సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్‌నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్‌ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్‌లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది.
ఉపయోగాలెన్నో..
ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది.
ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్‌ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది.
ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే
ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment