సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో జనసందోహం
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు.
మంత్రి హరీశ్‌రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment