సాక్షి, సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడని, కబ్జాల చరిత్ర ఆయనదేనని మండిపడ్డారు. గురువారం అందోల్ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని మండిపడ్డారు.
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదని స్పష్టం చేశారు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నానని, రంగనాయకసాగర్ దగ్గరికి రా.. కలిసి భూమిని కొలుద్దామని సవాల్ విసిరారుజ
‘నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి.. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగాడా?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment