జంతువుల కోసం పెట్టిన కెమెరాలు, డ్రోన్ల దుర్వీనియోగం
కేంబ్రిడ్జ్ వర్సిటీ అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు
పెద్దపులులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా అలరారుతున్న ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఘోరం జరుగుతోంది. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు, జంతువుల సంఖ్యను లెక్కపెట్టేందుకు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు అడవిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, డ్రోన్లను గ్రామీణ మహిళలపై అనుచిత నిఘాకు వాడుతున్న వైనం కలకలం రేపుతోంది. వంట చెరకు, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే గ్రామీణ మహిళలను దొంగచాటుగా చూసేందుకు కొందరు అధికారులు, స్థానికులు ఈ కెమెరాలు, డ్రోన్లు, వాయిస్ రికార్డర్లను వాడుతున్నారు. ఈ విస్మయకర విషయాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెలుగులోకి తెచ్చింది!
అడవే వారికి జీవనాధారం
ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అక్కడి గ్రామీణ మహిళలకు అడవే ఆధారం. వంట చెరకు, తేనె, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. రోజుల పాటు అక్కడే గడుపుతారు. తాగుబోతు భర్తల హింస, వేధింపులు తాళలేక అడవి బాట పట్టే అతివలు ఎందరో. అడవి తల్లిని ఆశ్రయించే ఈ మహిళలకు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలు, డ్రోన్లు తలనొప్పిగా తయారయ్యాయి. అడవిలో సెలయేర్లు, గట్ల వద్ద స్నానాలు చేసే, బహిర్భూమికి వెళ్లే మహిళలను డ్రోన్లు, నిఘా కెమెరా కళ్లు వెంటాడుతున్నాయని కేంబ్రిడ్జ్ అధ్యయనంలో తేలింది.
‘‘మహిళలు అటవీ సంపదను కొల్లగొట్టకుండా వారిని బయటకు తరిమేందుకు మొదట్లో కెమెరా ట్రాప్‌లు, డ్రోన్లను అధికారులు వాడేవారు. తర్వాత కొందరు అధికారులు ఇలా మహిళలను దొంగచాటుగా చూసేందుకు దుర్వీనియోగం చేశారు. ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వాట్సాప్‌లోనూ షేర్ చేయడంతో విషయం గ్రామస్తుల దాకా చేరింది. చివరకు స్థానిక నిఘా కెమెరాలను తగలబెట్టే దాకా వెళ్లింది’’అని కేంబ్రిడ్జ్‌లో సోషియాలజీ విభాగ పరిశోధకుడు, నివేదిక ముఖ్య రచయిత త్రిశాంత్ సిమ్‌లయ్ చెప్పారు. నివేదిక వివరాలు ‘ఎన్విరాన్‌మెంట్, ప్లానింగ్ ఎఫ్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇదేం దిక్కుమాలిన పని!
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో అత్యంత విలువైన వనమూలికలుంటాయి. వాటిని సేకరించి పొ ట్ట నింపుకునేందుకు గ్రామీణ మహిళలు అడవుల్లోకి వెళ్తుంటారు. గుంపులుగా వెళ్లి కొద్ది రో జలు అక్కడే ఉంటారు. ‘‘అడవి తల్లితో మాకెంతో అనుబంధం. ఇంట్లో మాకు నిర్బంధం ఎక్కువ. పెళ్లి వంటి వేడుకలప్పుడు తప్పితే కనీసం నోరు తెరిచి పాడటం కూడా తప్పే. అందుకే వనదేవత ఒడికి చేరినప్పుడే అందరం కలిసి ఆనందంగా పాటలు పాడుతూ పనిలో నిమగ్నమవుతాం’’అని ఒక గ్రామీణురాలు తెలిపారు.
తాజాగా కొన్ని చోట్ల నిఘా కెమెరాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతాల్లో పులి సంచారంపై అధికారులకు నిఘా కరువైంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో కెమెరాల దుర్వీనియోగం చివరకు మహిళ ప్రాణాలను బలి గొందని స్థానికుల్లో ఆగ్రహం రేగింది. ‘‘రెక్కా డితేగానీ డొక్కాడని పేద మహిళలు ఇప్పటికీ అడవిలోకి వెళ్తు న్నారు. కానీ ఏ చెట్టు కొమ్మకు ఏ కెమెరా ఉందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. వాళ్ల గొంతులు మూగబోయాయి. అమాయక గ్రామీణుల జీవనశైలి మీదే ఇది ప్రభావం చూపుతోంది’’అని పర్యావరణవేత్తలు, సా మాజికవేత్తలు అంటున్నారు. జంతువులను చూడమంటే మహిళలను దొంగచాటుగా చూడటమేటని త్రిశాంత్ ప్రశ్నించారు.
స్పందించని అధికారులు
దీనిపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా అధికారులు స్పందించలేదు. జిమ్ కార్బెట్ జాతీయవనం ఢిల్లీ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాది అంతటి నుంచీ ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ జీప్ సఫారీ సౌకర్యం కూడా ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment