Pune woman to travel the world on a bike wearing saree - Sakshi
Sakshi News home page

చీరకట్టులో బైక్‌పై వరల్డ్‌ టూర్‌

Published Wed, Mar 15 2023 4:59 AM | Last Updated on Wed, Mar 15 2023 9:18 AM

A world tour on a bike in a saree - Sakshi

రమాబాయి లత్‌పతే  9 గజాల మహారాష్ట్ర నౌవారీ చీరలో40 దేశాలు బైక్‌ మీద చుట్టి రావడానికిమార్చి 8న గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచిబయలుదేరింది.365 రోజుల పాటు ప్రయాణం సాగించివచ్చే ఏడాది మార్చి 8కి ముంబై చేరనుంది.‘భారత్‌ కీ బేటీ’ ఏదైనా చేయగలదని నరేంద్ర మోడీ అన్న మాటలే తననీ సాహసయాత్రకు పురిగొల్పాయని చెబుతోంది.

బైక్‌ యాత్రలు చేసిన మహిళలు చాలా మందే ఉన్నారు. కాని చీర మీద బైక్‌ నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టి రావాలనే కోరిక మాత్రం రమాబాయి లత్‌పతేకే వచ్చింది. పుణెకు చెందిన రమాబాయి అంట్రప్రెన్యూర్‌. కాని బైక్‌ మీద విహారాలు ఆమెకు ఇష్టం. ఆ విహారాల కోసమే ప్రత్యేకమైన బైక్‌ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ‘జి20’ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ‘భారతీయ స్త్రీలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని చేసిన వ్యాఖ్య రమాబాయి లత్‌పతేను ఇన్‌స్పయిర్‌ చేసింది.

‘నా డిక్షనరీలో భయం అనే మాటకు విలువ లేదు. బాల్యం నుంచి నేను చాలా ధైర్యంగా నా జీవితంలో ముందుకు సాగాను. ఆ ధైర్యంతోనే ప్రపంచ యాత్ర చేయాలనిపించింది. అయితే ఆ యాత్రలో ఏ దేశంలో అడుగు పెట్టినా నేను ‘భారత్‌ కీ బేటీ’ అనిపించుకోవాలంటే మన సాంస్కృతిక చిహ్నమైన చీరలో ఉండటం అవసరం అని భావించాను. మహారాష్ట్ర స్త్రీలు ధరించే 9 గజాల నౌవారి చీర చాలా ప్రసిద్ధం. ఆ చీరలతోనే నా యాత్ర మొత్తం చేస్తాను’ అంది రమాబాయి లత్‌పతే.

మొదలైన యాత్ర
సాధారణ జనం, మీడియా ఉత్సుకతతో చూస్తుండగా ముంబైలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి మార్చి 8న రమాబాయి లత్‌పతే యాత్ర మొదలైంది. ఈ యాత్ర గురించి, అందునా మహరాష్ట్ర సంస్కృతి ప్రాముఖ్యం ఉండటం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆమె యాత్రను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘నా మొత్తం యాత్రకు కోటి రూపాయలు అవుతుంది. ఇందుకోసం నాకున్న నగలు, నా ఎస్‌.యు.వి అమ్మేశాను. కొంత లోటు ఏర్పడింది. నా యాత్రను ప్రోత్సహించేందుకు మనిషికి 1 రూపాయి చొప్పున చందా ఇవ్వాలని అప్పీలు చేశాను. అలా కొంత సాయం వచ్చింది. మంచి పని మొదలెడితే సాయం అదే అందుతుంది’ అంది రమాబాయి లత్‌పతే.

కఠినమైన యాత్ర
రమాబాయి లత్‌పతే మొత్తం 80 వేల కిలోమీటర్లు ఈ యాత్రలో తన బైక్‌ మీద తిరగనుంది. నలభై దేశాల వాతావరణాన్ని తట్టుకోవాలి. అతి శీతల, అత్యల్ప ఉష్ణోగ్రతలు భరించాలి. భద్రత ఒక సమస్య. అలాగే ఆహారం కూడా. ‘అయినా నేను వెనుకాడను’ అని బయలుదేరింది రమాబాయి. ముంబై నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నాక అక్కడి నుంచి విమానం ద్వారా ఆమె బైక్‌తో పాటుగా ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో పెర్త్‌ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు బైక్‌ మీద ప్రయాణిస్తుంది.

కాని ఆ దారిలో జనావాసాలు పెద్దగా ఉండవు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. దారి మధ్యలో ఆమె టెంట్‌ వేసుకుని విడిది చేయక తప్పదు. ఆ ఛాలెంజ్‌ను రమాబాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఆక్‌లాండ్‌ (న్యూజిలాండ్‌)కు, అక్కడి నుంచి శాంటియాగో (చిలీ), ఆ తర్వాత బొగోటా (కొలంబియా), ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి కెనడాలకు బైక్‌ మీదే ఆమె ప్రయాణం సాగుతుంది.

ఆపై సముద్ర మార్గంలో బైక్‌ను లండన్‌కు చేరవేసి అక్కడి నుంచి తిరిగి బైక్‌ మీద పోలాండ్, రోమ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, టునీషియా, జోర్డాన్‌... ఇలా ప్రయాణించి మళ్లీ సముద్రం మీదుగా సౌదీ చేరుకుని ఆ ఎడారి దేశాలన్నీ చుట్టి గుజరాత్‌లో ప్రవేశించి వచ్చే ఏడాది మార్చి 8కి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్రలో మిగిలిన దేశాలతోపాటు   జి 20 నుంచి 12 దేశాలు ఉంటాయి. 

ప్రయాణాలు చేయండి
‘స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల ప్రపంచం ఏమీ తెలియదు. ప్రయాణాలకు భయపడాల్సింది లేదు. వీలైనన్ని ప్రయాణాలు చేసి లోకం ఎంత విశాలమో తెలుసుకోండి’ అంటోంది రమాబాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement