
న్యూఢిల్లీ: సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా రైలులోనూ మన దేశం నుంచి విదేశాలకు వెళ్లవచ్చనే సంగతి మీకు తెలుసా? త్వరలో భారత్- భూటాన్‌ల మధ్య నడవబోయే రైలు దీనిని సాకారం చేయనుంది. అస్సాంలోని కోక్రాఝర్ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకు రైల్వే లైన్ వేయడానికి భారత రైల్వేలు(Indian Railways) ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్)ప్రతినిధి తాజాగా మీడియాకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.
ప్రతిపాదిత 69.04 కి.మీ రైల్వే లైను అస్సాంలోని కోక్రాఝర్ స్టేషన్‌ను భూటాన్‌లోని గెలెఫుకు అనుసంధానిస్తుందని, ఇందుకోసం రూ.3,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రతినిధి తెలిపారు. ఈ రైల్వే లైన్‌కు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం పొందాల్సివుంది. ఈ ప్రాజెక్టులో బాలజన్, గరుభాస, రునిఖాత, శాంతిపూర్, దద్గిరి గెలెఫు.. ఇలా మొత్తం ఆరు కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గం భారత్-భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి(Cultural exchange)ని పెంపొందిస్తుంది. ఈ రైల్వే లైను ఏర్పాటుపై భూటాన్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. భారత్- భూటాన్‌లను రైలు ద్వారా అనుసంధానించేందుకు రెండు దేశాలు 2018 నుండి చర్చలు జరుపుతున్నాయి. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు అధికారికంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రైలు మార్గంలో రెండు ప్రధాన వంతెనలు, 29 భారీ వంతెనలు, 65 చిన్న వంతెనలు, ఒక రోడ్డు ఓవర్ బ్రిడ్జి, 39 రోడ్డు అండర్-బ్రిడ్జిలు, 11 మీటర్ల పొడవు గల రెండు వంతెనలు నిర్మాణం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment