పెద్ద పులులకు కుక్కల ముప్పు!
సాధారణంగా పెద్ద పులి అంటే అందరికీ వణుకు. అంత దూరంలో కనిపించినా అదేం చేస్తుందోనని అంతా భయపడుతుంటారు. కానీ, ఉత్తరాఖండ్‌లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో మాత్రం.. కుక్కల వల్ల పులులకు ముప్పు వచ్చిందట. ఈ పార్కు చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల బఫర్ జోన్‌లో గల గ్రామాల్లో దాదాపు 17వేల కుక్కలున్నాయి. ఈ విషయం తాజాగా హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అనే జంతు హక్కుల గ్రూపు చేసిన సర్వేలో తేలింది. సాధారణంగా కుక్కలను పులులు గానీ, చిరుత పులులు గానీ చంపవు. కానీ సమీపంలో ఉండే అటవీ ప్రాంతాల నుంచి ఊళ్లకు వచ్చే పులులు మాత్రం తమకు కనిపించే కుక్కలను కూడా వదిలిపెట్టవు. ఇదే వాటి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. చాలావరకు కుక్కలకు వాక్సిన్లు వేయించరు. ఈ కుక్కలను పులులు అడవిలోకి లాక్కెళ్లిపోయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం దొరక్క వీటినే తింటాయి.
అలాంటప్పుడు పులులకు ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. రేబిస్ లాంటి వ్యాధులు కుక్కల నుంచి సులభంగా ఇతర జంతువులకు, మనుషులకు సోకుతాయని, అందులోనూ రేబిస్ సోకిన కుక్కలను పులులు గానీ, చిరుత పులులు గానీ తింటే వాటికి కూడా రేబిస్ సోకుతోందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఉన్న పులుల సంఖ్య క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముందుగా పార్కు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కుక్కలన్నింటికీ యాంటీ రేబిస్ వాక్సిన్లు వేయించాలని.. తద్వారా పులుల సంతతిని కూడా కాపాడాలని హెచ్ఐఎస్ ప్రతినిధులు కోరుతున్నారు.