
ఎక్కువ పని గంటలతో లివర్‌కు తీవ్ర ముప్పు
ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రభావం
ఎక్కువ కేలరీల ఫుడ్, శారీరక శ్రమ లేకపోవటమే కారణం
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధ్యయనంలో వెల్లడి
ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందంటున్న శాస్త్రవేత్తలు
మానవ శరీరంలోనే అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం.. పని భారంతో తల్లడిల్లుతోంది. క్రమం తప్పిన జీవన విధానాన్ని సమన్వయం చేయలేక సతమతం అవుతోంది. అవసరానికి మించిన తిండి.. అవసరమైన శ్రమ ఏమాత్రం చేయని దినచర్య కాలేయంపై పెను భారం మోపుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీవన విధానంలోని మార్పులు కాలే యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరా బాద్ శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు.
ఈ పరిశోధనలో ఏఐజీ సీనియర్ హెపటాలజిస్ట్ పీఎన్ రావు, యూఓహెచ్‌ప్రొఫెసర్లు కల్యాణ్‌కర్ మహదేవ్, సీటీ అనిత, రీసెర్చ్ స్కాలర్లు భార్గవ, నందిత ప్రమోద్ పాల్గొన్నారు. వీరి పరిశోధనలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలోని వారి ఆరోగ్యాలను పరిశీలించారు. – సాక్షి, హైదరాబాద్
71% మంది
» అధిక బరువు (ఊబకాయం)తో 71 శాతం మంది బాధపడుతున్నారు. 34 శాతం మందిలో జీవక్రియల సమస్యలు ఉన్నాయి.
»ఎక్కువ పని గంటలు, తీవ్ర పని ఒత్తిడి, వేళాపాళా లేని తిండి, నిద్రలేమితో కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు.
» ఎక్కువ సేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం, ఎక్కువ గంటల పని, ఒత్తిడి వల్ల జీవక్రియలో ఇబ్బందులు తలెత్తి, ఫ్యాటీలివర్ సమస్య (ఎంఏఎఫ్‌ఎల్డీ) వచ్చే ప్రమాదం పెరుగుతోంది.
84% మంది
» ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం దాదాపు84 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది.
పరిశోధనలో తేలిన అంశాలు
జీవ క్రియల్లో సమస్యలు ఉన్న వారిలో ఫ్యాటీ లివర్, ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.కాలేయంలో 5 శాతం కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోతే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారని డాక్టర్ పీఎన్ రావు తెలిపారు.
సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం వాపు, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే ఐటీ ఉద్యోగులు జీవన శైలిని మార్చుకోవాల్సిన తక్షణ అసవరం ఉందని సూచించారు. వ్యాయామంతోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment