ఒంగోలు, న్యూస్‌లైన్: బస్టాండ్లు..రద్దీ ప్రదేశాలు..ఆస్పత్రి ఆవరణలు.. ప్రభుత్వ కార్యాలయాలు ప్రదేశం ఏదైతేనేమి..గుప్పుగుప్పు మంటూ పొగవదిలే వారు అడుగడుగునా కనబడుతుంటారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగరాదన్న నిబంధనలు ఎక్కడా అమలవడం లేదు. కాట్పా -2003 (సిగిరెట్ అండ్ అదర్ టుబాకో ప్రోడక్ట్స్ యాక్ట్) లోని సెక్షన్ 4 బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని స్పష్టం చేస్తోంది.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడం ద్వారా పొగతాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.కేసుల నమోదుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసినా ఫలితం లేదు. 40 రకాల ముఖ్యమైన ప్రదేశాల్లో పొగతాగరాదని చట్టం చెబుతోంది.
బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం వల్ల తాగే వ్యక్తి కన్నా..దాని ద్వారా వెలువడే పొగ పీల్చడం వల్ల సమీపంలోని వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ధూమపానం వల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఎక్కువగా దెబ్బతింటాయి. శారీరక సమస్యలకు తోడు మానసిక సమస్యలు..ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తోడవుతాయి.
దేశంలో ఏటా పొగాకు ఉత్పత్తుల వాడకం ద్వారా అనారోగ్యం పాలై మరణించే వారి సంఖ్య పది లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ధూమపానం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ప్రకటనల కోసం 2013 డిసెంబర్‌లో రూ 45 కోట్లను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ విడుదల చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగరాదని పెద్ద పెద్ద హోర్డింగ్‌ల రూపంలో ప్రకటనలు ఏర్పాటు చేయాలి. విద్యార్థి దశ నుంచే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలి.
జిల్లాలో
పరిస్థితి ఇదీ...
బహిరంగ ప్రదేశాలలో పొగతాగే వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జిల్లాలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. మండలాల్లో సంబంధిత మెడికల్ ఆఫీసర్లు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. వీరితోపాటు ఈ చట్టాన్ని పోలీసుశాఖ కూడా అమలుచేయవచ్చు. అయితే 2011 మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హడావుడి చేసిఏడుగురికి జరిమానా విధించారు.
ఆ తరువాత ఆ ఊసేలేదు. ఇక పోలీసు శాఖ కొత్తపట్నం బీచ్ ఒడ్డున సిగిరెట్ తాగుతున్న ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను 2008లో సస్పెండ్ చేసింది. అదే సంవత్సరం ట్రైనీ డీఎస్పీగా వచ్చిన దామోదర్ బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై దాడులు నిర్వహించి జరిమానాలు విధించారు. ఆయన జిల్లా నుంచి వెళ్లిన తరువాత తిరిగి ఈ చట్టాన్ని అమలుచేసేవారే లేరంటే అతిశయోక్తి కాదు. చీరాల వంటి పలు ప్రాంతాల్లో చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారులే నడిరోడ్డుపై పొగతాగుతూ కనిపిస్తుండడం నిత్యకృత్యం.
ఒంగోలు నగరంలోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ ధూమపానం చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోం ది. కనీసం పొగతాగితే జరిమానా విధిస్తామనే ప్రకటనలు జిల్లాలో ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఈ ప్రకటనలు కనిపించకపోతుండటం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల్లో ఏ ఒక్కరూ ఈ చట్టం ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయకపోతుండటంతో యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. సినిమాహాళ్లలో కొంత మేరకు ధూమపాన నిషేధం అమలవుతోంది. ఈ చట్టం అమలుపై ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
పొగచూరిన చట్టం
Published Mon, Jan 20 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement