
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి.
ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు.
47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.
సోలార్‌ప్లాంట్ ఆలోచనలో ఉన్నాం
ప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్‌లకు ధన్యవాదాలు.
– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడి
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.
సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురి
ఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం
ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆరి్థకాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేíÙంచి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారం
బస్సు రావడం సంతోషంగా ఉంది
మా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్‌లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.
– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం
Comments
Please login to add a commentAdd a comment