మిస్టర్‌ రేవంత్‌.. అంత వరకు నేను ఆగను: హరీష్‌ రావు | BRS Harish Rao Sensational Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ రేవంత్‌.. అంత వరకు నేను ఆగను: హరీష్‌ రావు

Published Tue, Dec 3 2024 3:56 PM | Last Updated on Tue, Dec 3 2024 5:25 PM

BRS Harish Rao Sensational Comments On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అంటూ విమర్శించారు. ఇదే సమయంలో తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, తాను మాత్రం ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా..‘మిస్టర్‌ రేవంత్‌ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.

రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు.

నీ రెండు నాలుకల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. #CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

లక్ష కేసులు పెట్టినా నన్ను ఆపలేరు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement