నేను మీ కాలేయం | I am your liver | Sakshi
Sakshi News home page

నేను మీ కాలేయం

Published Wed, Jan 20 2016 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

నేను మీ కాలేయం

నేను మీ కాలేయం

ఆనంద్ ప్రతిరోజూ అద్దంలోకి ముఖం పెట్టి పళ్లు పరీక్షించుకుంటాడు. తల దువ్వుకుంటాడు. జుట్టు సర్దుకుంటాడు. కనిపించే వీటిని పక్కనబెట్టి అప్పుడప్పుడూ కనిపించని లోపలి అవయవాలైన గుండె, కిడ్నీల గురించి ఆలోచిస్తాడు. నేనైతే ఆనంద్ కుడిపైపు ఛాతీ పైభాగపు ఎముకల కింద గుట్టుగా ఉంటూ, పొట్టకు అవసరమైన పనులు ప్రధానంగా చేస్తుంటా. కాళ్లూ, చేతులు కదపాలన్నా, ఆట ఆడాలన్నా, గోలు కొట్టాలన్నా నేనే. కండరంతో పరుగుతీయాలన్నా, తిన్నది అరగదీయాలన్నా నేనే చేయాలి.కానీ నా ఉనికే తెలియదు. అతడిలో నేను ఉన్నాననే ఆలోచనే అతడికి రాదు. కానీ అతడి ఒంటిలోపలి భాగాల్లో అతి పెద్ద అవయవాన్ని నేనే. దాదాపు కిలోన్నర తూగుతాను. ఆ నేనే... కాలేయం. ఇంగ్లిష్‌లో లివర్. ఉనికిలో ఎంత సెలైంటో పనిలో అంత వైబ్రెంట్! జీవక్రియల్లో ఎక్స్‌పర్ట్. కాలం పరంగా కాన్‌స్టాంట్. పని అందుకోవడంలో ఇన్‌స్టాంట్! ఇంతెందుకు... ఒక్కమాటలో చెప్పాలంటే ఆనంద్ ఏ పని చేసినా అందులో నా వాటా ఉంటుంది.
 
పని మానేస్తే పైకే...!
శరీరంలో అత్యంత సంక్లిష్టమైన భాగాలు అని చెప్పుకునే పరిస్థితి వస్తే... నన్ను చూసి ఆనంద్ గుండె, ఊపిరితిత్తులు కాస్త సిగ్గుపడాల్సిందే. ఓ జాబితాగా రాయాల్సి వస్తే నేను చేసే పనులు దాదాపు ఐదొందలకు పైమాటే. నేను గానీ పని మానేస్తే ఆనంద్ పని అంతేసంగతులు.
 
నాకు ఏడు సెం.మీ. చాలు
నేను చేసే పనులన్నింటినీ బయట చెయ్యాలంటే ఎకరాల కొద్దీ స్థలం కావాలి. అందులో ఒక పే...ద్ధ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలి. నేను చేసే అత్యంత సరళమైన పనికోసమే ఇది కావాలి. ఇక సంక్లిష్టమైన పనులకు ఎంత కావాలో మీరే ఊహించుకోవచ్చు. అంతెందుకు... నేను చేసే అంత్యంత సంక్లిష్టమైన పనులు ఈ ప్రపంచంలోని ఏ కెమికల్ ఫ్యాక్టరీ కూడా చేయలేదు. నేను దాదాపు వెయ్యికి పైగా ఎంజైములను ఉత్పత్తి చేస్తాను. అవి దేహంలోని రసాయన చర్యలకు తోడ్పడతాయి. ఆ చర్యల ద్వారా ఒక రకం పదార్థం మరో రకంగా మారేందుకు దోహదపడుతుంది. ఉదాహరణకు ఆనంద్ వేలు పొరబాటున తెగిందనుకోండి. నేను రంగంలోకి దిగకపోతే వేలంతా రక్తసిక్తం. ఆనంద్‌కు మరణం తథ్యం. అప్పుడు నేను రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్స్ పుట్టిస్తా. రక్తాన్ని గడ్డకట్టిస్తా. ఆనంద్ ప్రాణాలకు నా యాంటీబాడీస్ అడ్డేస్తా. అలాంటి యాంటీబాడీస్‌ను మరెన్నో పుట్టించి ఎన్నోన్నో అనర్థాలు రాకుండా కాపాడుతుంటా.
 
జీర్ణక్రియ... నా పనితీరుకు నిదర్శనక్రియ
ఆనంద్‌కు మాంసాహారం అంటే ఇష్టం. అందులో ఉండేవన్నీ ప్రోటీన్స్. జీర్ణమయ్యే క్రమంలో అవి ముక్కలవుతూ అమైనోయాసిడ్స్‌గా రూపొందుతాయి. ఆ పదార్థం యధాతథంగా రక్తంలో కలిస్తే మాత్రం ఆనంద్ అంతే సంగతులు. ఎందుకంటే అది సైనైడ్ అంతటి విషపూరితం. శత్రువుల్లాంటి ఆ అమైనో యాసిడ్స్‌ను నేను మేని మిత్రులుగా మార్చేస్తా. వాటి నైజాన్ని హ్యూమనైజం చేసేస్తా.
 ఇక నేను చేసే మరోపని ఏమిటంటే... కాస్త ఆకుపచ్చగానూ, మరికాస్త పసుపపచ్చగానూ ఉండే, చాలా చేదైన బైల్‌ను ఉత్పత్తి చేస్తా. నాలో ఉత్పత్తి అయిన ఈ జీర్ణరసం మొదట గాల్‌బ్లాడర్‌లోకి వెళ్లి మరింత గాఢమవుతుంది. కడుపు, పేగులకు మధ్య ఉండే చిన్న సంచిలోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి చిన్నపేగుల్లోని జారిపోతుంది. మనం తిన్న ఆహారపు ముద్దల్ని అక్కడ జీర్ణం చేస్తుందది. ఈలోపు ఆహారనాళంలోని కొవ్వులను కడిగేస్తుందీ బైల్‌జ్యూస్. ఇందులోనూ రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి బిలురుబిన్ (ఇది ఎరుపు రంగులోని బైల్). రెండోది బైలివెర్డిన్ (ఇదేమో ఆకుపచ్చ బైల్). అప్పుడప్పుడూ ఈ రంగు పదార్థాల్లో ఏవైనా రక్తంలో కలిస్తే కామెర్ల రూపంలో బయటకు కనిపిస్తుంటాయి. ఇలా కనిపించాయంటే... నా పనితీరులో ఏదో తప్పు జరుగుతుందని గుర్తించాలి. ఈ తప్పు మూడు రకాలుగా జరగవచ్చు. మొదటిది... మలేరియా సూక్ష్మజీవి ఒంట్లోకి ప్రవేశించడం లేదా ఎర్రరక్తకణాలు అతిగా నాశనమవుతూ రక్తహీనత వచ్చి ఉండవచ్చు. అప్పుడు... నేను తొలగించే వేగం కంటే నాశనమయ్యే ఎర్రరక్తకణాల వ్యర్థాలు ఎక్కువగా ఉంటే అవి రక్తంలోకి చేరుకుని కామెర్ల రూపంలో కనిపించవచ్చు. రెండోది... గాల్‌బ్లాడర్ నుంచి పేగులకు వచ్చే మార్గంలో ఏదైనా అడ్డుపడటం వల్ల బైల్ వెనక్కు ప్రవహించి, అది రక్తంలో కలిసి కామెర్లుగా ప్రయుక్తం కావచ్చు లేదా బైల్ ప్రవాహ మార్గాల్లో కొవ్వు అడ్డం పడటం వల్ల కూడా కామెర్లు కనిపించవచ్చు. ఇక మూడోది... నా కణాలకు.. అంటే కాలేయ కణాలకు హెపటైటిస్ లేదా ఏదైనా ఇతర వ్యాధులు సోకి వాటికి ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు. అదే జరిగితే నాకూ ఇబ్బంది. ఆనంద్‌కూ ప్రమాదం.
 
అతి ఉంటే మితి చేస్తా...
అతడి శరీరంలో అతిగా ఉండకూడని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని ఉండాల్సిన పరిమాణంలోకి మార్చేస్తా. అతి పరిమితులను తెలుసుకొని... అదనాలను వదిలిస్తా. ఒంట్లోని విషపదార్థాలను యూరియాగా మార్చేస్తా. మూత్రపిండాల్లోకి పంపేస్తా. ఆనంద్‌లోని అడ్రినల్ గ్రంథులు... శరీరంలో లవణాలను ఉండేలా చూస్తాయి. ఉండాల్సిన వాటికంటే అవి అదనంగా ఉంటే ఆనంద్ ఉబ్బిపోతాడు. అందుకే నేను వాటిని నాశనం చేస్తా.
 
ఇల్లూడ్చినట్టే... నేను ఒళ్లూడుస్తుంటా...
ఆనంద్ తన ఇల్లు ఊడ్చుకుని శుభ్రంగా ఉంచుకున్నట్టే... అతడిలోని వ్యర్థాలను ఊడ్చేస్తుంటాను నేను. ఎప్పటికప్పుడు కొత్తవి పుడుతుండటంతో ప్రతి సెకండ్‌కూ ఆనంద్ ఒంట్లో కోటి ఎర్రరక్తకణాలు చనిపోతూ ఉంటాయి. వాటిని భస్మం చేసే బాధ్యత నాదే. ఆ భస్మాన్ని తిరిగి ఉపయోగించి మళ్లీ కొత్త రక్తకణాలను పుట్టించే పనికూడా నాదే.
 
పెరిగే కొవ్వును చూసుకోవాలి...
ఆనంద్ వయసు పెరుగుతోంది. ఈ వయసులో కొవ్వు కూడా పెరుగుతుంటుంది. ఇది నాలోనూ జరుగుతుంటుంది. నాలో నార్మల్‌గా పనిచేసే కణాల స్థానంలో కొవ్వు పేరుకుంటూ ఉండవచ్చు. అలాంటప్పుడు అది కొన్నిసార్లు రక్తప్రవాహానికి అడ్డురావచ్చు. కొన్ని అంతర్గత అవయవాలను దెబ్బతీయవచ్చు. అప్పుడు నా ఆకృతి, నా స్వాభావికమైన రంగు దెబ్బతినవచ్చు. నేను జిగురుజిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. ఇది కొన్నిసార్లు ఆర్సెనిక్ వంటి విష ప్రభావాల వల్ల లేదా కొన్ని వ్యాధుల వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, తగినంత ఆహారం తీసుకోకుండా, మితిమీరిన ఆల్కహాల్ వల్ల (అంటే రోజుకు 350 ఎం.ఎల్. కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల) కూడా సిర్రోసిస్ రావచ్చు.
 
సిర్రోసిస్ లక్షణాలివే...
ఆనంద్ ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, నీరసంగా ఉన్నా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా గ్యాస్ పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇప్పుడు నా పనితీరును తెలుసుకోడానికి మంచి మంచి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నాలోకి బ్రోమ్‌సల్ఫాలియేన్ అనే ఒక రంగు పదార్థాన్ని (డై)ని లోపలికి పంపిస్తారు. నా పనితీరు బాగుంటే 45 నిమిషాల్లో అంతా బయటకు పంపేస్తాను. ఇదిగాక బైలురుబిన్ వంటి పిగ్మెంట్ మోతాదులు రక్తంలో ఎంత ఉన్నాయో పరీక్ష చేసి, నాలోని అనారోగ్యాన్ని కనుగొంటారు. ఆనంద్ ఆ పరిస్థితికి రాలేదు. కానీ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలావరకు ఆహార నియమాలు పాటిస్తూ, ప్రోటీన్‌లు తీసుకుంటూ, మామూలు మందులతోనే మళ్లీ నన్ను నార్మల్ చేయడానికి అవకాశం ఉందిప్పుడు.
 
నన్ను కాపాడుకోవడం ఎలా?
నన్ను కాపాడుకోవడం చాలా సులువు. ఆనంద్ బరువు పెరుగుతుంటే... నేనూ బరువు పెరుగుతున్నానన్నమాటే. ఆ పెరిగే బరువును అదుపు చేసుకోవాలి. ఆల్కహాల్‌కు పూర్తిగా దూరం కావాలి. తగినన్ని విటమిన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ‘బి’ విటమిన్ తీసుకోవడం ప్రధానం.
 
ఇన్‌పుట్స్:
డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి
ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్
గ్యాస్ట్రో ఎంటరాలజీ
ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్
 
ఫుడ్డును ఫ్యూయల్‌గా మార్చేది నేనే...
ఆనంద్ గోల్ఫ్ ఆడాలన్నా, కాలిబంతి ఆటలో గోల్ కొట్టాలన్నా... ఆ కండరాలకు అవసరమైన శక్తిని ఇవ్వడానికి తోడ్పడేదీ నేనే. తిన్న పదార్థాలు గ్లూకోజ్‌గా మారతాయి. తగినంత శక్తి కోసం చక్కెరలు మండుతాయి. కండరం కదులుతుంది. ఆటకు అవసరమైన ఎనర్జీ అందుతుంది. ఈ ప్రక్రియలో కండరం అలసిపోతే లాక్టిక్ ఆసిడ్ ఉత్పత్తి అవుతుంది. అ లాక్టిక్ యాసిడ్ వృథాపోకుండా మళ్లీ దాన్ని గ్లైకోజెన్‌గా మార్చి నిల్వ ఉంచుతాను నేను. ఆనంద్ పనిచేస్తున్నప్పుడు మళ్లీ ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి అతడికి అవసరమైన శక్తిని అందిస్తాను. నయాపైసా కూడా వృథాగా ఖర్చుకాకుండా ఆపే ఇల్లాలిలా ఒంటిలోని రేషన్‌ను చక్కగా నిత్యం అందేలా  మేనేజ్ చేస్తుంటాను.
 
శక్తి అపారం.. అదే శాపం-అదే వరం!
నాలోని శక్తి అపారం. నాలోని దాదాపు 85 శాతం కణాలు పూర్తిగా నాశనమైనా నా పనితీరులో మార్పురాదు. నా అద్భుత శక్తే నాకు అభిశాపమవుతుంది. అంటే కేవలం నా సామర్థ్యం 15 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు గానీ లక్షణాలు బయటకు కనిపించవు. దాంతో ఆనంద్‌కు నా హెచ్చరికలు వినిపించే వేళకు లేదా నా పని తగ్గడం వల్ల కలిగే లక్షణాలు కనిపించే వేళకు జరగాల్సిన నష్టం జరగవచ్చు. ఇక ఈ అంశమే కొన్ని సార్లు వరం కూడా. మిగతా ఏ అవయవానికీ లేని అద్భుత శక్తి నాకు మరొకటి ఉంది. నాలో 60 శాతం భాగాన్ని తొలగించినా నేను మళ్లీ మునుపటి పరిమాణానికి పెరుగుతాను.
 
విషాల పాలిటి అడ్డుగోడ... .
విషాల నీడ కూడా ఆనంద్ ఒంట్లో పడకుండా చూసే అడ్డుగోడను నేను. రోజూ సిగరెట్ తాగుతూ నికోటిన్ అనీ, కాఫీ తాగుతూ కెఫిన్‌నీ, తింటూ ఇంకొన్ని పాయిజన్‌లను ఒంట్లోకి యధేచ్ఛగా వదిలేస్తుంటాడు ఆనంద్. అవి గుండెకు చేరకుండా నేను గోడలా అడ్డు ఉంటా. ఆనంద్ మద్యం తాగుతుంటాడు. కాక్‌టెయిల్స్ తీసుకుంటూ కబుర్లాడుతుంటాడు. అతడు అలా పరమానందం పొందుతుంటే అందులోని ప్రమాద కారకాలపై అప్పటికప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిహరిస్తుంటాను. ఆల్కహాల్ ప్రవేశించగానే దాన్ని నీళ్లుగా చేసి, మూత్రంలా మార్చేస్తా. కార్బన్‌డైఆక్సైడ్‌లా మార్చి ఊపిరి తీసుకునే సమయంలో బయటకు పోయేలాచూస్తా. ఇలా అన్ని విషాలను విరిచేస్తా. అన్ని మోతాదులనూ సరిచేస్తా.
 
గుండెకు సేఫ్టీ వాల్వ్
గుండెకు ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తా. నా పైనుంచే ఆనంద్ గుండెలోకి హెపాటిక్ వెయిన్ అనే రక్తనాళం వెళ్తుంటుంది. అలా గుండెలోకి రక్తం వెళ్లే సమయంలో అదొక బలమైన అలలా వెళుతూ ఉంటుంది. ఆ రక్త ప్రవాహం నాలోంచే జరుగుతుంటుంది. హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం కనీసం ఆరు నుంచి పది సెకండ్ల వ్యవధి పాటు నాలోంచి వెళ్తుంది. ఆ టైమ్ నాకు చాలు. తక్షణమే  తరంగవేగాన్ని తగ్గిస్తా. నెత్తురునంతా నేను మెత్తటి స్పాంజ్‌లా అద్దేస్తా. అలా నాలోకి ఇంకేలా చేస్తా. నా ఎగ్జిట్ వెసెల్స్ నుంచి కొంత కొంత రక్తాన్నే పంపిస్తా. అలా గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా చూస్తా. కాసేపు ఆ రక్తభారాన్ని నేనే మోస్తా. గుండెకు ఎంత వస్తే సౌకర్యమో అంతే రక్తాన్ని సరఫరా చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement