ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య | Wife Donated A Liver To Save Her Husband's Life In Khammam, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య

Published Thu, Nov 21 2024 9:19 PM | Last Updated on Fri, Nov 22 2024 12:12 PM

Wife Who Donated A Liver To Her Husband In Khammam

సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.

రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్‌ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.

ఆపై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్‌ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్‌ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement