Adventure Yatra
-
ప్రయాణం.. విషాదాంతం
బోస్టన్: ఒకరు ‘టైటానిక్’ నిపుణుడు.. మరొకరు సాహసి..ఇంకొకరు సీఈవో..ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకు..! వీరంతా ‘టైటాన్’అనే మినీ సబ్‌మెరైన్‌లో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తూ అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యారు. ఈ అయిదుగురూ మృతి చెందినట్లు భావిస్తున్నామని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యూఫౌండ్‌ల్యాండ్ రాష్ట్రం సెంట్ జాన్స్‌కు సుమారు700 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం ‘టైటాన్’సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటానిక్ వైపుగా నీటి అడుగుకు ప్రయాణం ప్రారంభించిన 1.45 గంటలకే ప్రధాన నౌక పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సరిపోతాయి. దీంతో, అమెరికా, కెనడా విమానాలు, నౌకలు, రోబోల సాయంతో టైటాన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. చివరికి, టైటాన్ శకలాలను తమ రోబో టైటాన్ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ చీఫ్ పైలట్, సీఈవో స్టాక్టన్ రష్, సాహసి హామిష్ హార్డింగ్,, పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహ్జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, టైటానిక్ నిపుణుడు నర్గియెలెట్ మృతి చెందారని తెలిపింది. అయితే, అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ప్రమాదం బారిన పడి ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తామన్నారు. -
చీరకట్టులో బైక్‌పై వరల్డ్ టూర్
రమాబాయి లత్‌పతే 9 గజాల మహారాష్ట్ర నౌవారీ చీరలో40 దేశాలు బైక్ మీద చుట్టి రావడానికిమార్చి 8న గేట్ వే ఆఫ్ ఇండియా నుంచిబయలుదేరింది.365 రోజుల పాటు ప్రయాణం సాగించివచ్చే ఏడాది మార్చి 8కి ముంబై చేరనుంది.‘భారత్ కీ బేటీ’ ఏదైనా చేయగలదని నరేంద్ర మోడీ అన్న మాటలే తననీ సాహసయాత్రకు పురిగొల్పాయని చెబుతోంది. బైక్ యాత్రలు చేసిన మహిళలు చాలా మందే ఉన్నారు. కాని చీర మీద బైక్ నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టి రావాలనే కోరిక మాత్రం రమాబాయి లత్‌పతేకే వచ్చింది. పుణెకు చెందిన రమాబాయి అంట్రప్రెన్యూర్. కాని బైక్ మీద విహారాలు ఆమెకు ఇష్టం. ఆ విహారాల కోసమే ప్రత్యేకమైన బైక్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ‘జి20’ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ‘భారతీయ స్త్రీలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని చేసిన వ్యాఖ్య రమాబాయి లత్‌పతేను ఇన్‌స్పయిర్ చేసింది. ‘నా డిక్షనరీలో భయం అనే మాటకు విలువ లేదు. బాల్యం నుంచి నేను చాలా ధైర్యంగా నా జీవితంలో ముందుకు సాగాను. ఆ ధైర్యంతోనే ప్రపంచ యాత్ర చేయాలనిపించింది. అయితే ఆ యాత్రలో ఏ దేశంలో అడుగు పెట్టినా నేను ‘భారత్ కీ బేటీ’ అనిపించుకోవాలంటే మన సాంస్కృతిక చిహ్నమైన చీరలో ఉండటం అవసరం అని భావించాను. మహారాష్ట్ర స్త్రీలు ధరించే 9 గజాల నౌవారి చీర చాలా ప్రసిద్ధం. ఆ చీరలతోనే నా యాత్ర మొత్తం చేస్తాను’ అంది రమాబాయి లత్‌పతే. మొదలైన యాత్ర సాధారణ జనం, మీడియా ఉత్సుకతతో చూస్తుండగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మార్చి 8న రమాబాయి లత్‌పతే యాత్ర మొదలైంది. ఈ యాత్ర గురించి, అందునా మహరాష్ట్ర సంస్కృతి ప్రాముఖ్యం ఉండటం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆమె యాత్రను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘నా మొత్తం యాత్రకు కోటి రూపాయలు అవుతుంది. ఇందుకోసం నాకున్న నగలు, నా ఎస్.యు.వి అమ్మేశాను. కొంత లోటు ఏర్పడింది. నా యాత్రను ప్రోత్సహించేందుకు మనిషికి 1 రూపాయి చొప్పున చందా ఇవ్వాలని అప్పీలు చేశాను. అలా కొంత సాయం వచ్చింది. మంచి పని మొదలెడితే సాయం అదే అందుతుంది’ అంది రమాబాయి లత్‌పతే. కఠినమైన యాత్ర రమాబాయి లత్‌పతే మొత్తం 80 వేల కిలోమీటర్లు ఈ యాత్రలో తన బైక్ మీద తిరగనుంది. నలభై దేశాల వాతావరణాన్ని తట్టుకోవాలి. అతి శీతల, అత్యల్ప ఉష్ణోగ్రతలు భరించాలి. భద్రత ఒక సమస్య. అలాగే ఆహారం కూడా. ‘అయినా నేను వెనుకాడను’ అని బయలుదేరింది రమాబాయి. ముంబై నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నాక అక్కడి నుంచి విమానం ద్వారా ఆమె బైక్‌తో పాటుగా ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో పెర్త్ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తుంది. కాని ఆ దారిలో జనావాసాలు పెద్దగా ఉండవు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. దారి మధ్యలో ఆమె టెంట్ వేసుకుని విడిది చేయక తప్పదు. ఆ ఛాలెంజ్‌ను రమాబాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఆక్లాండ్ (న్యూజిలాండ్)కు, అక్కడి నుంచి శాంటియాగో (చిలీ), ఆ తర్వాత బొగోటా (కొలంబియా), ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి కెనడాలకు బైక్ మీదే ఆమె ప్రయాణం సాగుతుంది. ఆపై సముద్ర మార్గంలో బైక్‌ను లండన్‌కు చేరవేసి అక్కడి నుంచి తిరిగి బైక్ మీద పోలాండ్, రోమ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, టునీషియా, జోర్డాన్... ఇలా ప్రయాణించి మళ్లీ సముద్రం మీదుగా సౌదీ చేరుకుని ఆ ఎడారి దేశాలన్నీ చుట్టి గుజరాత్లో ప్రవేశించి వచ్చే ఏడాది మార్చి 8కి గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్రలో మిగిలిన దేశాలతోపాటు జి 20 నుంచి 12 దేశాలు ఉంటాయి. ప్రయాణాలు చేయండి ‘స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల ప్రపంచం ఏమీ తెలియదు. ప్రయాణాలకు భయపడాల్సింది లేదు. వీలైనన్ని ప్రయాణాలు చేసి లోకం ఎంత విశాలమో తెలుసుకోండి’ అంటోంది రమాబాయి. -
మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం
సాక్షి, మందస: ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట ఆ ప్రాంతం. స్థానికులు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మావోల సానుభూతి పరులే. ఆ గ్రామానికి చేరుకోవడం కూడా అంత సులభం కాదు. కొండలు, గుట్టలు కాలినడకన దాటితే గానీ వెళ్లలేం. అలాంటి ప్రాంతానికి మంత్రి సీదిరి అప్పలరాజు వెళ్లి సాహసం చేశారు. ఇటీవల మందస మండలం చీపి పంచాయతీలోని దాలసరి జలపాతం వార్తల్లోకి ఎక్కడంతో ఆ ప్రాంతంలో మంత్రి మంగళవారం పర్యటించారు. సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తానని చెప్పారు. కొండలు, ముళ్ల దారులను దాటుకుంటూ గ్రామానికి చేరుకున్న మంత్రికి గిరిజనులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఇది అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచింది. దాలసరి ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఒడిశా–ఆంధ్రా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ప్రిమియర్ షో అదుర్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ ప్రత్యేక ఎపిసోడ్ సోమవారం విడుదలైంది. రజనీ డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటీ నుంచి సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతోంది. ఇది చూసిన చూసిన ఆయన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బేర్ గ్రిల్స్‌తో సమానంగా ఆయన చేసిన స్టంట్స్ చూసి అభిమానులంతా ఇలా తలైవాను ఎప్పుడు చూడలేదంటూ.. ‘వయస్సు కేవలం సంఖ్య మాత్రమే’ ‘ఇది నిజంగా సూపర్ స్టార్ కోసమే’ ఇప్పడే ప్రిమియర్ చూశాను.. వావ్ ఎంత గొప్ప ఆత్మ విశ్వాసమో తలైవాది’ ‘అడవుల్లో ఆయన స్టైలిష్‌గా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక ‘ రజనీ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని బేర్ గ్రిల్స్ ఇదివరకే చాలసార్లు చెప్పారు. అయితే అది ఇప్పుడు రుజువైంది’ ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి అద్భతమైన ప్రదర్శన ఇచ్చారు. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (రజనీకాంత్ సూపర్ హీరో: బేర్ గ్రిల్స్) ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. కాగా బేర్ గ్రిల్స్‌తో పాటు తలైవా బండిపూర్ నేషనల్ పార్కు ఆరణ్యాన్ని అన్వేషించారు. ఈ క్రమంలో బేర్‌తో కలిసి రజనీ 50 అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప వంతేనను అధిరోహించడమే కాకుండా, అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా నడుము లోతు నీళ్లలో అవలీలగా నడుచుకుంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీ డిస్కవరీ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్‌ను జనవరిలో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన రజనీ చిన్న ముల్లు కారణంగా గీతలు పడ్డాయని స్పష్టం చేశారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి అడ్వెంచర్ షోలో పాల్గొన్న రెండవ భారతీయుడు రజనీకాంత్ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించిన సంగతి తెలిసిందే. Just watched the premiere.,wooow whata beautiful Soul u r thalaivaaa😘😘😘...so stylish & charming even in the woods😍😍...thank u #beargrylls for returning our Thalaivar #Rajinikanth safely to us🙏🙏🙏...luv uuu thalaivaa😘😘 pic.twitter.com/SywKT4GvdI — Sri (@RRsri777) March 23, 2020 -
రజనీకాంత్ సూపర్ హీరో: బేర్ గ్రిల్స్
ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సాహసయాత్రకు దిగాడు. అతనితో సమానంగా కొండలు, గుట్టలు ఎక్కుతూ దిగుతూ సాహసాలకు పూనుకున్నాడు. అంతేకాక తను కళ్లజోడు ఎంత స్టైల్‌గా పెట్టుకుంటాడో చూపించాడు. అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా వీళ్లిద్దరూ నడుము లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఎంతో అనుభవజ్ఞుడైన బేర్ గ్రిల్స్ నీళ్లలో పడిపోగా సూపర్ స్టార్ మాత్రం ఎలాంటి అదురూబెదురూ లేకుండా దాన్ని అవలీలగా దాటేశాడు. ఇక డెబ్భైఏళ్ళ వయసులోనూ రజనీ అంత చురుకుగా, చలాకీగా పరుగెత్తుతూ కనిపించడం బేర్గ్రిల్స్నే ఆశ్చర్యపరిచింది. అతని శక్తియుక్తులను కళ్లారా చూశాక.. పొగడకుండా ఉండలేకపోయాడు. ‘యూ ఆర్ ఏ సూపర్ హీరో’ అని ప్రశంసించాడు. అంతేకాక ‘రజనీ.. అతనిపై విసిరిన ప్రతి చాలెంజ్‌ను స్వీకరించాడు’ అంటూ ‘ఇన్‌టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ రెండో టీజర్‌ను బేర్ గ్రిల్స్ విడుదల చేశాడు. (రజనీకాంత్ వర్సెస్ బేర్ గ్రిల్స్) ఈ అడ్వెంచర్ యాత్రకు సంబంధించిన షూటింగ్ కర్ణాటకలోని బండీపూర్ అభయారణ్యంలో జరుపుకోగా పూర్తి కార్యక్రమం డిస్కవరీ చానెల్లో మార్చి 28న ప్రసారం కానుంది. సాహస యాత్రలకు మారుపేరైన బేర్ గ్రిల్స్ గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో దీనికి సంబంధించిన షూటింగ్ జరగ్గా ఈ ఎపిసోడ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ బల్లెం తయారు చేయడమే కాక తెప్పపై ప్రయాణించి ఆకట్టుకున్నారు. చదవండి: మోదీ వర్సెస్ వైల్డ్ ‘డిస్కవరీ’లో మోదీ -
మోదీ వర్సెస్ వైల్డ్
డెహ్రాడూన్: ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్(45) ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో సాహసయాత్ర చేపట్టారు. బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోదీకి వివరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ జీవితంపై పలు ఆసక్తికర అంశాలను ప్రధాని ఆయనతో పంచుకున్నారు. ప్రకృతిలో మమేకమై ఎలా జీవించాలో వివరించారు. పులుల అడుగుజాడల్ని చూసుకుంటూ వీరిద్దరూ హిమాలయాల్లోని ఓ నదిని తెప్పపై దాటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా చిత్రీకరించిన ఈ సాహస యాత్ర సోమవారం డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. ఈ సందర్భంగా మోదీ, గ్రీల్స్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ ఇదే.. ► బేర్ గ్రిల్స్: జిమ్ కార్పెట్ ఫేమస్ కదా సార్? మోదీ: అవును ఇది ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. వృక్షాలపై అధ్యయనం చేయాలనకునేవారికి ఇక్కడుండే వందలాది రకాల చెట్లు ఉపయోగపడతాయి. పర్వతాలు, నదులతో పాటు అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత్ భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. 100 భాషలు, 1,600 యాసలు ఇక్కడ ఉన్నాయంటే భారత్‌లో ఏ స్థాయిలో భిన్నత్వం ఉందో మీరే అర్థం చేసుకోండి. ► ఈ ప్రాంతం ప్రమాదకరమని భావిస్తున్నారా? ప్రకృతిని మనమెప్పుడూ ప్రమాదకరంగా భావించకూడదు. ప్రకృతితో పోరాడితే అన్ని సమస్యలే ఎదురవుతాయి. అదే ప్రకృతికి అనుగుణంగా కలిసిజీవిస్తే క్రూరమృగాలు కూడా సహకరిస్తాయి. ► మోదీజీ.. చిన్నప్పుడు మీరు మంచి స్టూడేంటా? మంచి స్టూడేంటా? కాదా? అని అంటే చెప్పలేను. ► ఇప్పుడు మీరు స్టైలిష్ దుస్తులు ధరిస్తున్నారు. చిన్నప్పుడూ ఇంతేనా? చిన్నప్పుడు నేను సామాన్యంగానే జీవించా. మురికి బట్టలే వేసుకున్నా. కానీ స్కూలుకు వెళ్లేటప్పుడు మాత్రం శుభ్రమైన యూనిఫాంను వేసుకెళ్లేవాడిని. అందుకోసం నిప్పు కణికలను ఓ రాగి చెంబులో వేసి యూనిఫాంను ఇస్త్రీ చేసుకునే వాడిని. స్కూలు అయిపోయాక పాకెట్ మనీ కోసం నాన్నతో కలిసి రైల్వేస్టేషన్ దగ్గర టీ అమ్మేవాడిని. అలా రైల్వేలు నా జీవితంలో కీలకపాత్ర పోషించాయి. మా ప్రాంతంలో మంచు కురిశాక దానిపై ఉప్పులాంటి పొర ఏర్పడేది. దాన్ని జాగ్రత్తగా సేకరించి దాచి పెట్టుకునేవాళ్లం. స్నానం సమయంలో ఆ ఇసుకనే వాడేవాళ్లం. వేడి నీటిలో ఈ ఇసుక వేసి బట్టలను ఉతికేవాళ్లం. ► మీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లారట? అప్పుడు నా వయసు 17–18 సంవత్సరాలు ఉంటుంది. నేను ఇళ్లు వదిలేశా. ప్రపంచాన్ని చూడాలనుకున్నా. హిమాలయాలకు వెళ్లగానే అక్కడి ప్రకృతి నచ్చింది. అక్కడే రుషులను కలుసుకున్నాను. అక్కడి మనుషుల మధ్య గడపడం అద్భుతమైన అనుభవం. అప్పటి శక్తే నన్ను ఇంకా నడిపిస్తోంది. నేను కలుసుకున్న రుషులంతా చాలా నిరాడంబరంగా ఉన్నారు. వాళ్లు ఒక్క కార్బన్ వ్యర్థాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఈ సందర్భంగా మా నాన్న గురించి చెప్పాలి. మా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వర్షాలు పడినప్పుడు మా నాన్న 25–30 పోస్ట్‌కార్డులు కొనేవారు. మా ప్రాంతంలో వర్షం పడిందని బంధువులందరికీ లేఖలు రాసేవారు. ఈ అనవసర ఖర్చు ఎందుకని మేం గోల చేసేవాళ్లం. అప్పట్లో నేనూ ఆశ్చర్యపోయేవాడ్ని. ప్రకృతి పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. ఆ విలువ ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అనంతరం వారిద్దరూ కలిసి ఎత్తుగా ఉన్న గడ్డి ప్రాంతాన్ని దాటి నదీతీరానికి చేరుకున్నారు. ► మీరు ప్రధాని కావాలని ఎప్పుడు అనుకున్నారు? నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశా. అది నాకు కొత్త ప్రయాణం. ఆ తర్వాత ఈ పని(ప్రధాని బాధ్యతలు) చేపట్టాలని దేశం ఆదేశించింది. అందుకే ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఈ కాలంలో అభివృద్ధిపైనే నేను దృష్టి సారించాను. ప్రజల కలల్ని నా కలలుగా చేసుకుని పనిచేశా. ప్రజల కలల సాకారంతోనే నాకు సంతృప్తి లభిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నేను సెలవు తీసుకున్నా. ► ప్రధాని హోదా మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? మోదీ: నా మెదడు ఎప్పుడూ హోదా గురించి ఆలోచించదు. అలాంటివాటికి నేను అతీతుడ్ని. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా, నా మెదడు కేవలం పనిగురించే ఆలోచిస్తూ ఉంటుంది. పదవి అనేది నా ఆలోచనల్లోకి కూడా రాదు. ► చిన్నప్పుడు మీరు మొసలిని ఇంటికి తీసుకెళ్లారట.. అసలేం జరిగింది? ఓ అదా.. నేను రోజూ చెరువులో స్నానం చేసేవాడిని. అక్కడ కనిపించిన ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకెళ్లా. దీంతో మా అమ్మ ‘తల్లీబిడ్డలను వేరుచేయడం తప్పు. దాన్ని మనం పెంచుకోకూడదు. వెళ్లి వదిలేసి రా’ అని చెప్పింది. ప్రకృతిని చూసి మనమెప్పుడూ భయపడకూడదు. అలా భయపడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► భారీ ర్యాలీల్లో పాల్గొనేటప్పుడు ఎదురయ్యే ఆందోళనను ఎలా ఎదుర్కొంటారు? నా సమస్య ఏంటంటే నేనెప్పుడూ అలాంటి భయాన్ని ఎదుర్కోలేదు. కాబట్టి భయం గురించి ప్రజలకు చెప్పలేను. నా స్వభావం చాలా సానుకూలమైనది. నేను ప్రతీదాంట్లో మంచినే చూస్తా. అనుకున్నపని జరగకపోతే బాధపడను. ► మీరు యువతకిచ్చే సందేశం ఏమిటి? నేను యువతకు చెప్పేదొకటే. జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చూడొద్దు. జీవితాన్ని సంపూర్ణంగా చూస్తే అందులో ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం కిందపడ్డా బాధపడకూడదు. తిరిగి పైకిలేవడానికి అక్కడే దారి మొదలవుతుంది. అనంతరం మోదీ, గ్రిల్స్ కలిసి నదిని దాటారు. ప్రధానిని టార్పాలిన్‌తో చేసిన తెప్పలో ఎక్కించిన గ్రిల్స్ దాన్ని తోసుకుంటూ నదిని దాటారు. ఈ సందర్భంగా వర్షం కురవడంతో మోదీ, గ్రిల్స్ తడిసిపోయారు. దీంతో ఇద్దరూ కరివేపాకులు కలిపిన టీని తాగారు. ► ప్రకృతి పరిరక్షణ అంటే మీకు ఇష్టమా..? మేం ఇండియాలో ప్రతీ చెట్టును దేవుడిగా భావిస్తాం. ఇక్కడ ‘తులసీ వివాహం’ అని సంప్రదా యం ఉంది. ఇందులో భగవంతుడిని, తులసి మొక్కకు ఏడాదికోసారి పెళ్లి చేస్తాం. అలా తుల సీదళాన్ని మా కుటుంబంలో భాగం చేసుకుంటాం. భూమిని కాపాడుకోవడమన్నది మన బాధ్య త. మన సుఖం కోసం ప్రకృతిని దోచుకుంటున్నాం. ► స్వచ్ఛ భారత్ కోసం ఏం చేయాలంటారు? బయటివారి వల్ల స్వచ్ఛభారత్ సాధ్యం కాదు. భారత్‌లో ఉండేవారి స్వభావం వల్లే దేశం క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత అన్నది భారతీయ సంస్కృతిలోనే ఓ భాగం. ఇప్పుడు సామాజిక పరిశుభ్రత అలవర్చుకోవాలి. ఈ విషయంలో మహాత్మాగాంధీ చాలా కృషి చేశారు. ► చంపడం నా స్వభావానికి విరుద్ధం ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ కత్తి, తాడు, కర్ర సాయంతో బల్లెం తయారుచేశారు. పులులు తాము వేటాడే జంతువును సమీపించేవరకూ నక్కి ఉండి ఒక్కసారిగా దాడిచేస్తాయని గ్రిల్స్ తెలిపారు. పులి సమీపిస్తే ఇలా దాడిచేయాలంటూ బల్లెం వాడే పద్ధతిని చూపించారు. దీంతో మోదీ స్పందిస్తూ..‘చంపడం నా స్వభావానికి విరుద్ధం. ఈ ఆయుధాన్ని మీరే తీసుకోండి’ అని చెప్పారు. దీంతో గ్రిల్స్ దాన్ని తీసుకోబోతుండగా..‘పర్లేదు. మీకోసం నేను దీన్ని తీసుకుంటా’ అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రిల్స్ స్పందిస్తూ..‘సార్ ఒకవేళ ఇప్పుడు పులి వస్తే మీరెంత వేగంగా పరిగెత్తగలరు?’ అని ప్రశ్నించారు. దీంతో మోదీ..‘మీరు చెప్పండి’ అని అడిగారు. దీంతో గ్రిల్స్ ‘నేను మీకంటే వేగంగా పరిగెత్తగలను’ అని జవాబిచ్చారు. వెంటనే మోదీ ‘అవునా!’ అంటూ తేరిపారా చూశారు. మోదీ మాటకు గ్రిల్స్ స్పందిస్తూ..‘ఇది పేలని జోక్ సార్. నేను మిమ్మల్ని వదిలి వెళతానా?’ అంటూ వ్యాఖ్యానించారు. బేర్‌తో కలసి తెప్పపై నదిని దాటుతున్న ప్రధాని -
19న ఇళ్లకు ‘థాయ్’ బాలురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్ జట్టు కోచ్‌ను ఆసుపత్రి నుంచి గురువారం (19న) ఇళ్లకు పంపనున్నారు. డిశ్చార్జి అయ్యాక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలని వైద్యులు బాలురకు సూచించారు. ఆ గుహలో సంఘటనలను గుర్తు చేసుకోవడం వారి మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పారు. గత నెల 23న ‘వైల్డ్ బోర్స్’ అనే ఫుట్‌బాల్ జట్టు సభ్యులైన 12 మంది పిల్లలు (అందరి వయసు 11–16 ఏళ్ల మధ్య) సాధన తర్వాత తమ కోచ్‌తో కలిసి గుహలోకి సాహస యాత్రకు వెళ్లి చిక్కుకుపోగా వారందరినీ కాపాడటానికి 18 రోజులు పట్టడం తెలిసిందే. కాగా, రెండు వారాలకు పైగా గుహలో ఉన్నందున ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారందరినీ ముందుగా వైద్యులు ఓ ప్రత్యేకమైన వార్డులో ఉంచారు. తాజాగా శనివారం థాయ్‌లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి పియసకోల్ సకోల్సత్తయతోర్న్ మాట్లాడుతూ ‘ఆ 12 మంది విద్యార్థులు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. వారందరినీ ఒకేసారి గురువారం ఇళ్లకు పంపిస్తాం’ అని చెప్పారు. కాగా, పిల్లలు తమను తాము పరిచయం చేసుకుంటున్న వీడియోను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. కెమెరా ముందుకు వచ్చి తమ పేరు, తమకు ఇష్టమైనవి తదితర వివరాలు చెప్పుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని బాలురు వెల్లడించారు. -
భద్రాచలం టు సామర్లకోట
410 కిలోమీటర్ల సాహసయాత్ర భద్రాచలం అర్బన్: విజయవాడ ఆంధ్ర నావలింగ్ యూనిట్, ఎన్సీసీ ఆధ్వర్యంలో సైలింగ్ ఎక్స్పిడేషన్–2017 క్యాంప్‌లో భాగంగా గోదావరిలో 410 కిలోమీటర్ల సాహసయాత్ర సాగనుంది. భద్రాచలంలోని గోదావరి నుంచి ఏపీలోని సామర్లకోట వరకు సాగనున్న ఈ యాత్రను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. యాత్ర ఈ నెల 14న సామర్లకోట చేరుకుంటుందని ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్ తెలిపారు. ఏటా ఈ యాత్ర చేపడతామని, ఈ ఏడాది తొలిసారిగా 14 మంది మహిళా క్యాడెట్లు పాల్గొంటున్నారని చెప్పారు. మొత్తం 42 మంది విద్యార్థులతో యాత్ర చేపట్టామన్నారు. కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ కల్నల్ ఎల్.సి.నాయుడు, ఆంధ్ర నావల్ కమాండర్ ఎస్.పి. ఖాజా, డిప్యూటీ క్యాంప్ కమాండర్ కెప్టెన్ కె.సి.ఎస్ రావు, భద్రాచలం ఏఎస్పీ సునీల్ దత్, ఆర్డీవో శివనారాయణ రెడ్డి, సర్పంచ్ శ్వేత, తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు.