jim corbett national park
-
వనంలో వనితలపై అనుచిత నిఘా
పెద్దపులులకు ఆవాసంగా, జీవవైవిధ్యానికి పట్టుగొమ్మగా అలరారుతున్న ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఘోరం జరుగుతోంది. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు, జంతువుల సంఖ్యను లెక్కపెట్టేందుకు, వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు అడవిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు, డ్రోన్లను గ్రామీణ మహిళలపై అనుచిత నిఘాకు వాడుతున్న వైనం కలకలం రేపుతోంది. వంట చెరకు, అటవీ ఉత్పత్తుల కోసం అడవిలోకి వెళ్లే గ్రామీణ మహిళలను దొంగచాటుగా చూసేందుకు కొందరు అధికారులు, స్థానికులు ఈ కెమెరాలు, డ్రోన్లు, వాయిస్ రికార్డర్లను వాడుతున్నారు. ఈ విస్మయకర విషయాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెలుగులోకి తెచ్చింది! అడవే వారికి జీవనాధారం ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌ను ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. అక్కడి గ్రామీణ మహిళలకు అడవే ఆధారం. వంట చెరకు, తేనె, ఇతరత్రా అటవీ ఉత్పత్తుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. రోజుల పాటు అక్కడే గడుపుతారు. తాగుబోతు భర్తల హింస, వేధింపులు తాళలేక అడవి బాట పట్టే అతివలు ఎందరో. అడవి తల్లిని ఆశ్రయించే ఈ మహిళలకు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలు, డ్రోన్లు తలనొప్పిగా తయారయ్యాయి. అడవిలో సెలయేర్లు, గట్ల వద్ద స్నానాలు చేసే, బహిర్భూమికి వెళ్లే మహిళలను డ్రోన్లు, నిఘా కెమెరా కళ్లు వెంటాడుతున్నాయని కేంబ్రిడ్జ్ అధ్యయనంలో తేలింది. ‘‘మహిళలు అటవీ సంపదను కొల్లగొట్టకుండా వారిని బయటకు తరిమేందుకు మొదట్లో కెమెరా ట్రాప్‌లు, డ్రోన్లను అధికారులు వాడేవారు. తర్వాత కొందరు అధికారులు ఇలా మహిళలను దొంగచాటుగా చూసేందుకు దుర్వీనియోగం చేశారు. ఒక మహిళకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఇటీవల ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. వాట్సాప్‌లోనూ షేర్ చేయడంతో విషయం గ్రామస్తుల దాకా చేరింది. చివరకు స్థానిక నిఘా కెమెరాలను తగలబెట్టే దాకా వెళ్లింది’’అని కేంబ్రిడ్జ్‌లో సోషియాలజీ విభాగ పరిశోధకుడు, నివేదిక ముఖ్య రచయిత త్రిశాంత్ సిమ్లయ్ చెప్పారు. నివేదిక వివరాలు ‘ఎన్విరాన్మెంట్, ప్లానింగ్ ఎఫ్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇదేం దిక్కుమాలిన పని! ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో అత్యంత విలువైన వనమూలికలుంటాయి. వాటిని సేకరించి పొ ట్ట నింపుకునేందుకు గ్రామీణ మహిళలు అడవుల్లోకి వెళ్తుంటారు. గుంపులుగా వెళ్లి కొద్ది రో జలు అక్కడే ఉంటారు. ‘‘అడవి తల్లితో మాకెంతో అనుబంధం. ఇంట్లో మాకు నిర్బంధం ఎక్కువ. పెళ్లి వంటి వేడుకలప్పుడు తప్పితే కనీసం నోరు తెరిచి పాడటం కూడా తప్పే. అందుకే వనదేవత ఒడికి చేరినప్పుడే అందరం కలిసి ఆనందంగా పాటలు పాడుతూ పనిలో నిమగ్నమవుతాం’’అని ఒక గ్రామీణురాలు తెలిపారు. తాజాగా కొన్ని చోట్ల నిఘా కెమెరాలను తగలబెట్టడంతో ఆ ప్రాంతాల్లో పులి సంచారంపై అధికారులకు నిఘా కరువైంది. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లిన ఒక మహిళపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో కెమెరాల దుర్వీనియోగం చివరకు మహిళ ప్రాణాలను బలి గొందని స్థానికుల్లో ఆగ్రహం రేగింది. ‘‘రెక్కా డితేగానీ డొక్కాడని పేద మహిళలు ఇప్పటికీ అడవిలోకి వెళ్తు న్నారు. కానీ ఏ చెట్టు కొమ్మకు ఏ కెమెరా ఉందోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది. వాళ్ల గొంతులు మూగబోయాయి. అమాయక గ్రామీణుల జీవనశైలి మీదే ఇది ప్రభావం చూపుతోంది’’అని పర్యావరణవేత్తలు, సా మాజికవేత్తలు అంటున్నారు. జంతువులను చూడమంటే మహిళలను దొంగచాటుగా చూడటమేటని త్రిశాంత్ ప్రశ్నించారు.స్పందించని అధికారులు దీనిపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయాన్ని మీడియా సంప్రదించగా అధికారులు స్పందించలేదు. జిమ్ కార్బెట్ జాతీయవనం ఢిల్లీ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరాది అంతటి నుంచీ ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడ జీప్ సఫారీ సౌకర్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజల నమ్మకాన్ని చెత్త బుట్టలో పడేశారు
న్యూఢిల్లీ: దేశంలో ప్రఖ్యాతిగాంచిన జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వాటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై మండిపడింది. అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనువుగా నిబంధనలను తుంగలో తొక్కిన 2021లో బీజేపీ ప్రభుత్వహయాంలో నాటి ఉత్తరాఖండ్ అటవీ మంత్రి హరక్ సింగ్ రావత్, నాటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్ల పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ ప్రజా విశ్వాసాన్ని బుట్టదాఖలుచేశారు. ఇంతటి విపరీత నిర్ణయాలు కేవలం ఇద్దరే తీసుకున్నారని అనుకోవట్లేము. ఇందులో చాలా మంది ప్రమేయం ఉండొచ్చు’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని పీకే మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయవనంలోని ల్యాన్డౌన్ ఫారెస్ట్ డివిజన్లో పఖ్రో టైగర్ సఫారీ కోసం వేల చెట్లు నరికేశారంటూ పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్ భన్సల్ వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘‘ అధికారి కిషన్‌ను సస్పెండ్ చేయాలని అటవీ కార్యదర్శి చేసిన సిఫార్సును రావత్ పెడచెవిన పెట్టారు. పైగా కిషన్‌ను సమరి్ధంచారు. రావత్ ఆ పదవి నుంచి దిగిపోయాయే కిషన్ సస్ఫెన్షన్, అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయనేతలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కలిసి చేస్తున్న అక్రమాలకు ప్రబల సాక్ష్యం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఈ ఉదంతంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై సీబీఐ సమగ్ర నివేదిక మూడు నెలల్లో సమరి్పంచాలి. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. జిమ్ కార్బైట్ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ పులులకు ఆవాసం. 1,288.31 చదరపు కి.మీ.లోని ఈ అటవీప్రాంతం పేరు. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది. -
పులికి కోపం వస్తే అలా ఉంటది.. టూరిస్ట్‌లు పరుగో పరుగు!
ఎంజాయ్ కోసం ఓ పార్క్‌లోకి వెళ్లిన టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. ఓ పులి చుక్కలు చూపించడంతో సఫారీలో పరుగు తీశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లోకి సఫారీలో కొంతమంది పర్యాటకులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ.. వాటిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఆ సమయంలో ఓ చోట పొదల్లో వారికి పెద్ద పులి కనిపించింది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేయడంతో.. పర్యాటకులు పులిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పులికి తిక్కరేగడంతో ఒక్కసారిగా వారిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. పులి ఒక్కసారిగా బిగ్గరగా గాండ్రిస్తూ సఫారీ జీపు వైపు దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి ముందుకు పోనిచ్చారు. దీంతో పులి అక్కడి నుంచి వెనుదిరిగింది. కాగా, పులి ఆవేశాన్ని పర్యాటకులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Striped monk gets irritated 😣 What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR — Susanta Nanda (@susantananda3) April 26, 2023 ఇది కూడా చదవండి: ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారాడు.. వైరల్‌గా మారిన బీహార్ యువకుడి పాట! -
మోదీ వర్సెస్ వైల్డ్
డెహ్రాడూన్: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు. బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై పలు ఆసక్తికర అంశాలను ప్రధాని ఆయనతో పంచుకున్నారు. ప్రకృతిలో మమేకమై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఈ సాహస యాత్ర సోమవారం డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా మోదీ, గ్రీల్స్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ ఇదే.. ► బేర్ గ్రిల్స్: జిమ్ కార్పెట్ ఫేమస్ కదా సార్? మోదీ: అవును ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. వృక్షాలపై అధ్యయనం చేయాలనకునేవారికి ఇక్కడుండే వందలాది రకాల చెట్లు ఉపయోగపడతాయి. పర్వతాలు, నదులతో పాటు అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత్ భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. 100 భాషలు, 1,600 యాసలు ఇక్కడ ఉన్నాయంటే భారత్‌లో ఏ స్థాయిలో భిన్నత్వం ఉందో మీరే అర్థం చేసుకోండి. ► ఈ ప్రాంతం ప్రమాదకరమని భావిస్తున్నారా? ప్రకృతిని మనమెప్పుడూ ప్రమాదకరంగా భావించకూడదు. ప్రకృతితో పోరాడితే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అదే ప్రకృతికి అనుగుణంగా కలిసిజీవిస్తే క్రూరమృగాలు కూడా సహకరిస్తాయి. ► మోదీజీ.. చిన్నప్పుడు మీరు మంచి స్టూడేంటా? మంచి స్టూడేంటా? కాదా? అని అంటే చెప్పలేను. ► ఇప్పుడు మీరు స్టైలిష్ దుస్తులు ధరిస్తున్నారు. చిన్నప్పుడూ ఇంతేనా? చిన్నప్పుడు నేను సామాన్యంగానే జీవించా. మురికి బట్టలే వేసుకున్నా. కానీ స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రమైన యూనిఫాంను వేసుకెళ్లేవాడిని. అందుకోసం నిప్పు కణికలను ఓ రాగి చెంబులో వేసి యూనిఫాంను ఇస్త్రీ చేసుకునే వాడిని. స్కూలు అయిపోయాక పాకెట్ మనీ కోసం నాన్నతో కలిసి రైల్వేస్టేషన్ దగ్గర టీ అమ్మేవాడిని. అలా రైల్వేలు నా జీవితంలో కీలకపాత్ర పోషించాయి. మా ప్రాంతంలో మంచు కురిశాక దానిపై ఉప్పులాంటి పొర ఏర్పడేది. దాన్ని జాగ్రత్తగా సేకరించి దాచి పెట్టుకునేవాళ్లం. స్నానం సమయంలో ఆ ఇసుకనే వాడేవాళ్లం. వేడి నీటిలో ఈ ఇసుక వేసి బట్టలను ఉతికేవాళ్లం. ► మీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లారట? అప్పుడు నా వయసు 17–18 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇళ్లు వదిలేశా. ప్రపంచాన్ని చూడాలనుకున్నా. హిమాలయాలకు వెళ్లగానే అక్కడి ప్రకృతి నచ్చింది. అక్కడే రుషులను కలుసుకున్నాను. అక్కడి మనుషుల మధ్య గడపడం అద్భుతమైన అనుభవం. అప్పటి శక్తే నన్ను ఇంకా నడిపిస్తోంది. నేను కలుసుకున్న రుషులంతా చాలా నిరాడంబరంగా ఉన్నారు. వాళ్లు ఒక్క కార్బన్ వ్యర్థాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సందర్భంగా మా నాన్న గురించి చెప్పాలి. మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వర్షాలు పడినప్పుడు మా నాన్న 25–30 పోస్ట్‌కార్డులు కొనేవారు. మా ప్రాంతంలో వర్షం పడిందని బంధువులందరికీ లేఖలు రాసేవారు. ఈ అనవసర ఖర్చు ఎందుకని మేం గోల చేసేవాళ్లం. అప్పట్లో నేనూ ఆశ్చర్యపోయేవాడ్ని. ప్రకృతి పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అనంతరం వారిద్దరూ కలిసి ఎత్తుగా ఉన్న గడ్డి ప్రాంతాన్ని దాటి నదీతీరానికి చేరుకున్నారు. ► మీరు ప్రధాని కావాలని ఎప్పుడు అనుకున్నారు? నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశా. అది నాకు కొత్త ప్రయాణం. ఆ తర్వాత ఈ పని(ప్రధాని బాధ్యతలు) చేపట్టాలని దేశం ఆదేశించింది. అందుకే ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఈ కాలంలో అభివృద్ధిపైనే నేను దృష్టి సారించాను. ప్రజల కలల్ని నా కలలుగా చేసుకుని పనిచేశా. ప్రజల కలల సాకారంతోనే నాకు సంతృప్తి లభిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను సెలవు తీసుకున్నా. ► ప్రధాని హోదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? మోదీ: నా మెదడు ఎప్పుడూ హోదా గురించి ఆలోచించదు. అలాంటివాటికి నేను అతీతుడ్ని. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా, నా మెదడు కేవలం పనిగురించే ఆలోచిస్తూ ఉంటుంది. పదవి అనేది నా ఆలోచనల్లోకి కూడా రాదు. ► చిన్నప్పుడు మీరు మొసలిని ఇంటికి తీసుకెళ్లారట.. అసలేం జరిగింది? ఓ అదా.. నేను రోజూ చెరువులో స్నానం చేసేవాడిని. అక్కడ కనిపించిన ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకెళ్లా. దీంతో మా అమ్మ ‘తల్లీబిడ్డలను వేరుచేయడం తప్పు. దాన్ని మనం పెంచుకోకూడదు. వెళ్లి వదిలేసి రా’ అని చెప్పింది. ప్రకృతిని చూసి మనమెప్పుడూ భయపడకూడదు. అలా భయపడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► భారీ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే ఆందోళనను ఎలా ఎదుర్కొంటారు? నా సమస్య ఏంటంటే నేనెప్పుడూ అలాంటి భయాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి భయం గురించి ప్రజలకు చెప్పలేను. నా స్వభావం చాలా సానుకూలమైనది. నేను ప్రతీదాంట్లో మంచినే చూస్తా. అనుకున్నపని జరగకపోతే బాధపడను. ► మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి? నేను యువతకు చెప్పేదొకటే. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడొద్దు. జీవితాన్ని సంపూర్ణంగా చూస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం కిందపడ్డా బాధపడకూడదు. తిరిగి పైకిలేవడానికి అక్కడే దారి మొదలవుతుంది. అనంతరం మోదీ, గ్రిల్స్ కలిసి నదిని దాటారు. ప్రధానిని టార్పాలిన్‌తో చేసిన తెప్పలో ఎక్కించిన గ్రిల్స్ దాన్ని తోసుకుంటూ నదిని దాటారు. ఈ సందర్భంగా వర్షం కురవడంతో మోదీ, గ్రిల్స్ తడిసిపోయారు. దీంతో ఇద్దరూ కరివేపాకులు కలిపిన టీని తాగారు. ► ప్రకృతి పరిరక్షణ అంటే మీకు ఇష్టమా..? మేం ఇండియాలో ప్రతీ చెట్టును దేవుడిగా భావిస్తాం. ఇక్కడ ‘తులసీ వివాహం’ అని సంప్రదా యం ఉంది. ఇందులో భగవంతుడిని, తులసి మొక్కకు ఏడాదికోసారి పెళ్లి చేస్తాం. అలా తుల సీదళాన్ని మా కుటుంబంలో భాగం చేసుకుంటాం. భూమిని కాపాడుకోవడమన్నది మన బాధ్య త. మన సుఖం కోసం ప్రకృతిని దోచుకుంటున్నాం. ► స్వచ్ఛ భారత్ కోసం ఏం చేయాలంటారు? బయటివారి వల్ల స్వచ్ఛభారత్ సాధ్యం కాదు. భారత్‌లో ఉండేవారి స్వభావం వల్లే దేశం క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత అన్నది భారతీయ సంస్కృతిలోనే ఓ భాగం. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అలవర్చుకోవాలి. ఈ విషయంలో మహాత్మాగాంధీ చాలా కృషి చేశారు. ► చంపడం నా స్వభావానికి విరుద్ధం ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కత్తి, తాడు, కర్ర సాయంతో బల్లెం తయారుచేశారు. పులులు తాము వేటాడే జంతువును సమీపించేవరకూ నక్కి ఉండి ఒక్కసారిగా దాడిచేస్తాయని గ్రిల్స్ తెలిపారు. పులి సమీపిస్తే ఇలా దాడిచేయాలంటూ బల్లెం వాడే పద్ధతిని చూపించారు. దీంతో మోదీ స్పందిస్తూ..‘చంపడం నా స్వభావానికి విరుద్ధం. ఈ ఆయుధాన్ని మీరే తీసుకోండి’ అని చెప్పారు. దీంతో గ్రిల్స్ దాన్ని తీసుకోబోతుండగా..‘పర్లేదు. మీకోసం నేను దీన్ని తీసుకుంటా’ అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రిల్స్ స్పందిస్తూ..‘సార్ ఒకవేళ ఇప్పుడు పులి వస్తే మీరెంత వేగంగా పరిగెత్తగలరు?’ అని ప్రశ్నించారు. దీంతో మోదీ..‘మీరు చెప్పండి’ అని అడిగారు. దీంతో గ్రిల్స్ ‘నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను’ అని జవాబిచ్చారు. వెంటనే మోదీ ‘అవునా!’ అంటూ తేరిపారా చూశారు. మోదీ మాటకు గ్రిల్స్ స్పందిస్తూ..‘ఇది పేలని జోక్ సార్. నేను మిమ్మల్ని వదిలి వెళతానా?’ అంటూ వ్యాఖ్యానించారు. బేర్‌తో కలసి తెప్పపై నదిని దాటుతున్న ప్రధాని -
'మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్లో మోదీ
-
‘డిస్కవరీ’లో మోదీ
ముంబై: డిస్కవరీ టీవీ చానల్ ప్రసారం చేసే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ప్రత్యేక ఎపిసోడ్లో నరేంద్ర మోదీ కనిపించనున్నారు. పర్యావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ డిస్కవరీ ఈ ఎపిసోడ్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో సాహసాలు చేస్తూ కనిపించే బేర్ గ్రిల్స్‌తో కలిసి మోదీ కూడా ప్రత్యేక ఎపిసోడ్లో నటించారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో జరిగింది. ఆగస్టు 12న 180 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. దీనిపై మోదీ ఓ ప్రకటన చేస్తూ ‘చాలా సంవత్సరాలపాటు నేను ప్రకృతి ఒడిలో, పర్వతాల నడుమ, అడవుల్లో జీవించాను. ఆ అనుభవాలు నా జీవితంపై చెరగని ముద్ర వేశాయి. రాజకీయాలకు సంబంధం లేని, ప్రకృతితో ముడిపడిన ప్రత్యేక కార్యక్రమం కావడంతో ఇందులో నటించేందుకు నేను ఒప్పుకున్నాను’ అని తెలిపారు. భారత పర్యావరణ సంపదను ప్రపంచానికి చూపేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన, ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరాన్ని చాటిచెప్పేందుకు తనకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని మోదీ చెప్పారు. ఈ ఎపిసోడ్ టీజర్‌ను బేర్ గ్రిల్స్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, మోదీతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. రేపు కంచికి రానున్న ప్రధాని సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులోని కాంచీపురానికి రానున్నారు. 40 ఏళ్లకోసారి దర్శనమిచ్చే అత్తివరదరాజస్వాముల వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ నెల 1 నుంచి స్వామివారు శయనరూపంలో దర్శనమిస్తున్నారు. -
మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..
న్యూఢిల్లీ: బేర్ గ్రిల్స్.. డిస్కవరి ఛానెల్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్.. సోమవారం చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ‘180 దేశాలకు చెందిన ప్రజలు.. 2019, ఆగస్టు 12నాటి రాత్రి 9గంటలకు మోదీలోని మరో కోణాన్ని చూడబోతున్నారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు గ్రిల్స్. 49 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్‌తో కలిసి అడవుల్లో సంచరిస్తూ.. నదులను దాటుతూ కనిపించారు. ఈ క్రమంలో గ్రిల్స్, మోదీని ఉద్దేశించి.. ‘భారత్‌కు చెందిన ముఖ్యమైన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. మిమ్మల్ని క్షేమంగా తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది’ అంటూ కామెంట్ చేయడం వినవచ్చు. People across 180 countries will get to see the unknown side of PM @narendramodi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi @DiscoveryIN on August 12 @ 9 pm. #PMModionDiscovery pic.twitter.com/MW2E6aMleE — Bear Grylls (@BearGrylls) July 29, 2019 ఈ వీడియోలో గ్రిల్స్ జంతువుల సంరక్షణ, పర్యావరణ మార్పుల వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చిత్రీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన షూటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే అదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి చోటు చేసుకున్న సమయంలో నరేంద్ర మోదీ షూటింగ్లో పాల్గొన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అప్పుడాయన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్లో పాల్గొన్నారనే విషయం ప్రస్తుతం స్పష్టమైంది. ఈ షో గురించి ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలు మరో సారి నరేంద్ర మోదీ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ‘పుల్వామాలో ఉగ్రవాదులు బరి తెగించి 44 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. దేశం అంతా తీవ్ర విషాదంలో మునిగి ఉన్న సమయంలో మోదీ మాత్రం షూటింగ్లో పాల్గొన్నారు. దారుణం గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. జవాన్ల మృతి పట్ల మోదీకి ఎంత బాధ ఉందో ప్రోమోలో ఆయన నవ్వు చూస్తేనే అర్థం అవుతుంద’ని విపక్ష నేతలు మండి పడుతున్నారు. -
పెద్ద పులులకు కుక్కల ముప్పు!
సాధారణంగా పెద్ద పులి అంటే అందరికీ వణుకు. అంత దూరంలో కనిపించినా అదేం చేస్తుందోనని అంతా భయపడుతుంటారు. కానీ, ఉత్తరాఖండ్‌లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో మాత్రం.. కుక్కల వల్ల పులులకు ముప్పు వచ్చిందట. ఈ పార్కు చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల బఫర్ జోన్లో గల గ్రామాల్లో దాదాపు 17వేల కుక్కలున్నాయి. ఈ విషయం తాజాగా హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అనే జంతు హక్కుల గ్రూపు చేసిన సర్వేలో తేలింది. సాధారణంగా కుక్కలను పులులు గానీ, చిరుత పులులు గానీ చంపవు. కానీ సమీపంలో ఉండే అటవీ ప్రాంతాల నుంచి ఊళ్లకు వచ్చే పులులు మాత్రం తమకు కనిపించే కుక్కలను కూడా వదిలిపెట్టవు. ఇదే వాటి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. చాలావరకు కుక్కలకు వాక్సిన్లు వేయించరు. ఈ కుక్కలను పులులు అడవిలోకి లాక్కెళ్లిపోయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం దొరక్క వీటినే తింటాయి. అలాంటప్పుడు పులులకు ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. రేబిస్ లాంటి వ్యాధులు కుక్కల నుంచి సులభంగా ఇతర జంతువులకు, మనుషులకు సోకుతాయని, అందులోనూ రేబిస్ సోకిన కుక్కలను పులులు గానీ, చిరుత పులులు గానీ తింటే వాటికి కూడా రేబిస్ సోకుతోందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఉన్న పులుల సంఖ్య క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముందుగా పార్కు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కుక్కలన్నింటికీ యాంటీ రేబిస్ వాక్సిన్లు వేయించాలని.. తద్వారా పులుల సంతతిని కూడా కాపాడాలని హెచ్ఐఎస్ ప్రతినిధులు కోరుతున్నారు.