సాక్షి,సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా,ఏ నాయకుడైనా డబ్బులు తీసుకోండా పనిచేస్తున్నామని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావే (harish rao) కారణం. సిద్దిపేటలో గెలవడానికి హరీష్ ఎంత కష్టపడ్డారో, నన్ను ఓడగొట్టడానికి అంతే కష్టపడ్డారు. నా ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు జరగాల్సిన మీటింగ్ చేసుకొనివ్వకుండా హరీష్ వ్యూహం పన్నారు.
రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు. కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు. నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు. రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు.
సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్. నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందే. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా. నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
Comments
Please login to add a commentAdd a comment