ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేతిలో బళ్లెం పట్టుకుని నడుస్తున్న ప్రధాని మోదీ, ఏనుగు పేడను పరిశీలిస్తున్న బేర్, ప్రధాని మోదీ
డెహ్రాడూన్: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు. బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై పలు ఆసక్తికర అంశాలను ప్రధాని ఆయనతో పంచుకున్నారు. ప్రకృతిలో మమేకమై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఈ సాహస యాత్ర సోమవారం డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా మోదీ, గ్రీల్స్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ ఇదే..
► బేర్ గ్రిల్స్: జిమ్ కార్పెట్ ఫేమస్ కదా సార్?
మోదీ: అవును ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. వృక్షాలపై అధ్యయనం చేయాలనకునేవారికి ఇక్కడుండే వందలాది రకాల చెట్లు ఉపయోగపడతాయి. పర్వతాలు, నదులతో పాటు అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత్ భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. 100 భాషలు, 1,600 యాసలు ఇక్కడ ఉన్నాయంటే భారత్‌లో ఏ స్థాయిలో భిన్నత్వం ఉందో మీరే అర్థం చేసుకోండి.
► ఈ ప్రాంతం ప్రమాదకరమని భావిస్తున్నారా?
ప్రకృతిని మనమెప్పుడూ ప్రమాదకరంగా భావించకూడదు. ప్రకృతితో పోరాడితే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అదే ప్రకృతికి అనుగుణంగా కలిసిజీవిస్తే క్రూరమృగాలు కూడా సహకరిస్తాయి.
► మోదీజీ.. చిన్నప్పుడు మీరు మంచి స్టూడేంటా?
మంచి స్టూడేంటా? కాదా? అని అంటే చెప్పలేను.
► ఇప్పుడు మీరు స్టైలిష్ దుస్తులు ధరిస్తున్నారు. చిన్నప్పుడూ ఇంతేనా?
చిన్నప్పుడు నేను సామాన్యంగానే జీవించా. మురికి బట్టలే వేసుకున్నా. కానీ స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రమైన యూనిఫాంను వేసుకెళ్లేవాడిని. అందుకోసం నిప్పు కణికలను ఓ రాగి చెంబులో వేసి యూనిఫాంను ఇస్త్రీ చేసుకునే వాడిని. స్కూలు అయిపోయాక పాకెట్ మనీ కోసం నాన్నతో కలిసి రైల్వేస్టేషన్ దగ్గర టీ అమ్మేవాడిని. అలా రైల్వేలు నా జీవితంలో కీలకపాత్ర పోషించాయి. మా ప్రాంతంలో మంచు కురిశాక దానిపై ఉప్పులాంటి పొర ఏర్పడేది. దాన్ని జాగ్రత్తగా సేకరించి దాచి పెట్టుకునేవాళ్లం. స్నానం సమయంలో ఆ ఇసుకనే వాడేవాళ్లం. వేడి నీటిలో ఈ ఇసుక వేసి బట్టలను ఉతికేవాళ్లం.
► మీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లారట?
అప్పుడు నా వయసు 17–18 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇళ్లు వదిలేశా. ప్రపంచాన్ని చూడాలనుకున్నా. హిమాలయాలకు వెళ్లగానే అక్కడి ప్రకృతి నచ్చింది. అక్కడే రుషులను కలుసుకున్నాను. అక్కడి మనుషుల మధ్య గడపడం అద్భుతమైన అనుభవం. అప్పటి శక్తే నన్ను ఇంకా నడిపిస్తోంది. నేను కలుసుకున్న రుషులంతా చాలా నిరాడంబరంగా ఉన్నారు. వాళ్లు ఒక్క కార్బన్ వ్యర్థాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సందర్భంగా మా నాన్న గురించి చెప్పాలి. మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వర్షాలు పడినప్పుడు మా నాన్న 25–30 పోస్ట్‌కార్డులు కొనేవారు. మా ప్రాంతంలో వర్షం పడిందని బంధువులందరికీ లేఖలు రాసేవారు. ఈ అనవసర ఖర్చు ఎందుకని మేం గోల చేసేవాళ్లం. అప్పట్లో నేనూ ఆశ్చర్యపోయేవాడ్ని. ప్రకృతి పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది.
అనంతరం వారిద్దరూ కలిసి ఎత్తుగా ఉన్న గడ్డి ప్రాంతాన్ని దాటి నదీతీరానికి చేరుకున్నారు.
► మీరు ప్రధాని కావాలని ఎప్పుడు అనుకున్నారు?
నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశా. అది నాకు కొత్త ప్రయాణం. ఆ తర్వాత ఈ పని(ప్రధాని బాధ్యతలు) చేపట్టాలని దేశం ఆదేశించింది. అందుకే ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఈ కాలంలో అభివృద్ధిపైనే నేను దృష్టి సారించాను. ప్రజల కలల్ని నా కలలుగా చేసుకుని పనిచేశా. ప్రజల కలల సాకారంతోనే నాకు సంతృప్తి లభిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను సెలవు తీసుకున్నా.
► ప్రధాని హోదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా?
మోదీ: నా మెదడు ఎప్పుడూ హోదా గురించి ఆలోచించదు. అలాంటివాటికి నేను అతీతుడ్ని. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా, నా మెదడు కేవలం పనిగురించే ఆలోచిస్తూ ఉంటుంది. పదవి అనేది నా
ఆలోచనల్లోకి కూడా రాదు.
► చిన్నప్పుడు మీరు మొసలిని ఇంటికి తీసుకెళ్లారట.. అసలేం జరిగింది?
ఓ అదా.. నేను రోజూ చెరువులో స్నానం చేసేవాడిని. అక్కడ కనిపించిన ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకెళ్లా. దీంతో మా అమ్మ ‘తల్లీబిడ్డలను వేరుచేయడం తప్పు. దాన్ని మనం పెంచుకోకూడదు. వెళ్లి వదిలేసి రా’ అని చెప్పింది. ప్రకృతిని చూసి మనమెప్పుడూ భయపడకూడదు. అలా భయపడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి.
► భారీ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే ఆందోళనను ఎలా ఎదుర్కొంటారు?
నా సమస్య ఏంటంటే నేనెప్పుడూ అలాంటి భయాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి భయం గురించి ప్రజలకు చెప్పలేను. నా స్వభావం చాలా సానుకూలమైనది. నేను ప్రతీదాంట్లో మంచినే చూస్తా. అనుకున్నపని జరగకపోతే బాధపడను.
► మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి?
నేను యువతకు చెప్పేదొకటే. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడొద్దు. జీవితాన్ని సంపూర్ణంగా చూస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం కిందపడ్డా బాధపడకూడదు. తిరిగి పైకిలేవడానికి అక్కడే దారి మొదలవుతుంది.
అనంతరం మోదీ, గ్రిల్స్ కలిసి నదిని దాటారు. ప్రధానిని టార్పాలిన్‌తో చేసిన తెప్పలో ఎక్కించిన గ్రిల్స్ దాన్ని తోసుకుంటూ నదిని దాటారు. ఈ సందర్భంగా వర్షం కురవడంతో మోదీ, గ్రిల్స్ తడిసిపోయారు. దీంతో
ఇద్దరూ కరివేపాకులు కలిపిన టీని తాగారు.
► ప్రకృతి పరిరక్షణ అంటే మీకు ఇష్టమా..?
మేం ఇండియాలో ప్రతీ చెట్టును దేవుడిగా భావిస్తాం. ఇక్కడ ‘తులసీ వివాహం’ అని సంప్రదా యం ఉంది. ఇందులో భగవంతుడిని, తులసి మొక్కకు ఏడాదికోసారి పెళ్లి చేస్తాం. అలా తుల సీదళాన్ని మా కుటుంబంలో భాగం చేసుకుంటాం. భూమిని కాపాడుకోవడమన్నది మన బాధ్య త. మన సుఖం కోసం ప్రకృతిని దోచుకుంటున్నాం.
► స్వచ్ఛ భారత్ కోసం ఏం చేయాలంటారు?
బయటివారి వల్ల స్వచ్ఛభారత్ సాధ్యం కాదు. భారత్‌లో ఉండేవారి స్వభావం వల్లే దేశం క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత అన్నది భారతీయ సంస్కృతిలోనే ఓ భాగం. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అలవర్చుకోవాలి. ఈ విషయంలో మహాత్మాగాంధీ చాలా కృషి చేశారు.
► చంపడం నా స్వభావానికి విరుద్ధం
ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కత్తి, తాడు, కర్ర సాయంతో బల్లెం తయారుచేశారు. పులులు తాము వేటాడే జంతువును సమీపించేవరకూ నక్కి ఉండి ఒక్కసారిగా దాడిచేస్తాయని గ్రిల్స్ తెలిపారు. పులి సమీపిస్తే ఇలా దాడిచేయాలంటూ బల్లెం వాడే పద్ధతిని చూపించారు. దీంతో మోదీ స్పందిస్తూ..‘చంపడం నా స్వభావానికి విరుద్ధం. ఈ ఆయుధాన్ని మీరే తీసుకోండి’ అని చెప్పారు. దీంతో గ్రిల్స్ దాన్ని తీసుకోబోతుండగా..‘పర్లేదు. మీకోసం నేను దీన్ని తీసుకుంటా’ అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రిల్స్ స్పందిస్తూ..‘సార్ ఒకవేళ ఇప్పుడు పులి వస్తే మీరెంత వేగంగా పరిగెత్తగలరు?’ అని ప్రశ్నించారు. దీంతో మోదీ..‘మీరు చెప్పండి’ అని అడిగారు. దీంతో గ్రిల్స్ ‘నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను’ అని జవాబిచ్చారు. వెంటనే మోదీ ‘అవునా!’ అంటూ తేరిపారా చూశారు. మోదీ మాటకు గ్రిల్స్ స్పందిస్తూ..‘ఇది పేలని జోక్ సార్. నేను మిమ్మల్ని వదిలి వెళతానా?’ అంటూ వ్యాఖ్యానించారు.
బేర్‌తో కలసి తెప్పపై నదిని దాటుతున్న ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment