హైటెక్ కారు బ్యాటరీ
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లు మాత్రమే రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న నానా పరిమితుల కారణంగా వాటి వైపు ఎవరూ పెద్దగా మొగ్గు చూపడం లేదు. వాటికి ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేసినా 50 కిలోమీటర్లకు మించి ప్రయాణించడం కష్టం. పట్టణాలు, నగరాల్లో ఏదో లోకల్ జర్నీలకు తప్ప ఇలాంటి కార్లు లాంగ్ జర్నీలకు ఏమాత్రం అనుకూలం కాదు.
అయితే, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక హైటెక్ కారు బ్యాటరీని రూపొందించారు. దీనిని ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే, నిరాటంకంగా 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు. ఈ హైటెక్ బ్యాటరీలతో నడిచే కార్లు పెట్రోలు లేదా డీజిలుతో నడిచే కార్లకు దీటుగా రోడ్లపై పరుగులు తీయగలవని, వీటి ఇంధన సాంద్రత మామూలు బ్యాటరీల కంటే 90 శాతం ఎక్కువని కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ బ్యాటరీలను వారు ‘లిథియం-ఆక్సిజన్’ సమ్మేళనంతో రూపొందించారు. మామూలు కారు బ్యాటరీల కంటే ఇవి చాలా తేలికైనవని అంటున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే లీథియం బ్యాటరీలలో ఇంధన సాంద్రత తక్కువగా ఉండటం వల్ల వాటిని తరచు చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పోలిస్తే, తాము రూపొందించిన లిథియం-ఆక్సిజన్ బ్యాటరీల ఇంధన సాంద్రత పదిరెట్లు ఎక్కువని దీని రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ క్లేర్ గ్రే చెబుతున్నారు.