TS Sangareddy Assembly Constituency: తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్‌రావు
Sakshi News home page

తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి : మంత్రి హరీశ్‌రావు

Published Sat, Nov 4 2023 4:28 AM | Last Updated on Sat, Nov 4 2023 8:39 AM

- - Sakshi

సంగారెడ్డిలో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు పక్కన చింతా ప్రభాకర్‌

సాక్షి, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి కావాలో అందరివాడుగా పేరొంది నిత్యం అందుబాటులో ఉంటున్న చింతా ప్రభాకర్‌ కావాలో నియోజకవర్గ ప్రజలు తెల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి, జహీరాబాద్‌లో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ ఎన్నికల బూత్‌ కమిటీల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గతంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న జగ్గారెడ్డి గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఐదు సార్లు అయినా సంగారెడ్డికి రాకుండా ముఖం చాటేశారన్నారు.

ఎన్నికల హామీల్లో గల్లికో ఏటీఎం, ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం అని చెప్పి ఇంతవరకు కనిపించకుండా పోయారన్నారు. తిరిగి డ్రామాలు చేయడానికి కల్లబొల్లి మాటలతో వస్తాడు! జాగ్రత్తగా ఉండాలని హితవుపలికారు. ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అందరూ మౌనం వీడి, మొహమాటం పక్కన పెట్టి రంగంలో దిగితే జగ్గారెడ్డి గాల్లో కలిసి పోతారన్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బహిరంగ సభలో ఉన్న దాని కంటే ఎక్కువ మంది కేవలం ముఖ్యకార్యకర్తల ఈ మీటింగ్‌లోనే ఉన్నారని వెల్లడించారు.

తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసుకున్న జగ్గారెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణ వస్తే సంగారెడ్డిని కర్ణాటకలో కలపాలని చెప్పిన ఆయనకు సంగారెడ్డి ప్రజల ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ లాంటి స్ట్రాంగ్‌ లీడర్‌ ఉండగా.. రేవంత్‌ లాంటి రాంగ్‌ లీడర్‌లకు మద్దతు ఇవ్వొదని ఉద్ఘాటించారు. మూడోసారి సైతం కేసీఆర్‌ సీఎం అవుతారన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ సైతం 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.

నాయకులు బాగా పని చేయాలి!
ఈసారి కార్యకర్తలు, నాయకులు బాగా పని చేసి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేస్తానని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ఆయనకు అనారోగ్యంగా ఉన్న విశ్రాంతి లేకుండా ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన మంచి నాయకుడన్నారు. కాంగ్రెస్‌ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోతే గోసపడేది ప్రజలేనన్నారు. బీజేపీ కాంగ్రెస్‌ ఒక్కటేనన్నారు.

బీజేపీ డకౌటయితే కాంగ్రెస్‌ ఇట్‌ వికెట్‌ గా నిలిచిపోతుందని చెప్పారు. సంగారెడ్డికి రూ. 570 కోట్లతో మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల తీసుకువచ్చామని స్పష్టం చేశారు. రూ.70 కోట్లతో సంగారెడ్డిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అనంతరం చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ, ప్రజలే నా బలం నా బలగం అన్నారు. తామే అభ్యర్థిగా భావించి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం తథ్యం..
మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్టీకి 75 పైగా సీట్లు వస్తాయని, అన్నీ సర్వేలు చెబుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న పదికి పది సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవి గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్‌ కట్‌ అవుతుందన్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్‌ ఇస్తామని ఇటీవల తాండూర్‌ సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చెప్పారని, తెలంగాణలో 24 గంటల సరఫరా ఉందన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. రైతు బంధు బంద్‌ చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు అడ్డా కూలీలని, బీరుబిర్యానీలకు అమ్ముడుపోతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవమానపరిచారన్నారు. ఆ పార్టీ నాయకులకు ఎంత గర్వమో ప్రజలు ఆలోచించాలన్నారు.

సమావేశాల్లో ఎంపీ.బీబీపాటిల్‌, టీఎస్‌ ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ పట్నం మాణిక్యం, డీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, సీడీసీ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, నాయకులు డాక్టర్‌ శ్రీహరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రభుగౌడ్‌, విజేందర్రెడ్డి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, టీఎస్‌ఐడీసీ చైర్మన్‌ తన్వీర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరోత్తం, పార్టీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌ దేవిప్రసాద్‌, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: కోడ్‌ ఉల్లంఘనలపై కొరడా.. డీజేలు, పోస్టర్లున్న వాహనాలు సీజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement