పాన క్రియతో పాంక్రియాస్‌కు దెబ్బ | Damage to the act of smoking pankriyasku | Sakshi
Sakshi News home page

పాన క్రియతో పాంక్రియాస్‌కు దెబ్బ

Published Mon, Sep 16 2013 12:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

పాన క్రియతో  పాంక్రియాస్‌కు దెబ్బ

పాన క్రియతో పాంక్రియాస్‌కు దెబ్బ

మనం మన లోపలి అవయవాల గురించి ఆలోచించినప్పుడు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... అంటూ చాలా వాటిపై దృష్టి పెడతామేమో గాని పాంక్రియాస్ అనే ఆ అంతర్గత అవయవం వైపు దాదాపుగా దృష్టిసారించం. ఆకృతిలో తోకలా ఉండే అది మాత్రం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. ఈ పాంక్రియాస్ ఉరఃపంజరాని(రిబ్‌కేజ్)కి కాస్తంత కిందగా కడుపులో ఉంటుంది. దాని పనితీరు మందగించిన కారణంగానే మనకు మధుమేహం లాంటి పాపులర్ జబ్బు వచ్చినా అది దానివల్ల్లేనని మనకు తెలియదు. కీలక అవయవం అయిన పాంక్రియాస్‌కు సోకే ఇన్ఫెక్షన్స్, కారణాలు, జాగ్రత్తలను గురించి తెలిపేదే ఈ కథనం.
 
 పాంక్రియాస్ అనేది ప్రధానంగా రెండు కీలకమైన పనులు చేస్తుంటుంది. మొదటిది మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక మనం తీసుకున్న ఆహారం శక్తిగా, అన్ని అవయవాలకూ అందడానికి గ్లూకోజ్‌గా మారే ప్రక్రియలో, రక్తంలోని ఆ గ్లూకోజ్‌ను నియంత్రిస్తూ ఉండే ప్రధాన భూమికను పాంక్రియాస్ పోషిస్తుంది. ఈ రెండు విధులను నిశ్శబ్దంగా చేసుకుపోయే ఈ అవయవంలోని కణాలకూ ఒక్కోసారి ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్ సోకి, ఆ కణాలు దెబ్బతింటాయి. అలా పాంక్రియాస్‌లోని కణాలకు ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్ సోకడాన్నే ‘పాంక్రియాటైటిస్’  అంటారు.
 
 పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా?
 కడుపు పైభాగం (అప్పర్ అబ్డామిన్)లో తీవ్రమైన కడుపునొప్పితో పాంక్రియాటైటిస్‌ను గుర్తించవచ్చు. కొన్నిసార్లు కొందరిలో ఆ నొప్పి వీపు వైపునకు వ్యాపిస్తుంది. దీన్ని సాధారణ కడుపునొప్పిగా పరిగణించలేం. ఎందుకంటే చాలా తీవ్రంగా గంటలకొద్దీ వచ్చే ఆ నొప్పి వల్ల కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం కావచ్చు.
 
 పాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది?
 పాంక్రియాస్ నిర్వహించే విధుల గురించి మనకు తెలిసిందే. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే స్రావాలను అది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ స్రావాలు పేగుల్లోకి విడుదలయ్యాక, అవి వాటిమీద పని చేస్తే ఆహారం అరుగుతుంది. అప్పటివరకూ ఆ స్రావాలను నిద్రాణంగా ఉండేలా ప్రకృతి ఏర్పాటుచేసింది. కానీ కొన్ని సందర్భాల్లో అవి పాంక్రియాస్‌లో ఉండగానే క్రియాశీలం అయిపోయి, తమ పనిని ప్రారంభించేస్తాయి. దాంతో అప్పుడు అవి పాంక్రియాస్ కణాలనే దెబ్బతీయడం మొదలుపెడతాయన్నమాట. ఫలితంగా పాంక్రియాస్ కణాలకు వాపు, మంట వస్తాయి. అవి ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ సమష్టి పరిణామాలన్నింటినీ కలుపుకుని వైద్యపరిభాషలో ఇన్‌ఫ్లమేషన్‌గా చెప్పవచ్చు. ఇలా పాంక్రియాస్ అనే అవయవం ఇన్‌ఫ్లమేషన్‌కు గురికావడాన్నే ‘పాంక్రియాటైటిస్’గా పేర్కొంటారు.
 
 పాంక్రియాటైటిస్‌లో రకాలు

 పాంక్రియాటైటిస్ రుగ్మతలోనూ కొన్ని రకాలున్నాయి. అందులో రెండింటిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. మొదటిది తక్షణలక్షణాలు కనిపించే పాంక్రియాటైటిస్. దీన్నే అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఇక రెండోది... రుగ్మత దీర్ఘకాలికంగా కొనసాగే క్రానిక్ పాంక్రియాటైటిస్. క్రానిక్ పాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో కడుపునొప్పి మొదలుకొని పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే లక్షణాలన్నీ తరచూ కనిపిస్తుంటాయి.
 
 అక్యూట్ పాంక్రియాటైటిస్ వచ్చినవారిలో చాలామందిలో అది దానంతట అదే తగ్గిపోతుంది. కానీ క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో మాత్రం తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్నవారిలో క్రానిక్ పాంక్రియాటైటిస్ వస్తుంది. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో మద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ తరహా కేసుల్లోనూ 20% నుంచి 30% మందిలో డయాబెటిస్ ఉన్నవారిలోనే ఇది కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో ఉండే తేడాలే దీనికి కారణం.
 
 పాంక్రియాటైటిస్‌కు కారణాలు
 పాంక్రియాటైటిస్ రుగ్మతతో బాధపడేవారికి అందుకు కారణమయ్యే అంశాలలో అతి ముఖ్యమైనది ‘ఆల్కహాల్’. పాంక్రియాటైటిస్‌తో బాధపడే ప్రతిపదిమందిలోనూ ఏడుగురు మద్యం కారణంగానే ఆ వ్యాధి బారిన పడుతుంటారు. మద్యం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి, అవి క్రమంగా పాంక్రియాటైటిస్‌కు దారితీస్తాయి. వీటి గురించి విపులంగా...
 
 గాల్‌స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు):
పిత్తాశయంలో జీర్ణక్రియకు ఉపయోగపడే  పైత్యరసం అనే స్రావాలు నిల్వ ఉంటాయి. కడుపులోని జీర్ణాశయానికి కాస్తకిందుగా చిన్నపేగులు మొదలయ్యే చోట... పిత్తాశయం తాలూకు నాళమైన బైల్ డక్ట్ నుంచి చిన్నపేగుల మొదటిభాగం (డియోడినమ్)లో కలిసి అక్కడ పైత్యరసాన్ని విడుదల చేసి, ఆహారం జీర్ణమయ్యేలా చేయడం జరుగుతుంది.  పిత్తాశయం నుంచి వచ్చి, చిన్నపేగుల దగ్గర తెరచుకునే నాళం (బైల్ డక్ట్), పాంక్రియాస్ నుంచి వచ్చి అక్కడే తెరచుకునే నాళం ఒక కూడలిలా ఉంటాయి. సాధారణంగా చిన్నపేగులోకి పైత్యనాళం నుంచి పైత్యరసం విడుదలయ్యే ఈ ప్రక్రియవల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొన్నిసార్లు కొంతమందిలో పైత్యనాళం నుంచి వచ్చే రాళ్లు ఈ కూడలిలో ఇరుక్కుపోతాయి. ఈ రాళ్ల కారణంగా ఈ స్రావాలు వెనక్కు వెళ్లి పాంక్రియాటిక్ నాళం (డక్ట్)లోకి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు కొంతమేరకే ఈ స్రావాలను అడ్డుకునే రాళ్లు, ఒక్కోసారి పాంక్రియాటిక్ డక్ట్‌ను అడ్డుకుని పూర్తిగా మూసేస్తాయి కూడా. దాంతో ఆస్రావాలు వెనక్కు పాంక్రియాస్‌లోకి ప్రవేశించి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి.


 ఆల్కహాల్ వల్ల: పాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణం ఆల్కహాల్ అన్నది వాస్తవం. అయితే ఇదెలా జరుగుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా బాగా మద్యం తాగిన 6-12 గంటల తర్వాత కడుపునొప్పి రూపంలో పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. కొంతమందిలోనైతే ఎంతకొద్దిమోతాదులో తాగినప్పటికీ పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. అంటే ఇలాంటివారిలో వారి పాంక్రియాస్‌కు ఆల్కహాల్ అంటే అస్సలు పడదన్నమాట. అంటే పాంక్రియాస్... ఆల్కహాల్ పట్ల సెన్సిటివిటీని కలిగి ఉంటుందని అర్థం.
 
మరికొన్ని కారణాలు: పై కారణాలతోపాటు మరికొన్ని అంశాలు కూడా పాంక్రియాటైటిస్‌కు కారణమవుతాయి. కానీ అవి అంత సాధారణం కావు. అవి... కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ (ఉదాహరణకు మంప్స్ వైరస్, హెచ్‌ఐవీ వైరస్‌ల కారణంగా పాంక్రియాటైటిస్ రావచ్చు). చాలా అరుదుగా కొన్నిరకాల మందుల తాలూకు దుష్ర్పభావాలు (సైడ్‌ఎఫెక్ట్స్)గా కూడా పాంక్రియాటైటిస్ కనిపించవచ్చు. పాంక్రియాస్ లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా శస్త్రచిక్సిత జరిగినప్పుడు సైతం ఈ రుగ్మత రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరాన్నజీవుల కారణంగానూ ఈ వ్యాధి రావచ్చు. ఇక ఒంటిలో చాలా ఎక్కువగా కొవ్వు ఉన్న సందర్భాల్లోనూ, క్యాల్షియమ్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, పాంక్రియాస్ నిర్మాణం సరిగా లేనప్పుడు కూడా ఈ జబ్బు రావచ్చు. కొన్నిసందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా చాలా చాలా అరుదనే చెప్పాలి.


 ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్: ఇందులో మన సొంత రోగనిరోధక శక్తి మన పాంక్రియాస్‌ను దెబ్బతీస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్ అంటారు.
 
 కారణాలు తెలియకుండా కూడా:
పది పాంక్రియాటైటిస్ కేసుల్లో రెండింటికి అసలు కారణమే తెలియదు.
 
 పాంక్రియాటైటిస్ తీవ్రత
 సాధారణంగా అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో కడుపునొప్పి తీవ్రంగా వచ్చినప్పటికీ సాధారణంగా దుష్ర్పభావాలు పెద్దగా ఉండవు. అయితే 10 శాతం కేసుల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, ఒక్కోసారి సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. చాలా అరుదుగా మరణానికి దారితీయవచ్చు. ఒక్కోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి రావచ్చు.
 
 దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌లో పరిస్థితి కాస్త భిన్నం. ఇందులో కడుపునొప్పి వచ్చినా చాలా సందర్భాల్లో కొద్దిగా లేదా ఓ మోస్తరుగా ఉండి నొప్పినివారణ మందులతో తగ్గవచ్చు లేదా కొంతమంది విషయంలో కొంతకాలం ఆసుపత్రిలో ఉంచడం వల్ల, ఇంజెక్షన్లతోను పరిస్థితి చక్కబడవచ్చు. కొన్నిసార్లు పాంక్రియాస్ నుంచి వెలువడవలసిన స్రావాలకు రాళ్లు అడ్డుపడుతున్నప్పుడు ఎండోస్కోపిక్ చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
 
 ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్: దీనికి ప్రధానకారణం ఆల్కహాల్. చాలా ఎక్కువ మోతాదులో ఐదేళ్లపాటు కొనసాగిస్తుంటే, అది ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్‌కు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఆల్కహాల్ మానివేయగానే దాంతోపాటే ఈదుష్ర్పభావమూ తగ్గిపోతుంది. క్రమంగా ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్ నయమైపోతుంది.
 
 నిర్వహణ- యాసీన్
 
 నివారణ / జాగ్రత్తలు

 ఎవరిలోనైనా సరే డాక్టర్లు పాంక్రియాటైటిస్ జబ్బు ఉన్నట్లుగా చెబితే, వారికి ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే తక్షణం దాన్ని మానేయాలి. దాంతో పాంక్రియాటైటిస్ కారణంగా వచ్చిన నొప్పి తగ్గిపోయి, పాంక్రియాస్ మరింత దెబ్బతినడం ఆగిపోతుంది. ఒకవేళ పాంక్రియాటైటిస్ వ్యాధి కనిపించాక కూడా మద్యం అలవాటును ఆపివేయకుండా అలాగే కొనసాగిస్తే నొప్పితీవ్రత మరింతగా పెరుగుతుంది. ఇక పాంక్రియాస్ దెబ్బతినడం కూడా పెరుగుతుంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి అది మరణానికీ దారితీయవచ్చు.
 అక్యూట్ పాంక్రియాటైటిస్‌కు ఆల్కహాల్ కారణం కానప్పటికీ, ఒకవేళ ఒకసారి అక్యూట్ పాంక్రియాటైటిస్ కనిపిస్తే మాత్రం ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు తక్షణం దాన్ని మానేయాలి. అలా కనీసం ఆర్నెల్లపాటు దూరంగా ఉండాలి. అంటే పాంక్రియాస్ మళ్లీ యథాస్థితికి రావడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఇలా కాకుండా ఒకవేళ అలాగే కొనసాగిస్తే మాత్రం అది దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌కూ లేదా ప్రమాదకరమైన పరిస్థితికీ దారితీయవచ్చు.
 
 డాక్టర్ ఐతా శ్రీవేణు,
 సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
 సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ అడ్వాన్స్‌డ్
 ఎండోస్కోపీ సెంటర్
 మియాపూర్, హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement