ: ఉత్కంఠభరిత వాతావరణంలో విశాఖలోని అపోలో ఆస్పత్రి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు వేదికైంది. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆరిలోవ ప్రాంతం పెదగదిలి వద్ద గల అపోలో ఆస్పత్రి ఇందుకు కేంద్రమైంది. ఈ శస్త్ర చికిత్స కోసం కాలేయాన్ని తిరుపతిలో ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆఘమేఘాలపై విశాఖలోని అపోలోకు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం నుంచి అపోలో వరకు కాలేయాన్ని తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర పోషించారు. అనుకొన్న సమయం కంటే కొన్ని నిముషాల ముందుగానే అస్పత్రికి కాలేయం చేరేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇదీ నేపథ్యం విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన ‘జీవన్‌దాన్’ స్కీమ్‌లో సభ్యుడుగా చేరాడు. విజయవాడలో వైద్యులు కాలేయ మార్పిడి అవసరమని నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ స్కీంలో భాగంగా రోగి కుటుంబ సభ్యులు తిరుపతిలో ఓ ఆస్పత్రిని సంప్రదించి కాలేయం సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొన్నారు. దీని ప్రకారం అపోలోలో కాలేయ మార్పిడి చేయడానికి ఇక్కడి వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన ప్రకారం ఆదివారం వేకువ జామున రోగి అపోలోలో చేరాడు. కాలేయాన్ని తిరుపతి నుంచి ఇక్కడకు ప్రత్యేక విమానంలో తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి చేరడానికి ట్రాఫిక్ నియంత్రణకు అపోలో నిర్వాహకులు ట్రాఫిక్ పోలీసుల సహకారం కోరారు. దాంతో పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. విమానాశ్రయం నుంచి గోపాలపట్నం, సింహాచలం, ముడసర్లోవ మీదుగా అపోలోకి చేరేవిధంగా పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అన్ని కూడళ్లలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో సాయంత్రం 7.30 గంటలకు చేరాల్సిన కాలేయం ఐదు నిముషాల ముందుగానే ఆస్పత్రికి చేరింది. ఇలా ప్రయాణం తిరుపతిలో కాలేయంతో ప్రత్యేక విమానం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరింది. విశాఖ విమానాశ్రయానికి 7 గంటలకు చేరుకొంది. విమానాశ్రయం ద్వారం ముందు సిద్ధంగా ఉన్న అపోలో అంబులెన్స్‌లోకి కాలేయం ఉన్న ప్రత్యేక బాక్స్‌ను సిబ్బంది ఎక్కించి అక్కడ 7.04 గంటలకు బయలదేరారు. అంబులెన్స్ విమానాశ్రయం నుంచి 7.10 గంటలకు ఎన్ఏడీ కూడలికి దూసుకొచ్చింది. అక్కడ నుంచి గోపాలపట్నం మీదుగా 7.18 గంటలకు సింహాచలం చేరుకుంది. కేవలం 7 నిముషాల్లో (7.25 గంటలకు) ముడసర్లోవ మీదుగా పెదగదిలి వద్ద అపోలో ఆస్పత్రికి అంబులెన్స్ చేరింది. అంటే 18 కిలోమీటర్లు 21 నిమిషాల్లో ప్రయాణించింది. వెంటనే సిబ్బంది ఆగమేఘాలపై మూడో ఫ్లోర్లో ఉన్న ఆపరేషన్ థియేటర్‌కు చేర్చారు. అప్పటికే సిద్ధమైన వైద్య సిబ్బంది 7.28 నిముషాలకు ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఆపరేషన్ పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. విశాఖలో అపోలోలో కాలేయం మార్పిడి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు. -
కాలేయం ఖల్లాస్
జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే హెపటైటిస్... ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. హెపటైటిస్‌లో ఎ, బి, సి, డి, ఇ, జి అనే రకాలు ఉన్నాయి. హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో దాదాపు 50 కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు దారితీస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ ఎనిమిదో స్థానంలో ఉంది. హెపటైటిస్-బి, హెపటైటిస్-సి ముదిరిపోతే లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి. సకాలంలో నియంత్రించకుంటే హెపటైటిస్ మొత్తం కాలేయాన్నే ఖల్లాస్ చేసేస్తుంది. హెపటైటిస్ ఏ రకానికి చెందినదైనా, ఇది కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే వ్యాధి. సకాలంలో గుర్తించి, తగిన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. హెపటైటిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో చాలావరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది ముదిరితే పచ్చకామెర్లు, ఆకలి తగ్గుదల, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో వైరస్ వల్ల హెపటైటిస్ తలెత్తుతుంది. అరుదుగా కొన్ని సందర్భాల్లో పారాసెటిమాల్ వంటి నొప్పి నివారణ మందులు, పారిశ్రామిక వ్యర్థాలు, మొక్కలకు చెందిన విష పదార్థాలు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా హెపటైటిస్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా హెపటైటిస్ కొనసాగితే, కాలేయం మొద్దుబారడం, బిరుసెక్కడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి. చివరకు లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితులూ వాటిల్లుతాయి. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ సోకుతుంది. అయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, పరాన్న జీవుల వల్ల, మితిమీరిన మద్యం అలవాటు వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మద్యం అలవాటు లేకపోయినా, కొందరిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్ఏఎఫ్ఎల్) వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అరుదుగా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల, కాలేయానికి గాయం కావడం వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా గుర్తించాలి చాలా సందర్భాల్లో హెపటైటిస్ సోకినా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందువల్ల ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యమవుతుంది. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా, లివర్ బయాప్సీ ద్వారా హెపటైటిస్‌ను గుర్తిస్తారు. పరిశుభ్రత పాటించడం, కలుషితమైన నీటికి, ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా చాలా వరకు హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. హెపటైటిస్-సి, హెపటైటిస్-ఇ మినహా మిగిలిన రకాల హెపటైటిస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నందున ముందుగానే వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా చాలా వరకు రక్షణ పొందవచ్చు. వ్యాధి ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చు. ఆర్థికభారం అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను హెపటైటిస్ వ్యాధి ఆర్థిక వ్యవస్థపై పెను భారం మోపుతోంది. పనిచేసే వయసులో ఉన్న వ్యక్తికి హెపటైటిస్ సోకితే కనీసం 27 పనిదినాలు నష్టపోవాల్సి వస్తుంది. చాలా దేశాల్లో హెపటైటిస్ చికిత్స కారణంగా ఎదురవుతున్న ఆర్థికభారంపై కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, అమెరికా ఆర్థికరంగంపై హెపటైటిస్ కారణంగా ఏటా 650 కోట్ల డాలర్ల (రూ.43,595 కోట్లు) భారం పడుతున్నట్లు అంచనా. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పోల్చుకుంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే హెపటైటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రపంచానికి పెనుసవాళ్లలో ఒకటిగా నిలుస్తున్న హెపటైటిస్పై అవగాహన కల్పించేందుకు 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘హెపటైటిస్‌ను నివారించండి: అది మీ చేతుల్లోనే ఉంది’ నినాదంతో ప్రచారం చేపడుతోంది. నివారణ జాగ్రత్తలు * వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లను క్రిములకు దూరంగా ఉంచుకోవాలి. * ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు మరొకరు వాడకుండా ఉండాలి. ఆస్పత్రులలో డిస్సోజబుల్ సిరంజీలు, సూదులు వాడాలి. * రక్తమార్పిడి చేసే ముందు రక్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధులేవీ లేవని నిర్ధారించుకోవాలి. * వ్యాధి సోకిన వారితో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. * కలుషితమైన ఆహారానికి, నీటికి దూరంగా ఉండాలి. హెపటైటిస్ వాస్తవాలు * హెపటైటిస్-బి, హెపటైటిస్-సి మాత్రమే లివర్ కేన్సర్‌కు దారితీస్తాయి. హెపటైటిస్-ఎ వల్ల లివర్ కేన్సర్ సోకే అవకాశం లేదు. * రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారికి హెపటైటిస్-ఎ ఒకవేళ సోకినా, ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా దానంతట అదే నయమైపోతుంది. * కలుషితమైన నీరు, ఆహారం వల్ల హెపటైటిస్-ఎ సోకుతుంది. * రక్తం, ఇతర శరీర స్రావాలు, మ్యూకస్ ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకుతుంది. * హెపటైటిస్-బి సోకినవారిలో 90 శాతానికి పైగా చిన్నారులే. ఈ వైరస్ సోకిన తల్లుల నుంచి వారికి ఈ వ్యాధి సంక్రమిస్తోంది. లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకే అవకాశాలు ఉన్నా, అవి చాలా అరుదు. * గర్భిణిగా ఉన్నప్పుడు హెపటైటిస్ సోకితే, గుర్తించిన తర్వాత వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, పుట్టే పిల్లలకు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు. * హెపటైటిస్-బి సోకిన వారిలో 25 శాతం మందికి మాత్రమే సిర్రోసిస్ లేదా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన వారు చికిత్స తర్వాత సాధారణ జీవితం గడిపే అవకాశాలు ఉంటాయి. * హెపా-బి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే లివర్ కేన్సర్ సోకకుండా బయటపడవచ్చు. * హెచ్ఐవీ సోకిన వారికి హెపటైటిస్-సి సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. * ఒకరికి వాడిన సూదులు, రేజర్లు మరొకరికి వాడటం, రక్తమార్పిడి వంటి కారణాల ద్వారా కూడా హెపటైటిస్-సి సోకుతుంది. -
పునర్జమ్మ
-
లివర్ దెబ్బతింటే...
లివర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. గృహిణిని. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్ పూర్తిగా పాడైపోయిందనీ, అందువల్లనే నేను తరచుగా అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, వైజాగ్ లివర్ పాడవడానికి అనేక కారణాలున్నాయి.ఎక్కువ శాతం మంది హెపటైటిస్- బీ, హెపటైటిస్-సి వైరస్ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్ బ్లడ్ టెస్ట్స్ నిర్వహించి మీ లివర్ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి. ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ ప్రక్రియ అంటారు. ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్ ఆర్గాన్ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్ లభించే అవకాశం ఉంది. కెడావర్ ఆర్గాన్ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్ డోనార్’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది. కాకపోతే లివర్ అనేది చాలా సున్నితమైన అవయవం. కాబట్టి అధునాతనమైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ నిర్వహిస్తే రిస్క్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్ స్పెషలిస్ట్‌ను కలవండి. డాక్టర్ బాలచంద్రమీనన్ చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. ఎత్తు ఐదు అడుగులు. బరువు 92 కేజీలు. నా బరువు తగ్గడానికి ఆయుర్వేద మందులు, ఆహారం గురించి తెలియజేయగలరు. - అరుణాగాయత్రి, హైదరాబాద్ భౌతిక లక్షణాల్లో మనిషి మనిషికీ తేడాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇవి వారి ‘ప్రకృతి, సార, సత్వం’ లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. (అంటే శరీరతత్వం, సప్తధాతువుల్లోని భేదం, మానసిక తత్వం). మీ ఎత్తునుబట్టి మీరు ఉండాల్సిన దానికంటే సుమారు 35 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. హైపోథైరాయిడిజం కుషింగ్ సిండ్రోమ్, పీసీఓడీ, రక్తహీనతల వంటి ప్రాథమిక రోగాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కూడా అధిక బరువుకు కొన్ని కారణాలు. అవి లేనప్పుడు మన బరువు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటుంది. స్థౌల్య కారణాలు: శారీరక శ్రమ లేకుండటం, పగటిపూట అధిక నిద్ర, కఫవృద్ధికర ఆహార సేవన... అంటే గుర్వాహారం (కొవ్వులు, మధుర ద్రవ్యాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం) (మాధవ నిదానం: అవ్యాయామ దివాస్వప్న శ్లేష్మలాహార సేవినః మధురోన్న రసః ప్రాయః స్నేహాత్ మేదః ప్రవర్ధయేత్) లక్షణాలు: ఆకలి, దప్పిక ఎక్కువగా ఉండటం, శరీరం లావెక్కడం, ఉత్సాహం లేకపోవడం వంటివి. చికిత్స: ఈ చికిత్స నియమాలు రోగికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎలాగంటే... ఉదాహరణకు గుర్వాహారం తినకూడదు, వ్యాయామం చాలా అవసరం (స్థూలకాయం వల్ల ఇది ప్రాణసంకటంగా ఉంటుంది). స్థౌల్యం తగ్గాలనే ప్రగాఢ కాంక్ష రోగికి కలిగేట్టు స్ఫూర్తినివ్వాలి (నిరుత్సాహం స్థూలకాయుల్లో ప్రధాన లక్షణం). అందుకే చరక మహర్షి స్థౌల్యాన్ని అత్యంత నిందితావస్థగా ఉటంకించాడు. ఈ సందర్భంలో వాగ్భటుడు ‘స్థౌల్యం కంటే కృశత్వమే వరం, స్థూలునికి మందుల్లేవు’ అని అతిశయోక్త్యలంకారంలో చెప్పాడు. (కార్శ్య మేవ వరం స్థౌల్యాత్, నహి స్థూలస్య భేషజం). ఈ చికిత్సలో ఆహార విహారాలు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఔషధాలది మూడో స్థానం మాత్రమే. 1. ఆహారం: పోషక విలువలుండాలి; కొవ్వులు మధురరసాయలు ఉండకూడదు. కాబట్టి ఉడికించని పచ్చి ఆహారం మంచిది. అవి... మొలకలు, క్యారట్, బీట్రూట్, దోసకాయ, టమాటా వంటి సలాడ్సు, తాజా ఫలాలు, కూరగాయల పచ్చిరసాలు. 2. వండిన ఆహారం: ఉప్పు, నూనెలు లేకుండా ఉడికించిన కూరగాయలు, పుల్కాలు, ముడిబియ్యపు అన్నం, పొట్టుతో కూడిన పప్పులు, ఆకుకూరలు. 3. పానీయాలు: గంజి, జావలు, ఉలవచారు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని నీరు. ఇలాంటి లఘ్వాహారంతో ఆకలిని నియంత్రించి జయించాలేగానీ... ఆకలిని అణచివేసే ద్రవ్యాల్ని ప్రయోగించడం శాస్త్రవిరుద్ధం. ఉప్పుని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. స్థౌల్యహర ద్రవ్యాలు: పసుపు, వెల్లుల్లి, గోధుమలు, బార్లీ, ఉలవలు, వేడినీరు. విహారం: ఏదో ఒక రూపంలో చెమట పట్టేలా తగినంత పరిశ్రమ చేయాలి. క్రమక్రమేణా వ్యాయామాలను పెంచాలి. పగలు నిద్రపోవద్దు. ప్రాణాయామం రెండుపూటలా తప్పనిసరిగా చేయాలి. ఔషధాలు: త్రిఫల / నవక గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 మేదోహర విడంగాది లోహం (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 తిప్పతీగ, తుంగముస్తలు, శొంఠి త్రవ్యాలతో చేసిన కషాయం రోజూ పరగడుపున 30 మిల్లీలీటర్లు తాగాలి. పంచకర్మలు: ఉద్వర్తనం (చూర్ణాలతో నలుగుపెట్టడం) స్వేదకర్మ (చెమట పట్టేట్టు చేయడం) అవసరాన్ని బట్టి వమన, విరేచన, వస్తికర్మల వల్ల గణనీయమైన ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. గమనిక: బరువు తగ్గడమనేది క్రమబద్ధంగా జరగాల్సిన దీర్ఘకాలపు ప్రక్రియ. రాత్రికి రాత్రి బరువు తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. అది అశాస్త్రీయం, ప్రమాదభరితం. అధికబరువు వల్ల గుండెపోటు, పక్షవాతం రావచ్చు. ఆయాసం, నీరసం, సంభోగశక్తి తగ్గిపోవడం వంటి ఉపద్రవాలుంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్తవహించడం శ్రేయస్కరం. అది మన చేతుల్లోనే ఉంది. మొండిగా, అదేపనిగా ఉపవాసాల వల్ల ప్రయోజనం ఉండదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
నేను.. మీ పాంక్రియాస్‌ని!
నేను గ్రే అండ్ పింక్ కలర్లో ఉంటాను. అచ్చం నోటి నుంచి బయటకు చాపిన నాలుక ఆకృతిలో సుమారు 15 సెంటీమీటర్ల పొడవుంటాను. దాదాపు 85 గ్రాముల బరువుంటాను. నేను కడుపులో ఉంటాను. వెన్నెముకకు కాస్త లోపల కాలేయం, కిడ్నీలు, పెద్ద పేగుకు దగ్గర్లో ఉంటాను. ఆనంద్ తిన్న గుట్టల కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో నేనూ పాలుపంచుకుంటూ ఉంటాను. నేను ఆనంద్ క్లోమ గ్రంథి (ప్యాక్రియాస్)ని. నేను చాలా బిజీగా పనిచేస్తుంటాను. నా నుంచి స్రవించే హార్మోన్లు లేకపోతే ఆనంద్ తిన్నది జీర్ణం కాదు. ఆనంద్ ఎప్పుడూ ఆహారం అందని వ్యక్తిలా ఎండిపోయినట్లుగా అవుతాడు. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా, ఆనంద్ గుండె కొట్టుకున్నప్పుడల్లా... ఆ కణాల మాదిరిగానే అతడిలోని కణాలన్నింటికీ శక్తి కావాలి. ఆ శక్తిని సరఫరా చేయడంలో నేను తోడ్పడుతుంటాను. ఇదే కాదు, మరో కీలకమైన పని కూడా చేస్తుంటాను. నిజానికి నేను ఒకే ఒక గ్రంథిని కాదు. ఒకే ప్యాకింగ్‌లో లభ్యమయ్యే రెండు గ్రంథులం మేము. రెండు స్రావాలను ఆనంద్ రక్తంలోకి పంపుతూ ఉంటాం. నాలోని ఒక స్రావం ఆనంద్‌లోని ఆహారం నుంచి శక్తిని పుట్టించేందుకు దోహదం చేస్తుంటుంది. ఇక మరో స్రావం అయిన ఇన్సులిన్ శక్తి అందే పని పూర్తయ్యాక ఆ ప్రక్రియను అడ్డగిస్తుంది. ఇలా అనుక్షణం ఆనంద్ రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇదే జరగకపోతే ఇప్పుడు చాలామందిలో వచ్చే డయాబెటిస్ సమస్య ఆనంద్‌కు వస్తుంది. జీర్ణ ప్రక్రియ కోసం నా పని... ఆహారం జీర్ణం చేసే ప్రక్రియలో భాగంగా నేను దగ్గరదగ్గర రోజుకు ఒక లీటరుకు పైగా జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంటాను. విచిత్రం చూడండి... నా బరువు 85 గ్రాములే గానీ... నా నుంచి రోజూ లీటరుకు పైగానే స్రావాలు వస్తుంటాయన్నమాట. అన్నవాహిక లోంచి కిందికి పోయే క్రమంలో ఆహారం మెత్తగా దాదాపు ద్రవరూపంలో ఉండే ప్రవాహంలా ఉండి, అసిడిక్‌గా ఉంటుంది. మీరు ‘అసిడిటీ, అసిడిటీ’ అంటూ పొట్టలో ఊరే యాసిడ్‌ను నిందిస్తుంటారుగానీ... ఆహారం... అందునా ప్రత్యేకంగా ప్రొటీన్లు జీర్ణం కావాలంటే ఆ యాసిడ్ ఊరక తప్పదు. అదే యాసిడ్ ప్రవాహం పేగుల్లోకి వెళ్తే అది వాటిని కాల్చేస్తుంది. అందుకే ఇక్కడ తప్పకుండా దాన్ని తటస్థం (న్యూట్రలైజ్) చేసే క్షారం (ఆల్కలైన్) ఊరాల్సిందే. ఆనంద్ భోజనానికి కూర్చోగానీ అతడి నరాల నుంచి నాలోని (ప్యాంక్రియాస్‌లోని) చిన్న చిన్న సంచుల్లాంటి తిత్తులకు క్షారాన్ని ఉత్పత్తి చేయమంటూ సిగ్నల్స్ అందుతాయి. అలా సిగ్నల్స్ అందే గుచ్ఛాలంటి ఆ కణాలను ‘అసిని’ అంటారు. అప్పుడు నేను ఆ కణాల ద్వారా క్షారంతో కూడిన స్రావాలను పేగుల్లోకి పంపుతాను. అయితే ప్రవహించేంత మెత్తగా అయిన జీర్ణాహారం‘కైమ్’ వచ్చాక... కడుపులోంచి పేగుల ‘గేట్‌వే’ అయిన డియోడినమ్లోకి నేను నా స్రావాలను పంపకాన్ని వేగం చేస్తా. చిన్న పేగుల ప్రారంభంలో ఈ డియోడినమ్ 25 సెం.మీ. ఉంటుంది. ఈ డియోడినమ్‌లో ప్రవహించే ఒక రకం స్రావం రక్తంలో కలిసి మెదడుకు సిగ్నల్స్ పంపింపి, నాలోని ఆల్కలైనర్ (క్షారం) టాప్‌గేర్‌లో ప్రవహించేలా చేస్తుంది. నేనిలా కడుపులో యాసిడ్‌తో ముక్కలైన ఆహారంలోకి క్షారాన్ని ప్రవహింపజేసి, దాన్ని న్యూట్రలైజ్ చేయడం అన్నది పెద్ద ప్రధానమైన సంగతి కాదు. ఇంకా ఇంతకంటే అద్భుతాలు చేస్తా. మూడు అద్భుతమైన ఎంజైములను నేను ప్రవహించేలా చేస్తాను. అందులో ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను అమైనో యాసిడ్స్‌గా మార్చుతుంది. వీటినే రక్తప్రవాహం అందుకొని ఆనంద్ కండరాలు బాగా పెరిగేలా చేస్తుంది. అమలైజ్ అనే మరో ఎంజైమ్ సహాయంతో పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తా. ఇక మూడోదైన లైపేజ్తో కొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్‌గా మార్చేస్తా. ఈ మొత్తం ప్రక్రియలకు అవసరమైన మొత్తం స్రావాలను స్రవించడానికి నాలోని సగం ‘అసినీ’ కణాలు చాలు. ఒకవేళ నేను పూర్తిగా నాశనం అయిపోయినా... అతడి లాలాజలం, అతడి పేగులు మాత్రమే స్రవించే జీర్ణరసాలు చాలు... ఆనంద్ బతికి బట్టకట్టడానికి. అంత అద్భుతంగా ఆనంద్ మనగడ కోసం ఏర్పాటు చేసింది ప్రకృతి. ఐలెట్స్ అనే కణాలన్నీ అనునిత్యం మండే ఫర్నెస్‌లు నాలో చెదిరిపోయినట్లుగా కనిపించే కనీసం పదిలక్షలకు పైగా ఐలెట్స్ అనే ప్రధానమైన కణాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కణం... ఒక్కో కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. మీకు వినడానికి 10 లక్షల కణాలు అనే సంఖ్య పెద్దగా అనిపిస్తున్నా... నా 85 గ్రాముల బరువులో వాటి వాటా కేవలం 15 శాతం మాత్రమే. అవన్నీ ఒక్కొక్కటీ ఒక్కో బట్టీలా (ఫర్నెస్లా) మండుతూ ఉంటాయి. ఆ బట్టీలో ఆనంద్‌లోని గ్లూకోజ్‌ను నిత్యం మండిస్తూ శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయి. అవన్నీ అలా నిత్యం మండుతూ గ్లూకోజ్‌ను మండిస్తూ... ఆనంద్ రక్తప్రవాహంలోని గ్లూకోజ్ ఎప్పుడూ 4.4 గ్రాములకు మించి ఉండకుండా చూస్తుంటాయి. ఒకవేళ నాలోని ‘ఐలెట్’ కణాలు అకస్మాత్తుగా మెరుపుసమ్మె చేశాయనుకోండి. అప్పుడు ఆనంద్లోకి గ్లూకోజ్‌కు బదులు మిగతా కణాలు ఈ మంటలు కొనసాగేలా చూడటం కోసం వేరే ఇంధనాలను మండిస్తుంటాయి. దాంతో ఆనంద్‌లోని కొవ్వులు మండిపోతాయి. అతడిలోని ప్రోటీన్లు కండరాలకు అందకుండానే భస్మం అయిపోతాయి. దాంతో ఆనంద్ ఒక బతికి ఉన్న శవంలా మిగిలిపోతాడు. ఎప్పుడూ ఆకలీ... దాహం అంటూ అల్లాడతాడు. చక్కెర మండదు. దాంతో మూత్రంలో చక్కెర పోతుంటుంది. ఒక్కోసారి అలా బయటకు పోయే చక్కెర నాలుగు కిలోల వరకు ఉంటుంది. అలాంటి కండిషన్‌నే డయాబెటిస్ అంటారు. అది రాకుండా పాంక్రియాస్నైన నేను కాపాడుతుంటాను. కప్బోర్డ్ లాంటి కాలేయం నాలోని ఇన్సులిన్ అనేది ఆనంద్ కాలేయాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంటుంది. నిజానికి ఆనంద్ కాలేయం ఒక కప్బోర్డులాంటిది. ఆనంద్‌కు అవసరమైన శక్తి ఉత్పత్తి అయ్యాక మిగతా గ్లూకోజ్‌ను అతడు కాలేయం అనే కప్‌బోర్డులో దాచేస్తాడు. ఈ గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. మళ్లీ ఆనంద్‌కు ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని వాడుకుంటూ ఉంటాడు. ఈ ప్రక్రియ నా సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... అప్పుడు ఆనంద్‌కు డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు. నా వల్ల వచ్చే జబ్బు డయాబెటిసే అయినా దాన్ని కనుగొనడానికి ఫిజీషియన్లు కనుబొమలు ముడిపడేసేటంతగా ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ నన్ను సరిచేయడానికి సర్జన్ నన్ను చేరదామన్నా... అతడికి అందనంత లోతుగా ఉంటాన్నేను. ఇతర అవయవాలు కొన్నింటిని కోయకుండా సర్జన్ నన్ను చేరడం అసాధ్యం అన్నంత సంక్లిష్టమైన లోతుల్లో ఉంటాన్నేను. ఒకప్పుడు నన్ను తొలగించడం అంటే... అది మృత్యువుకు చేరువకావడమే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకవేళ నేను సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చి ఆనంద్ ప్రాణాలను పదిలంగా కాపాడవచ్చు. నాకు ఏదైనా సమస్య వస్తే కడుపు పైభాగంలో నొప్పి వస్తుంది. పొట్ట పైభాగంలో పుట్టిన ఇది వీపు వైపు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. నా ఒక్క సమస్యలోనే కాదు... ఆనంద్‌కు అల్సర్, హార్ట్ ఎటాక్, గాల్‌బ్లాడర్ సమస్యలు, పేగుల్లో ఏదైనా అడ్డుపడటం (ఇంటస్టినల్ అబ్స్ట్రక్షన్)... ఇలా ఏం జరిగినా ఆనంద్ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఫిజీషియన్కు అది ఏ సమస్య అన్నది నిర్ధారణ చేయడానికి పైన చెప్పినట్లు కనుబొమలు ముడిపడతాయి. ఇక ఆ లక్షణాలతో పాటు నీళ్లవిరేచనాలు, బరువు తగ్గిపోవడం, అలసట, తీవ్రమైన నిస్సత్తువ, కామెర్లు వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. మరికొన్ని సమస్యలివే... నాకు వచ్చే మరో సాధారణ సమస్య ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’. పాంక్రియాస్‌కు వచ్చే ఇన్ఫెక్షన్ పేరే పాంక్రియాటైటిస్. నా పక్క అవయవానికి శస్త్రచికిత్స చేసే సమయంలో నాకు చిన్న దెబ్బతగిలినా, చీరుకుపోయినా లేదా నాకు ఎవైనా పుండ్లు పడినా, నాలో ఇన్ఫ్లమేషన్ వచ్చినా. ఆనంద్ అదేపనిగా ఆల్కహాల్ తాగుతూ ఉన్నా నాకు ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ రావచ్చు. అన్నట్టు కాలేయంతో పాటు గాల్ బ్లాడర్ నుంచీ, నా నుంచి స్రావాలు చిన్న పేగుల్లోని భాగమైన డియోడినమ్లోకి వెళ్లడానికి ఒకే గొట్టం ఉంటుంది. ఈ పైప్ సరిగా పనిచేయక ప్లంబింగ్ సమస్య వచ్చిందనుకోండి. గాల్‌బ్లాడర్ నుంచి ముందుకు వెళ్లాల్సిన స్రావాలు వెనక్కు తన్నాయనుకోండి . అలా జరిగితే ఆ స్రావాలు నన్ను దెబ్బతీస్తాయి. ఒక్కోసారి ఆ పరిస్థితి నన్ను పూర్తిగా నాశనం చేయవచ్చు. ఒక్కోసారి గాల్‌స్టోన్ ఏర్పడి నేను స్రవించిన స్రావాలకు అడ్డుపవచ్చు. అలా జరిగితే నేను స్రవించే జీర్ణస్రావాలు వెనకకు వచ్చి నన్నే జీర్ణం చేసేయవచ్చు. ఇదే జరిగితే అనంద్‌కు అది సాధారణంగా అందరూ ఊహించేదానికంటే పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది. క్యాన్సర్లలో అతి చెడ్డదైన రకాలలో ఒకటైన అడినోమా అనేది ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇది ఉంటే నాలోని ఇన్సులిన్ స్రావాలు ఎక్కువగా స్రవిస్తుండవచ్చు. ఇలా జరిగిందంటే ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటివరకూ నేను ఎలాంటి ఇబ్బందీ తెచ్చిపెట్టకుండా ఆనంద్‌లో పనిచేశా. కాకపోతే ఇంతకుముందులా కాకుండా ఈమధ్య వయసుకు తగినట్లుగా ఆనంద్ కాస్త ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం వంటివి వస్తున్నాయనుకోండి. అయితే ఇంతకు ముందులాగే ఆనంద్ అదేపనిగా ప్లేట్లు ప్లేట్లు లాగించడం, అదే పనిగా మద్యం గ్లాసులు గ్లాసులు తాగడం చేశాడనుకోండి. నేను ఇంతకు ముందులాగే చూసిచూడనట్టుగా పోయే రకాన్ని కాదు. గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని శరీరం వాడుకుంటూ ఉంటుంది.. ఈ ప్రక్రియ ప్యాంక్రియాస్ సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు. నేను సరిగా పనిచేయకపోతే డయాబెటిస్ తప్పదు... నేను జీర్ణప్రక్రియలో పనిచేయడం కంటే ఇన్సులిన్ స్రవించడం అన్నది నేను నిర్వహించే విధుల్లోకెల్లా ప్రత్యేకమైనది. ఒకవేళ నేను ఈ పనిని సక్రమంగా చేయలేకపోతే ఈ ప్రపంచంలోని అనేక మందిలా ఆనంద్ డయాబెటిస్ పాలవుతాడు. డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్ -
కాలేయానికి వైరస్ సాయం
పాడైపోయిన కాలేయ కణజాలాన్ని మరమ్మతు చేసేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. జన్యుక్రమంలో మార్పులు చేయడం ద్వారా ఒక వైరస్.. లివర్ కణాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. మద్యం అతిగా తీసుకోవడం లేదా కొన్ని రకాల వ్యాధుల వల్ల కాలేయం హెపోసైట్స్ అనే కణాలు నాశనమవుతాయి. దీనివల్ల ఏర్పడే ఖాళీ ప్రాంతంలో మైఫైబ్రోబ్లాస్ట్లు చేరిపోయి కణజాలం మొత్తం పనికిరాకుండా పోతుంది. కాలేయం సకాలంలో మరిన్ని ఎక్కువ హైపోసైట్స్ను తయారు చేసుకోలేకపోవడంతో మరింతగా దెబ్బతింటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు జలుబుకు కారణమయ్యే అడెనో అసోసియేటెడ్ వైరస్‌కు జన్యుపరంగా కొన్ని మార్పులు చేసి ఎలుకలపై ప్రయోగం చేశారు. ఈ వైరస్లు మైఫైబ్రోబ్లాస్ట్లపై దాడి చేయడంతోపాటు పాడైపోయిన కణాలను హైపోసైట్స్గా మార్చగలిగాయి. మొత్తంగా ఆరోగ్యకరమైన హైపోసైట్స్ కణాలు పెరిగి.. కాలేయం పునరుద్ధరణ అవుతుంది. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మరో ఐదేళ్లలోనే మనుషులకూ ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త విన్లెన్బ్రింగ్ చెబుతున్నారు. అడెనో అసోసియేటెడ్ వైరస్‌ను ఇప్పటికే పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నందువల్ల కాలేయం మరమ్మతులోనూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వాడే వీలుంటుందని పేర్కొంటున్నారు. -
లివర్ జబ్బులకు వైరస్ చికిత్స
శాన్ ఫ్రాన్సిస్కో: పీకలదాకా మద్యం సేవిస్తూ కాలేయ జబ్బులతో బాధపడే మందు బాబులకు శుభవార్త! మద్యం, హెపటైటీస్ సీ, ఫ్యాటీ లివర్ కారణంగా సిరోసిస్ లాంటి ప్రాణాంతక కాలేయ వ్యాధులను సులభంగా నయం చేసే వైరస్‌ను కాలిఫోర్నియా యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన నిపుణులు కనుగొన్నారు. ‘అడినో అసోసియేటెడ్ వైరస్ (ఏఏవీ)ని కాలేయంలోకి పంపించడం వల్ల ఆ వైరస్ చెడిపోయిన కాలేయ కణాలను మంచి కణాలుగా మారుస్తున్న విషయం తమ ప్రయోగంలో రుజువైందని జర్మనీలోని హైడెల్బర్గ్ యూనివర్శిటీ హాస్పటల్ నిపుణులతో సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించిన ప్రొఫెసర్ డాక్టర్ హోల్గర్ విల్లిన్ బ్రింగ్ తెలిపారు. చెడిపోయిన కాలేయ కణాలను మ్యోఫిబ్రోబ్లాస్ట్స్ అని పిలుస్తామని, మంచి కణాలను హెపటోసైట్స్ అని పిలుస్తామని, తాము ప్రయోగించిన వైరస్ వల్ల చెడిపోయిన కాలేయ కణాలు హెపటోసైట్స్ గా మారిపోయాయని ఆయన వివరించారు. సహజ కణాలలాగే వైరస్ మరమ్మతు చేసిన కణాలు పునరుత్పత్తి శక్తిని కలిగి ఉండడం, సహజ సిద్ధమైన ఆరోగ్య కణజాలంతో ఇట్టే కలిసిపోవడం ఓ అద్భుతమని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి పంచర్ పడిన ఓ టైరుకు ప్యాచ్ అతికించడం లాంటిదే ఈ చర్యని, ప్రస్తుతానికి కాలేయ మార్పిడే సరైన చికిత్స అని ఆయన తెలిపారు. రానున్న సంవత్సరాల్లో ఈ వైరస్ చికిత్సను మరింత అభివద్ధి చేసినట్లయితే కాలేయ మార్పిడి అవసరం లేకపోవచ్చని ఆయన చెప్పారు. ఆయన ఈ ప్రయోగ వివరాలను ‘జర్నల్ స్టెమ్ సెల్’లో ప్రచురించారు. -
హోమియోలో హెపటైటిస్-బి చికిత్స ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. ఈమధ్య కాలంలో పచ్చకామెర్లు వచ్చాయి. వాంతులు అవుతున్నాయి. అన్నం తినబుద్ధికావడం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి హెపటైటిస్-బి అని నిర్ధారణ చేశారు. తాత్కాలికంగా తగ్గినా మళ్లీ ఎప్పుడైనా రావచ్చని అన్నారు. హెపటైటిస్-బి వ్యాధికి హోమియోలో మందులు ఉన్నాయా? - రాధాకృష్ణ, గజ్వేల్ హెపటైటిస్-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది హెపటైటిస్-బి వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం వాపు రావడం, వాంతులు, పచ్చకామెర్లు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముదిరితే కాలేయం గట్టిపడిపోయి లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి వ్యాప్తి: ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లోకి ప్రవేశించిందంటే, దాని సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రక్తంలోనూ, లాలాజలంలోనూ, వీర్యంలోనూ, మానవుడి ప్రతీ శారీరక స్రావంలోనూ ఈ వైరస్ చేరుతుంది. ఇది శరీర ద్రవాల ద్వారా, సూదులు ద్వారా, తల్లికడుపులోని తల్లి నుంచి బిడ్డకూ వ్యాపంచవచ్చు. లక్షణాలు... తొలి దశ : శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని అక్యూట్ దశ అంటారు.ఈ దశలో ఎలీజా పరీక్ష చేస్తే పాజిటివ్ వస్తుంది. రెండో దశ: ఈ దశలో వైరస్ శరీరంలో చాలాకాలం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణిస్తారు. అంటే వైరస్ శరీరంలో ఉండిపోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట. ఈ దశలో కామెర్లు తగ్గినా కూడా హెచ్‌బీఎస్‌ఏజీ పరీక్షలో పాజిటివ్ అని వస్తుంది. శరీరంలో వైరస్ ఉన్నా కూడా ఇలాంటి వారికి తెలియదు. వారికి ఇతరత్రా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వాటి కోసం వైద్యపరీక్షలు చేయిస్తే ఇది బయటపడుతుంది. ఇలాంటి వారికి ఏ సమస్యా లేకపోయినా... వారి నుంచి ఇతరులకు వైరస్ సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది. తొలి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ దశలో పదే పదే కామెర్లు వచ్చిపోతుంటాయి. వీరిలో 99.5 శాతం మందికి ప్రాణాపాయం ఉండదు. కానీ శరీరంలో వైరస్ ఉండి బాధిస్తుంది. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. ప్రతి ఆర్నెల్లకోసారి పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. ఎందుకంటే వైరస్ పూర్తిగా శరీరంలోంచి పోవడానికి చాలా సమయం పడుతుంది. రెండో దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వీరి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ వీరికి ఏ బాధలూ / సమస్యలూ ఉండకపోయినప్పటికీ వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వీరు ప్రతి ఆర్నెల్లకొకసారి పరీక్ష చేయించుకుంటూ తగిన చికిత్స తీసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీరికి భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు లివర్ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. కొందరిలో సమస్యలేమీ లేకపోయినా అకస్మాత్తుగా లక్షణాలు మొదలై, క్యాన్సర్‌కు కారణం కూడా కావచ్చు. మెల్లగా లివర్ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం కూడా ఉంది. చికిత్స: హోమియో విధానంలో కాన్సిటిట్యూషన్ పద్ధతుల్లో రోగి మానసిక / శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని క్రమేపీ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ, వ్యాధిని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ కిడ్నీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. ఇటీవల ఆకలి బాగా తగ్గిపోయింది. బాగా నీరసంగా ఉంటోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటినిన్ విలువ 14 మి.గ్రా/డీఎల్. యూరియా 320 మి.గ్రా/డీఎల్ గా ఉంది. స్కానింగ్ లో కిడ్నీ సైజు బాగా తగ్గిందని తెలిసింది. ప్రస్తుతం క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ఐదో దశలో ఉన్నాననీ, కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? - ఎస్. శ్రీధర్, నూజివీడు మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు కిడ్నీ మార్పిడి ఒక్కటే మేలైన పరిష్కారం. మీ తోడబుట్టినవాళ్లు లేదా మీ భార్య వంటి దగ్గరి సంబంధీకుల నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. కిడ్నీ మార్పిడి చేయించుకునే ముందు దాతకు అన్నిరకాల వైద్య పరీక్షలు చేసి, కిడ్నీదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి సమస్యలు లేకపోతేనే వారి నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. ఇక పేషెంట్‌కు దాత ఎంత దగ్గరి బంధువైతే అంత మంచిది. కిడ్నీ దీర్ఘకాలం పనిచేసే అవకాశం ఉంటుంది. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా పేషెంట్ క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాత అందుబాటులో లేకుంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, కెడావర్ దాతల కోసం తన పేరు నమోదు చేయించుకోవాలి. బ్రెయిన్‌డెత్ అయిన సందర్భాల్లో వాళ్ల దగ్గర కిడ్నీ దొరికితే అది మీకు అమర్చుతారు. నాకు 38 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు? - సుధాకర్, కొత్తూరు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారమే తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆ ఐదుగురిలో పునర్జన్మెత్తి..
► నిండు నూరేళ్లు కలిసుంటానంటూ ఏడడుగులు వేసిన తోడు.. అర్ధంతరంగా లోకాన్ని వీడుతున్నాడనే బాధను మునిపంటి కింద నొక్కి పట్టి..మిణుకుమిణుకుమనే ఆ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే మహోన్నత ఆశయానికి పురుడు పోసింది. . ► నాన్న ఎక్కడమ్మా అంటూ చంటి బిడ్డలు మారం చేస్తుంటే..వారికి సమాధానం చెప్పలేక ఉబికివస్తున్న కన్నీళ్లను కళ్లలోనే దాచుకుంటూ..ఐదు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న అవే కన్నీళ్లను వారికి దూరం చేయాలనే సంకల్పానికి నడుం కట్టింది. ► కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోతున్నాననే దిగులును గుండె లోతుల్లో అదిమిపట్టి..మరెన్నో గుండెల్లో దిగులు తరిమేయాలనే భార్య త్రివేణి మనోధైర్యం ఆదర్శంగా నిలిచింది. భర్త అవయవాలను జీవన్‌దాన్‌కు అప్పగించి..తాను అంతులేని విషాదంలో మునిగిపోయింది. విజయవాడ(లబ్బీపేట): ఆయన మృతి చెందిన మరో ఐదుగురిలో సజీవంగా జీవించాలని భావించిన త్రివేణి అవయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ ఇల్లాలి నిర్ణయం ముగ్గురికి పునర్జన్మను ప్రసాదించగా, మరో ఇద్దరికి ఈ రంగుల లోకాన్ని చూసేందుకు చూపునిచ్చింది. జీవన్‌దాన్ ద్వారా సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్ యువకుడి నుంచి సేకరించిన రెండు కిడ్నీలు, లివర్, కళ్లు వేర్వేరు ఆస్పత్రులకు సోమవారం తరలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై... ఖమ్మం జిల్లా ముచ్చర్లకు చెందిన కే సురేష్(25) వ్యవసాయ కూలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదానికి గురి కాగా తొలుత జిల్లాలో స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మెట్రో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెదడు వాపు వచ్చి బ్రెయిన్‌డెత్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి స్థితిలో కోలుకోవడం కష్టమని, అవయవదానం ద్వారా మరికొందరికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని వైద్యులు శ్రీనివాసరావు, వినయ్‌బాబు కుటుంబ సభ్యులతో చెప్పడంతో నిరుపేదలైనా మహోన్నత హృదయంతో అంగీకరించారు. జీవన్‌దాన్‌తో అవయవాల సేకరణ రాష్ట్రంలో అవయవదానం చేసేందుకు అమలులో ఉన్న జీవన్‌దాన్ పథకం ద్వారా యువకుడి అవయవాలు సేకరించారు. యువకుడి ఊపిరితిత్తులు, గుండె పనికి రావని వైద్యులు నిర్ధారించారు. రెండు కిడ్నీలను సేకరించి వాటిని సన్‌రైజ్ హాస్పిటల్, అరుణ్ కిడ్నీకేర్ సెంటర్లకు తరలించారు. లివర్‌ను మణిపాల్ ఆస్పత్రికి, రె ండు కళ్లు వాసన్ ఐ కేర్‌కు అప్పగించారు. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం.. ఆదుకోండి బ్రెయిన్‌డెత్‌కు గురైన సురేష్‌కు ఏడాదిలోపు వయసున్న పాపతో పాటు, మూడేళ్ల బాబు ఉన్నారు. దినసరి కూలి పనులకు వెళితేనే పూటగడిచే ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. తన భర్త మృతి చెందడంతో ఇద్దరు చంటి పిల్లలతో తన పరిస్థితి ఏమిటంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది భార్య త్రివేణి. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. ఒక మహోన్నత ఆశయంతో భర్త అవయవాలను దానం చేసిన ఆ ఇల్లాలి వేదనను అర్థం చేసుకుని దాతలు సహకరించాలని కోరుకుందాం. -
రోగమొకటైతే.. మందొకటిచ్చాడు!
- కడుపునొప్పి ఉందని వెళ్తే లివర్ పక్కన ఆపరేషన్ - కర్నూలు ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండుప్రాణం బలి మానవపాడు (మహబూబ్‌నగర్) : రోగం ఒకటైతే మందు మరొకటి అనే చందంగా ఉంది వైద్యుల తీరు. కడుపునొప్పి ఉందని వెళ్తే లివర్ పక్కన ఆపరేషన్ చేసి చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలితీశారు. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం అమరవాయిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. అమరవాయికి చెందిన గురుస్వామి, సత్యమ్మల చిన్నకొడుకు రాజు(20)కు గతనెల 23వ తేదీన కడుపునొప్పి తీవ్రంగా రావడంతో గ్రామంలో ఉన్న ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని రక్ష ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశాడు. వారు వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రాణాలుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజును ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబసభ్యులు సరేనన్నారు. ఆపరేషన్ చేసిన వైద్యుడు కోటిరెడ్డి నాలుగురోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పి వారం రోజుల వరకు అక్కడికి రాలేదు. కనీసం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రాజు కుటుంబ సభ్యులు కలత చెందారు. రాజు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిపోతుండడంతో తండ్రి గురుస్వామి ఇది తట్టుకోలేక మరో ఆస్పత్రికి తీసుకెళ్లి తన కొడుకును ఎలాగైనా బతికించాలని కాళ్లావేళ్లపడ్డారు. అక్కడ వైద్యసిబ్బంది మాత్రం రెండురోజుల్లో నయమవుతుందని చెప్పి తిరిగి పంపించారు. చివరకు బుధవారం ఉదయం ఆపరేషన్ చేసిన వైద్యుడు కోటిరెడ్డి రక్ష ఆస్పత్రికి వచ్చి రాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వారి వెంట వెళ్లిన వైద్యుడు కోటిరెడ్డి రాజు ఆపరేషన్ కోసం రూ.లక్ష చెల్లించాడు. ఇదిలాఉండగా, పరీక్షించిన యశోదా ఆస్పత్రి వైద్యులు లివర్ పక్కన అవసరం లేని ఆపరేషన్ చేశారని గుర్తించినట్లు రాజు తల్లిదండ్రులు వివరించారు. అయితే రాజు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కనుమూశాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని కర్నూలు రక్ష ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ కొడుకు చావుకు మీరే బాధ్యులని, కడుపునొప్పి అని వస్తే లేనిపోని ఆపరేషన్లు చేసి చంపేశారని గొడవకు దిగారు. తనకు ఎలాంటి సంబంధంలేదని వైద్యుడు కోటిరెడ్డి చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి తప్పుచేయనని.. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని వైద్యులు భరోసా ఇవ్వడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతుడు రాజు తండ్రి గురుస్వామి చేతికొచ్చిన కొడుకును ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు బలిచేశారని కన్నీరుమున్నీరయ్యాడు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
బ్రకోలీతో లివర్ క్షేమం
పరిపరి శోధన తరచుగా బ్రకోలీ తీసుకుంటే లివర్ పదికాలాల పాటు క్షేమంగా ఉంటుందని అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి మూడు నుంచి ఐదుసార్లు బ్రకోలీ తీసుకునేట్లయితే లివర్ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని వారు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి జబ్బులను నివారించడంలోనూ బ్రకోలీ బాగా ఉపయోగపడుతుందని ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకురాలు ప్రొఫెసర్ ఎలిజబెత్ జెఫరీ చెబుతున్నారు. బ్రకోలీకి దగ్గరగా ఉండే కాలిఫ్లవర్ వల్ల కూడా దాదాపు ఇలాంటి ఉపయోగాలే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది!
లండన్: కాఫీ ప్రియులకు శుభవార్త. మీరు రోజు మామూలుగా తాగేదానికన్నా అదనంగా మరో రెండు కప్పుల కాఫీని లాగించమని చెబుతున్నారు పరిశోధకులు. దీని ద్వారా కాలేయానికి సంబంధించిన ప్రాణాంతకమైన వ్యాధులు సగానికి పైగా తగ్గుతాయని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శరీరంలో ఆల్కహాల్ మోతాదు మించడం, హెపటైటిస్ సీ లాంటి వైరల్ వ్యాధుల భారిన పడటం ద్వారా కాలేయం(లివర్) తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇలా దీర్ఘకాలంగా కాలేయ వ్యాధులు ఉన్నవారిలో అది లివర్ క్యాన్సర్‌గా మారి ప్రాణాంతకంగా తయారవుతోంది. అయితే ఈ ముప్పును కాఫీ సగానికి పైగా తగ్గిస్తోందని లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృంధం తాజాగా తేల్చింది. సుమారు 5 లక్షల మందిని పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. లివర్ సిర్రోసిస్ వ్యాధికి కాఫీ మంచి విరుగుడులా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీతో కలిగే ఈ ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా లివర్‌కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఉపయోగాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఒలివర్ కెన్నడీ వెల్లడించారు. -
నేను మీ కాలేయం
ఆనంద్ ప్రతిరోజూ అద్దంలోకి ముఖం పెట్టి పళ్లు పరీక్షించుకుంటాడు. తల దువ్వుకుంటాడు. జుట్టు సర్దుకుంటాడు. కనిపించే వీటిని పక్కనబెట్టి అప్పుడప్పుడూ కనిపించని లోపలి అవయవాలైన గుండె, కిడ్నీల గురించి ఆలోచిస్తాడు. నేనైతే ఆనంద్ కుడిపైపు ఛాతీ పైభాగపు ఎముకల కింద గుట్టుగా ఉంటూ, పొట్టకు అవసరమైన పనులు ప్రధానంగా చేస్తుంటా. కాళ్లూ, చేతులు కదపాలన్నా, ఆట ఆడాలన్నా, గోలు కొట్టాలన్నా నేనే. కండరంతో పరుగుతీయాలన్నా, తిన్నది అరగదీయాలన్నా నేనే చేయాలి.కానీ నా ఉనికే తెలియదు. అతడిలో నేను ఉన్నాననే ఆలోచనే అతడికి రాదు. కానీ అతడి ఒంటిలోపలి భాగాల్లో అతి పెద్ద అవయవాన్ని నేనే. దాదాపు కిలోన్నర తూగుతాను. ఆ నేనే... కాలేయం. ఇంగ్లిష్‌లో లివర్. ఉనికిలో ఎంత సెలైంటో పనిలో అంత వైబ్రెంట్! జీవక్రియల్లో ఎక్స్పర్ట్. కాలం పరంగా కాన్స్టాంట్. పని అందుకోవడంలో ఇన్స్టాంట్! ఇంతెందుకు... ఒక్కమాటలో చెప్పాలంటే ఆనంద్ ఏ పని చేసినా అందులో నా వాటా ఉంటుంది. పని మానేస్తే పైకే...! శరీరంలో అత్యంత సంక్లిష్టమైన భాగాలు అని చెప్పుకునే పరిస్థితి వస్తే... నన్ను చూసి ఆనంద్ గుండె, ఊపిరితిత్తులు కాస్త సిగ్గుపడాల్సిందే. ఓ జాబితాగా రాయాల్సి వస్తే నేను చేసే పనులు దాదాపు ఐదొందలకు పైమాటే. నేను గానీ పని మానేస్తే ఆనంద్ పని అంతేసంగతులు. నాకు ఏడు సెం.మీ. చాలు నేను చేసే పనులన్నింటినీ బయట చెయ్యాలంటే ఎకరాల కొద్దీ స్థలం కావాలి. అందులో ఒక పే...ద్ధ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి. నేను చేసే అత్యంత సరళమైన పనికోసమే ఇది కావాలి. ఇక సంక్లిష్టమైన పనులకు ఎంత కావాలో మీరే ఊహించుకోవచ్చు. అంతెందుకు... నేను చేసే అంత్యంత సంక్లిష్టమైన పనులు ఈ ప్రపంచంలోని ఏ కెమికల్ ఫ్యాక్టరీ కూడా చేయలేదు. నేను దాదాపు వెయ్యికి పైగా ఎంజైములను ఉత్పత్తి చేస్తాను. అవి దేహంలోని రసాయన చర్యలకు తోడ్పడతాయి. ఆ చర్యల ద్వారా ఒక రకం పదార్థం మరో రకంగా మారేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు ఆనంద్ వేలు పొరబాటున తెగిందనుకోండి. నేను రంగంలోకి దిగకపోతే వేలంతా రక్తసిక్తం. ఆనంద్‌కు మరణం తథ్యం. అప్పుడు నేను రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్స్ పుట్టిస్తా. రక్తాన్ని గడ్డకట్టిస్తా. ఆనంద్ ప్రాణాలకు నా యాంటీబాడీస్ అడ్డేస్తా. అలాంటి యాంటీబాడీస్‌ను మరెన్నో పుట్టించి ఎన్నోన్నో అనర్థాలు రాకుండా కాపాడుతుంటా. జీర్ణక్రియ... నా పనితీరుకు నిదర్శనక్రియ ఆనంద్‌కు మాంసాహారం అంటే ఇష్టం. అందులో ఉండేవన్నీ ప్రోటీన్స్. జీర్ణమయ్యే క్రమంలో అవి ముక్కలవుతూ అమైనోయాసిడ్స్‌గా రూపొందుతాయి. ఆ పదార్థం యధాతథంగా రక్తంలో కలిస్తే మాత్రం ఆనంద్ అంతే సంగతులు. ఎందుకంటే అది సైనైడ్ అంతటి విషపూరితం. శత్రువుల్లాంటి ఆ అమైనో యాసిడ్స్‌ను నేను మేని మిత్రులుగా మార్చేస్తా. వాటి నైజాన్ని హ్యూమనైజం చేసేస్తా. ఇక నేను చేసే మరోపని ఏమిటంటే... కాస్త ఆకుపచ్చగానూ, మరికాస్త పసుపపచ్చగానూ ఉండే, చాలా చేదైన బైల్‌ను ఉత్పత్తి చేస్తా. నాలో ఉత్పత్తి అయిన ఈ జీర్ణరసం మొదట గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి మరింత గాఢమవుతుంది. కడుపు, పేగులకు మధ్య ఉండే చిన్న సంచిలోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి చిన్నపేగుల్లోని జారిపోతుంది. మనం తిన్న ఆహారపు ముద్దల్ని అక్కడ జీర్ణం చేస్తుందది. ఈలోపు ఆహారనాళంలోని కొవ్వులను కడిగేస్తుందీ బైల్‌జ్యూస్. ఇందులోనూ రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి బిలురుబిన్ (ఇది ఎరుపు రంగులోని బైల్). రెండోది బైలివెర్డిన్ (ఇదేమో ఆకుపచ్చ బైల్). అప్పుడప్పుడూ ఈ రంగు పదార్థాల్లో ఏవైనా రక్తంలో కలిస్తే కామెర్ల రూపంలో బయటకు కనిపిస్తుంటాయి. ఇలా కనిపించాయంటే... నా పనితీరులో ఏదో తప్పు జరుగుతుందని గుర్తించాలి. ఈ తప్పు మూడు రకాలుగా జరగవచ్చు. మొదటిది... మలేరియా సూక్ష్మజీవి ఒంట్లోకి ప్రవేశించడం లేదా ఎర్రరక్తకణాలు అతిగా నాశనమవుతూ రక్తహీనత వచ్చి ఉండవచ్చు. అప్పుడు... నేను తొలగించే వేగం కంటే నాశనమయ్యే ఎర్రరక్తకణాల వ్యర్థాలు ఎక్కువగా ఉంటే అవి రక్తంలోకి చేరుకుని కామెర్ల రూపంలో కనిపించవచ్చు. రెండోది... గాల్‌బ్లాడర్ నుంచి పేగులకు వచ్చే మార్గంలో ఏదైనా అడ్డుపడటం వల్ల బైల్ వెనక్కు ప్రవహించి, అది రక్తంలో కలిసి కామెర్లుగా ప్రయుక్తం కావచ్చు లేదా బైల్ ప్రవాహ మార్గాల్లో కొవ్వు అడ్డం పడటం వల్ల కూడా కామెర్లు కనిపించవచ్చు. ఇక మూడోది... నా కణాలకు.. అంటే కాలేయ కణాలకు హెపటైటిస్ లేదా ఏదైనా ఇతర వ్యాధులు సోకి వాటికి ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అదే జరిగితే నాకూ ఇబ్బంది. ఆనంద్‌కూ ప్రమాదం. అతి ఉంటే మితి చేస్తా... అతడి శరీరంలో అతిగా ఉండకూడని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని ఉండాల్సిన పరిమాణంలోకి మార్చేస్తా. అతి పరిమితులను తెలుసుకొని... అదనాలను వదిలిస్తా. ఒంట్లోని విషపదార్థాలను యూరియాగా మార్చేస్తా. మూత్రపిండాల్లోకి పంపేస్తా. ఆనంద్‌లోని అడ్రినల్ గ్రంథులు... శరీరంలో లవణాలను ఉండేలా చూస్తాయి. ఉండాల్సిన వాటికంటే అవి అదనంగా ఉంటే ఆనంద్ ఉబ్బిపోతాడు. అందుకే నేను వాటిని నాశనం చేస్తా. ఇల్లూడ్చినట్టే... నేను ఒళ్లూడుస్తుంటా... ఆనంద్ తన ఇల్లు ఊడ్చుకుని శుభ్రంగా ఉంచుకున్నట్టే... అతడిలోని వ్యర్థాలను ఊడ్చేస్తుంటాను నేను. ఎప్పటికప్పుడు కొత్తవి పుడుతుండటంతో ప్రతి సెకండ్‌కూ ఆనంద్ ఒంట్లో కోటి ఎర్రరక్తకణాలు చనిపోతూ ఉంటాయి. వాటిని భస్మం చేసే బాధ్యత నాదే. ఆ భస్మాన్ని తిరిగి ఉపయోగించి మళ్లీ కొత్త రక్తకణాలను పుట్టించే పనికూడా నాదే. పెరిగే కొవ్వును చూసుకోవాలి... ఆనంద్ వయసు పెరుగుతోంది. ఈ వయసులో కొవ్వు కూడా పెరుగుతుంటుంది. ఇది నాలోనూ జరుగుతుంటుంది. నాలో నార్మల్‌గా పనిచేసే కణాల స్థానంలో కొవ్వు పేరుకుంటూ ఉండవచ్చు. అలాంటప్పుడు అది కొన్నిసార్లు రక్తప్రవాహానికి అడ్డురావచ్చు. కొన్ని అంతర్గత అవయవాలను దెబ్బతీయవచ్చు. అప్పుడు నా ఆకృతి, నా స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. నేను జిగురుజిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. ఇది కొన్నిసార్లు ఆర్సెనిక్ వంటి విష ప్రభావాల వల్ల లేదా కొన్ని వ్యాధుల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్ వల్ల (అంటే రోజుకు 350 ఎం.ఎల్. కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల) కూడా సిర్రోసిస్ రావచ్చు. సిర్రోసిస్ లక్షణాలివే... ఆనంద్ ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, నీరసంగా ఉన్నా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు నా పనితీరును తెలుసుకోడానికి మంచి మంచి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నాలోకి బ్రోమ్సల్ఫాలియేన్ అనే ఒక రంగు పదార్థాన్ని (డై)ని లోపలికి పంపిస్తారు. నా పనితీరు బాగుంటే 45 నిమిషాల్లో అంతా బయటకు పంపేస్తాను. ఇదిగాక బైలురుబిన్ వంటి పిగ్మెంట్ మోతాదులు రక్తంలో ఎంత ఉన్నాయో పరీక్ష చేసి, నాలోని అనారోగ్యాన్ని కనుగొంటారు. ఆనంద్ ఆ పరిస్థితికి రాలేదు. కానీ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలావరకు ఆహార నియమాలు పాటిస్తూ, ప్రోటీన్లు తీసుకుంటూ, మామూలు మందులతోనే మళ్లీ నన్ను నార్మల్ చేయడానికి అవకాశం ఉందిప్పుడు. నన్ను కాపాడుకోవడం ఎలా? నన్ను కాపాడుకోవడం చాలా సులువు. ఆనంద్ బరువు పెరుగుతుంటే... నేనూ బరువు పెరుగుతున్నానన్నమాటే. ఆ పెరిగే బరువును అదుపు చేసుకోవాలి. ఆల్కహాల్‌కు పూర్తిగా దూరం కావాలి. తగినన్ని విటమిన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ‘బి’ విటమిన్ తీసుకోవడం ప్రధానం. ఇన్పుట్స్: డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్ ఫుడ్డును ఫ్యూయల్‌గా మార్చేది నేనే... ఆనంద్ గోల్ఫ్ ఆడాలన్నా, కాలిబంతి ఆటలో గోల్ కొట్టాలన్నా... ఆ కండరాలకు అవసరమైన శక్తిని ఇవ్వడానికి తోడ్పడేదీ నేనే. తిన్న పదార్థాలు గ్లూకోజ్‌గా మారతాయి. తగినంత శక్తి కోసం చక్కెరలు మండుతాయి. కండరం కదులుతుంది. ఆటకు అవసరమైన ఎనర్జీ అందుతుంది. ఈ ప్రక్రియలో కండరం అలసిపోతే లాక్టిక్ ఆసిడ్ ఉత్పత్తి అవుతుంది. అ లాక్టిక్ యాసిడ్ వృథాపోకుండా మళ్లీ దాన్ని గ్లైకోజెన్‌గా మార్చి నిల్వ ఉంచుతాను నేను. ఆనంద్ పనిచేస్తున్నప్పుడు మళ్లీ ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి అతడికి అవసరమైన శక్తిని అందిస్తాను. నయాపైసా కూడా వృథాగా ఖర్చుకాకుండా ఆపే ఇల్లాలిలా ఒంటిలోని రేషన్‌ను చక్కగా నిత్యం అందేలా మేనేజ్ చేస్తుంటాను. శక్తి అపారం.. అదే శాపం-అదే వరం! నాలోని శక్తి అపారం. నాలోని దాదాపు 85 శాతం కణాలు పూర్తిగా నాశనమైనా నా పనితీరులో మార్పురాదు. నా అద్భుత శక్తే నాకు అభిశాపమవుతుంది. అంటే కేవలం నా సామర్థ్యం 15 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు గానీ లక్షణాలు బయటకు కనిపించవు. దాంతో ఆనంద్‌కు నా హెచ్చరికలు వినిపించే వేళకు లేదా నా పని తగ్గడం వల్ల కలిగే లక్షణాలు కనిపించే వేళకు జరగాల్సిన నష్టం జరగవచ్చు. ఇక ఈ అంశమే కొన్ని సార్లు వరం కూడా. మిగతా ఏ అవయవానికీ లేని అద్భుత శక్తి నాకు మరొకటి ఉంది. నాలో 60 శాతం భాగాన్ని తొలగించినా నేను మళ్లీ మునుపటి పరిమాణానికి పెరుగుతాను. విషాల పాలిటి అడ్డుగోడ... . విషాల నీడ కూడా ఆనంద్ ఒంట్లో పడకుండా చూసే అడ్డుగోడను నేను. రోజూ సిగరెట్ తాగుతూ నికోటిన్ అనీ, కాఫీ తాగుతూ కెఫిన్నీ, తింటూ ఇంకొన్ని పాయిజన్లను ఒంట్లోకి యధేచ్ఛగా వదిలేస్తుంటాడు ఆనంద్. అవి గుండెకు చేరకుండా నేను గోడలా అడ్డు ఉంటా. ఆనంద్ మద్యం తాగుతుంటాడు. కాక్టెయిల్స్ తీసుకుంటూ కబుర్లాడుతుంటాడు. అతడు అలా పరమానందం పొందుతుంటే అందులోని ప్రమాద కారకాలపై అప్పటికప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిహరిస్తుంటాను. ఆల్కహాల్ ప్రవేశించగానే దాన్ని నీళ్లుగా చేసి, మూత్రంలా మార్చేస్తా. కార్బన్డైఆక్సైడ్లా మార్చి ఊపిరి తీసుకునే సమయంలో బయటకు పోయేలాచూస్తా. ఇలా అన్ని విషాలను విరిచేస్తా. అన్ని మోతాదులనూ సరిచేస్తా. గుండెకు సేఫ్టీ వాల్వ్ గుండెకు ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తా. నా పైనుంచే ఆనంద్ గుండెలోకి హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం వెళ్తుంటుంది. అలా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో అదొక బలమైన అలలా వెళుతూ ఉంటుంది. ఆ రక్త ప్రవాహం నాలోంచే జరుగుతుంటుంది. హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం కనీసం ఆరు నుంచి పది సెకండ్ల వ్యవధి పాటు నాలోంచి వెళ్తుంది. ఆ టైమ్ నాకు చాలు. తక్షణమే తరంగవేగాన్ని తగ్గిస్తా. నెత్తురునంతా నేను మెత్తటి స్పాంజ్‌లా అద్దేస్తా. అలా నాలోకి ఇంకేలా చేస్తా. నా ఎగ్జిట్ వెసెల్స్ నుంచి కొంత కొంత రక్తాన్నే పంపిస్తా. అలా గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా చూస్తా. కాసేపు ఆ రక్తభారాన్ని నేనే మోస్తా. గుండెకు ఎంత వస్తే సౌకర్యమో అంతే రక్తాన్ని సరఫరా చేస్తా. -
కాలేయం 3డీ ప్రింట్!
► బెంగుళూరు స్టార్టప్ ఘనత న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన బయోటెక్నాలజీ స్టార్టప్ కంపెనీ పాండోరమ్ టెక్నాలజీస్.. మానవ కాలేయాన్ని పోలిన 3డీ ప్రింట్ కణజాలాన్ని అభివృద్ధి చేసింది. ఇది మానవ కాలేయం చేసే విధులను నిర్వర్తిస్తుంది. తమ కొత్త కణజాల ఆవిష్కరణ భవిష్యత్తులో పూర్తి స్థాయి కాలేయ మార్పిడి ప్రక్రియకు దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. కృత్రిమ అవయవాల వల్ల చాలా వైద్య అనువర్తనాలు ఉన్నాయని, ఇవి కృత్రిమ కాలేయ వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, తద్వారా కాలేయం పాడయిన వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు తూహిన్ భౌమిక్ తెలిపారు. సమీప భవిష్యత్తులో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలో ఉత్పన్నమయ్యే మానవ అవయవాల కొరతను ఈ టెక్నాలజీ తీరుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కణజాలాన్ని మరిన్ని అనువర్తనాలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని పాండోరమ్ టెక్నాలజీస్ మరో సహ-వ్యవస్థాపకుడు అరుణ్ చంద్రు తెలిపారు. తక్కువ ధరల్లో, స్వల్ప దుష్ర్పభావం ఉండేలా, ఎక్కువ సామర్థ్యం గల ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధికి తమ 3డీ ప్రింట్ బయో కాలేయం ఒక పరీక్షా వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కొత్త ఔషధం మార్కెట్లోకి రావాలంటే దానికి చాలా ఏళ్లు, అధిక ఖర్చు అవుతోందని చెప్పారు. తమ కొత్త ఆవిష్కరణ వల్ల ఔషధ తయారీ ఖర్చు, కాలం రెండూ తగ్గుతాయని వివరించారు. -
నా కాలేయం 75 శాతం పాడైంది
బాలీవుడ్ బాత్ బాలీవుడ్ అసలే సంచనాలకు వేదికగా ఉంది. మొన్న ఆమిర్‌ఖాన్ సంచనలం నేడు అమితాబ్ బచ్చన్ సంచలనం. ఇటీవల హెపెటైటిస్ బి మీడియా అవేర్నెస్ కాంపెయిన్ జరిగింది. అందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న అమితాబ్ బచ్చన్ తన కాలేయం 75 శాతం హెపెటైటిస్ బి వల్ల పాడైందని ప్రస్తుతం తాను 25 శాతం ఆరోగ్యంగా మిగిలిన కాలేయంతోనే సాధారణ జీవితం గడుపుతున్నానని తెలిపాడు. కూలీ సినిమా ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 40 బాటిళ్ల రక్తం ఎక్కించారనీ వాటిలో ఒక దానిలో హెపెటైటిస్ బి వైరస్ ఉండి అది తన శరీరంలో నిశ్శబ్దంగా చేరి కాలేయాన్ని తినేసిందనీ 2004 దాకా ఆ సంగతి తెలియలేదని ఆయన తెలిపాడు. అప్పటి నుంచి మందులు స్థిరంగా తీసుకోవడంతో తాను సాధారణ జీవితం గడుపుతున్నానని కనుక కాలేయ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరమని అమితాబ్ తెలియచేశాడు. అదే విషయాన్ని తన బ్లాగ్‌లో కూడా రాసుకున్నాడు. -
పునరుద్ధరించి.. మళ్లీ అమర్చి
* దెబ్బతిన్న కాలేయానికి ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స * ప్రపంచంలోనే రెండోది... దేశంలో మొదటిది సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాలేయం, కాళ్లు, పొట్ట భాగంలోని ప్రధాన రక్తనాళాలు మూసుకుపోవడంతో కాలేయం పని తీరు దెబ్బతిని తరచూ రక్తస్త్రావంతో బాధపడుతున్న యువకుడికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్'(దెబ్బతిన్న కాలేయాన్ని శరీరం నుంచి బయటికి తీసి, పూడుకుపోయిన అంతర్గత రక్త నాళాలను పునరుద్ధరించి, తిరిగి అమర్చడం) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా చికిత్స చేయడం ఇది రెండోదని, దేశంలో మొదటిదని ఉస్మానియా వైద్యులు తెలిపారు. కెనడాలో మాదిరిగా... ఖమ్మం జిల్లాకు చెందిన నాగరాజు(24) పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. కాలేయం నుంచి గుండెకు, తిరిగి అటు నుంచి కాలేయానికి రక్తం సరఫరా చేసే ఇంట్రాహెపటిక్ బ్లడ్ వెసెల్ (ఐవీసీ) మూసుకుపోయింది. దీంతో కాలేయం దెబ్బతింది. పొట్ట, కాళ్లకు సంబంధించిన ప్రధాన రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వల్ల అవి ఉబ్బి తరచూ రక్తస్త్రావం అవుతోంది. దీన్ని వైద్య పరిభాషలో 'క్రానిక్ బడ్ చియరీ సిండ్రోమ్'గా పిలుస్తారు. చికిత్స కోసం నగరంలోని ప్రధాన కార్పొరేట్ ఆస్పత్రులను సంప్రదించగా... కాలేయ మార్పిడి చేయాలని, అందుకు రూ.20-30 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అంత ఖర్చు భరించే స్తోమత లేక నాగరాజు ఉస్మానియా ఆసుపత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.మధుసూదన్‌ను ఆశ్రయించాడు. పరీక్షలు చేసిన వైద్యులు... కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని తొలుత భావించారు. అయితే... కాలేయ దాత కోసం రెండు మాసాలు ఎదురు చూసినా దొరకలేదు. ఈ క్రమంలో కెనడాలోని టొరంటో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో ఇటీవల ప్రపంచంలోనే తొలిసారిగా ఇదే వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి 'ఆటో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ లివర్' పద్ధతిలో శస్త్రచికిత్స చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో డాక్టర్ మధుసూదన్ బృందం ఈ తరహా శస్త్రచికిత్సకు సిద్ధమైంది. 25 మంది వైద్యులు... 10 గంటలు... ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్సలకు కావాల్సిన నిధులను సమకూర్చారు. ప్రభుత్వ అనుమతితో ఈ నెల 13న ఛాతీ కింది భాగంలోని కాలేయాన్ని పూర్తిగా కత్తిరించి, బయటకు తీసి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్స్ దగ్గర దాన్ని భద్రపరిచారు. కాలేయంలో పూడుకుపోయిన అంతర్గత రక్తనాళాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో కాళ్లు, పొట్ట భాగం రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్‌లను క్లియర్ చేశారు. ఇలా శరీరం పునరుద్ధరించిన కాలేయాన్ని తిరిగి అదే వ్యక్తికి అదేచోట విజయవంతంగా అతికించారు. ఇందు కోసం 25 మందితో కూడిన వైద్య బృందం సుమారు 10 గంటలు శ్రమించినట్లు మధుసూదన్ తెలిపారు. బాధితుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని, గురువారం డిశ్చార్జ్ కానున్న అతను జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందన్నారు. -
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్
మద్యంతో లివర్ దెబ్బతింది... చికిత్స సాధ్యమేనా? మా నాన్నకు 48 ఏళ్లు. మద్యపానం అలవాటు వల్ల లివర్ బాగా పాడైపోయిందని డాక్టర్ చెప్పారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అవసరముంటుందా? దయచేసి తెలపండి. - విజేందర్, వరంగల్ మద్యపానం వల్ల శరీరంలో ముందుగా పాడయ్యేది లివరే. అలవాటుగా రోజూ మద్యం తాగేవారిలో లివర్ దెబ్బతింటుందని గుర్తించడం చాలా అవసరం. మీ నాన్న విషయానికి వస్తే ముందుగా ఆయన లివర్ ఏ మేరకు దెబ్బతిన్నదో చూడాలి. కామెర్లు, ట్యూమర్స్ (గడ్డలు), సిర్రోసిస్, హెపటైటిస్ వంటి కారణాలతో లివర్ దెబ్బతింటుంది. లివర్ పూర్తిగా గట్టిపడిపోయి రాయిలా మారిపోయిన స్థితిలో దానిని క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. లివర్ పూర్తిగా నాశనమైపోయి పనిచేయనప్పుడు మాత్రమే లివర్ మార్పిడి సర్జరీ అనివార్యం అవుతుంది. అయితే దానికంటే ముందుగా దెబ్బతిన్న లివర్‌ను కాపాడేందుకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మద్యపానం వల్ల లివర్ దెబ్బతిన్న కేసులలో ఓ ఆర్నెల్లపాటు ఆ పేషెంట్‌ను మద్యానికి దూరంగా ఉంచి చికిత్స చేయడం ద్వారా లివర్‌ను కాపాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ నాన్న విషయంలో కూడా అది సాధ్యమే. ముందుగా ఆయనచేత వెంటనే మద్యం మాన్పించి దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుకు చూపించి చికిత్స ప్రారంభించండి. నా వయసు 40 ఏళ్లు. నేను ఈమధ్య రొటీన్‌గా చేయించుకున్న వైద్యపరీక్షలలో గాల్‌బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. కానీ నాకు కడుపునొప్పి వంటి ఎలాంటి లక్షణాలూ కనపడలేదు. ఇప్పుడు రాళ్లను తొలగించడానికి సర్జరీనే ఉత్తమ పరిష్కారం అని డాక్టర్ అంటున్నారు. మీ సలహా ఏమిటి? - జయలక్ష్మి, కర్నూలు లివర్‌కు అనుసంధానమై సంచి మాదిరిగా ఉండే నిర్మాణమే గాల్‌బ్లాడర్. ఇది పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. రకరకాల కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. మీ విషయం తీసుకుంటే మీకు కడుపులో ఎలాంటి నొప్పిలేదు కాబట్టి వీటిని లక్షణాలు కనిపించని గాల్‌స్టోన్స్ అంటారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన జబ్బుతో బాధపడే కొందరు పేషెంట్లకు ఉదరం కుడివైపు ఎగువభాగాన తీవ్రమైన నొప్పివస్తుంది. అలాగే కామెర్లు, తీవ్రమైన పాంక్రియాటిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో కీహోల్ సర్జరీ ద్వారా మొత్తం గాల్‌బ్లాడర్‌ను తీసివేయాలని సూచిస్తాం. మీ విషయానికి వస్తే, మీకు కడుపునొప్పి లాంటి లక్షణాలు ఏవీ కనిపించనందున మీకు అసలు చికిత్స అవసరం లేదు. పిత్తాశయంలో రాళ్లకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించని పేషెంట్లలో కేవలం మూడింట ఒక వంతు మందికి మాత్రమే తర్వాతికాలంలో సర్జరీ అవసరమవుతుంది. -
విజయవంతంగా కాలేయ మార్పిడి
దోమలగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి కాలేయాన్ని రోగికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. శనివారం సాయివాణి ఆసుపత్రి ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్వీ రాఘవేంద్రరావు ఆపరేషన్ వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతూ దోమలగూడలోని సాయివాణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. డాక్టర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో వైద్యులు శ్రీనివాస్, ఆకాష్ చౌదరి, అనస్థటిషియన్ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ బృందం ఆయనను పరీక్షించి కాలేయ మార్పిడి తప్పదని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 22 న జీవన్‌ధాన్ పథకం ద్వారా విజయవాడలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ యువకుడి సమాచారం తెలుసుకున్న ఈ బృందం అక్కడికి చేరుకుంది. ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి బ్రెయిన్‌డెడ్ వ్యక్తి కాలేయాన్ని వేరు చేసి విమానం ద్వారా నగరానికి తీసుకువచ్చారు. దాదాపు 9 గంటల పాటు వైద్యుల బృందం విజయ్‌కుమార్‌కు సర్జరీ చేసి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచిన అనంతరం సాధారణ వార్డుకు మార్చారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించినట్లు రాఘవేంద్రరావు తెలిపారు. -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
హెపటైటిస్-బితో లివర్ చెడిపోతుందా? నా వయసు 30 ఏళ్లు. నేను ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా దగ్గర నిర్వహించిన ఒక మెడికల్ క్యాంప్‌లో హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ అని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? ఈ వ్యాధి మందులతో తగ్గుతుందా? - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు హెపటైటిస్-బి అనే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంతమాత్రాన కాలేయం చెడిపోదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి కాలేయం చెడిపోయే అవకాశం ఉంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్, హెచ్‌బీవీ డీఎన్ఏ టెస్ట్ చేయించండి. వీటివల్ల వైరస్ ఏ దశలో ఉందో తెలుస్తుంది. ఒకవేళ హెచ్‌బీవీ డీఎన్ఏ ఎక్కువగా ఉండి, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో కూడా తేడా వస్తే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవండి. నేను వృత్తిరీత్యా గోల్డ్‌స్మిత్‌ను. నా కూతురి వయసు 16 ఏళ్లు. మూడు నెలల క్రితం పొరబాటున గ్లాసులో ఉన్న తేజాబ్ ద్రావణం (యాసిడ్) తాగేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాను. కానీ ప్రస్తుతం ఆహారం మింగడం కష్టంగా ఉందని చెబుతోంది. ఎందుకని ఆహారం సాఫీగా జారడం లేదో అర్థం కావడం లేదు. దయచేసి మా అమ్మాయి సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - ఒక సోదరుడు, ఊరి పేరు రాయలేదు మీ అమ్మాయి తేజాబ్ ద్రావణం తాగిందని అంటున్నారు. దాని వల్ల అన్నవాహికలో యాసిడ్ విడుదలై స్ట్రిక్చర్ డెవలప్ అయి ఉండవచ్చు. అంటే అన్నవాహిక సన్నబడి ఉండవచ్చు. దాంతో అన్నవాహిక నుంచి జీర్ణాశయానికి ఉన్న దారి మూసుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే మీ అమ్మాయికి వాంతులు అవుతున్నాయా లేదా అన్న విషయం మీరు రాయలేదు. ఒకవేళ వాంతులు లేకుండా కేవలం ఆహారం మింగడం కష్టంగా ఉంటే ఎండోస్కోపీ డయలటేషన్ అనే ప్రక్రియ ద్వారా సన్నబడిన ఆహార వాహిక మార్గాన్ని వెడల్పు చేసి చికిత్స చేయవచ్చు. ఈ ప్రక్రియను రెండువారాలకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. ఈ చికిత్స వల్ల ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆహారం తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
హృదయం 20 వేలు.. కాలేయం 5 వేలు
మీరట్: 'తాజా లీవర్ (కాలేయం) కావాలా.. ఐతే ఐదువేలివ్వు. ఇంకా తక్కువ ధరకంటే.. రెండు వేలు. సరుకు నెల రోజుల కిందటిది. గుండె (హృదయం) విషయంలో మాత్రం బేరాల్లేవ్. కచ్చితంగా 20 వేలు ఇవ్వాల్సిందే' ఈ సంభాషణ దేనిగురించో ఇప్పటికే అర్థమైందికదా. అవును. మనుషుల అవయవాల గురించే. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రభుత్వాసుపత్రుల మార్చురీలనుంచి అవయవాలను దొంగిలించి మంత్రగాళ్లకు రహస్యంగా అమ్ముకుంటోన్నఆసుపత్రి సిబ్బంది బండారం ఓ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. పైన పేర్కొన్న మాటలు శవాల అమ్మకందారులు మాట్లాడినవి. మీరట్ పరిధిలోని పలు సర్కారీ దవాఖానల్లో మార్చురీల నుంచి తరచూ శవాలు, వాటిలోని అవయవాలు మాయమవుతున్నాయి. దొంగిలించిన అవయవాల్ని మంత్రగాళ్లకు అమ్ముతున్నట్లు పుకార్లు చెలరేగాయి. ఈ దురాగతాలను వెలుగులోకి తేవాలనుకున్న స్థానిక యువకులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా అవయవాల అమ్మకాల గుట్టును రట్టుచేశారు. పథకం ప్రకారం రహస్య కెమెరాలతో బేరగాళ్లుగా మారి ఆసుపత్రులకు వెళ్లి మార్చురీకి వెళ్లి బేరసారాల వ్యవహారాల్ని రికార్డుచేసి పోలీసులకు అప్పజెప్పారు. 'అసలు ఇలాంటివి జరుగుతాయన్న విషయమే ఊహకందనిది. నా ఆసుపత్రిలో ఇలాంటివి చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఇకపై పోలీసుల అనుమతిలేనిదే మార్చురీలో శవాలను ముట్టుకోకూడదని ఆదేశాలు జరీచేశాను' అని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రమేశ్ చంద్ర మీడియాకు చెప్పారు. ఘటనలపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. -
కాలేయ పునరుత్పత్తికి మందు!
న్యూయార్క్: కాలేయం, పెద్ద పేగు, ఎముక మజ్జ క్షీణిస్తే.. వాటిని తిరిగి బాగుచేయొచ్చు. ఇందుకు ఉపయోగపడే ఓ ఔషధాన్ని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ఎస్డబ్ల్యూ033291’ అనే ఈ మందుతో ఎలుకలపై ప్రయోగించగా.. కణజాలాన్ని చాలా వేగంగా పునరుత్పత్తి చేసి దెబ్బతిన్న అవయవాలను పునరుద్ధరించిందని వారు వెల్లడించారు. ఎముక మజ్జ క్షీణించి చనిపోయే దశకు చేరిన ఎలుకలు సైతం ఈ ఔషధంతో కోలుకున్నాయని వర్సిటీ పరిశోధకుడు మార్కోవిజ్ తెలిపారు. కణజాలాన్ని ఉత్పత్తి చేసే మూలకణాలకు ఈ మందు విటమిన్‌లా పనిచేస్తుందన్నారు. ఈ ఔషధంతో అనేక వ్యాధులకు సమర్థమైన చికిత్స చేయవచ్చన్నారు. ప్రస్తుతం దీనిని మనుషుల్లో ఉపయోగించేందుకు అభివృద్ధిపరుస్తున్నామని తెలిపారు. కాగా, కణజాలాలను ఉత్పత్తి చేసే మూలకణాల వ్యాప్తికి ఉపయోగపడే ప్రోస్టగ్లాండిన్ ఈ2(పీజీఈ2) అనే అణువుల మాదిరిగా పనిచేసేలా ఈ మందును తయారు చేశారు. పీజీఈ2 అణువుల సంఖ్య పెరిగేందుకు లేదా తగ్గేందుకు 15-పీజీడీహెచ్ అనే జన్యువు ప్రభావం చూపుతుందని గతంలో తేలింది. అయితే, తాజా పరిశోధనలో ఆ జన్యువును క్రియారహితం చేసేలా ఎస్డబ్ల్యూ033291 ఔషధాన్ని తయారు చేశారు. ఇదిలాఉండగా.. ఎముకల క్షీణతను నివారించేందుకు గాను ఫ్లోరిడాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఓ కొత్త చికిత్సను కనుగొన్నారు. ఎముకల క్షీణత ఉన్న రోగుల్లో ఈ చికిత్స ద్వారా.. ఓ ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా కొత్త ఎముకను ఏర్పర్చే కణాలను అభివృద్ధిపర్చవచ్చని వారు తెలిపారు. -
లివర్... సెంటర్ ఫర్ పవర్
ట్రివియా మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి, ఇది పోషకాల ఖజానా. మనం తినే ఆహారంలోని విటమిన్లు, ఐరన్ సహా ఖనిజ లవణాలను నిల్వ ఉంచుకుని, నిరంతరం శరీరానికి సరఫరా చేస్తుంది. శరవేగమైన ప్రాసెసర్ గల సూపర్ కంప్యూటర్ స్థాయిలో పనిచేసే అవయవం లివర్ మాత్రమే. మెదడుకు గ్లూకోజ్ సరఫరా చేయడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం, పోషకాలను నిల్వ చేసుకోవడం వంటి దాదాపు రెండువందల పనులను ఏకకాలంలో చేస్తుంది. లివర్ పదిశాతం కొవ్వుతో తయారై ఉంటుంది. లివర్‌లో కొవ్వు అంతకు మించిన పరిస్థితినే ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఫ్యాటీ లివర్ పరిస్థితి ఏర్పడితే టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. శరీరంలోని మాలిన్యాలను, విషపదార్థాలను లివర్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఆల్కహాల్, ఇతర మాదక పదార్థాల వల్ల శరీరానికి కలిగే అనర్థాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.మన శరీరంలో ప్రవహించే రక్తంలో పది శాతం లివర్లోనే ఉంటుంది.మన శరీరంలో తిరిగి పెరిగే సామర్థ్యం ఉన్న ఏకైక అవయవం లివర్ మాత్రమే. ఒకవేళ సగానికి పైగా దెబ్బతిన్నా, ఇది పూర్తిగా పెరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అందుకే అవసరంలో ఉన్న ఇతరులకు లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసినా, ఎలాంటి ఇబ్బంది ఉండదు.యంత్రాలలో బ్యాటరీ పనిచేసినట్లే, మన శరీరంలోని లివర్ పనితీరు ఉంటుంది. ఇది చక్కెరను నిల్వ చేసుకుని, శరీర అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తూ ఉంటుంది. లివర్ ఈ పని సమర్థంగా చేయకుంటే, రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయి, కోమాలకు చేరుకునే ప్రమాదం ఏర్పడుతుంది. -
గ్రీన్ కార్పెట్‌తో ‘గ్లోబల్’కు కాలేయం తరలింపు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా.. లివర్‌ను గ్రీన్కార్పెట్తో హైదరాబాద్ లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించి ఓ వ్యక్తికి అమర్చారు. విశాఖపట్నం నివాసి సత్యనారాయణ (53) ఈ నెల 26న రోడ్డుప్రమాదానికి గురవగా.. అక్కడి సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు తరలించారు. 27న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్‌దాన్ చైర్మన్, ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్ కష్ణమూర్తిల సహకారంతో అవయవదానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా మంగళవారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్లు మాథ్యూ జేకబ్, డాక్టర్ రాఘవేంద్ర, మురగన్ రాజన్నల బృందం అవయవాలను శరీరం నుంచి వేరు చేశారు. ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ హాస్పిటల్‌కు తరలించారు. లివర్‌ను గ్రీన్ కార్పెట్ సాయంతో లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో నగరంలో నివాసముండే 63 ఏళ్ల వ్యక్తికి లివర్‌మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్ హీరేంద్రనాథ్ తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల పోలీసులు లివర్ తరలించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం వల్లే సకాలంలో హాస్పిటల్‌కు లివర్‌ను తరలించగలిగామని తెలిపారు. -
తెల్లనివన్నీ పాలు కావు..!
మీకు పాలలా కనిపిస్తున్న ఆ ద్రవం పాలు కాకపోవచ్చు. సంపూర్ణాహారంగా భావించి మీరు తాగుతున్న ఆ పానీయం విషాహారం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాలనూ కల్తీ చేసి, లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు ఎన్నో ఉన్నాయి. సింథటిక్ పాలుగా పేర్కొంటున్న ఇవి ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా... బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. సింథటిక్ పాలలో వాడే పదార్థాలు, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మనదేశం ఒకటి. కానీ ఇందులో దాదాపు 70 శాతం పాలు కల్తీవే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కల్తీ మాత్రమే కాదు... అవి కృత్రిమపాలు. ఈ పాలనే ఇంగ్లిష్‌లో సింథటిక్ మిల్క్ అంటారు. సింథటిక్ మిల్క్ అంటే...? ఆవు లేదా గేదె పొదుగునుంచి పితికిన పాలు స్వాభావికమైన పాలు అనీ, కృత్రిమ పదార్థాలతో, కృత్రిమమైన రసాయనాలతో పాల రూపు వచ్చేలా తయారు చేసిన ద్రవాన్ని ‘సింథటిక్ మిల్క్’ అనీ అంటారు. సింథటిక్ పాలలో ఏమేం వాడతారు... సింథటిక్ పాల తయారీలో నీరు, కాస్టిక్ సోడా, యూరియా, గ్లూకోజ్, గంజి పొడి, చవకరకం వంటనూనె/రిఫైన్డ్ ఆయిల్, స్టార్చ్ ఆయిల్, డిటర్జెంట్, కుంకుళ్లు, షాంపూ, తెల్లరంగు, బంక, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి పదార్థాలు వాడతారు. ఇందులో పాలను పైనుంచి ధారగా పోస్తున్నప్పుడు నురగ వచ్చేందుకు డిటర్జెంట్/కుంకుడుకాయలు వాడతారు. ఇక అందులో వాడే ఆమ్ల పదార్థాలను నిర్వీర్యం చేయడానికి కాస్టిక్ సోడాను ఉపయోగిస్తారు. రవాణా ప్రక్రియలో పాలు చెడిపోయి/విరిగిపోయి పుల్లబారిపోకుండా ఉండేందుకూ కాస్టిక్‌సోడా ఉపయోగపడుతుంది. చవకరకం వంటనూనెను పాలలోని సహజ కొవ్వుపదార్థంలా అనిపించేందుకు వాడతారు. స్వాభావికమైన పాలరుచి రావడానికి యూరియానూ, తెల్లరంగు రావడానికీ, చిక్కగా అనిపించడానికి తెల్ల పెయింట్నూ ఉపయోగిస్తారు. గమ్ అకేషియా, గమ్ లెగ్యూమినస్ తరహాలకు చెందిన బంకను సైతం పాలను చిక్కగా అనిపించేలా చేయడానికి వాడతారు. దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచేలా చూసేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వాడతారు. ఇలా తయారు చేసిన సింథటిక్ పాలు పూర్తిగా స్వాభావికమైన పాలలాగే కనిపిస్తాయి. అయితే స్వాభావికమైన పాలలో ఉండే పోషక విలువలేవీ ఈ పాలలో ఉండవు. ఇలా తయారు చేసిన పాలను గ్రామాల్లోని ‘డైరీ కో-ఆపరేటివ్ సొసైటీ’ల ఆధ్వర్యంలో నడిచే పాల సేకరణ కేంద్రాలలో ఉంచే పాలలో కలిపేస్తారు. అందులో అవి తేలిగ్గా కలిసిపోతాయి కూడా. లాభార్జన కోసమే ఈ అక్రమ మార్గం ఒక లీటరు సింథటిక్ పాలను తయారుచేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 5 మాత్రమే. మార్కెట్లో లీటరు పాల ధర దాదాపు 40 వరకు ఉంటుంది. స్వాభావిక పాలను విక్రయిస్తే వచ్చే లాభం కేవలం రూ. 10 నుంచి రూ.15 మాత్రమే. కానీ సింథటిక్ పాలను విక్రయిస్తే వచ్చే లాభం రూ. 35. అందుకే అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనకు పాల్పడేవారు తోటివారి ఆరోగ్యాలనూ, ప్రాణాలను లెక్కచేయకుండా తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యానికి ఎంత నష్టం... ఈ సింథటిక్ పాల వల్ల అన్ని విధాలా ఆరోగ్యానికి నష్టమే. ముఖ్యంగా గర్భవతులైన మహిళల ఆరోగ్యంతో పాటు లోపలి పిండానికీ ఇది నష్టమే. ఇక గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి ఇవి మరింత నష్టం చేస్తాయి. పైగా అనేక రకాల క్యాన్సర్లకు మూలకారణం కూడా. పిల్లల ఆరోగ్యం బాగుండాలని తల్లులు పట్టుబట్టి ఈ పాలు తాగిస్తుంటారు. కానీ తమ పిల్లలకు తామే విషాన్ని పడుతున్నామన్న సంగతే వారికి తెలియదు. ఈ పాలను తాగడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి క్రమంగా సన్నగిల్లి చిన్నవయసులోనే ఎన్నో వ్యాధులకు గురవుతారు. సింథటిక్ పాల వల్ల కళ్లకూ, కాలేయానికీ ప్రమాదం. రసాయన పరీక్షలతో సింథటిక్ పాలను గుర్తించే ప్రక్రియలు ⇒పాలలో యూరియా కలిసి ఉంటే 5 ఎమ్ఎల్ శాంపిల్‌ను తీసుకుని దానికి 5 ఎమ్ఎల్. పారాడైమిథైల్ అమైనో బెంజాల్డిహైడ్ కలిపితే ఆ ద్రావణం పసుపురంగుకు మారితే ఆ పాలలో యూరియా ఉన్నట్లు అర్థం. ⇒ఐదు ఎమ్ఎల్ పాల శాంపిల్‌ను తీసుకుని, దానికి 0.1 ఎమ్ఎల్ బ్రోమోక్రెజాల్ పర్పుల్ ద్రావణాన్ని కలపాలి... ఒకవేళ ఆ మిశ్రమం వంకాయ రంగుకు మారితే అందులో డిటర్జెంట్ ఉన్నట్లు అర్థం. ఒకవేళ అందులో డిటర్జెంట్ లేకపోయినా ఆ ద్రావణం వయొలెట్ రంగుకు మారుతుంది కానీ అది చాలా లేత వంకాయ రంగులో ఉంటుంది. ⇒రసాయన పరీక్షలు ఇంట్లో సాధ్యం కాకపోయినా ఇలా స్వాభావిక లక్షణాలను కొంతకాలం పాటు నిశితంగా గమనిస్తూ పై లక్షణాలను బట్టి మీ పాలు స్వాభావికమైనవో, సింథటిక్ పాలో తెలుసుకోండి. దానికి అనుగుణంగా ఆ పాలను కొనసాగించడమా లేదా బ్రాండ్ మార్చడమా అన్నది నిర్ణయించుకోండి. సింథటిక్ పాలలోని కాస్టిక్సోడాతో ప్రమాదాలివి... ⇒ హైబీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి ఇందులో ఉండే సోడియమ్ స్లోపాయిజన్‌లా పని చేస్తుంది. ⇒నోరు, గొంతు, ఈసోఫేగస్, కడుపు వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఉండే మ్యూకస్‌ను దెబ్బతీస్తుంది. ⇒గాలి గొట్టాలను దెబ్బతీసి... ఊపిరి పీల్చే ప్రక్రియపై అవాంఛిత ప్రభావాలు చూపుతుంది. ⇒కొందరిలో ఈ సింథటిక్ పాలు తాగగానే గొంతు వాపు వచ్చే అవకాశం ఉంది. ⇒నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంది. యూరియాతో అనర్థాలివి... ⇒కిడ్నీలపై యూరియా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపి వాటిని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆ యూరియాను తొలగించడానికి కిడ్నీలు చాలా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దాంతో నెఫ్రాన్లు దెబ్బతింటాయి. ⇒గుండె, కాలేయాలను దెబ్బతీస్తుంది. డిటర్జెంట్లతో హాని ఇలా... ⇒స్వల్పంగా లేదా తీవ్రంగానూ కడుపునొప్పి రావచ్చు. ⇒ఇందులోని క్షారగుణం వల్ల మనం తీసుకునే ప్రోటీన్లు దెబ్బతింటాయి. -
స్టెమ్‌సెల్స్‌తో కొత్త రక్తనాళాలు
ప్రయోగాత్మకం లండన్‌లోని శాస్త్రవేత్తలు స్టెమ్‌సెల్స్‌తో ప్రయోగాత్మకంగా నిర్వహించిన శస్త్రచికిత్స సత్ఫలితాలనిచ్చింది. జీర్ణాశయం, పేగుల నుంచి కాలేయానికి రక్తాన్ని సరఫరా చేయాల్సిన నాళాలు లేకపోవడంతో స్టెమ్‌సెల్స్ ద్వారా సేకరించిన రక్తం ఆధారంగా దేహంలో రక్తనాళాలు ఆవిర్భవించేటట్లు చేశారు. కొత్తగా రూపొందిన రక్తనాళాలు కాలేయానికి, జీర్ణాశయానికి మధ్య చక్కగా పని చేస్తున్నాయని ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మిఖాయిల్ ఓల్యూసన్ తెలియచేశారు. స్టెమ్సెల్స్ని భద్రపరుచుకుంటే ఇలాంటి అవసరాలకు ఎముకల నుంచి బోన్‌మ్యారో సేకరించాల్సిన అవసరం ఉండదని కూడా చెప్పారు. -
లవ్ యువర్ లివర్
జీర్ణవ్యవస్థకూగ కాలేయానికీ అవినాభావ సంబంధం ఉంది. శరీరంలో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించడంలో కాలేయం పాత్ర కీలకమైంది. అలాంటి కాలేయం విషయంలో చేసే తప్పులు మనిషిని రోగాల రొంపిలోకి దింపుతున్నాయి. శరీరంలో వెలువడే టాక్సిన్స్ (విష పదార్థాలను) సైతం విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు పంపించి నిలువెత్తు శరీరానికి ఆప్తుడిగా ఉండే కాలేయం (లివర్) ఆపదలో పడిపోతోంది. బిజీలైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న నగరజీవి తమకు తెలియకుండానే లివర్‌ను ముప్పులోకి నెడుతున్నాడని చెబుతున్నారు వైద్యులు. నగరంలో రోజూ పదివేల మంది పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్తుంటే అందులో 2 వేల మంది జీర్ణవ్యవస్థ, లివర్‌కు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నవారే. మిగతా అవయవాల పరిస్థితి పక్కన పెడితే లివర్‌ను కాపాడుకోవడమనేది పక్కాగా మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు డాక్టర్లు. లివర్ మీద ప్రెషర్ పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనిషి మనుగడకు ఢోకా ఉండదని చెబుతున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డా.ఆర్వీ రాఘవేంద్రరావు. లివర్‌కు ముప్పు ఇక్కడ్నుంచే * నగరంలో రోజురోజుకూ మద్యం సేవించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. మితిమీరి మద్యం సేవించడం కారణంగా చాలా మంది లివర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. * హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ సోకినపుడు లివర్ జబ్బులకు కారణమవుతున్నాయి. * కొన్ని జన్యుపరమైన సమస్యలు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణం అవుతున్నాయి. * కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ల కారణంగా కాలేయంలో చిన్న చిన్న సిస్ట్స్ (చిన్న చిన్న బుగ్గలు) ఏర్పడుతున్నాయి. ఇవి ప్రమాదానికి దారితీస్తున్నాయి. * ఆల్కహాల్ దీర్ఘకాలంగా వాడితే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తోంది. అంటే లివర్ పనితీరు తగ్గిపోవడం, పూర్తిగా పనిచేయకుండా పోతుంది. * పస్తుతం ఎక్కువగా చిన్నపిల్లల్లో లివర్‌కు సంబంధించి హెపటో బ్లాస్టోమా, పెద్దవారిలో హెపటో సెల్యులర్ కార్సినోమా వస్తోంది * నగరాల్లో ఈటింగ్ హాబిట్స్ కూడా లివర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. * పదేళ్లలో రకరకాల కారణాల వల్ల లివర్ కేన్సర్ తీవ్రమవుతున్నట్టు స్పష్టమైంది. నివారణ మన చేతుల్లోనే.. * లివర్‌ను కొద్దిగా తీసి ఇతరులకు అమర్చినా మళ్లీ పూర్వస్థితిని చేరుకునే అవయవం ఇదొక్కటే. అం టే శరీరంలో ఇలాంటి సహాయకారి మరొకటి లేదు. దీన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. * మద్యానికి దూరంగా ఉండటం మంచిది. * మద్యం సేవించే వారు తరచూ లివర్ టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే ఈఎస్‌ఎల్‌డీ (ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్-దీన్నే ఆల్కలిక్ లివర్ సిరోసిస్ అంటాం) వస్తే ప్రమాదం. * ఏ వయసు వారైనా హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వైరస్‌లకు ఇంజెక్షన్లు వేయించుకోవాలి. * ఈ వైరస్లు ఉన్నాయో లేవో పరీక్షలు చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి. * మేనరికం సంబంధాలు చేసుకుని ఉంటే వారు జెనెటిక్స్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. * వీలైనంత వరకూ వేపుళ్లు, ప్రిజర్వేటివ్ ఫుడ్స్‌ను తీసుకోవడం తగ్గించాలి * ఒంట్లో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి * వీలైనంత వరకూ మాంసాహారాన్ని తగ్గించి తినడం మంచిది -
దయతలిస్తే.. ప్రాణం నిలుస్తది
అతనో అద్భుత నైపుణ్యమున్న నేత కార్మికుడు. ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆయన ‘ఖరీదైన’రోగంతో మంచం పట్టాడు. ఫలితంగా ఆ ఇంట చీకట్లు అలముకున్నాయి. కుటుంబ పెద్దదిక్కు మంచానికే పరిమితం కావడంతో కుటుంబ భారాన్ని నెత్తిపై వేసుకుని ఓ వైపు భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు పిల్లలను సాకుతూ బతుకుబండిని నెట్టుకొస్తోందా ఇల్లాలు. భర్త ప్రాణాలు కాపాడే దాతల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. - బచ్చన్నపేట మండలంలోని చినరామన్‌చర్ల శివారు గోపాల్‌నగర్‌కు చెందిన చక్రాల యాదగిరి(45) నేత కార్మికుడు. అతని భార్య మణెమ్మ. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 20ఏళ్లుగా వృత్తినే నమ్ముకున్న యాదగిరి ఉన్నంతలో కుటుంబాన్ని పోషిస్తూ హాయిగా జీవించేవారు. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి చీకట్లు ప్రవేశించాయి. కొన్నేళ్ల క్రితం ఓ రోజు హఠాత్తుగా కడుపులో నొప్పి రావడంతో జనగామలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన యాదగిరిని..పరీక్షల అనంతరం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు. దీంతో చేసేది లేక దొరికిన చోటల్లా అప్పులు చేసి భర్తను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించింది భార్య మణెమ్మ. వివిధ పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయింది. కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. కాలేయం పాడైపోయి.. గుండె వాచిపోయి.. యాదగిరికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన కాలేయంలో ఓ పక్కన పాడైపోయిందని, గుండె వాచిపోయిందని చెప్పారు. కాలేయం మార్పిడికి రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక భర్తను ఇంటికి తీసుకొచ్చింది మణెమ్మ. అప్పటికే పరీక్షలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. మూడు లక్షల వరకు అప్పుచేసి ఖర్చుచేయడంతో ఇప్పుడా కుటుంబం దుర్భర పరిస్థితి అనుభవిస్తోంది. ప్రస్తుతం ఇంటివద్దే ఉన్న యాదగిరి.. కాళ్లు ఉబ్బిపోయి రెండు అడుగులు కూడా వేయలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. భర్త పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న భార్య మణెమ్మ.. కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతూ వచ్చిన డబ్బులతో మందులు కొంటూ భర్త ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. పతిభిక్ష పెట్టరూ.. రోజురోజుకు చావుకు దగ్గరవుతున్న తన భర్త ప్రాణాలను కాపాడాలని యాదగిరి భార్య మణెమ్మ చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. నెలనెలా ఆస్పత్రి ఖర్చులకే రూ. ఆరేడు వేలు ఖర్చవుతున్నాయని కన్నీళ్ల పర్యంతమైంది. బీడీలు చుడితే తప్ప నోట్లోకి ముద్దపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రోజురోజుకీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండడంతో దయగల దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని అర్థిస్తోంది. భర్త ప్రాణాలు కాపాడి తనకు పతిభిక్ష ప్రసాదించాలని వేడుకుంటోంది. యాదగిరి కుటుంబానికి ఆర్థికసాయం అందించదలచిన దాతలు 95053 52850 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చు. -
అవయవమార్పిడి అద్భుతం
సాక్షి, ముంబై: బ్రెయిన్‌డెడ్ వల్ల మరణించిన ముగ్గురు రోగుల బంధువులు సరైన సమయంలో అవయవదానం చేయడం వల్ల 38 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలను డాక్టర్లు నిలబెట్టగలిగారు. ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన దాదాపు 50 మంది వైద్యులు ఈ అవయాలను సేకరించారు. అవసరమైన రోగులకు అమర్చి వారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందుకు గాను జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ కమిటీ (జెడ్టీసీసీ) కూడా తమ సహకారం అందజేసింది. మృతదేహాల నుంచి చట్టబద్ధంగా అవయవాలను సేకరించే వారికి ఈ సంస్థ తోడ్పాటునిస్తోంది. బ్రెయిడ్‌డెడ్ అయిన వారి దేహాల నుంచి అవయవాలను దానం చేస్తే చాలా ఉపయోగముంటుందన్న విషయంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని సీనియర్ డాక్టర్ ఒకరు పేర్కొన్నారు. ఇదిలా వుండగా, గత ఏడాది నగరంలో 20 శవదానాలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 41 కిడ్నీ దానాలు, 20 కాలేయదానాలు (ఆర్గాన్ డొనేషన్) నమోదయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 2013లో 36 కిడ్నీ దానాలు, 19 కాలేయదానాలు నమోదయ్యా యి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 36,791 అవయవదానాలు నమోదయ్యాయని జెడ్టీసీసీ తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ముంబైలో శవదానాలు 20 నుంచి 23 వరకు నమోదయ్యాయి. కిడ్నీల కోసం 3,079 మంది వెయిటిం గ్ లిస్టులో ఉండగా, కాలేయం కోసం 212 మంది బాధితులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఖార్‌కు చెందిన ఓ 58 ఏళ్ల మహిళ ఇటీవల మరణించగా, ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ అవయవాలను ఈ మహిళ కూతురు పీడీ హిందుజా ఆస్పత్రికి అందజేశారు. అయితే తాను మరణించిన తర్వాత కళ్లను దానం చేయాల్సిందిగా తల్లి కోరినట్లు ఆమె పేర్కొంది. మిగతా వాళ్లు కూడా తమ అవయవాలను దానం చేయాలన్న డాక్టర్ల విజ్ఞప్తికి మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించడం విశేషం. గుండె, ఊపిరితిత్తులు కూడా దానం చేసినట్లు ఆస్పత్రికి చెందిన అవయవ మార్పిడి సమన్వయాధికారి డాక్టర్ సుచేత దలాల్ తెలిపారు. ఇదిలా వుండగా సదరు మహిళ ఇంట్లో వంట చేస్తుండగా మెదడులో రక్తస్రావం కావడంతో స్మృహ తప్పి పడిపోయింది. అయితే ముంబైలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) సదుపాయం లేదు. దీంతో కేవలం కిడ్నీలు, కాలేయాన్ని మాత్రమే తీసుకున్నారు. సదరు మహిళ కిడ్నీని ఓ 53 ఏళ్ల వ్యక్తికి మార్పి డి చేశారు. ఇటీవలే ఇతని కాలేయం, కిడ్నీ పాడైపోవడంతో అతనికి మార్పిడి చేసినట్లు వైద్యురాలు పేర్కొంది. మరోకిడ్నీని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరికి దానం చేసినట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు. -
కాలేయంలో కణతుల తొలగింపు
అరుదైన శస్త్రచికిత్స చేసిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : కాలేయంలో అరుదుగా ఏర్పడే కణతులను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు తొలగించి మహిళకు తిరిగి ప్రాణాలు పోశారు. అనంతపురం జిల్లా చర్లపల్లి గ్రామానికి చెందిన ఇ.సిద్దమ్మ(35) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు గత నెల 29న చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చారు. జనరల్ సర్జరీ విభాగం ఐదో యూనిట్ వైద్యులు ఆమెను పరీక్షించి కాలేయంలో కణతులు ఏర్పడినట్లు గుర్తించారు. గర్భాశయంపై కూడా ఇదే విధమైన కణతులు కనుగొన్నారు. ఆమెకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించి సోమవారం ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ విషయమై ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ జిలానీ మాట్లాడుతూ లివర్, గర్భసంచిపైన హైడాటిడ్ సిస్ట్లు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయన్నారు. కలుషితమైన కూరగాయలు సరిగ్గా శుభ్రం చేయకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయన్నారు. కాలే యం వద్ద రెండు, గర్భాశయం వద్ద ఒక కణతిని తొలగించినట్లు చెప్పారు. ఆపరేషన్ చేసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణనాయక్, పీజీ డాక్టర్ మూర్తి ఉన్నట్లు ఆయన తెలిపారు. -
పొగచూరిన చట్టం
ఒంగోలు, న్యూస్‌లైన్: బస్టాండ్లు..రద్దీ ప్రదేశాలు..ఆస్పత్రి ఆవరణలు.. ప్రభుత్వ కార్యాలయాలు ప్రదేశం ఏదైతేనేమి..గుప్పుగుప్పు మంటూ పొగవదిలే వారు అడుగడుగునా కనబడుతుంటారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగరాదన్న నిబంధనలు ఎక్కడా అమలవడం లేదు. కాట్పా -2003 (సిగిరెట్ అండ్ అదర్ టుబాకో ప్రోడక్ట్స్ యాక్ట్) లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని స్పష్టం చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడం ద్వారా పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.కేసుల నమోదుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసినా ఫలితం లేదు. 40 రకాల ముఖ్యమైన ప్రదేశాల్లో పొగతాగరాదని చట్టం చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం వల్ల తాగే వ్యక్తి కన్నా..దాని ద్వారా వెలువడే పొగ పీల్చడం వల్ల సమీపంలోని వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ధూమపానం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఎక్కువగా దెబ్బతింటాయి. శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు..ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తోడవుతాయి. దేశంలో ఏటా పొగాకు ఉత్పత్తుల వాడకం ద్వారా అనారోగ్యం పాలై మరణించే వారి సంఖ్య పది లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ధూమపానం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ప్రకటనల కోసం 2013 డిసెంబర్లో రూ 45 కోట్లను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగరాదని పెద్ద పెద్ద హోర్డింగ్‌ల రూపంలో ప్రకటనలు ఏర్పాటు చేయాలి. విద్యార్థి దశ నుంచే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలి. జిల్లాలో పరిస్థితి ఇదీ... బహిరంగ ప్రదేశాలలో పొగతాగే వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. మండలాల్లో సంబంధిత మెడికల్ ఆఫీసర్లు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. వీరితోపాటు ఈ చట్టాన్ని పోలీసుశాఖ కూడా అమలుచేయవచ్చు. అయితే 2011 మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హడావుడి చేసిఏడుగురికి జరిమానా విధించారు. ఆ తరువాత ఆ ఊసేలేదు. ఇక పోలీసు శాఖ కొత్తపట్నం బీచ్ ఒడ్డున సిగిరెట్ తాగుతున్న ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను 2008లో సస్పెండ్ చేసింది. అదే సంవత్సరం ట్రైనీ డీఎస్పీగా వచ్చిన దామోదర్ బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై దాడులు నిర్వహించి జరిమానాలు విధించారు. ఆయన జిల్లా నుంచి వెళ్లిన తరువాత తిరిగి ఈ చట్టాన్ని అమలుచేసేవారే లేరంటే అతిశయోక్తి కాదు. చీరాల వంటి పలు ప్రాంతాల్లో చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులే నడిరోడ్డుపై పొగతాగుతూ కనిపిస్తుండడం నిత్యకృత్యం. ఒంగోలు నగరంలోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ ధూమపానం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోం ది. కనీసం పొగతాగితే జరిమానా విధిస్తామనే ప్రకటనలు జిల్లాలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఈ ప్రకటనలు కనిపించకపోతుండటం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల్లో ఏ ఒక్కరూ ఈ చట్టం ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయకపోతుండటంతో యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సినిమాహాళ్లలో కొంత మేరకు ధూమపాన నిషేధం అమలవుతోంది. ఈ చట్టం అమలుపై ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
లివర్ సిర్రోసిస్... తగ్గేదెలా?
నా వయసు 57. గత నాలుగు నెలలుగా కొద్దిపాటి కడుపునొప్పి, వాంతి, వికారం, ఆకలి సన్నగిల్లటం, నీరసం వంటి లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని పరీక్షలు చేసిన పిమ్మట డాక్టర్లు ‘లివర్ సిర్రోసిస్’గా నిర్ధారణ చేసి, మందులిచ్చారు. వాడినా పెద్ద ప్రయోజనం కనబడలేదు. ఈ సమస్యకు ఆయుర్వేదంతో పరిష్కారం సూచించ ప్రార్థన. - శరత్చంద్ర, బోధన్ కాలేయాన్ని (లివర్) ఆయుర్వేదంలో ‘యకృత్’గా వర్ణించారు. దీనికి సంబంధించిన వ్యాధులు ఉదర రోగాలలో విశదీకరించారు. జీర్ణక్రియ, ధాతు పరిణామ క్రియ, విష నిరహరణ క్రియ వంటి అత్యంత ప్రధాన కర్మలన్నింటికీ ‘యకృత్’ మూలాధారం. ఒక్కమాటలో చెప్పాలంటే దేహపోషణకు, శరీరరక్షణకు ప్రకృతి ప్రసాదించిన ‘రసాయన కర్మాగారం’ కాలేయం. ఆహార విహారాలను అశ్రద్ధ చేయడం, వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్ల యకృత్ దెబ్బతింటుంది. ఉప్పు, కొవ్వు పదార్థాలను అతిగా తీసుకోవడం, స్థూలకాయం, వ్యాయామం (శ్రమ) లేని జీవనశైలి, కల్తీ ఆహారం, ధూమ మద్యపానాల వంటి మాదకద్రవ్యసేవన, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటివి యకృత్ వ్యాధులకు ప్రధాన కారణాలు. కాలేయ కణాలు నశిస్తూ, క్షీణిస్తూ ఉండటం వల్ల లివర్ పనితీరు దెబ్బతిని, సామర్థ్యవిహీనమవుతుంది. ఇదే ‘సిర్రోసిస్’. ఈ వ్యాధిలోని ఆరంభలక్షణాలు మాత్రమే మీకు ఉన్నాయి. ఇంకా వ్యాధి తీవ్రరూపం దాల్చితే జలోదరం, రక్తపువాంతి, రక్తమొలలు, కిడ్నీ, ఊపిరితిత్తులు పాడవటం కూడా సంభవించవచ్చు. పచ్చకామెర్లు (కామలా) ముందు ప్రారంభమై సరైన చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలను లోతుగా పరిశీలించి అనేక ఓషధుల్ని ఆయుర్వేదం విపులీకరించింది. వాటిలో కొన్ని ప్రధానమైనవి: చిత్రకాదివటి మాత్రలు రెండు పూటలా రెండేసి చప్పరిస్తే వాంతి భ్రాంతి తగ్గి, ఆకలి పుడుతుంది. త్రికటుచూర్ణం (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు): మూడు గ్రాముల మోతాదులో రెండు పూటలా వేడినీళ్లతో సేవిస్తే అజీర్తి తొలగిపోయి, శోషణ క్రియ మెరుగుపడుతుంది. త్రిఫలాచూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ): ఐదు గ్రాముల మోతాదులో నీటితోగాని, తేనెతోగాని, రెండుపూటలా సేవిస్తే కడుపుబ్బరం తగ్గి, విరేచనం సాఫీగా అవుతుంది. నీరసం తగ్గుతుంది. కుమార్యాసవ, భృంగరాజాసవ: ఈ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో కలుపుకొని, సమానంగా నీళ్లు కలిపి, రెండుపూటలా తాగితే యకృత్ క్రియాసామర్థ్యం పెరిగి, కామలా (కామెర్లు) తగ్గుతుంది. పునర్నవారిష్ట ద్రావకాన్ని నాలుగు చెంచాలు తీసుకుని, సమానంగా నీరు కలిపి మూడుపూటలా తాగితే జలోదరం ఉపశమిస్తుంది. యకృత్ సామర్థ్య పుష్టికి మూలికలు: కుమారీ (కలబంద), భృంగరాజ (గంటగలగర), భూమ్యామలకీ (నేల ఉసిరిక), ఆమలకీ (ఉసిరిక), పునర్నవా (గలిజేరు), కటుకరోహిణి, గుడూచి (తిప్పతీగె), చిత్రమూల, కాలమేఘ, హరిద్ర (పసుపు) మొదలైనవి. ఇక... మూసాంబరం, అడ్డసరం రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. గమనిక: ఏ ఓషధిని, ఏ రూపంలో, ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలో వ్యాధి లక్షణాలను, తీవ్రతను బట్టి ఆయుర్వేద నిపుణులు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ‘యకృత్ పిప్పలి’ అనే మందును చరకసంహితలో పేర్కొన్నారు. దీన్ని కొంతమంది వైద్యనిపుణులు ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఇది బజారులో లభించదు. ఇది సిర్రోసిస్ కోసం మాత్రమే గాక, లివర్ క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల్లో కూడా చక్కని గుణాన్నిచ్చిన దాఖలాలున్నాయి. ఒకసారి మీరు మీకు దగరలో ఉన్న నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
పాన క్రియతో పాంక్రియాస్‌కు దెబ్బ
మనం మన లోపలి అవయవాల గురించి ఆలోచించినప్పుడు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... అంటూ చాలా వాటిపై దృష్టి పెడతామేమో గాని పాంక్రియాస్ అనే ఆ అంతర్గత అవయవం వైపు దాదాపుగా దృష్టిసారించం. ఆకృతిలో తోకలా ఉండే అది మాత్రం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. ఈ పాంక్రియాస్ ఉరఃపంజరాని(రిబ్కేజ్)కి కాస్తంత కిందగా కడుపులో ఉంటుంది. దాని పనితీరు మందగించిన కారణంగానే మనకు మధుమేహం లాంటి పాపులర్ జబ్బు వచ్చినా అది దానివల్ల్లేనని మనకు తెలియదు. కీలక అవయవం అయిన పాంక్రియాస్‌కు సోకే ఇన్ఫెక్షన్స్, కారణాలు, జాగ్రత్తలను గురించి తెలిపేదే ఈ కథనం. పాంక్రియాస్ అనేది ప్రధానంగా రెండు కీలకమైన పనులు చేస్తుంటుంది. మొదటిది మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక మనం తీసుకున్న ఆహారం శక్తిగా, అన్ని అవయవాలకూ అందడానికి గ్లూకోజ్‌గా మారే ప్రక్రియలో, రక్తంలోని ఆ గ్లూకోజ్‌ను నియంత్రిస్తూ ఉండే ప్రధాన భూమికను పాంక్రియాస్ పోషిస్తుంది. ఈ రెండు విధులను నిశ్శబ్దంగా చేసుకుపోయే ఈ అవయవంలోని కణాలకూ ఒక్కోసారి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సోకి, ఆ కణాలు దెబ్బతింటాయి. అలా పాంక్రియాస్‌లోని కణాలకు ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సోకడాన్నే ‘పాంక్రియాటైటిస్’ అంటారు. పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా? కడుపు పైభాగం (అప్పర్ అబ్డామిన్)లో తీవ్రమైన కడుపునొప్పితో పాంక్రియాటైటిస్‌ను గుర్తించవచ్చు. కొన్నిసార్లు కొందరిలో ఆ నొప్పి వీపు వైపునకు వ్యాపిస్తుంది. దీన్ని సాధారణ కడుపునొప్పిగా పరిగణించలేం. ఎందుకంటే చాలా తీవ్రంగా గంటలకొద్దీ వచ్చే ఆ నొప్పి వల్ల కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం కావచ్చు. పాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది? పాంక్రియాస్ నిర్వహించే విధుల గురించి మనకు తెలిసిందే. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే స్రావాలను అది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ స్రావాలు పేగుల్లోకి విడుదలయ్యాక, అవి వాటిమీద పని చేస్తే ఆహారం అరుగుతుంది. అప్పటివరకూ ఆ స్రావాలను నిద్రాణంగా ఉండేలా ప్రకృతి ఏర్పాటుచేసింది. కానీ కొన్ని సందర్భాల్లో అవి పాంక్రియాస్లో ఉండగానే క్రియాశీలం అయిపోయి, తమ పనిని ప్రారంభించేస్తాయి. దాంతో అప్పుడు అవి పాంక్రియాస్ కణాలనే దెబ్బతీయడం మొదలుపెడతాయన్నమాట. ఫలితంగా పాంక్రియాస్ కణాలకు వాపు, మంట వస్తాయి. అవి ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ సమష్టి పరిణామాలన్నింటినీ కలుపుకుని వైద్యపరిభాషలో ఇన్‌ఫ్లమేషన్‌గా చెప్పవచ్చు. ఇలా పాంక్రియాస్ అనే అవయవం ఇన్ఫ్లమేషన్కు గురికావడాన్నే ‘పాంక్రియాటైటిస్’గా పేర్కొంటారు. పాంక్రియాటైటిస్‌లో రకాలు పాంక్రియాటైటిస్ రుగ్మతలోనూ కొన్ని రకాలున్నాయి. అందులో రెండింటిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. మొదటిది తక్షణలక్షణాలు కనిపించే పాంక్రియాటైటిస్. దీన్నే అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఇక రెండోది... రుగ్మత దీర్ఘకాలికంగా కొనసాగే క్రానిక్ పాంక్రియాటైటిస్. క్రానిక్ పాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో కడుపునొప్పి మొదలుకొని పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే లక్షణాలన్నీ తరచూ కనిపిస్తుంటాయి. అక్యూట్ పాంక్రియాటైటిస్ వచ్చినవారిలో చాలామందిలో అది దానంతట అదే తగ్గిపోతుంది. కానీ క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో మాత్రం తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్నవారిలో క్రానిక్ పాంక్రియాటైటిస్ వస్తుంది. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో మద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ తరహా కేసుల్లోనూ 20% నుంచి 30% మందిలో డయాబెటిస్ ఉన్నవారిలోనే ఇది కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో ఉండే తేడాలే దీనికి కారణం. పాంక్రియాటైటిస్‌కు కారణాలు పాంక్రియాటైటిస్ రుగ్మతతో బాధపడేవారికి అందుకు కారణమయ్యే అంశాలలో అతి ముఖ్యమైనది ‘ఆల్కహాల్’. పాంక్రియాటైటిస్‌తో బాధపడే ప్రతిపదిమందిలోనూ ఏడుగురు మద్యం కారణంగానే ఆ వ్యాధి బారిన పడుతుంటారు. మద్యం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి, అవి క్రమంగా పాంక్రియాటైటిస్‌కు దారితీస్తాయి. వీటి గురించి విపులంగా... గాల్‌స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు): పిత్తాశయంలో జీర్ణక్రియకు ఉపయోగపడే పైత్యరసం అనే స్రావాలు నిల్వ ఉంటాయి. కడుపులోని జీర్ణాశయానికి కాస్తకిందుగా చిన్నపేగులు మొదలయ్యే చోట... పిత్తాశయం తాలూకు నాళమైన బైల్ డక్ట్ నుంచి చిన్నపేగుల మొదటిభాగం (డియోడినమ్)లో కలిసి అక్కడ పైత్యరసాన్ని విడుదల చేసి, ఆహారం జీర్ణమయ్యేలా చేయడం జరుగుతుంది. పిత్తాశయం నుంచి వచ్చి, చిన్నపేగుల దగ్గర తెరచుకునే నాళం (బైల్ డక్ట్), పాంక్రియాస్ నుంచి వచ్చి అక్కడే తెరచుకునే నాళం ఒక కూడలిలా ఉంటాయి. సాధారణంగా చిన్నపేగులోకి పైత్యనాళం నుంచి పైత్యరసం విడుదలయ్యే ఈ ప్రక్రియవల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొన్నిసార్లు కొంతమందిలో పైత్యనాళం నుంచి వచ్చే రాళ్లు ఈ కూడలిలో ఇరుక్కుపోతాయి. ఈ రాళ్ల కారణంగా ఈ స్రావాలు వెనక్కు వెళ్లి పాంక్రియాటిక్ నాళం (డక్ట్)లోకి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు కొంతమేరకే ఈ స్రావాలను అడ్డుకునే రాళ్లు, ఒక్కోసారి పాంక్రియాటిక్ డక్ట్‌ను అడ్డుకుని పూర్తిగా మూసేస్తాయి కూడా. దాంతో ఆస్రావాలు వెనక్కు పాంక్రియాస్లోకి ప్రవేశించి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఆల్కహాల్ వల్ల: పాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణం ఆల్కహాల్ అన్నది వాస్తవం. అయితే ఇదెలా జరుగుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా బాగా మద్యం తాగిన 6-12 గంటల తర్వాత కడుపునొప్పి రూపంలో పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. కొంతమందిలోనైతే ఎంతకొద్దిమోతాదులో తాగినప్పటికీ పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. అంటే ఇలాంటివారిలో వారి పాంక్రియాస్‌కు ఆల్కహాల్ అంటే అస్సలు పడదన్నమాట. అంటే పాంక్రియాస్... ఆల్కహాల్ పట్ల సెన్సిటివిటీని కలిగి ఉంటుందని అర్థం. మరికొన్ని కారణాలు: పై కారణాలతోపాటు మరికొన్ని అంశాలు కూడా పాంక్రియాటైటిస్‌కు కారణమవుతాయి. కానీ అవి అంత సాధారణం కావు. అవి... కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ (ఉదాహరణకు మంప్స్ వైరస్, హెచ్ఐవీ వైరస్ల కారణంగా పాంక్రియాటైటిస్ రావచ్చు). చాలా అరుదుగా కొన్నిరకాల మందుల తాలూకు దుష్ర్పభావాలు (సైడ్ఎఫెక్ట్స్)గా కూడా పాంక్రియాటైటిస్ కనిపించవచ్చు. పాంక్రియాస్ లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా శస్త్రచిక్సిత జరిగినప్పుడు సైతం ఈ రుగ్మత రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరాన్నజీవుల కారణంగానూ ఈ వ్యాధి రావచ్చు. ఇక ఒంటిలో చాలా ఎక్కువగా కొవ్వు ఉన్న సందర్భాల్లోనూ, క్యాల్షియమ్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, పాంక్రియాస్ నిర్మాణం సరిగా లేనప్పుడు కూడా ఈ జబ్బు రావచ్చు. కొన్నిసందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా చాలా చాలా అరుదనే చెప్పాలి. ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్: ఇందులో మన సొంత రోగనిరోధక శక్తి మన పాంక్రియాస్‌ను దెబ్బతీస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్ అంటారు. కారణాలు తెలియకుండా కూడా: పది పాంక్రియాటైటిస్ కేసుల్లో రెండింటికి అసలు కారణమే తెలియదు. పాంక్రియాటైటిస్ తీవ్రత సాధారణంగా అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో కడుపునొప్పి తీవ్రంగా వచ్చినప్పటికీ సాధారణంగా దుష్ర్పభావాలు పెద్దగా ఉండవు. అయితే 10 శాతం కేసుల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, ఒక్కోసారి సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. చాలా అరుదుగా మరణానికి దారితీయవచ్చు. ఒక్కోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి రావచ్చు. దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌లో పరిస్థితి కాస్త భిన్నం. ఇందులో కడుపునొప్పి వచ్చినా చాలా సందర్భాల్లో కొద్దిగా లేదా ఓ మోస్తరుగా ఉండి నొప్పినివారణ మందులతో తగ్గవచ్చు లేదా కొంతమంది విషయంలో కొంతకాలం ఆసుపత్రిలో ఉంచడం వల్ల, ఇంజెక్షన్లతోను పరిస్థితి చక్కబడవచ్చు. కొన్నిసార్లు పాంక్రియాస్ నుంచి వెలువడవలసిన స్రావాలకు రాళ్లు అడ్డుపడుతున్నప్పుడు ఎండోస్కోపిక్ చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్: దీనికి ప్రధానకారణం ఆల్కహాల్. చాలా ఎక్కువ మోతాదులో ఐదేళ్లపాటు కొనసాగిస్తుంటే, అది ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్‌కు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఆల్కహాల్ మానివేయగానే దాంతోపాటే ఈదుష్ర్పభావమూ తగ్గిపోతుంది. క్రమంగా ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్ నయమైపోతుంది. నిర్వహణ- యాసీన్ నివారణ / జాగ్రత్తలు ఎవరిలోనైనా సరే డాక్టర్లు పాంక్రియాటైటిస్ జబ్బు ఉన్నట్లుగా చెబితే, వారికి ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే తక్షణం దాన్ని మానేయాలి. దాంతో పాంక్రియాటైటిస్ కారణంగా వచ్చిన నొప్పి తగ్గిపోయి, పాంక్రియాస్ మరింత దెబ్బతినడం ఆగిపోతుంది. ఒకవేళ పాంక్రియాటైటిస్ వ్యాధి కనిపించాక కూడా మద్యం అలవాటును ఆపివేయకుండా అలాగే కొనసాగిస్తే నొప్పితీవ్రత మరింతగా పెరుగుతుంది. ఇక పాంక్రియాస్ దెబ్బతినడం కూడా పెరుగుతుంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి అది మరణానికీ దారితీయవచ్చు. అక్యూట్ పాంక్రియాటైటిస్‌కు ఆల్కహాల్ కారణం కానప్పటికీ, ఒకవేళ ఒకసారి అక్యూట్ పాంక్రియాటైటిస్ కనిపిస్తే మాత్రం ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు తక్షణం దాన్ని మానేయాలి. అలా కనీసం ఆర్నెల్లపాటు దూరంగా ఉండాలి. అంటే పాంక్రియాస్ మళ్లీ యథాస్థితికి రావడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఇలా కాకుండా ఒకవేళ అలాగే కొనసాగిస్తే మాత్రం అది దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్కూ లేదా ప్రమాదకరమైన పరిస్థితికీ దారితీయవచ్చు. డాక్టర్ ఐతా శ్రీవేణు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ మియాపూర్, హైదరాబాద్.