చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కత్తి కార్తీక, శ్రావణ్‌కుమార్‌రెడ్డి
సంగారెడ్డి: దుబ్బాక నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పాతతరం మారినా గ్రూపుల లొల్లి మారడంలేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాల వల్ల ప్రతిసారి పరాభవం ఎదుర్కొంటుందని పలువురు నేతలు అంటున్నారు. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి కత్తి కార్తీక గ్రూపుల మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి.
అధిష్టానానికి తలనొప్పిగా..
ఈ నేపథ్యంలో దుబ్బాక టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. అయితే ప్రజల్లో ఏ నాయకుడికి ఆదరణ ఉందన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సర్వే చేయించిందని, ఆ సర్వే ఆధారంగానే టికెట్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆ ముగ్గురు నేతలూ మాత్రం తమకే టికెట్ వస్తుందని తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాల్లో హడావుడి చేస్తున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ కేటాయించగా.. పోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్ సోలిపేట సుజాత మధ్యనే నడిచి చివరకు వెయ్యికి పైగా ఓట్లతో బీజేపీ గెలుపొందడం తెలిసిందే.
చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం..
పరిస్థితి అలా ఉంటే చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి 106 రోజులుగా నియోజకవర్గంలో ఆత్మగౌరవ యాత్ర చేపడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు. ఇటీవల నాలుగైదు రోజుల నుంచి ఏకంగా ప్రచారం మొదలుపెట్టారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ముగ్గురిలో ఎవరిని వరిస్తుందో అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది.
టికెట్ కోసం త్రిముఖ పోటీ..
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీకతో పాటు పీసీసీ సీనియర్ నాయకుడు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి తనయుడు గాల్‌రెడ్డి దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్, కార్తీక కొన్ని నెలలుగా తమకే టికెట్ వస్తుందంటూ ఎవరికి వారు తమ అనుచరులతో గ్రామాల్లో పర్యటిస్తూ ధీమాగా ఉన్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ముగ్గురిలో ఎవరికి టికెట్ వచ్చినా మిగతా ఇద్దరు సహకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment