new journy
-
కూత.. సంబరాల మోత.. దశాబ్దాల కల సాకారమైన వేళ..
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి హరీశ్‌రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచర్లు లేని ప్రయాణం
- కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టైర్ సీలెంట్ - రాష్ట్రంలోనే తొలిసారి ‘అనంత’లో లాంచింగ్ అనంతపురం : ఇకపై ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు ఇలా ఏ వాహనాలైనా సరే పంచర్లు కాకుండా ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలోనే తొలిసారి అనంతపురం నగరానికి చెందిన ఆర్కే ట్రేడర్స్ వారు ‘టైర్ సీలెంట్’ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రొడక్ట్‌ను ఆదివారం ప్రారంభించారు. టైర్ సీలెంట్ వాడుక, పనితనంపై తమిళనాడుకు చెందిన ఇంపోర్టర్ ఆర్.శేఖర్ వివరించారు. టైర్‌సీలెంట్ అనే ద్రావణం ట్యూబ్‌లో నింపడం ద్వారా పంచర్‌కు అవకాశమే ఉండదన్నారు. పైగా ఎంతదూరం ప్రయాణించినా టైర్లు వేడి ఎక్కవన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇది విజయవంతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్, ఆర్కే ట్రేడర్స్ అధినేతలు వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము సుమారు 100కు పైగా వాహనాలను ప్రాక్టికల్‌గా ఉపయోగించామని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. టైర్లు అరిగిపోయే వరకు ట్యూబ్‌లు మార్చాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా కొన్ని వాహనాలకు సీలెంట్ వేసి ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ముందుగా టైరులో గాలిమొత్తం తీసి అందులో సీలెంట్ నింపి తిరిగి గాలి పెట్టారు. ఆ తర్వాత టైరులోకి మేకు దింపి కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత మేకు తీసేశారు. అయినా గాలి పోలేదు.