గ్యాస్ట్రో కౌన్సెలింగ్
ఇటీవల కురుస్తున్న వర్షాలను చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా ప్రయాణాలు చేసే వృత్తిలో ఉన్నాను. కలుషితమైన బయటి ఆహారాలు తింటే కామెర్లు వస్తాయని అందరూ అంటున్నారు. ఇది వాస్తవమేనా? నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- సుదర్శన్, వరంగల్
కామెర్లు అని చెప్పేది ఒక వ్యాధి కాదు. ఇది కలుషితమైన నీటి వల్ల వచ్చే హెపటైటిస్‌లలో రకాలైన హెపఐటిస్-ఏ, హెపటైటిస్-ఈ వైరస్‌లు వచ్చినప్పుడు కనిపించే ఒక లక్షణం మాత్రమే. సాధారణంగా కలుషితమైన నీళ్లలోని ఈ వైరస్‌ల వల్ల కాలేయం దెబ్బతిని కామెర్లు కనిపిస్తుంటాయి. కామెర్లలో రక్తంలోని బిలురుబిన్ పాళ్లు పెరుగుతాయి. రక్తంలో బిలురుబిన్ పెరిగినప్పుడు దాని రంగు కనుగుడ్లు, చర్మంలోని మ్యూకస్ పొరల్లో పేరుకుపోతుంది.
దాంతో అవి పచ్చగా కనిపిస్తాయి. మామూలు పరిస్థితుల్లో వ్యర్థాలను కాలేయం సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి అది మలంలోకి వెళ్లి బయటకు వెళ్తుంది. మలం పసుపు రంగులో కనిపించడానికి కారణం ఆ వ్యర్థాలే. అయితే కాలేయం సరిగా పనిచేయకపోవడం వల్ల బైలురుబిన్, బైలివర్దిన్ అనే పదార్థాలు ఒంట్లోనేరుకుపోతాయన్నమాట. ఇదే పచ్చదనం కళ్లలోనూ కనిపిస్తుందన్నమాట.
కామెర్లు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు...
కళ్లు పచ్చబడతాయి మూత్రం పసుపు రంగులోకి మారుతుంది మలం బూడిదరంగులో వస్తుంది
జ్వరం, ఒళ్లునొప్పులు, ఆకలి తగ్గడం, దురదలు, వాంతులు కనిపిస్తాయి కాలేయానికి జరుగుతున్న నష్టం కనిపించకపోతే కామెర్లు తీవ్రతరమవుతాయి. అప్పుడు పాదాల వాపు, నిద్రపట్టకపోవడం, రక్తపు వాంతులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : సాధారణంగా బయటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. మీ వృత్తి కారణంగా మీరు ఇంట్లో వండిన పదార్థాలను తినలేరు కాబట్టి ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయండి. మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగండి. మద్యం అలవాటుకు, పొగతాగే అలవాట్లకు దూరంగా ఉండండి పరిశుభ్రమైన పరిసరాల్లోనే ఉండండి. చెట్ల మందులు, పసర్ల వంటి నాటు మందులు వాడకండి.
- డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్
బయటి పదార్థాలు తింటే కామెర్లు తప్పదా?
Published Sat, Sep 24 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement
Advertisement