Cambridge scientists
-
చక్కెర స్థాయిలను సజావుగా నియంత్రించే...
లండన్: టైప్–2 మధుమేహులకు ఇది నిజంగా శుభవార్తే! ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. భారత్‌లోనైతే 2019 నాటికి ఏకంగా 7.7 కోట్ల మంది దీని బారిన పడ్డారు. 2045 కల్లా వీరి సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఒంట్లో చక్కెర మోతాదులను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచేందుకు దోహదపడే కృత్రిమ క్లోమాన్ని కేంబ్రిడ్జి వర్సిటీలోని వెల్కమ్–ఎంఆర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటబాలిక్ సైన్స్ పరిశోధకులు తాజాగా అభిృవృద్ధి చేశారు. దీన్నిప్పటికే విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా! టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న వారికి ఇది వరప్రసాదమేనని వారు చెబుతున్నారు. కామ్‌ఏపీఎస్ హెచ్‌ఎక్స్‌గా పిలిచే దీంట్లో గ్లూకోజ్ మానిటర్, ఇన్సులిన్ పంపు ఉంటాయి. ఇది యాప్ సాయంతో పని చేస్తుంది. చక్కెర స్థాయి సరైన విధంగా కొనసాగాలంటే ఎప్పుడు ఎంత ఇన్సులిన్ అవసరమో అంచనా వేసి చెబుతుంది. ‘‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్ ఇంజక్షన్లు తదితరాలతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను సరిగా మెయింటెయిన్ చేయడం టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో చాలామందికి సమస్యగా మారింది. అలాంటి వారికి ఈ కృత్రిమ క్లోమం సురక్షితమైన, మెరుగైన ప్రత్యామ్నాయం. దీని టెక్నాలజీ చాలా సులువైనది. కనుక ఇంట్లో సురక్షితంగా వాడుకోవచ్చు’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన చార్లొటీ బౌటన్ తెలిపారు. దీని వివరాలు జర్నల్ నేచర్ మెడిసిన్‌లో పబ్లిషయ్యాయి. ఇలా చేశారు... కామ్‌ఏపీఎస్ హెచ్‌ఎక్స్‌ను తొలుత 26 మంది టైప్–2 డయాబెటిస్ రోగులపై ప్రయోగాత్మకంగా వాడి చూశారు. వీరిని రెండు గ్రూపులుగా చేశారు. తొలి గ్రూపు 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని వాడి తర్వాత రోజువారీ ఇన్సులిన్ ఇంజక్షన్ల వంటి పద్ధతులకు మారింది. రెండో గ్రూప్ ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా తొలుత రోజువారీ ఇన్సులిన్ ఇంజక్షన్ల వంటివి వాడి అనంతరం 8 వారాల పాటు కృత్రిమ క్లోమాన్ని ఉపయోగించింది. రెండు గ్రూపుల్లోనూ కృత్రిమ క్లోమాన్ని వాడినప్పుడు రోగుల్లో సగటు చక్కెర స్థాయిలు 3 ఎంఎంఓఎల్/ఎల్ మేరకు పడిపోయినట్టు గుర్తించారు. అంతేగాక రక్తంలో హిమోగ్లోబిన్ చక్కెరతో కలిసినప్పుడు వృద్ధి చెందే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బీఏ1సీ) అణువుల మోతాదు కూడా తగ్గినట్టు తేలింది. ఇన్సులిన్ ఇంజక్షన్లతో నానా రకాల సైడ్ ఎఫెక్టులున్న నేపథ్యంలో కృత్రిమ క్లోమం చాలా మెరుగైన ప్రత్యామ్నాయం కాగలదని కేంబ్రిడ్జి వర్సిటీకి చెందిన డాక్టర్ ఐదీన్ డాలీ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్సులిన్ థెరపీ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే రిస్కు తరచూ తలెత్తుతుంది. కనుక వాటిని విస్తృతంగా వాడే పరిస్థితి లేదు. కానీ మా ప్రయోగాల్లో కృత్రిమ క్లోమం వాడిన ఒక్క రోగిలోనూ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సినంత కంటే మరీ తక్కువకు పడిపోలేదు. ఇది చాలా గొప్ప విషయం’’ అని ఆయన వివరించారు. వాణిజ్యపరంగా రోగులకు దీన్ని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చే ముందు మరింత విస్తృతంగా ప్రయోగాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
లాక్డౌన్ : కేంబ్రిడ్జ్ షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాన్‌డౌన్ ఆరవ రోజుకు చేరుకుంది. లాక్‌డౌన్‌పై పలు వదంతులు, అంచనాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో 21 రోజుల లాక్డౌన్ గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌పై షాకింగ్ అధ్యయనం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 5 రోజుల సడలింపులతో నాలుగు దశల్లో మూడు లాక్ డౌన్లు అవసరమని కేంబ్రిడ్జ్ పరిశోధనలు చెబుతున్నాయి. మూడు వారాల లాక్డౌన్ సరిపోదనే ప్రధానంగా నమ్ముతున్నామని, సడలింపులతో కూడిన లాక్ డౌన్ వల్ల వ్యక్తిగత నిర్బంధం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ లాంటి నిబంధనలు సమర్ధవంత అమలు సాధ్యమని తద్వారా కేసుల సంఖ్య తగ్గుందని పరిశోధకులు పేర్కొన్నారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్ డౌన్ 21 రోజులు కాదు, 49 (21+28) రోజులకు పొడిగిండాలని కేంబ్రిడ్జ్ పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరీటికల్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకులు రాజేష్ సింగ్, ఆర్ అధికారి ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించారు. మార్చి 25న లాక్డౌన్ విధింపు, ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం లాంటి పరిణామాల అనంతరం జరిగిన గణిత గణనల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు వారు చెప్పారు. నాలుగు దశల్లో వేర్వేరు నియంత్రణ ప్రోటోకాల్స్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు లాక్ డౌన్లు అవసరమని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఇందులో మొదటి దశ ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్. ఇది వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే మళ్లీ వ్యాప్తి చెందకుండా వుండేందుకు, కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇది పెద్దగా పని చేయదని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ సడలింపు తర్వాత ఈ దశంలో తిరిగి పుంజుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. ఇక రెండవ దశలో 21 రోజుల లాక్ డౌన్ తరువాత తరువాత 5 రోజుల సడలింపు ఇచ్చి.. వెంటనే 28 రోజుల మరో లాక్ డౌన్ అమలు చేయాలంటున్నారు. తగ్గిన కేసుల ఆధారంగా వైరస్ పునరుజ్జీవనాన్ని అంచనా వేయలేమన్నారు. అదొక్కటే సరిపోదని పేర్కొన్నారు. మూడవ దశలో 28 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్లీ 5 రోజుల సడలింపు తరువాత 18 రోజుల లాక్ డౌన్ విధించాలంటున్నారు. ఈ మూడు లాక్డౌన్లు అయిదు రోజుల సడలింపులతో అమలు కావాలని సింగ్, అధికారి తెలిపారు. నాలుగవ దశలో పాజిటివ్ కేసుల 10 కంటే తక్కువకు వస్తుంది. స్పష్టమైన కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, తరువాత మాత్రమే వైరస్ తిరిగి రావడాన్ని నిరోధించడం అనే ప్రక్రియ విజయవంతమవుతుందని తేల్చారు. అంతేకాకుండా, 21నుండి 49 రోజుల కాలంలోమరణాల రేటు గణనీయంగా తగ్గుతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. 73 రోజుల వ్యవధిలో మరణాలు 2,727గా వుంటాయని, రెండవ దశలో 11 కి, మూడవ దశలో ఆరుకి, నాలుగ దశలో నాలుగుకు పడిపోతుందని భావిస్తున్నట్టు చెప్పారు. -
హైటెక్ కారు బ్యాటరీ
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లు మాత్రమే రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న నానా పరిమితుల కారణంగా వాటి వైపు ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదు. వాటికి ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేసినా 50 కిలోమీటర్లకు మించి ప్రయాణించడం కష్టం. పట్టణాలు, నగరాల్లో ఏదో లోకల్ జర్నీలకు తప్ప ఇలాంటి కార్లు లాంగ్ జర్నీలకు ఏమాత్రం అనుకూలం కాదు. అయితే, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక హైటెక్ కారు బ్యాటరీని రూపొందించారు. దీనిని ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే, నిరాటంకంగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఈ హైటెక్ బ్యాటరీలతో నడిచే కార్లు పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లకు దీటుగా రోడ్లపై పరుగులు తీయగలవని, వీటి ఇంధన సాంద్రత మామూలు బ్యాటరీల కంటే 90 శాతం ఎక్కువని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బ్యాటరీలను వారు ‘లిథియం-ఆక్సిజన్’ సమ్మేళనంతో రూపొందించారు. మామూలు కారు బ్యాటరీల కంటే ఇవి చాలా తేలికైనవని అంటున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే లీథియం బ్యాటరీలలో ఇంధన సాంద్రత తక్కువగా ఉండటం వల్ల వాటిని తరచు చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పోలిస్తే, తాము రూపొందించిన లిథియం-ఆక్సిజన్ బ్యాటరీల ఇంధన సాంద్రత పదిరెట్లు ఎక్కువని దీని రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ క్లేర్ గ్రే చెబుతున్నారు.