చక్కెర స్థాయిలను సజావుగా నియంత్రించే... | Cambridge scientists conduct successful trial of artificial pancreas for Type 2 diabetes patients | Sakshi
Sakshi News home page

చక్కెర స్థాయిలను సజావుగా నియంత్రించే...

Published Wed, Jan 18 2023 6:18 AM | Last Updated on Wed, Jan 18 2023 6:18 AM

Cambridge scientists conduct successful trial of artificial pancreas for Type 2 diabetes patients - Sakshi

లండన్‌: టైప్‌–2 మధుమేహులకు ఇది నిజంగా శుభవార్తే! ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. భారత్‌లోనైతే 2019 నాటికి ఏకంగా 7.7 కోట్ల మంది దీని బారిన పడ్డారు. 2045 కల్లా వీరి సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఒంట్లో చక్కెర మోతాదులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేందుకు దోహదపడే కృత్రిమ క్లోమాన్ని కేంబ్రిడ్జి వర్సిటీలోని వెల్‌కమ్‌–ఎంఆర్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటబాలిక్‌ సైన్స్‌ పరిశోధకులు తాజాగా అభిృవృద్ధి చేశారు. దీన్నిప్పటికే విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా! టైప్‌–2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఇది వరప్రసాదమేనని వారు చెబుతున్నారు.

కామ్‌ఏపీఎస్‌ హెచ్‌ఎక్స్‌గా పిలిచే దీంట్లో గ్లూకోజ్‌ మానిటర్, ఇన్సులిన్‌ పంపు ఉంటాయి. ఇది యాప్‌ సాయంతో పని చేస్తుంది. చక్కెర స్థాయి సరైన విధంగా కొనసాగాలంటే ఎప్పుడు ఎంత ఇన్సులిన్‌ అవసరమో అంచనా వేసి చెబుతుంది. ‘‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తదితరాలతో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను సరిగా మెయింటెయిన్‌ చేయడం టైప్‌ 2 డయాబెటిస్‌ రోగుల్లో చాలామందికి సమస్యగా మారింది. అలాంటి వారికి ఈ కృత్రిమ క్లోమం సురక్షితమైన, మెరుగైన ప్రత్యామ్నాయం. దీని టెక్నాలజీ చాలా సులువైనది. కనుక ఇంట్లో సురక్షితంగా వాడుకోవచ్చు’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన చార్లొటీ బౌటన్‌ తెలిపారు. దీని వివరాలు జర్నల్‌ నేచర్‌ మెడిసిన్‌లో పబ్లిషయ్యాయి.

ఇలా చేశారు...
కామ్‌ఏపీఎస్‌ హెచ్‌ఎక్స్‌ను తొలుత 26 మంది టైప్‌–2 డయాబెటిస్‌ రోగులపై ప్రయోగాత్మకంగా వాడి చూశారు. వీరిని రెండు గ్రూపులుగా చేశారు. తొలి గ్రూపు 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని వాడి తర్వాత రోజువారీ ఇన్సులిన్‌ ఇంజక్షన్ల వంటి పద్ధతులకు మారింది. రెండో గ్రూప్‌ ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా తొలుత రోజువారీ ఇన్సులిన్‌ ఇంజక్షన్ల వంటివి వాడి అనంతరం 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని ఉపయోగించింది. రెండు గ్రూపుల్లోనూ కృత్రిమ క్లోమాన్ని వాడినప్పుడు రోగుల్లో సగటు చక్కెర స్థాయిలు 3 ఎంఎంఓఎల్‌/ఎల్‌ మేరకు పడిపోయినట్టు గుర్తించారు. అంతేగాక రక్తంలో హిమోగ్లోబిన్‌ చక్కెరతో కలిసినప్పుడు వృద్ధి చెందే గ్లైకేటెడ్‌ హిమోగ్లోబిన్‌ (హెచ్‌బీఏ1సీ) అణువుల మోతాదు కూడా తగ్గినట్టు తేలింది.

ఇన్సులిన్‌ ఇంజక్షన్లతో నానా రకాల సైడ్‌ ఎఫెక్టులున్న నేపథ్యంలో కృత్రిమ క్లోమం చాలా మెరుగైన ప్రత్యామ్నాయం కాగలదని కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్‌ ఐదీన్‌ డాలీ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్సులిన్‌ థెరపీ వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే రిస్కు తరచూ తలెత్తుతుంది. కనుక వాటిని విస్తృతంగా వాడే పరిస్థితి లేదు. కానీ మా ప్రయోగాల్లో కృత్రిమ క్లోమం వాడిన ఒక్క రోగిలోనూ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ ఉండాల్సినంత కంటే మరీ తక్కువకు పడిపోలేదు. ఇది చాలా గొప్ప విషయం’’ అని ఆయన వివరించారు. వాణిజ్యపరంగా రోగులకు దీన్ని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చే ముందు మరింత విస్తృతంగా ప్రయోగాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement