దుబ్బాక పట్టణం 'వ్యూ'
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాల ఖిల్లాగా దుబ్బాక నియోజకవర్గం పేరుగాంచింది. మొదటి నుంచి విప్లవోద్యమాలకు అడ్డాగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నక్సలైట్ దళాలు ఈ నియోజకవర్గంలో పనిచేయడంతో దేశవ్యాప్తంగా దుబ్బాక పేరు మార్మోగింది. మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలను కలుపుతూ మధ్యలో ఉండే నియోజకవర్గం దుబ్బాక.
రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది కావడంతో నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై న చాలామంది ఉన్నత పదవులు పొందారు. మంత్రి పదవితో పాటు, డిప్యూటీ స్పీకర్, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నత బాధ్యతలు చేపట్టి దుబ్బాక నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
1957లో దొమ్మాట నియోజకవర్గంగా..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిదశలో రాజగోపాలపేటగా ఉన్న ఈ నియోజకవర్గంలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలు ఉండేవి. ఆ తర్వాత 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాజగోపాలపేట స్థానంలో దొమ్మాట నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన దొమ్మాట నియోజక వర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, కొండపాక మండలాలు ఉండేవి. 2001లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న చెరుకు ముత్యంరెడ్డి మిరుదొడ్డి, కొండపాక మండలాల నుంచి 17 గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా తొగుట మండలంను ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి నుంచి ఐదు మండలాలతో దొమ్మాట నియోజకవర్గం ముఖ చిత్రంగా ఏర్పడింది.
2009లో దుబ్బాక నియోజకవర్గంగా..
2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో దొమ్మాట నియోజకవర్గం కాస్త దుబ్బాక నియోజకవర్గంగా అవతరించింది. దుబ్బాకలో కొండపాక మండలంను కలపకుండా గజ్వేల్ నియోజకవర్గంలో చేర్చి.. అప్పటి రామాయంపేట నియోజకవర్గంలో ఉన్న చేగుంట మండలాన్ని దుబ్బాకలో చేర్చారు.
అంతేగాకుండా అప్పటి వరకు దుబ్బాక మండలంలోని 11 గ్రామాలు, మిరుదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామం సిద్దిపేట నియోజకవర్గంలో ఉండగా వాటిని దుబ్బాక నియోజకవర్గంలో కలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా మండలాలు ఏర్పర్చడంతో కొత్తగా రాయపోల్, నార్సింగ్, భూంపల్లి–అక్బర్‌పేట మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్, భూంపల్లి–అక్బర్‌పేట మండలాలతో పాటుగా గజ్వేల్ మండలంలోని ఆరపల్లి గ్రామంతో కలిసి దుబ్బాక నియోజకవర్గంగా ఉంది.
రాజకీయంగా ఎన్నో మార్పులు..
రాజకీయంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 1952లో తొలిసారి రాజగోపాలపేట నియోజకవర్గం పేరిట జరిగిన ఎన్నికల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కే.వీ.నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచారు. 1957 ఎన్నికల్లో వంగ హనుమంతరెడ్డి అలియాస్ ఆశిరెడ్డి పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. 1962 ఎన్నికల్లో ఎంకే మోహినొద్దీన్ కాంగ్రెస్ తర ఫున గెలిచారు.
1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎం.భీంరెడ్డి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1972 ఎన్నికల్లో దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1978లో దుబ్బాకకు చెందిన ఐరేని లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి శాసనసభ ఉపసభాపతి పదవిని పొందారు. 1988లో టీడీపీ ప్రభంజనంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోయిన దొమ్మాటలో కాంగ్రెస్ నుంచి ఐరేని లింగయ్య విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కొండపాకకు చెందిన డి. రాంచంద్రారెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు.
1989,1994,1999 లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన బీఆర్‌ఎస్ తరఫున జర్నలిస్టుగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి పోటీచేసి వరుస విజయాలతో ఉన్న ముత్యంరెడ్డిపై గెలుపొందారు.అనంతరం తెలంగాణ ఉద్యమపరిణామాల్లో భాగంగా 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి మళ్లీ బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి గెలుపొందారు.
2014 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి ఘనవిజయం సాధించారు. 2018లో నాలుగోసారి బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా సోలిపేట 66వేల పై చిలుకు ఓట్లతో రాష్ట్రంలోనే 7వ రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు వెయ్యికి పై చిలుకు ఓట్లతో రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అందులో 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 4 పర్యాయాలు బీఆర్‌ఎస్, ఒకసారి బీజేపీ విజయం సాధించడం విశేషం. కమ్యూనిస్టు, పీడీఎఫ్, ఇండిపెండెంట్‌లు ఒక్కోసారి గెలుపొందారు.
కీలక పదవులు..
నియోజకవర్గం నుంచి ఎన్నికై న ఎమ్మెల్యేలు రాష్ట్ర కేబినేట్‌లో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టారు.1978లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐరేని లింగయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని అలంకరించారు.
1994లో టీడీపీ నుంచి రెండోసారి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, 1999లో టీడీపీ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి రాష్ట్రశాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నతమైన పదవులు చేపట్టారు.
చదవండి: శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి
Comments
Please login to add a commentAdd a comment