
సాక్షి, భద్రాచలం: భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరిగితే ఇంత వరకు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేదని బాధిత కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు.
భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకొని కామేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక సహాయ బృందాలు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చాయి. భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బాధితుల కుటుంబాల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరిగితే ఇంత వరకు శిథిలాల కింద చిక్కుకున్న తమ వారిని బయటకు తీసుకురాలేదన్నారు. తమ వారు బతికున్నారా చచ్చిపోయారా అన్నది కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు బయటకు తీస్తారన్నది కూడా అధికారులు చెప్పడం లేదని మండిపడుతున్నారు. ఓ ఎమ్మెల్యే, మంత్రి కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఇంతసేపు ఆగేవారా అని ప్రశ్నిస్తున్నారు. పెద్దలకు ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా?. శిథిలాల కింద చిక్కుకున్న తమ నాన్న కావాలని రోడ్డుపై కూర్చొని.. ఓ వ్యక్తిని కన్నీరుపెట్టుకున్నారు. మరోవైపు.. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు.. శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, కూలిన భవనం యజమాని శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. బుధవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో భవనం ఉన్నట్లుండి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులో పనిచేసేందుకు వచ్చిన ఇద్దరు తాపీ కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ సంఘటన స్థలానికి వెళ్లి రెస్క్యూ సిబ్బందితో శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. శిథిలాలను తొలగించే యత్నంలో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్లు, స్లాబ్ కూలాయి. దానిపై మిగిలిన అంతస్తుల స్లాబ్‌లు పేర్చినట్లు పడిపోయాయి. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సహాయం కోసం కేకలు వేయడంతో వైద్య బృందాలను రప్పించి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపించారు. కూలిన స్లాబ్ కిందకు కుంగిపోకుండా జాకీలను ఉంచారు.