పంచర్లు లేని ప్రయాణం
- కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన టైర్ సీలెంట్
- రాష్ట్రంలోనే తొలిసారి ‘అనంత’లో లాంచింగ్
అనంతపురం : ఇకపై ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు ఇలా ఏ వాహనాలైనా సరే పంచర్లు కాకుండా ప్రయాణం చేయొచ్చు. రాష్ట్రంలోనే తొలిసారి అనంతపురం నగరానికి చెందిన ఆర్‌కే ట్రేడర్స్ వారు ‘టైర్ సీలెంట్’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రొడక్ట్‌ను ఆదివారం ప్రారంభించారు. టైర్ సీలెంట్ వాడుక, పనితనంపై తమిళనాడుకు చెందిన ఇంపోర్టర్ ఆర్.శేఖర్ వివరించారు. టైర్‌సీలెంట్ అనే ద్రావణం ట్యూబ్‌లో నింపడం ద్వారా పంచర్‌కు అవకాశమే ఉండదన్నారు. పైగా ఎంతదూరం ప్రయాణించినా టైర్లు వేడి ఎక్కవన్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇది విజయవంతమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్, ఆర్కే ట్రేడర్స్ అధినేతలు వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము సుమారు 100కు పైగా వాహనాలను ప్రాక్టికల్‌గా ఉపయోగించామని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. టైర్లు అరిగిపోయే వరకు ట్యూబ్‌లు మార్చాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా కొన్ని వాహనాలకు సీలెంట్ వేసి ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ముందుగా టైరులో గాలిమొత్తం తీసి అందులో సీలెంట్ నింపి తిరిగి గాలి పెట్టారు. ఆ తర్వాత టైరులోకి మేకు దింపి కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత మేకు తీసేశారు. అయినా గాలి పోలేదు.