Pancreas
-
పదోతరగతి నుంచే మద్యపానం.. ప్రాణాల మీదకు తెచ్చిన వైనం
సాక్షి, అనంతపురం: పదో తరగతి చదివే సమయం నుంచే ఉన్న మద్యపానం అలవాటు.. ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మద్యపానం అలవాటైపోయిన ఓ యువకుడికి.. దాని కారణంగా పాంక్రియాస్ (క్లోమం) బాగా పాడైపోయి, కుళ్లిపోయిన స్థితికి చేరుకోవడంతో ప్రాణాపాయం ఏర్పడింది. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో వ్యాపించడంతో శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు దాదాపు లేవనే బెంగళూరులోని పలు ఆస్పత్రుల వైద్యులు అసలు కేసు తీసుకునేందుకే ఇష్టపడలేదు. అలాంటి కేసులో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడమే కాక.. రోగి ప్రాణాలను విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎన్.మహ్మద్ షాహిద్ తెలిపారు.“హిందూపురానికి చెందిన 26 ఏళ్ల లోకేష్‌కు తాను పదోతరగతి చదివే సమయం నుంచి మద్యపానం అలవాటు ఉంది. కొంతమందిలో దానివల్ల మరీ అంత సమస్యలు రాకపోయినా, కొందరికి మాత్రం శరీర తత్వం కారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. లోకేష్‌కు పాంక్రియాస్ చుట్టూ నీరు చేరి, ఒక గోడలా తయారైపోవడమే కాక.. బాగా చీముపట్టి విపరీతమైన ఇన్ఫెక్షన్ (నెక్రోసిస్)కు దారితీసింది. అతడు బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ చదువుతూ వైద్యరంగంలోనే ఉన్నాడు. సమస్య వచ్చిన మొదట్లో ఇక్కడ చూపించుకున్నప్పుడు మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ మనోజ్‌కు చూపించారు. ఆయన కొన్ని మందులు ఇచ్చి, శస్త్రచికిత్స అవసరం అవుతుందని చెప్పారు. దాంతో రోగి, అతడి బంధువులు బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ మూడు నాలుగు పెద్దపెద్ద ఆస్పత్రులకు తిరిగారు. ఇలాంటి కేసులో శస్త్రచికిత్స చేయకపోతే బతికే అవకాశాలు దాదాపు ఉండవు. ఒకవేళ చేసినా, 60-70శాతం మంది చనిపోతారు. బతికేవారిలో కూడా జీవితాంతం ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉండటంతో బెంగళూరు ఆస్పత్రులలో వైద్యులెవరూ ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉండటంతో పాటు గుండె రేటు కూడా గణనీయంగా పెరిగిపోయింది. రక్తపోటు పడిపోయింది. క్లోమం పూర్తిగా పాడైపోవడంతో దాన్ని తొలగించక తప్పలేదు. ఇన్ఫెక్షన్ ప్రేగులకు కూడా విస్తరించడంతో ముందు జాగ్రత్తగా స్టోమా చేశాం. దీన్ని మరో రెండు మూడు నెలల తర్వాత మళ్లీ లోపల పెట్టేస్తాం.ఈ శస్త్రచికిత్స తర్వాత లోకేష్ పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాంక్రియాస్‌ను తొలగించడం వల్ల భవిష్యత్తులో అతడికి కచ్చితంగా మధుమేహం వస్తుంది. ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. మధుమేహ నియంత్రణకు టాబ్లెట్లు గానీ, ఇన్సులిన్ గానీ వాడాల్సి ఉంటుంది. మద్యపానానికి పూర్తిగా దూరం కావాలి. ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి” అని డాక్టర్ మహ్మద్ షాహిద్ వివరించారు. -
ప్యాంక్రియాటైటిస్ వస్తే?
దేహంలోని జీవక్రియల్లో ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంధి)ది కీలక పాత్ర. దీని నుంచి అవసరమైనప్పుడు రక్తంలోని గ్లూకోజ్‌నుంచి శక్తిని తీసుకుని వినియోగించుకునేలా, అలాగే అవసరం లేనప్పుడు అదే మళ్లీ అదే గ్లూకోజ్‌ను రక్తం నుంచి తొలగించి, కాలేయంలో భద్రపరచుకునేలా హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అవసరమైనప్పుడు శక్తిని తీసుకునేందుకు గ్లూకగాన్, అవసరం లేనప్పుడు మళ్లీ నిల్వ చేసుకునేందుకు ఇన్సులిన్ అనే హార్మోన్లను ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ లోపం వల్లనే డయాబెటిస్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది సొమాటోస్టాటిన్ అనే హార్మోన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఓ చిన్న గొట్టం ద్వారా జీర్ణప్రక్రియకు అవసరమైన క్లోమరసం కూడా వచ్చి చిన్నపేగుల దగ్గర కలుస్తుంది. ఏవైనా కారణాల వల్ల ఈ క్లోమరసం తాలూకు స్రావాల్లోని ప్రోటీన్లు ఉండల్లాగా మారి, క్లోమరసాన్ని తీసుకెళ్లే గొట్టానికి అడ్డుపడ్డప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథికి ఇన్ఫెక్షన్ రావచ్చు. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ గ్రంథిలోనే రాళ్లలా ఏర్పడవచ్చు. ఇలా జరగడాన్ని ‘ప్యాంక్రియాటైటిస్’ అంటారు. నిజానికి ఇది అంత ప్రాణాంతకం కానప్పటికీ, కొందరిలో మాత్రం తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే దీనికి చికిత్స అవసరమవుతుంది. లక్షణాలు : ► తిన్నది జీర్ణం కాకపోవడం ► ఏదైనా తిన్నవెంటనే కడుపులో తీవ్రమైన మంట, నొప్పి ► స్వల్పంగా జ్వరం ► పొట్టభాగం ఎడమవైపున పైభాగంలో లేదా మధ్య భాగంలో నొప్పి మొదలై కొన్ని సందర్భాల్లో అది వీపుకు వైపునకు పాకుతుండటం ► కామెర్లు ఠీ పొట్ట ఉబ్బరం ఠీ వాంతి అవుతున్నట్లు అనిపిస్తుండం (వికారం) ► కొందరిలో విరేచనాలు కావడం ► కడుపుపైన తాకితే భరించలేనంత బాధ (టెండర్నెస్) ► కొందరిలో కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం... వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కారణాలు : ఏ కారణం లేకుండానే పాంక్రియాస్లో రాళ్ల వంటివి రావడం జరుగుతుంది. అయితే కొందరిలో మితిమీరిన మద్యపానం చాలావరకు పాంక్రియాటైటిస్‌కు కారణమవుతుంది. నిర్ధారణ పరీక్షలు : బాధితులకు కొన్ని రక్తపరీక్షలు, సీరమ్ లైపేజ్ పరీక్షలు, సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేసి, పాంక్రియాస్ నుంచి వచ్చే నాళం ఎంత దెబ్బతిన్నదీ, ఆ గ్రంథి ఏ మేరకు ఉబ్బి ఉంది అన్న విషయాలు తెలుసుకుని చికిత్స ప్రారంభిస్తారు. చికిత్స : పాంక్రియాటైటిస్ తీవ్రత చాలా తక్కువగా ఉంటే కొన్ని రకాల మందులతో దాన్ని తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. మందులతో తగ్గనప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల ల్యాపరోస్కోపిక్ / కీహోల్ శస్త్రచికిత్సలతో కడుపుపై కత్తితో కోయకుండానే, చిన్నపాటి గాట్లతోనే శస్త్రచికిత్స చేసి, ప్యాంక్రియాస్ గ్రంథిలోని దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల హాస్పిటల్లో ఉండాల్సిన సమయం, ఇతర ఇన్ఫెక్షన్లు, సర్జరీ తర్వాత వచ్చే దుష్పరిణామాలు బాగా తగ్గిపోతాయి. -
చక్కెర స్థాయిలను సజావుగా నియంత్రించే...
లండన్: టైప్–2 మధుమేహులకు ఇది నిజంగా శుభవార్తే! ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. భారత్‌లోనైతే 2019 నాటికి ఏకంగా 7.7 కోట్ల మంది దీని బారిన పడ్డారు. 2045 కల్లా వీరి సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఒంట్లో చక్కెర మోతాదులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేందుకు దోహదపడే కృత్రిమ క్లోమాన్ని కేంబ్రిడ్జి వర్సిటీలోని వెల్కమ్–ఎంఆర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటబాలిక్ సైన్స్ పరిశోధకులు తాజాగా అభిృవృద్ధి చేశారు. దీన్నిప్పటికే విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా! టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న వారికి ఇది వరప్రసాదమేనని వారు చెబుతున్నారు. కామ్‌ఏపీఎస్ హెచ్‌ఎక్స్‌గా పిలిచే దీంట్లో గ్లూకోజ్ మానిటర్, ఇన్సులిన్ పంపు ఉంటాయి. ఇది యాప్ సాయంతో పని చేస్తుంది. చక్కెర స్థాయి సరైన విధంగా కొనసాగాలంటే ఎప్పుడు ఎంత ఇన్సులిన్ అవసరమో అంచనా వేసి చెబుతుంది. ‘‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్ ఇంజక్షన్లు తదితరాలతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను సరిగా మెయింటెయిన్ చేయడం టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో చాలామందికి సమస్యగా మారింది. అలాంటి వారికి ఈ కృత్రిమ క్లోమం సురక్షితమైన, మెరుగైన ప్రత్యామ్నాయం. దీని టెక్నాలజీ చాలా సులువైనది. కనుక ఇంట్లో సురక్షితంగా వాడుకోవచ్చు’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన చార్లొటీ బౌటన్ తెలిపారు. దీని వివరాలు జర్నల్ నేచర్ మెడిసిన్‌లో పబ్లిషయ్యాయి. ఇలా చేశారు... కామ్‌ఏపీఎస్ హెచ్‌ఎక్స్‌ను తొలుత 26 మంది టైప్–2 డయాబెటిస్ రోగులపై ప్రయోగాత్మకంగా వాడి చూశారు. వీరిని రెండు గ్రూపులుగా చేశారు. తొలి గ్రూపు 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని వాడి తర్వాత రోజువారీ ఇన్సులిన్ ఇంజక్షన్ల వంటి పద్ధతులకు మారింది. రెండో గ్రూప్ ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా తొలుత రోజువారీ ఇన్సులిన్ ఇంజక్షన్ల వంటివి వాడి అనంతరం 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని ఉపయోగించింది. రెండు గ్రూపుల్లోనూ కృత్రిమ క్లోమాన్ని వాడినప్పుడు రోగుల్లో సగటు చక్కెర స్థాయిలు 3 ఎంఎంఓఎల్/ఎల్ మేరకు పడిపోయినట్టు గుర్తించారు. అంతేగాక రక్తంలో హిమోగ్లోబిన్ చక్కెరతో కలిసినప్పుడు వృద్ధి చెందే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బీఏ1సీ) అణువుల మోతాదు కూడా తగ్గినట్టు తేలింది. ఇన్సులిన్ ఇంజక్షన్లతో నానా రకాల సైడ్ ఎఫెక్టులున్న నేపథ్యంలో కృత్రిమ క్లోమం చాలా మెరుగైన ప్రత్యామ్నాయం కాగలదని కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్ ఐదీన్ డాలీ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్సులిన్ థెరపీ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే రిస్కు తరచూ తలెత్తుతుంది. కనుక వాటిని విస్తృతంగా వాడే పరిస్థితి లేదు. కానీ మా ప్రయోగాల్లో కృత్రిమ క్లోమం వాడిన ఒక్క రోగిలోనూ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సినంత కంటే మరీ తక్కువకు పడిపోలేదు. ఇది చాలా గొప్ప విషయం’’ అని ఆయన వివరించారు. వాణిజ్యపరంగా రోగులకు దీన్ని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చే ముందు మరింత విస్తృతంగా ప్రయోగాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి?
Why Do Stones Form In Gallbladder: గాల్‌బ్లాడర్‌ను తెలుగులో పిత్తాశయం అంటారు. ఇది కాలేయం (లివర్)తో పాటు ఉండే కీలకమైన అవయవం. కొందరిలో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయో, అలా వచ్చినప్పుడు పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. నిజానికి పైత్యరసం (బైల్ జ్యూస్) కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇలా లివర్‌లో పుట్టిన ఈ పైత్యరసాన్ని గాల్‌బ్లాడర్ నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వులు జీర్ణం కావడం కోసం ఈ బైల్ జ్యూస్ ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలైపోయి జీర్ణమయ్యేలా ఈ బైల్‌జ్యూస్ చూస్తుంది. ఇలా జరిగే క్రమంలో ఒకవేళ ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే... వాటిని గాల్‌బ్లాడర్ మళ్లీ స్వీకరించి, తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే, అలాగే పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకేచోట పోగుబడి రాళ్లలా మారవచ్చు. ఇలా ఏర్పడే ఈ రాళ్లు పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. అంటే బైల్‌జ్యూస్ స్రావాలకు అడ్డుపడే ప్రమాదం ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది మొదటి ప్రధాన కారణం. అలాగే మన జన్యువులు (జీన్స్), ఊబకాయం, పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్ కూడా గాల్‌స్టోన్స్‌కు కొంతవరకు కారణాలే. డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే... కిడ్నీలో మాదిరిగా ఇవి పూర్తిగా రాళ్లలాంటివి కావు. ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలన్నీ ఒక ఉండగా మారి రాళ్లను తలపిస్తుంటాయి. కొందరిలో ఇవి పైత్యరసం ప్రవహించే డక్ట్ (పైత్యవాహిక)కు అడ్డు తగిలి నొప్పిని కలగజేయవచ్చు. మరికొందరిలో ఇవి ఏర్పడినా ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అలా నొప్పి అనిపిస్తేగానీ... ఇవి ఏర్పడ్డ విషయం తెలియదు. కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించినప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు. చికిత్స ఏమిటి? నిజానికి గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చిన వాళ్లలో ఎలాంటి నొప్పీ లేకపోతే వారికి చికిత్స కూడా ఏమీ అవసరం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసి వీటిని తొలగించాల్సి ఉంటుంది. మందులతో తగ్గడం జరగదు. నొప్పి తీవ్రంగా వచ్చేవారు డాక్టర్ సలహా మేరకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. శస్త్రచికిత్స అవసరమనే నిర్ధారణ ఎలా? తొలుత నిర్వహించిన వైద్య పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు, మరోసారి అల్ట్రాసౌండ్ లేదా ఎమ్‌ఆర్‌సీపీ స్కాన్ చేసి లివర్, గాల్బ్లాడర్లలో వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. అలాగే గాల్‌బ్లాడర్ పనితీరును తెలుసుకునేందుకు ‘హెచ్ఐడిఏ’ పరీక్షను కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో చేసే శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవచ్చు. ఇది మేజర్ శస్త్రచికిత్స కూడా కాదు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆసుపత్రిలో ఉంటే చాలు. -డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
షాకింగ్: పసుపు రంగులోకి మారిన శరీరం!
బీజింగ్ : దీర్ఘకాలంగా పొగ తాగుతున్న ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. స్మోకింగ్ వల్ల ఏర్పడిన ట్యూమర్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పాంక్రియాస్లో ఏర్పడిన కణతి దుష్ప్రభావం కారణంగా కామెర్లు వచ్చి శరీరం మొత్తం ముదురు పసుపు పచ్చ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్నాయి. (నకిలీ వ్యాక్సిన్లు అమ్ముతున్న చైనా ముఠా) వివరాలు... డూ అనే ఇంటిపేరు గల 60 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్‌కు బానిసగా మారాడు. గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజూ సిగరెట్లు కాలుస్తున్న అతడికి ఇటీవల ఆరోగ్యం పాడైంది. దీంతో జనవరి 27న ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడికి కామెర్లు సోకినట్లు వైద్యులు గుర్తించారు. పొగతాగడం వల్ల ఏర్పడిన కారణంగా కణితి కారణంగా చిన్నపేగు, కాలేయం గుండా వెళ్లే నాళాలు మూసుకుపోయినట్లు పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలో రక్తంలో బిలిరూబిన్(పసుపు రంగులో ఉండే పైత్యరసం) స్థాయి పెరిగి కామెర్లు వచ్చాయి. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల ట్యూమర్ ఏర్పడిందని, దాని ప్రభావం అనారోగ్యానికి దారి తీసిందని తెలిపారు. అతడి శరీరంలో ఉన్న కాన్సన్ కణితిని తొలగించామని, ఈ క్రమంలో చర్మం రంగు తిరిగి సాధారణ రంగులోకి మారిందని తెలిపారు. దురలవాట్లు మానుకోకపోతే డూ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈసారి ఆయనను కాపాడటం కష్టమేనని పేర్కొన్నారు. -
'పారికర్‌ను అమెరికాకైనా తరలిస్తాం..'
సాక్షి, పనాజీ : అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను అమెరికా తరలిస్తామని బీజేపీ నేత, గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో చెప్పారు. క్లోమం (ప్యాంక్రియాస్) సంబంధించిన సమస్య ఏర్పడిన కారణంగా కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన పారికర్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆయనను పరామర్శించి రావడంతో అంతలా పారికర్‌కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అయితే, వాటన్నింటిని ఆస్పత్రి వర్గాలు కొట్టి పారేశాయి. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైకెల్ కూడా సోమవారం ఓ ప్రకటన చేశారు. 'ఆయన మాకు కావాలి. మేం చేయగలిగిందంతా చేస్తాం. అవసరం అయితే, ఆయనను అమెరికాకు కూడా తరలిస్తాం' అని మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పారు. ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్య కారణంగా పారికర్ ఈ నెల (ఫిబ్రవరి) 15న లీలావతి ఆస్పత్రిలో చేరి వైద్యంసేవలు పొందుతున్నారు. ఆయనకు ఓ సర్జరీ కూడా చేయగా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే చెప్పాయి. -
కీరదోస తింటే... పాంక్రియాస్ పనిచేస్తుంది!
గుడ్‌ఫుడ్ కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు ఎండాకాలంలో దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపేస్తుంది. కాబట్టి ఏడాదంతా తినవచ్చు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం. ఇందులోని ‘ కె’ విటమిన్ ఎమకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరును మెరుగుపరిచి అల్జీమర్స్ (మతిమరుపు) సమస్యను నివారిస్తుంది. కీరదోస ... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో లద్దెపురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు. -
ప్యాంక్రియాటిక్ స్టోన్స్ శస్త్రచికిత్స ప్రక్రియలు
ప్యాంక్రియాస్ చాలా కీలకమైన విధులు నిర్వహిస్తుంది. అందులో ప్రధానమైనది ఆహారం జీర్ణమయ్యేలా చేయడం. ఇందుకోసం అది తన ప్యాక్రియాటిక్ స్రావాలను విడుదల చేస్తుంది. ప్యాంక్రియాస్ స్రావాలు కలిసే చిన్న పేగుల వరకు ఉండే నాళం చాలా మృదువుగా, ఏకరీతి (రెగ్యులర్)గా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారిలో అది ఏకరీతిగా ఉండక అక్కడక్కడ సన్నబడుతుంది. దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ వచ్చిన 22 – 60 శాతం మందిలో ప్యాంక్రియాస్ నుంచి స్రావాలు సరిగా వెలువడక రాళ్లు కూడా రావచ్చు. ఈ రాళ్లు మళ్లీ ప్యాంక్రియాటిక్ స్రావాలను అడ్డగించవచ్చు. ప్యాంక్రియాటిక్ నాళంలో రాళ్లు రావడం గతంలో చాలా అరుదుగానీ ఇటీవల చాలా తరచుగానే కనిపిస్తున్నాయి. వాటిని తొలగించుకోడానికి అవసరమయ్యే శస్త్రచికిత్సల గురించి తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. ప్యాంక్రియాటిక్ స్టోన్స్ (రాళ్లు) ఎలా వస్తాయి? ప్యాంక్రియాస్ స్రావంలోని క్యాల్షియమ్ నిల్వ కావడంతో ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి మళ్లీ జీర్ణప్రక్రియను నిర్వహించాల్సిన స్రావాలకు అడ్డుపడవచ్చు. గాల్‌బ్లాడర్ నుంచి వచ్చే నాళం, ప్యాంక్రియాటిక్ నాళంలో కలిసి ఒకే నాళంగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో కూడా రాళ్లు ఏర్పడవచ్చు. ఈ రెండు రకాల రాళ్లలో ఏవైనా సరే ప్యాంక్రియాటిక్ ఎంజైములను అడ్డుకోవచ్చు. దాంతో ఆ స్రావాలు ప్యాంక్రియాస్‌లోని లోపలి పొరలనే దెబ్బతీయవచ్చు. ఎందుకు వస్తాయి...? కొందరిలో ఈ రాళ్లు ఎందుకు వస్తాయనే అంశం ఇదమిత్థంగా తెలియదు. అయితే కొన్ని అంశాలు ఇందుకు దోహదం చేస్తాయి. అవి... కొలెస్ట్రాల్ పెరగడం లేదా పైత్యరసంలో బైలురుబిన్ పెరగడం స్థూలకాయం. ఒకేచోట కూర్చొని పనిచేయడం ∙వయసు పెరగడం డయాబెటిస్ .తీవ్రమైన కాలేయ వ్యాధులు రావడం. కుటుంబ చరిత్రలో గాల్ స్టోన్స్ ఉండటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం.. ఇవన్నీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్‌కు దారితీస్తాయి. ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఈ రాళ్లు ఉన్నవారిలో సాధారణంగా పొట్టపైభాగం (అప్పర్ అబ్డామిన్)లో కుడివైపున నొప్పి కనిపిస్తుంది. ఈ నొప్పి వీపు భాగంలోకి కూడా రేడియేట్ అవుతుంటుంది. ఇది సాధారణంగా 15 నిమిషాలు మొదలుకొని కొంతమందిలో తీవ్రమైన నొప్పితో గంటలకొద్దీ బాధించవచ్చు. కొందరిలో వాంతులు కావడం, చెమటలు పట్టడం కూడా సంభవించవచ్చు. వారాలు, నెలలు కొందరిలో సంవత్సరాల తరబడి కనిపించవచ్చు. నొప్పి ఉన్న ప్రాంతాన్ని ముట్టుకోనివ్వనట్లుగా (టెండర్నెస్తో) ఈ బాధ ఉంటుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ నొప్పి వస్తున్నవారిలో అజీర్ణం, ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం, మలం కాస్త నూనె కలిసినట్లుగా (ఆయిలీగా), ఒకలాంటి వాసనతో ఉంటుంది. ఈ కండిషన్‌ను స్టియటోరియా అంటారు. అనర్థాలు: ప్యాంక్రియాటిక్ రాళ్లు ఆహారం జీర్ణం చేయాల్సిన ప్యాంక్రియాటిక్ స్రావాలకు అడ్డుపడటంతో పాటు రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రించే ప్యాంక్రియాటిక్ స్రావాలు సరిగా వెలువడకుండా అడ్డుపడవచ్చు. అది డయాబెటిస్‌కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. చికిత్స విధానాలు కొన్నిసార్లు ఈ రాళ్లను మందులతో కరిగించవచ్చు. అయితే రాళ్లు చాలా చిన్న సైజులో ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ స్రావాలతో ఏర్పడ్డ రాళ్ల విషయంలోనే ఈ చికిత్స సాధ్యమవుతుంది. చాలామందిలో రాళ్లను తొలగించడానికి శస్త్రచికిత్స విధానాలు అవసరమవుతాయి. ∙కొందరిలో ఈఆర్సీపీ అనే ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా రాళ్లను తొలగించవచ్చు. ఈఆర్సీపీ ప్రక్రియలో చిన్న పేగు దగ్గర ప్యాంక్రియాటిక్ నాళం కలిసే చోట, ఆ నాళాన్ని కొద్దిగా కట్ చేసి అక్కడి రాళ్లను ఎండోస్కోప్ (కడుపులోకి పంపే గొట్టం) ద్వారా తొలగిస్తారు. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియోటోగ్రఫీ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈఆర్సీపీ. ఇందులో ఎండోస్కోపీ ప్రక్రియలో ఒక పలుచటి గొట్టానికి కెమెరా అమర్చి కడుపులోకి పంపించి, ఆ గొట్టం చివర లైట్ వెలిగేలా చేసి, దాని సహాయంతో కడుపులోకి స్పష్టంగా చూస్తూ చికిత్స చేస్తారు. ఈ ఎండోస్కోప్ సహాయంతో కడుపు, చిన్నపేగులు, ఆ మార్గంలో కనెక్ట్ అయ్యే కొన్ని శరీర భాగాలకు అనేక వైద్య పరీక్షలు, చికిత్సలు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. రెట్రోగ్రేడ్ అంటే ఎండోస్కోప్ మార్గంలో ఒక ద్రవం విడుదలయ్యేలా చేసి దాని సహాయంతో ఎక్స్–రేస్ ప్రసరింపజేస్తూ అక్కడి అవయవాలైను చూడటం. కొలాంజియో–ప్యాంక్రియాటోగ్రఫీ అంటే కొలాంజియో అనే బైల్ నాళంలోనూ, ప్యాంక్రియాటోగ్రఫీ అంటే ప్యాంక్రియాస్ భాగాలలో ఎక్స్ కిరణాలసు ప్రసరించేయడం. ⇒ మరికొందరిలో ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్) అనే ప్రక్రియ ద్వారా రాళ్లను తొలగిస్తారు. ఇందులో రాళ్లను శబ్దతరంగాల సహయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి, అప్పుడు ఈసీఆర్పీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈఎస్‌డబ్ల్యూఎల్ అనేది ఇప్పుడు ఔట్‌పేషెంట్ ప్రక్రియగానూ చేస్తున్నారు. ⇒ ఈఎస్‌డబ్ల్యూఎల్ అనే ఈ ప్రక్రియలో పేషెంట్‌ని ఒక నీళ్ల తొట్టిలో బోర్లా పడుకోబెడతారు. కడుపు నీళ్లలో పాక్షికంగా మునిగి ఉండేలా చూస్తారు. శబ్దతరంగాలను వెలువరించే షాక్హెడ్స్ పొట్టకు ఆనించి ఉంచి, 2400 నుంచి 3000 వరకు షాక్‌వేవ్స్ వెలువడేలా చూస్తారు. దాంతో ఈ షాక్‌వేవ్‌ల శబ్దతరంగాల తాకిడికి రాళ్లు నుసిగా మారేలా చేస్తారు. ఈ ప్రక్రియకు సాధారణంగా 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది. ఒక్కోసారి పొట్టనొప్పి, చాలా అరుదుగా పొట్టకు గాయాలు కావచ్చు. ఈఆర్సీపీ, ఈఎస్డబ్ల్యూల్ అనేవి శరీరానికి కోట పెట్టకుండా చేసే శస్త్రచికిత్సలు (నాన్–ఇన్వేజివ్) శస్త్రచికిత్స మార్గాలు. ⇒ ఇక పొట్ట భాగంలో కోతతో చేసే సంప్రదాయ సర్జరీ కూడాచేయవచ్చు. అయితే ఈ ప్రక్రియయలో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రోగికి రక్తం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సంప్రదాయ శస్త్రచికిత్సలో ప్యాంక్రియాస్‌ను ఓపెన్ చేసి, రాళ్లు బయటకు తీసి, ప్యాంక్రియాస్ నాళాన్ని మళ్లీ చిన్నపేగుకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా సంప్రదాయ శస్త్రచికిత్స చేస్తారు కాబట్టి కోలుకోడానికి దాదాపు 10 రోజులు పైగానే ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ ఆలోక్ రథ్ కన్సల్టెంట్ జనరల్ సర్జరీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హైదరాబాద్ -
షుగర్...నో ఫికర్
పాంక్రియాస్‌ను చైతన్యవంతం చేసే ఆసనం ఉంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆర్డర్లో పెట్టే ఆసనాలూ ఉన్నాయి. షుగర్ రావడం అంటే శరీరంలో ఏదో సవ్యత లోపించడమే. యోగా శరీరాన్ని క్రమస్థితిలో ఉంచుతుంది. అంటే షుగర్‌ని కూడా కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. 1. వక్రాసన సుఖాసనంలో కూర్చుని రెండు కాళ్లు ముందుకు సాచాలి. స్ట్రెచ్ చేయాలి. కుడి మోకాలును పైకి లేపి పాదాన్ని పూర్తిగా జననేంద్రియాలకు దగ్గరగా ఉంచాలి. శరీరాన్ని, నడుముని కుడివైపుకు తిప్పి నిలబెట్టినట్టుగా ఉండాలి. కుడిమోకాలు ఎడమ చంకభాగంలోకి వచ్చేటట్లుగా కుడి చెయ్యి సీటుకి వెనుక వైపుగా తీసుకెళ్లి, అరచేతిని భూమి మీద నొక్కుతూ ఆ సపోర్ట్‌తో వీలైనంతవరకూ నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ కుడి భుజం నుండి వెనుకకు చూసే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలోకి వెళ్లి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి వెనుకకు అంటే యధాస్థితికి రావాలి. కాళ్లు రెండూ ఫ్రీ చేసుకున్న తరువాత రెండవ వైపు కూడా ఇలాగే సాధన చేయాలి. ఈ వక్రాసనం మరీచాసనం తరువాత చేయబోయే అర్థమశ్చీంద్రాసనానికి సిద్ధం చేస్తుంది. ఉపయోగాలు: నడుమును ట్విస్ట్ చేయుడం, పొట్ట దగ్గర కండరాలను లోపలకు లాగడం వలన జీర్ణావయవాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. 2. అర్ధమశ్ఛీంద్రాసన పై వక్రాసనంలో నిలబెట్టి ఉంచిన కుడికాలును ఎడమకాలు మీద నుండి క్రాస్ చేసి, ఎడమ పాదాన్ని కుడి తొడ బయట వైపుకు తీసుకురావాలి. సీటుకు వీలైనంత దగ్గరగా ఉంచి ఎడమకాలును మడిచి ఎడమ పాదాన్ని, ఎడమ మడమ కుడి సీటు భాగానికి దగ్గరగా ఉంచి, ఎడమ చంక భాగంలోకి నిలబెట్టి (ఫొటోలో చూపిన విధంగా) కుడి చేతిని మడచి వీపు వెనుక భూమికి సమాంతరంగా ఉంచాలి. కుడి మోకాలు మీద నుంచి ఎడమ చేతిని ట్విస్ట్ చేస్తూ వీపు వెనుక రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ తల కుడి భుజం మీదుగా తిప్పి వెనుకకు కుడివైపుకు చూసే ప్రయత్నం. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి యధాస్థితికి రావాలి. తరువాత కాలు మార్చుకుని రెండవ వైపుకు కూడా ఇలాగే చేయాలి. ఉపయోగాలు: ఈ ఆసనం ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా చేయాలి. పాంక్రియాస్ మీద ఒత్తిడి ఉండటం వలన, పాంక్రియాస్ బాగా యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. రెండవవైపు చేసినప్పుడు లివర్ మీద ప్రభావం ఉంటుంది. దీంతో ఫాటీ లివర్ సిండ్రోమ్, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులకు కూడా పరిష్కారం లభిస్తుంది. గమనిక: ఆసనం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కాలు నిలబెట్టి ఉంచినప్పుడు క్రాస్ చేసినప్పుడు శరీరానికి దగ్గరగా అదుముతూ నడుమును పక్కలకు ట్విస్ట్ చేయగల్గినట్లయితే ఆశించిన పలితం తప్పకుండా చేకూరుతుంది. 3. యోగముద్రాసన పద్మాసనంలో కూర్చొని చేతులు రెండు వెనుకకు తీసుకెళ్లాలి. వ్యతిరేక దిశలో కుడిచేతితో ఎడమపాదాన్ని కాలివేళ్లను, ఎడమచేత్తో కుడి పాదాన్ని, కాలివేళ్లను పట్టుకుని (ఆ ఆసనం బద్ధ పద్మాసనమని పిలుస్తారు) శరీరాన్ని నిటారుగా ఉంచి, పూర్తిగా శ్వాసతీసుకుని శ్వాసను వదులుతూ ఉండాలి. నడుము నుండి పై శరీర భాగాన్ని బాగా సాగదీస్తూ ముందుకు వంగి నుదురును భూమి మీద ఆనించాలి. లేదా భూమికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఒక వేళ వెనుక నుండి కాలి వేళ్లను ఫొటోలో చూపిన విధంగా పట్టుకోలేకపోతే ఎడమచేతి మణికట్టును కుడి చేత్తో పట్టుకుని చేతుల్ని వెనుక కిందకు లాగుతూ శరీరాన్ని ముందుకు వంచవచ్చు. తల భూమికి శక్తి కొద్దీ దగ్గరకు తీసుకువస్తే ఆశించిన ఫలితం లభిస్తుంది. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుని పైకి రావాలి. ఉపయోగాలు: జీర్ణవ్యవస్థకు, పునరుత్పత్తి వ్యవస్థకు ఈ ఆసనం చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కగా పనికి వచ్చే ఆసనం. -
టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స ఎలా?
టైప్-1 డయాబెటిస్ అంటే ఏమిటి? మా పిల్లవాడికి టైప్-1 డయాబెటిస్ అన్నారు. దీని గురించి వివరించి, మావాడు పాటించాల్సిన ఆహార నియమాలు వివరించండి. - కృష్ణమూర్తి, నల్గొండ పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపు వారిలో వచ్చే చక్కెరవ్యాధిని టైప్-1 డయాబెటిస్ (మధుమేహం) అంటారు. టైప్-1 డయాబెటిస్ అంటే ఇందులో క్లోమగ్రంథి అస్సలు పనిచేయదు. అంటే క్లోమగ్రంథి తయారు చేయాల్సిన ఇన్సులిన్ శరీరంలో అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి ఇన్సులిన్ మాత్రలతో ఆరంభించి, కొంతకాలానికి ఇంజెక్షన్‌కు మారుస్తుంటారు. సి-పెప్టైడ్ అనే ప్రోటీన్ మోతాదు 0.3 నానోగ్రాము ఉంటే క్లోమగ్రంథి సక్రమంగా పనిచేస్తున్నట్టు లెక్క. అంతకన్నా తక్కువ ఉంటే క్లోమగ్రంథి పనిచేయక, టైప్-1 డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ చేయవచ్చు. కొందరిలో ఈ కొలత సాధారణంగా ఉంటూ కూడా మధుమేహం వస్తుంది. అంటే ఇన్సులిన్ బాగానే ఉంది కానీ మధుమేహం వచ్చింది కాబట్టి ఇది టైప్-2 డయాబెటిస్ అని చెప్పవచ్చు. కాబట్టి పిల్లల్లో మధుమేహం ఉంటే నేరుగా ఇన్సులిన్ ఇవ్వకుండా సి-పెప్టైడ్ ఏ స్థాయిలో ఉందో చూసుకొని వైద్యం చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో మధుమేహం ఉంటే పాటించాల్సిన ఆహార నియమాలు: పిల్లల్లో ఎలాంటి ఆహార నియమాలు వద్దు 15-25 మధ్య వయసువారు లావుగా ఉంటేనే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే జంక్‌ఫుడ్ తగ్గించుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆహారంలో పిండిపదార్థాలు తగ్గించుకోవాలి 5 - 15 ఏళ్ల వయసువారికి ఎలాంటి ఆహారనియమాలు పెట్టకూడదు. వారి ఎదుగుదల కోసం వాళ్ల బరువుకు తగినట్లు ఎన్ని క్యాలరీలు అవసరమవుతాయో డైటీషియన్‌ను సంప్రదించి వారు చెప్పినట్లు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలను వాడాలి. మార్కెట్లో దొరికే పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, బిస్కెట్లు వాడకూడదు పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతో ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం, ఆహారాన్ని తగ్గించి, వ్యాయామాలను పెంచడం చేస్తే అసలే పిల్లల్లో తక్కువగా ఉండే రోగనిరోధకశక్తి మరింత తగ్గుతుంది. దీనికితోడు క్షయవ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి లక్షణాలతో టైప్-1ను గుర్తించవచ్చు... టైప్-1 డయాబెటిస్ హఠాత్తుగా వస్తుంది. రక్తంలో గ్లూకోజు ఆర్నెల్ల నుంచి పన్నెండు నెలల్లోపు 100 - 500 పెరగవచ్చు అతిమూత్రం, ఆకలి, దాహం వేయడం, మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్తుంటారు. రోగనిరోధకశక్తి తగ్గడంతో తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు ఎదుగుదల తగ్గుతుంది. హోమియోవైద్యవిధానంలో చికిత్స: హోమియోలో టైప్-1కు అద్భుతమైన వైద్యం అందుబాటులో ఉంది. ఇన్సులిన్‌తోపాటు హోమియో మందులు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఎదుగుదల లోపం, సోమరితనం, అతిమూత్రం లాంటి లక్షణాలను పూర్తిగా నయం చేయవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం, దుష్పరిణామాలు ఉండవు. డాక్టర్ టి. కిరణ్ కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
పాన క్రియతో పాంక్రియాస్‌కు దెబ్బ
మనం మన లోపలి అవయవాల గురించి ఆలోచించినప్పుడు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... అంటూ చాలా వాటిపై దృష్టి పెడతామేమో గాని పాంక్రియాస్ అనే ఆ అంతర్గత అవయవం వైపు దాదాపుగా దృష్టిసారించం. ఆకృతిలో తోకలా ఉండే అది మాత్రం తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. ఈ పాంక్రియాస్ ఉరఃపంజరాని(రిబ్కేజ్)కి కాస్తంత కిందగా కడుపులో ఉంటుంది. దాని పనితీరు మందగించిన కారణంగానే మనకు మధుమేహం లాంటి పాపులర్ జబ్బు వచ్చినా అది దానివల్ల్లేనని మనకు తెలియదు. కీలక అవయవం అయిన పాంక్రియాస్‌కు సోకే ఇన్ఫెక్షన్స్, కారణాలు, జాగ్రత్తలను గురించి తెలిపేదే ఈ కథనం. పాంక్రియాస్ అనేది ప్రధానంగా రెండు కీలకమైన పనులు చేస్తుంటుంది. మొదటిది మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యే క్రమంలో అవసరమైన జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక మనం తీసుకున్న ఆహారం శక్తిగా, అన్ని అవయవాలకూ అందడానికి గ్లూకోజ్‌గా మారే ప్రక్రియలో, రక్తంలోని ఆ గ్లూకోజ్‌ను నియంత్రిస్తూ ఉండే ప్రధాన భూమికను పాంక్రియాస్ పోషిస్తుంది. ఈ రెండు విధులను నిశ్శబ్దంగా చేసుకుపోయే ఈ అవయవంలోని కణాలకూ ఒక్కోసారి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సోకి, ఆ కణాలు దెబ్బతింటాయి. అలా పాంక్రియాస్‌లోని కణాలకు ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ సోకడాన్నే ‘పాంక్రియాటైటిస్’ అంటారు. పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా? కడుపు పైభాగం (అప్పర్ అబ్డామిన్)లో తీవ్రమైన కడుపునొప్పితో పాంక్రియాటైటిస్‌ను గుర్తించవచ్చు. కొన్నిసార్లు కొందరిలో ఆ నొప్పి వీపు వైపునకు వ్యాపిస్తుంది. దీన్ని సాధారణ కడుపునొప్పిగా పరిగణించలేం. ఎందుకంటే చాలా తీవ్రంగా గంటలకొద్దీ వచ్చే ఆ నొప్పి వల్ల కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం కావచ్చు. పాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది? పాంక్రియాస్ నిర్వహించే విధుల గురించి మనకు తెలిసిందే. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసే స్రావాలను అది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ స్రావాలు పేగుల్లోకి విడుదలయ్యాక, అవి వాటిమీద పని చేస్తే ఆహారం అరుగుతుంది. అప్పటివరకూ ఆ స్రావాలను నిద్రాణంగా ఉండేలా ప్రకృతి ఏర్పాటుచేసింది. కానీ కొన్ని సందర్భాల్లో అవి పాంక్రియాస్లో ఉండగానే క్రియాశీలం అయిపోయి, తమ పనిని ప్రారంభించేస్తాయి. దాంతో అప్పుడు అవి పాంక్రియాస్ కణాలనే దెబ్బతీయడం మొదలుపెడతాయన్నమాట. ఫలితంగా పాంక్రియాస్ కణాలకు వాపు, మంట వస్తాయి. అవి ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ సమష్టి పరిణామాలన్నింటినీ కలుపుకుని వైద్యపరిభాషలో ఇన్‌ఫ్లమేషన్‌గా చెప్పవచ్చు. ఇలా పాంక్రియాస్ అనే అవయవం ఇన్ఫ్లమేషన్కు గురికావడాన్నే ‘పాంక్రియాటైటిస్’గా పేర్కొంటారు. పాంక్రియాటైటిస్‌లో రకాలు పాంక్రియాటైటిస్ రుగ్మతలోనూ కొన్ని రకాలున్నాయి. అందులో రెండింటిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. మొదటిది తక్షణలక్షణాలు కనిపించే పాంక్రియాటైటిస్. దీన్నే అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఇక రెండోది... రుగ్మత దీర్ఘకాలికంగా కొనసాగే క్రానిక్ పాంక్రియాటైటిస్. క్రానిక్ పాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్తుల్లో కడుపునొప్పి మొదలుకొని పాంక్రియాటైటిస్ వల్ల వచ్చే లక్షణాలన్నీ తరచూ కనిపిస్తుంటాయి. అక్యూట్ పాంక్రియాటైటిస్ వచ్చినవారిలో చాలామందిలో అది దానంతట అదే తగ్గిపోతుంది. కానీ క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో మాత్రం తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్నవారిలో క్రానిక్ పాంక్రియాటైటిస్ వస్తుంది. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో మద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ తరహా కేసుల్లోనూ 20% నుంచి 30% మందిలో డయాబెటిస్ ఉన్నవారిలోనే ఇది కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో ఉండే తేడాలే దీనికి కారణం. పాంక్రియాటైటిస్‌కు కారణాలు పాంక్రియాటైటిస్ రుగ్మతతో బాధపడేవారికి అందుకు కారణమయ్యే అంశాలలో అతి ముఖ్యమైనది ‘ఆల్కహాల్’. పాంక్రియాటైటిస్‌తో బాధపడే ప్రతిపదిమందిలోనూ ఏడుగురు మద్యం కారణంగానే ఆ వ్యాధి బారిన పడుతుంటారు. మద్యం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి, అవి క్రమంగా పాంక్రియాటైటిస్‌కు దారితీస్తాయి. వీటి గురించి విపులంగా... గాల్‌స్టోన్స్ (పిత్తాశయంలో రాళ్లు): పిత్తాశయంలో జీర్ణక్రియకు ఉపయోగపడే పైత్యరసం అనే స్రావాలు నిల్వ ఉంటాయి. కడుపులోని జీర్ణాశయానికి కాస్తకిందుగా చిన్నపేగులు మొదలయ్యే చోట... పిత్తాశయం తాలూకు నాళమైన బైల్ డక్ట్ నుంచి చిన్నపేగుల మొదటిభాగం (డియోడినమ్)లో కలిసి అక్కడ పైత్యరసాన్ని విడుదల చేసి, ఆహారం జీర్ణమయ్యేలా చేయడం జరుగుతుంది. పిత్తాశయం నుంచి వచ్చి, చిన్నపేగుల దగ్గర తెరచుకునే నాళం (బైల్ డక్ట్), పాంక్రియాస్ నుంచి వచ్చి అక్కడే తెరచుకునే నాళం ఒక కూడలిలా ఉంటాయి. సాధారణంగా చిన్నపేగులోకి పైత్యనాళం నుంచి పైత్యరసం విడుదలయ్యే ఈ ప్రక్రియవల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొన్నిసార్లు కొంతమందిలో పైత్యనాళం నుంచి వచ్చే రాళ్లు ఈ కూడలిలో ఇరుక్కుపోతాయి. ఈ రాళ్ల కారణంగా ఈ స్రావాలు వెనక్కు వెళ్లి పాంక్రియాటిక్ నాళం (డక్ట్)లోకి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు కొంతమేరకే ఈ స్రావాలను అడ్డుకునే రాళ్లు, ఒక్కోసారి పాంక్రియాటిక్ డక్ట్‌ను అడ్డుకుని పూర్తిగా మూసేస్తాయి కూడా. దాంతో ఆస్రావాలు వెనక్కు పాంక్రియాస్లోకి ప్రవేశించి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఆల్కహాల్ వల్ల: పాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణం ఆల్కహాల్ అన్నది వాస్తవం. అయితే ఇదెలా జరుగుతుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా బాగా మద్యం తాగిన 6-12 గంటల తర్వాత కడుపునొప్పి రూపంలో పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. కొంతమందిలోనైతే ఎంతకొద్దిమోతాదులో తాగినప్పటికీ పాంక్రియాటైటిస్ లక్షణాలు బయటపడతాయి. అంటే ఇలాంటివారిలో వారి పాంక్రియాస్‌కు ఆల్కహాల్ అంటే అస్సలు పడదన్నమాట. అంటే పాంక్రియాస్... ఆల్కహాల్ పట్ల సెన్సిటివిటీని కలిగి ఉంటుందని అర్థం. మరికొన్ని కారణాలు: పై కారణాలతోపాటు మరికొన్ని అంశాలు కూడా పాంక్రియాటైటిస్‌కు కారణమవుతాయి. కానీ అవి అంత సాధారణం కావు. అవి... కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ (ఉదాహరణకు మంప్స్ వైరస్, హెచ్ఐవీ వైరస్ల కారణంగా పాంక్రియాటైటిస్ రావచ్చు). చాలా అరుదుగా కొన్నిరకాల మందుల తాలూకు దుష్ర్పభావాలు (సైడ్ఎఫెక్ట్స్)గా కూడా పాంక్రియాటైటిస్ కనిపించవచ్చు. పాంక్రియాస్ లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైనా శస్త్రచిక్సిత జరిగినప్పుడు సైతం ఈ రుగ్మత రావచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరాన్నజీవుల కారణంగానూ ఈ వ్యాధి రావచ్చు. ఇక ఒంటిలో చాలా ఎక్కువగా కొవ్వు ఉన్న సందర్భాల్లోనూ, క్యాల్షియమ్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, పాంక్రియాస్ నిర్మాణం సరిగా లేనప్పుడు కూడా ఈ జబ్బు రావచ్చు. కొన్నిసందర్భాల్లో ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా చాలా చాలా అరుదనే చెప్పాలి. ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్: ఇందులో మన సొంత రోగనిరోధక శక్తి మన పాంక్రియాస్‌ను దెబ్బతీస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ పాంక్రియాటైటిస్ అంటారు. కారణాలు తెలియకుండా కూడా: పది పాంక్రియాటైటిస్ కేసుల్లో రెండింటికి అసలు కారణమే తెలియదు. పాంక్రియాటైటిస్ తీవ్రత సాధారణంగా అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో కడుపునొప్పి తీవ్రంగా వచ్చినప్పటికీ సాధారణంగా దుష్ర్పభావాలు పెద్దగా ఉండవు. అయితే 10 శాతం కేసుల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, ఒక్కోసారి సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. చాలా అరుదుగా మరణానికి దారితీయవచ్చు. ఒక్కోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి రావచ్చు. దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్‌లో పరిస్థితి కాస్త భిన్నం. ఇందులో కడుపునొప్పి వచ్చినా చాలా సందర్భాల్లో కొద్దిగా లేదా ఓ మోస్తరుగా ఉండి నొప్పినివారణ మందులతో తగ్గవచ్చు లేదా కొంతమంది విషయంలో కొంతకాలం ఆసుపత్రిలో ఉంచడం వల్ల, ఇంజెక్షన్లతోను పరిస్థితి చక్కబడవచ్చు. కొన్నిసార్లు పాంక్రియాస్ నుంచి వెలువడవలసిన స్రావాలకు రాళ్లు అడ్డుపడుతున్నప్పుడు ఎండోస్కోపిక్ చికిత్స లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్: దీనికి ప్రధానకారణం ఆల్కహాల్. చాలా ఎక్కువ మోతాదులో ఐదేళ్లపాటు కొనసాగిస్తుంటే, అది ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్‌కు దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఆల్కహాల్ మానివేయగానే దాంతోపాటే ఈదుష్ర్పభావమూ తగ్గిపోతుంది. క్రమంగా ఆల్కహాలిక్ పాంక్రియాటైటిస్ నయమైపోతుంది. నిర్వహణ- యాసీన్ నివారణ / జాగ్రత్తలు ఎవరిలోనైనా సరే డాక్టర్లు పాంక్రియాటైటిస్ జబ్బు ఉన్నట్లుగా చెబితే, వారికి ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే తక్షణం దాన్ని మానేయాలి. దాంతో పాంక్రియాటైటిస్ కారణంగా వచ్చిన నొప్పి తగ్గిపోయి, పాంక్రియాస్ మరింత దెబ్బతినడం ఆగిపోతుంది. ఒకవేళ పాంక్రియాటైటిస్ వ్యాధి కనిపించాక కూడా మద్యం అలవాటును ఆపివేయకుండా అలాగే కొనసాగిస్తే నొప్పితీవ్రత మరింతగా పెరుగుతుంది. ఇక పాంక్రియాస్ దెబ్బతినడం కూడా పెరుగుతుంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే ఒక్కోసారి అది మరణానికీ దారితీయవచ్చు. అక్యూట్ పాంక్రియాటైటిస్‌కు ఆల్కహాల్ కారణం కానప్పటికీ, ఒకవేళ ఒకసారి అక్యూట్ పాంక్రియాటైటిస్ కనిపిస్తే మాత్రం ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు తక్షణం దాన్ని మానేయాలి. అలా కనీసం ఆర్నెల్లపాటు దూరంగా ఉండాలి. అంటే పాంక్రియాస్ మళ్లీ యథాస్థితికి రావడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఇలా కాకుండా ఒకవేళ అలాగే కొనసాగిస్తే మాత్రం అది దీర్ఘకాలిక పాంక్రియాటైటిస్కూ లేదా ప్రమాదకరమైన పరిస్థితికీ దారితీయవచ్చు. డాక్టర్ ఐతా శ్రీవేణు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సిగ్నస్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ మియాపూర్, హైదరాబాద్.