మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను దించుతున్న కేజ్రీవాల్-ఆతిషి సర్కారు
మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు అనువుగా బస్సులు
ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయన్న గణాంకాలు
ఇరుకైన సందుల్లోకూ వెళ్లగలిగే మొహల్లా బస్సులు
మొత్తం 36 మంది ప్రయాణికులు ప్రయాణించేలా మొహల్లా బస్సులు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న ఆప్ మరోమారు అధికారం సొంతం చేసుకునేందుకు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటిలో ఒకటే ‘మొహల్లా’.. మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.
మొహల్లా క్లినిక్‌లకు అమితమైన ఆదరణ
కేజ్రీవాల్ సారధ్యంలో ఢిల్లీలో ఏర్పాటైన 300కు పైగా మొహల్లా క్లినిక్‌లు అమితమైన ప్రజాదరణ పొందాయి. 1.6 కోట్ల మంది మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను అందుకున్నారు. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ రోడ్లపైకి ఎక్కనున్న మొహల్లా బస్సులు రవాణా రంగంలో మరో విప్లవానికి నాంది పలకబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొహల్లా బస్సులు బ్రహ్మాస్త్రంగా మారనున్నాయనే మాట కూడా వినిపిస్తోంది
మహిళల భద్రతే ధ్యేయంగా..
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొహల్లా బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. శాంతిభద్రతల అంశాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచుకునే ఉద్దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా బస్సులను తీసుకువస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఢిల్లీ ఎంత అభద్రతలో ఉందో తెలియజేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటామో లేదో అనే అభద్రతా భావంతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం మొహల్లా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తోంది.
గల్లీల్లోనూ సులభంగా తిరిగేలా..
మొహల్లా బస్సులు 9 మీటర్ల పొడవు కలిగివుంటాయి. ఇవి చిన్నపాటి గల్లీల్లోనూ సులభంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేజ్రీవాల్-అతిషి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మొహల్లా బస్సుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలో మరో రెండు వారాల్లో ఢిల్లీ రోడ్లపై మొహల్లా బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులో 23 సీట్లు ఉండనున్నాయి. అలాగే 13 మంది నిలుచునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా 36 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఆరు సీట్లు మహిళలకు కేటాయించారు.
రాత్రి 10 గంటల వరకూ అందుబాటులో..
తొలిదశలో 140 మొహల్లా బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మొత్తం 16 గంటల్లో 12 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విధంగా ఒక్కరోజులో లక్షా 20 వేల 960 మంది ప్రయాణికులు ఒక రోజులో ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొహల్లా బస్సులు ప్రారంభం కావడం విశేషం. మొహల్లా బస్సుల వినియోగం ఢిల్లీ రవాణా రంగంలో ఒక మైలురాయిగా మారనుందనే మాట వినిపిస్తోంది. మొహల్లా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు. ఫలితంగా వీటి నుంచి కాలుష్యం ఏర్పడదు.
ఇది కూడా చదవండి: మరోమారు తెరపైకి అమృత్‌సర్..
Comments
Please login to add a commentAdd a comment