పింప్రి, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం అనే పిలుపునకు అర్థంలేకుండా పోతోంది. పుణే నగరంలో బస్సులను ఆశ్రయించే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. రోజూ ఏదో ఓ చోట దుర్ఘటనలు సంభవిస్తునే ఉన్నాయి. పీఎంపీఎల్‌కు చెందిన బస్సుల్లో వెళ్లాలాంటే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. పుణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్‌కు (పీఎంపీఎల్)కు చెందిన బస్సులు పుణే వాసుల పాలిట శాపంగా మారాయి. ప్రతి ఏడాది ఈ బస్సుల కారణంగా దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు.
పీఎంపీఎంఎల్ ఉదాసీనత, డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా ఈ దుస్థితి నెలకొన్నది. ఇటీవల సాధువాస్వానీ చౌక్ వద్ద జరిగిన ప్రమాదంలో సంస్థకు చెందిన బస్సుల ప్రామాణికతపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఆరు నెలల కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 16 మంది పీఎంపీ బస్సు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి.
పాతబడిన బస్సులు
పాతబడిన ఈ బస్సులు ప్రజల పాలిట శాపంగా మారాయి. పీఎంపీ ఆధ్వర్యంలో నగరంలో నడుస్తున్న బస్సులకు ఫిట్‌నెస్ ఉండడం లేదు. ఈ బస్సులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బస్సుల్లో ఆయిల్ లీకేజీ వల్ల బ్రేకులు వేసినా పడకపోవడంతో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొన్ని బస్సులకు అద్దాలు లేవు. ఇటీవల హడప్సర్‌లో ఒక పీఎంపీ బస్సులో ఇంజన్‌కు మంటలు అంటుకున్నాయి. డ్రైవరు గాయపడ్డాడు. వరుసగా గురువారం, శనివారాలల్తో సతారా మార్గంపై జరిగిన ప్రమాదాల్లో ఒక్కొక్కరు మరణించారు.
బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడంతో బస్సులో ఉన్న ప్రయాణికురాలు ఎగిరి బయట పడి మరణించింది. పలువురు గాయపడ్డారు. ఇలా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రెండు ఏళ్ల కాలంలో ఈ బస్సుల మూలంగా నగరంలో 40కి పైగా మరణించారు. ఇప్పటికైనా పీఎంపీ బస్సులను మార్చి డ్రైవర్లకు శిక్షణ మెళకువలను నేర్పించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ
పీఎంపీ పీఆర్వో దీపక్ పరదేశి మాట్లాడుతూ.. పీఎంపీ బస్సు డ్రైవర్లకు శిక్షణ మెళకువలను అందిస్తున్నామన్నారు. మైలేజీ ఎలా పెంచుకోవాలి అనే వాటిపై కూడా సంస్థ శిక్షణ ఇస్తుందని, బస్సుల ప్రమాదాల కారణంగా మరణించిన తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటిని నివారించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ‘పెట్రోలింగ్ కన్జర్వేటర్ రిసెర్చ్ (పీసీఆర్‌ఐ) ఆధ్వర్యంలో ప్రతి డ్రైవర్‌కు మూడు రోజుల శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇందులో మొదట డ్రైవరు బస్సు నడిపే పద్ధతిని గమనిస్తారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని గమనించి శాస్త్రీయ పద్ధతిలో వాహనాన్ని ఎలా నడపాలో శిక్షణ ఇస్తారని దీపక్ పరదేశి వివరించారు.
ప్రయాణం నరకప్రాయం ఫిట్‘లెస్’
Published Mon, Aug 4 2014 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement