తూప్రాన్ విజయ సంకల్ప సభలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్
సాక్షి, సంగారెడ్డి/తూప్రాన్: బీజేపీ కండువా కప్పుకున్న వారికి సంక్షేమ పథకాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు మీ అయ్య జాగీరా? అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఆదివారం తూప్రాన్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావు అధ్యక్షతన జరిగిన సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాషాయ కండువా కప్పుకున్న వారికి పెన్షన్లు, రైతుబంధు, డబుల్ బెడ్రూం రాదంటున్నారు. మిస్టర్ సీఎం కేసీఆర్.. మిస్టర్ హరీశ్.. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ అయ్య జాగీరా..? అని ప్రశ్నించారు. మీరు కేవలం ప్రజల ఆస్తులకు కాపాలదారులు మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసే జీతగాళ్లు అనే విషయం మరిచిపోతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
రాజకీయం నుంచి తప్పుకుంటా..
కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమతోనే ఉద్యోగాలు, 24 గంటల విద్యుత్ సరఫరా అని మాట్లాడటం సిగ్గుచేటని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తే తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కౌలు రైతు చనిపోతే రూ.లక్ష ఇచ్చే సోయి లేని కేసీఆర్.. పక్క రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులకు రూ.3 లక్షల చెక్కులు అందించి తెలంగాణ వ్యవసాయంలో ఆదర్శం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు విత్తనాలు, ట్రాక్టర్లు, పనిముట్లు తదితర వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు.
అలాగే ప్రతీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్లు అందించడంతోపాటు రైతులు సాగు చేసిన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.3,500 చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మురళీయాదవ్(నర్సాపూర్), నందీశ్వర్‌గౌడ్(పటాన్‌చెరు), రాజు (సంగారెడ్డి), శ్రీకాంత్‌రెడ్డి (సిద్దిపేట), విజయ్‌కుమార్ (మెదక్) మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
Comments
Please login to add a commentAdd a comment