Pune City
-
చీరకట్టులో బైక్‌పై వరల్డ్ టూర్
రమాబాయి లత్‌పతే 9 గజాల మహారాష్ట్ర నౌవారీ చీరలో40 దేశాలు బైక్ మీద చుట్టి రావడానికిమార్చి 8న గేట్ వే ఆఫ్ ఇండియా నుంచిబయలుదేరింది.365 రోజుల పాటు ప్రయాణం సాగించివచ్చే ఏడాది మార్చి 8కి ముంబై చేరనుంది.‘భారత్ కీ బేటీ’ ఏదైనా చేయగలదని నరేంద్ర మోడీ అన్న మాటలే తననీ సాహసయాత్రకు పురిగొల్పాయని చెబుతోంది. బైక్ యాత్రలు చేసిన మహిళలు చాలా మందే ఉన్నారు. కాని చీర మీద బైక్ నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టి రావాలనే కోరిక మాత్రం రమాబాయి లత్‌పతేకే వచ్చింది. పుణెకు చెందిన రమాబాయి అంట్రప్రెన్యూర్. కాని బైక్ మీద విహారాలు ఆమెకు ఇష్టం. ఆ విహారాల కోసమే ప్రత్యేకమైన బైక్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ‘జి20’ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ‘భారతీయ స్త్రీలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని చేసిన వ్యాఖ్య రమాబాయి లత్‌పతేను ఇన్‌స్పయిర్ చేసింది. ‘నా డిక్షనరీలో భయం అనే మాటకు విలువ లేదు. బాల్యం నుంచి నేను చాలా ధైర్యంగా నా జీవితంలో ముందుకు సాగాను. ఆ ధైర్యంతోనే ప్రపంచ యాత్ర చేయాలనిపించింది. అయితే ఆ యాత్రలో ఏ దేశంలో అడుగు పెట్టినా నేను ‘భారత్ కీ బేటీ’ అనిపించుకోవాలంటే మన సాంస్కృతిక చిహ్నమైన చీరలో ఉండటం అవసరం అని భావించాను. మహారాష్ట్ర స్త్రీలు ధరించే 9 గజాల నౌవారి చీర చాలా ప్రసిద్ధం. ఆ చీరలతోనే నా యాత్ర మొత్తం చేస్తాను’ అంది రమాబాయి లత్‌పతే. మొదలైన యాత్ర సాధారణ జనం, మీడియా ఉత్సుకతతో చూస్తుండగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మార్చి 8న రమాబాయి లత్‌పతే యాత్ర మొదలైంది. ఈ యాత్ర గురించి, అందునా మహరాష్ట్ర సంస్కృతి ప్రాముఖ్యం ఉండటం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆమె యాత్రను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘నా మొత్తం యాత్రకు కోటి రూపాయలు అవుతుంది. ఇందుకోసం నాకున్న నగలు, నా ఎస్.యు.వి అమ్మేశాను. కొంత లోటు ఏర్పడింది. నా యాత్రను ప్రోత్సహించేందుకు మనిషికి 1 రూపాయి చొప్పున చందా ఇవ్వాలని అప్పీలు చేశాను. అలా కొంత సాయం వచ్చింది. మంచి పని మొదలెడితే సాయం అదే అందుతుంది’ అంది రమాబాయి లత్‌పతే. కఠినమైన యాత్ర రమాబాయి లత్‌పతే మొత్తం 80 వేల కిలోమీటర్లు ఈ యాత్రలో తన బైక్ మీద తిరగనుంది. నలభై దేశాల వాతావరణాన్ని తట్టుకోవాలి. అతి శీతల, అత్యల్ప ఉష్ణోగ్రతలు భరించాలి. భద్రత ఒక సమస్య. అలాగే ఆహారం కూడా. ‘అయినా నేను వెనుకాడను’ అని బయలుదేరింది రమాబాయి. ముంబై నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నాక అక్కడి నుంచి విమానం ద్వారా ఆమె బైక్‌తో పాటుగా ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో పెర్త్ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తుంది. కాని ఆ దారిలో జనావాసాలు పెద్దగా ఉండవు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. దారి మధ్యలో ఆమె టెంట్ వేసుకుని విడిది చేయక తప్పదు. ఆ ఛాలెంజ్‌ను రమాబాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఆక్లాండ్ (న్యూజిలాండ్)కు, అక్కడి నుంచి శాంటియాగో (చిలీ), ఆ తర్వాత బొగోటా (కొలంబియా), ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి కెనడాలకు బైక్ మీదే ఆమె ప్రయాణం సాగుతుంది. ఆపై సముద్ర మార్గంలో బైక్‌ను లండన్‌కు చేరవేసి అక్కడి నుంచి తిరిగి బైక్ మీద పోలాండ్, రోమ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, టునీషియా, జోర్డాన్... ఇలా ప్రయాణించి మళ్లీ సముద్రం మీదుగా సౌదీ చేరుకుని ఆ ఎడారి దేశాలన్నీ చుట్టి గుజరాత్లో ప్రవేశించి వచ్చే ఏడాది మార్చి 8కి గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్రలో మిగిలిన దేశాలతోపాటు జి 20 నుంచి 12 దేశాలు ఉంటాయి. ప్రయాణాలు చేయండి ‘స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల ప్రపంచం ఏమీ తెలియదు. ప్రయాణాలకు భయపడాల్సింది లేదు. వీలైనన్ని ప్రయాణాలు చేసి లోకం ఎంత విశాలమో తెలుసుకోండి’ అంటోంది రమాబాయి. -
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
తెల్లవారు జామున ఒక చెట్టు కొమ్మల మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. మరో చెట్టు తొర్రలో నుంచి పాలపిల్ల కువకువలాడుతోంది. సూర్యుడు నేలను చూడడానికి చెట్ల ఆకుల మధ్య నుంచి దారులు వెతుక్కుంటున్నాడు! ఇదేమీ చీమలు దూరని చిట్టడవి వర్ణన కాదు, కాకులు దూరని కారడవి వర్ణన కూడా కాదు. ఒక ప్రొఫెసర్ విశ్రాంత జీవనం గడుపుతున్న ప్రదేశం. ఏళ్లుగా కరెంటే లేని నివాసం. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉంది బుధవారపేట. పెద్ద వ్యాపార కేంద్రం అది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ గూడ్స్ మార్కెట్‌కు ప్రసిద్ధి బుధవారపేట. ఆ బుధవారపేటలోనే ఉంది కరెంట్ లేని ఓ ఇల్లు. అది ఇల్లంటే ఇల్లు కాదు తోటంటే తోటా కాదు. చిన్న అడవిని తలపించే ప్రదేశం. అందులో ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఓ కట్టడం. అందులో ఒంటరిగా నివసించే ప్రొఫెసర్ పేరు డాక్టర్ హేమా సనే. బాటనీ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారామె. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే హేమ కరెంట్ దీపాలు వెలిగిస్తే పక్షులకు అసౌకర్యం కలుగుతుందని కరెంట్ లేకుండానే జీవిస్తున్నారు. ఇప్పుడామెకి 79 ఏళ్లు. ‘‘కరెంట్ లేని రోజులను చూశాను, అప్పుడు కూడా హాయిగానే జీవించాను. ఇప్పుడూ అంతే. కరెంట్ సౌకర్యం కోసం పక్షులను ఇబ్బంది పెట్టలేను’’ అంటారామె. ఏది నాది? ‘‘తిండి, దుస్తులు, నీడ మాత్రమే మనిషికి కనీసవసరాలు. ఇక ఇతర అవసరాలేవీ తప్పని సరి కానే కాదు. నాకు ఈ మూడు కనీస అవసరాలు తీరుతున్నాయి. కరెంట్ లేని కారణంగా నాకు ఎదురవుతున్న అసౌకర్యం ఏమీ లేదు. నిద్రలేచేటప్పటికి పక్షుల కిలకిలరవాలు వినిపించకపోతే అసౌకర్యానికి లోనవుతాను తప్ప కరెంటు లేనందుకు కాదు. ఈ ప్రదేశాన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందనే సలహాలు నాకు చాలా మందే ఇచ్చారు. ఈ నేల నా ఆస్థి కాదు. ఇక్కడ నాకు తోడుగా ఓ కుక్క, రెండు పిల్లులున్నాయి. వాటికి తోడు ఓ ముంగిస కూడా ఉంది. ఎన్నో రకాల చెట్లున్నాయి. ఆ చెట్ల మీద లెక్కలేనన్ని పక్షులున్నాయి. వాటన్నింటి ఆస్తి ఇది. నేను వాటి బాధ్యత చూసుకునే సంరక్షకురాలిని మాత్రమే. ప్రకృతి భూమిని ఏర్పరచింది పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ జీవించడానికే తప్ప మనిషి విపరీతమైన ఆకాంక్షల కోసం ఛిన్నాభిన్నం చేయడానికి కాదు. నన్ను చాలా మంది ఫూల్ అంటుంటారు కూడా. వాళ్లలా అన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను. ఎవరికీ హాని కలిగించని రీతిలో జీవిస్తున్నాను కాబట్టి ఎవరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’’ అంటారు హేమ నిష్కర్షగా. నిత్యాన్వేషణ నడుము వంగిపోయిన వయసులో ఆమె రోజూ తన అడవిలాంటి తోటంతా తిరుగుతారు. ఆమె సామిత్రీఫూలే పూనె యూనివర్సిటీ నుంచి బాటనీలో పీహెచ్డీ చేశారు. పూనెలోని గర్వారే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. వృక్షశాస్త్రం– పర్యావరణం అంశం మీద ఆమె రాసిన అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. తన ఒంటరి జీవితాన్ని వృక్షశాస్త్ర అధ్యయనానికే అంకితం చేసిన హేమ ఇప్పటికీ కొత్త పరిశీలనలను గ్రంథస్థం చేస్తున్నారు. ఆ తోట మొత్తంలో ఆమెకు పేరు తెలియని పక్షి కానీ, చెట్టు కానీ లేవు. ప్రతి మొక్క, చెట్టు సైంటిఫిక్ నేమ్‌తో దాని లక్షణాలను వివరిస్తారు. ఇలాంటి విలక్షమైన జీవనశైలి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశమూ ఇవ్వడం లేదని కూడా అంటారు డాక్టర్ హేమాసనే. అయితే అలా అడిగిన వాళ్లకు... ‘నీ జీవితంలో నీవు నడవాల్సిన దారిని నువ్వే అన్వేషించుకో’ అనే బుద్ధుని సూక్తిని ఉదహరిస్తారామె. – మంజీర -
ముంబైకి షాకిచ్చిన పుణే
ముంబై: ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న సమయంలో సొంత గడ్డపై ముంబై సిటీ ఎఫ్సీకి... ఎఫ్‌సీ పుణే సిటీ షాకిచ్చింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే 1-0తో నెగ్గింది. 89వ నిమిషంలో యుగెనెసన్ లింగ్డో చేసిన గోల్‌తో పుణే గట్టెక్కింది. మ్యాచ్ చివరి వరకు కూడా ముంబై సిటీ ఆధిక్యం కనబరిచినా గోల్స్ చేయడంలో విఫలమైంది. అరుుతే పుణే మాత్రం పట్టు వదలకుండా పోరాడింది. లెప్ట్ వింగ్ నుంచి నారాయణ్ దాస్ ఇచ్చిన క్రాస్‌ను లింగ్డో ఎలాంటి పొరపాటుకు తావీయకుండా నెట్లోకి పంపడంతో పుణేకు అద్భుత విజయం దక్కింది. -
పుణే ఆశలు సజీవం
2-0తో ముంబైపై గెలుపు ఐఎస్ఎల్ పుణే: నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ సత్తా చాటింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2-0తో ముంబై సిటీ ఎఫ్‌సీపై విజయం సాధించింది. పుణే తరఫున డుడు (66, 80వ ని.) రెండు గోల్స్ చేశాడు. 66వ నిమిషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి కట్సొరనిస్ ఇచ్చిన పాస్‌ను డుడు డ్రిల్ చేసుకుంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. 80వ నిమిషంలో మరోసారి కట్సొరనిస్ బంతిని డ్రిల్ చేస్తూ వెళ్లాడు. అప్పటికే గోల్ పోస్ట్ దగ్గర ఉన్న డుడు పాస్‌ను అందుకుని నెట్లోకి పంపి ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. ప్రస్తుతం పుణే 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరగా... ముంబై 12 పాయింట్లతో అట్టడుగున కొనసాగుతోంది. -
ప్రయాణం నరకప్రాయం ఫిట్‘లెస్’
పింప్రి, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం అనే పిలుపునకు అర్థంలేకుండా పోతోంది. పుణే నగరంలో బస్సులను ఆశ్రయించే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోజూ ఏదో ఓ చోట దుర్ఘటనలు సంభవిస్తునే ఉన్నాయి. పీఎంపీఎల్‌కు చెందిన బస్సుల్లో వెళ్లాలాంటే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్‌కు (పీఎంపీఎల్)కు చెందిన బస్సులు పుణే వాసుల పాలిట శాపంగా మారాయి. ప్రతి ఏడాది ఈ బస్సుల కారణంగా దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. పీఎంపీఎంఎల్ ఉదాసీనత, డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా ఈ దుస్థితి నెలకొన్నది. ఇటీవల సాధువాస్వానీ చౌక్ వద్ద జరిగిన ప్రమాదంలో సంస్థకు చెందిన బస్సుల ప్రామాణికతపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఆరు నెలల కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 మంది పీఎంపీ బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. పాతబడిన బస్సులు పాతబడిన ఈ బస్సులు ప్రజల పాలిట శాపంగా మారాయి. పీఎంపీ ఆధ్వర్యంలో నగరంలో నడుస్తున్న బస్సులకు ఫిట్నెస్ ఉండడం లేదు. ఈ బస్సులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బస్సుల్లో ఆయిల్ లీకేజీ వల్ల బ్రేకులు వేసినా పడకపోవడంతో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొన్ని బస్సులకు అద్దాలు లేవు. ఇటీవల హడప్సర్లో ఒక పీఎంపీ బస్సులో ఇంజన్‌కు మంటలు అంటుకున్నాయి. డ్రైవరు గాయపడ్డాడు. వరుసగా గురువారం, శనివారాలల్తో సతారా మార్గంపై జరిగిన ప్రమాదాల్లో ఒక్కొక్కరు మరణించారు. బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడంతో బస్సులో ఉన్న ప్రయాణికురాలు ఎగిరి బయట పడి మరణించింది. పలువురు గాయపడ్డారు. ఇలా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ఏళ్ల కాలంలో ఈ బస్సుల మూలంగా నగరంలో 40కి పైగా మరణించారు. ఇప్పటికైనా పీఎంపీ బస్సులను మార్చి డ్రైవర్లకు శిక్షణ మెళకువలను నేర్పించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ పీఎంపీ పీఆర్వో దీపక్ పరదేశి మాట్లాడుతూ.. పీఎంపీ బస్సు డ్రైవర్లకు శిక్షణ మెళకువలను అందిస్తున్నామన్నారు. మైలేజీ ఎలా పెంచుకోవాలి అనే వాటిపై కూడా సంస్థ శిక్షణ ఇస్తుందని, బస్సుల ప్రమాదాల కారణంగా మరణించిన తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటిని నివారించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ‘పెట్రోలింగ్ కన్జర్వేటర్ రిసెర్చ్ (పీసీఆర్ఐ) ఆధ్వర్యంలో ప్రతి డ్రైవర్‌కు మూడు రోజుల శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇందులో మొదట డ్రైవరు బస్సు నడిపే పద్ధతిని గమనిస్తారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని గమనించి శాస్త్రీయ పద్ధతిలో వాహనాన్ని ఎలా నడపాలో శిక్షణ ఇస్తారని దీపక్ పరదేశి వివరించారు. -
పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న చెత్తలో ప్లాస్టిక్ సమస్య అధికమవుతుండడంతో దీనిని నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవాలంటూ పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) కమిషనర్ వికాస్ దేశ్‌ముఖ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను 28, మార్చి 2014 తరువాత వినియోగించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవరు వినియోగిస్తూ మొట్టమొదటిసారిగా పట్టుబడ్డ వారికి రూ. 5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. నగరంలో ప్లాస్టిక్ బ్యాగులను కూరగాయలు, పండ్లు, విక్రయదారులతోపాటు తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా వినియోగదారులకు చేరవేస్తున్నారు. నగరంలో ప్రతి రోజూ జమ అయ్యే చెత్తలో 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీనితో నగరంలో వాతావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ను వర్గీకరించే విషయంలో సమస్యలు అధికమవుతుండడంతో దీనిని నియంత్రించాలని నిర్ణయించారు. 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను రూ. 15 లకు అమ్మాలని, థర్మాకోల్ గ్లాసులు, ప్లేట్లను నిషేధించాలంటూ ఇటీవల కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానించిన సంగతి విదితమే. విలీనంపై 18న నిర్ణయం చకాన్ సహా మొత్తం 20 గ్రామాల విలీనం విషయమై ఈ నెల 18వ తేదీన పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) ఓ నిర్ణయం తీసుకోనుంది. పీసీఎంసీ పరిధిలోని గ్రామాలను కచ్చితంగా విలీనం చేయాల్సిందేనా లేకపోతే ఆ అవసరమేమీ లేదా అనే అంశంపై ఓ నివేదిక సమర్పించాలంటూ గత ఏడాది ఆగస్టులో పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ)ని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించిన సంగతి విదితమే. చ కాన్ను కొత్త మున్సిపల్ కౌన్సిల్‌గా మార్చేకంటే విలీనమే ఉత్తమమని అప్పట్లో ప్రభుత్వం సూచించింది. ఇందుకు స్పందించిన పీసీఎంసీ..సిటీ ఇంప్రూవ్మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనపై చర్చించి, దానిని సర్వసభ్య సమావేశానికి నివేదిస్తుందంటూ జవాబిచ్చింది. అయితే హింజేవాడి, మాన్ తదితర గ్రామాలు అప్పట్లో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ కావాలని డిమాండ్ చేశాయి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయానికొస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. తాతవాడే తదితర గ్రామాల విలీనాన్ని అక్కడి ప్రజలు, నాయకులు 1997లో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయామన్నారు. అయితే ఇప్పుడు వారిలో కొంతమార్పు వచ్చిందన్నారు. 2009లో ఈ మార్పు స్పష్టంగా కనిపించిందన్నారు. కాగా పీసీఎంసీకి చెందిన అనేకమంది కార్పొరేటర్లు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన విషయం విదితమే. -
బాలాజీ మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి ప్రాంతంలోని బాలాజీ మందిరాన్ని బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపాల్ చింతల్, దిలీప్ కవడే, కంటోన్మెంట్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ మంత్రి, బాలాజీ మం దిర మాజీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌రెడ్డి, కె.చెం చయ్య, కార్యవర్గ సభ్యులు సుబ్బారాయుడు పాల్గొన్నారు.