సాక్షి, సంగారెడ్డి: 'సెంటిమెంట్ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్‌లో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.' – గజ్వేల్
రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే గజ్వేల్ ఎన్నో విశేషాలకు నెలవు. ప్రత్యేకించి 1952లో జరిగిన ఎన్నికల్లో మిగితా 15సార్లు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనవాయితీగా వస్తుంది. ఇదే ‘సెంటిమెంట్’ను నమ్ముకొని సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా తిరిగే అవసరమున్నా దృష్ట్యా ఆయన ప్రచార బాధ్యతలను పార్టీ యంత్రాంగమే చేపడుతోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్‌చార్జులుగా మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలు వ్యవహరిస్తుండగా...సమన్వయ కమిటీ సభ్యులుగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డిలు వ్యవహరిస్తున్నారు.
వీరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కేసీఆర్ ప్రాతినిథ్యం ఫలితంగా పదేళ్లలో నియోజకవర్గంలో వచ్చిన మార్పును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాలతో పాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన రింగురోడ్డు, ఎడ్యుకేషన్ హబ్‌వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం తీసుకున్న చర్యలను వివరిస్తున్నారు.
అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల మార్పును సైతం ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్‌షోలు, నృత్యాలతో ఆ పార్టీ నేతలు ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకించి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట ‘గులాబీ జెండాలే రామక్క’ పాటపై మహిళలతో కలిసి నృత్యం చేస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
బీజేపీ సైతం గట్టిగానే కదన రంగంలోకి దిగింది. ఈ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం వేగం పెంచారు. ప్రత్యేకించి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇతర ప్యాకేజీల పంపిణీలో నెలకొన్న జాప్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకర్గంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరిగిందని చెబుతూ...పేదలకు చెందిన వేలాది ఎకరాల భూములను లాక్కొని రోడ్డున పడేశారని ప్రచారం చేస్తున్నారు.
ఈ కష్టాల నుంచి బయట పడాలంటే బీజేపీ గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సైతం సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పార్టీ తూంకుంట నర్సారెడ్డి తానూ 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రజలందరికీ 24గంటలు అందుబాటులో ఉన్నానని, కానీ కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు కనీసం దర్శనం ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
మరోసారి బీఆర్‌ఎస్ గెలిస్తే కేసీఆర్ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోడని, స్థానికులు సమస్యల పరిష్కారానికి కలవడానికి ప్రయత్నించినా అది జరగదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల్లో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి గజ్వేల్‌లో ప్రచార పర్వం ఆసక్తికరంగా మారింది. నామినేషన్లు ముగిసిన తర్వాత ప్రచారం తీరు మరింత వేడెక్కె అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: 'బండి సంజయ్' నామినేషన్ సందర్భంగా.. భారీ ర్యాలీ!
Comments
Please login to add a commentAdd a comment